అంతర్జాతీయం

పలువురు మిలిటెంట్లు సహా జైషే ఉగ్రవాది మసూద్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు ఆఫీసుల మూసివేత
పఠాన్‌కోట్ దాడిపై
ప్రత్యక్ష చర్యలకు దిగిన పాక్
చర్యలను సమీక్షించిన
ఉన్నత స్థాయి భేటీ

ఇస్లామాబాద్, జనవరి 13: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పథక రచన చేసినట్లుగా భావిస్తున్న పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మహమూద్, అతని సోదరుడు సహా ఆ సంస్థకు చెందిన పలువురు వ్యక్తులను పాకిస్తాన్ బుధవారం అరెస్టు చేయడంతో పాటు దానికి చెందిన రెండు కార్యాలయాలను సీల్ చేసింది. శుక్రవారం జరగాల్సిన ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ తీసుకోబోయే కచ్చితమైన, నిర్ణయాత్మక చర్చలపై ఆధారపడి ఉంటాయని భారత్ స్పష్టం చేసిన తర్వాత పాక్ ఈ చర్యలు తీసుకుంది. మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రెహమాన్ రౌఫ్‌ను కూడా అరెస్టు చేసినట్లు జియో టీవీ తెలిపింది. పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనగా మసూద్ అజర్‌ను అరెస్టు చేయడంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. జైషే మహమ్మద్‌కు చెందిన పలు కార్యాలయాలపై దాడి అనంతరం మసూద్ అజర్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 1999లో జరిగిన కాందహార్ హైజాక్ ఉదంతంలో టెర్రరిస్టులు హైజాక్ చేసిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని 155 మంది ప్రయాణికులకు బదులుగా భారతీయ జైళ్లలోంచి విడుదల చేసిన ముగ్గురు టెర్రరిస్టుల్లో మసూద్ అజర్ ఒకరనే విషయం తెలిసిందే.
కాగా, ప్రధాని నవాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో తాజా పరిణామాలను సమీక్షించారు. ద్వైపాక్షిక చర్చల ప్రక్రియను పునరుద్ధరించడంపై పాక్ విదేశాంగ కార్యదర్శితో చర్చలు జరపడానికి భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఇస్లామాబాద్ వెళ్లడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉండడం, పాక్ ప్రభుత్వం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకోని పక్షంలో ఈ చర్చలు జరగబోవని భారత ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రవాద దాడి వెనుక వౌలానా మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ హస్తం ఉందని భారత్ గట్టిగా నమ్ముతున్న విషయం తెలిసిందే. కాగా, ఉగ్రవాదాన్ని తమ గడ్డపైనుంచి పూర్తిగా తుడిచిపెట్టాలన్న పాక్ కృతనిశ్చయంలో భాగంగా తీసుకున్న ఈ చర్యల పట్ల సమావేశం సంతృప్తి వ్యక్తం చేసిందని, ప్రపంచంలో ఎక్కడ కూడా ఉగ్రవాద చర్యల కోసం తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించకూడదన్న సంకల్పాన్ని మరోసారి వ్యక్తం చేసిందని సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అంతేకాకుండా పఠాన్‌కోట్ సంఘటనకు సంబంధం ఉందని భావిస్తున్న ఉగ్రవాద శక్తులపై సాగిస్తున్న దర్యాప్తులో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించినట్లు కూడా ఆ ప్రకటన తెలిపింది. ‘పాకిస్తాన్‌లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు, భారత్ అందజేసిన సమాచారం ఆధారంగా జైషే మహమ్మద్‌కు చెందిన పలువురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. ఆ సంస్థకు చెందిన కార్యాలయాలను కూడా గుర్తించి మూసివేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’ అని ఆ ప్రకటన తెలిపింది. కాగా, ఈ రోజు జరిగిన సమావేశానికి పాక్ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ రహీల్ షరీఫ్, ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టెనెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్, హోం మంత్రి నిసార్ అలీఖాన్, ఆర్థిక మంత్రి ఇషక్ దార్, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తార్ అజీజ్, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.