ఎడిట్ పేజీ

మళ్లీ తప్పటడుగులు వేస్తున్న కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ఒక బృందంగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా 70 సీట్లలో 67 సీట్లు గెల్చుకొని ప్రభుత్వం ఏర్పరచినప్పుడు మొత్తం దేశ ప్రజలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుండి ఎన్నో ఆశించారు. ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించగలరని ఎదురుచూశారు. అయితే అధికారాల విషయ మై లెఫ్టినెంట్ గవర్నర్‌తో వివాదాలకు కాలు దువ్వుతూ కాలం గడపగలరని ఎవ్వరూ ఊహించలేదు. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఘర్షణకు తలబడుతూ ఢిల్లీ ప్రజలకు మెరుగైన పౌర సదుపాయాలు కల్పించడం పట్ల దృష్టి సారించడం లేదు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ చెప్పినట్లుగా ఇది కేవలం ఇద్దరు వ్యక్తులమధ్య (కేజ్రీవాల్- నజీబ్ జంగ్) ఎవరెక్కువ అనే అహంకార ధోరణితో ఏర్పడిన సమస్య కానేరదు. లోతయిన దీర్ఘకాలిక ఎత్తుగడలతో అడుగులు వేసే కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రిగా తన అధికారాలను సుస్థిరం చేసుకొనే ప్రయ త్నం చేయడంలేదు. దేశ, విదేశాల్లో సాటిలేని నాయకుడిగా ఎదుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢీకొనగల నాయకుడు తాను మాత్రమే అనే సంకేతం దేశ ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతున్నది. ఢిల్లీలో సీనియర్ అధికారులు, పోలీసు అధికారులపై ఎవరికి హక్కు ఉండదనే విషయమై కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్‌తో తలబడుతున్నారు. అంతేగానీ విధానపర అంశాలు, ప్రజలకు సదుపాయాలు మెరుగుపరచే విషయాల్లో కాకపోవడం గమనార్హం. తన మాట కాదని జంగ్ ఆదేశంపై ఒక మహిళా అధికారిని యాక్టివ్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆఫీస్ నోట్ తయారుచేసినందుకు ఒక అధికారి ఆఫీస్ గదికి తాళం వేశారు. ఆ మహి ళా అధికారి ఢిల్లీలో విద్యుత్ పంపిణీచేస్తున్న ఒక కార్పొరేట్ సంస్థకు అనుకూలమని, ఆమె అంటే కేజ్రీవాల్ అయిష్టత పెం చుకున్నారు. తర్వాత కేజ్రీవాల్ చేసిన అధికారుల బదిలీలను జంగ్ నిలిపివేశారు. తాజాగా బీహార్ నుంచి ఏసీబీ, పోలీసు అధికారులను కేజ్రీవాల్ రప్పిస్తుంటే తన అనుమతి లేకుండా ఎలా చేస్తావంటూ జంగ్ ప్రశ్నించారు.
జంగ్-కేజ్రీవాల్‌ల మధ్య ఏర్పడిన వివాదం అన్ని మర్యాదల సరిహద్దులను దాటిందని చెప్పవచ్చు. ఈ సమస్య ప్రాథమికంగా దేశ ప్రధాని కావాలన్న కేజ్రీవాల్ లోతయిన రాజకీయ ఆకాంక్ష పునాది నుండి ఏర్పడిందని గుర్తించాలి. ప్రధానమంత్రి పదవికి ముఖ్యమంత్రి పదవిని ఒక మెట్టుగా ఆయన భావిస్తున్నారు. ఆ అధికార మత్తులో ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార పరిధులను, రాజ్యాంగం ఏర్పరచిన పరిమితులను విస్మరిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు మాదిరిగా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర స్థాయి హోదా లేదు. 1993లో రాష్ట్ర హో దా కుదించినప్పటి నుండి ఢిల్లీలో ఎక్కువగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేంద్రం లో పలు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నా యి. అయితే ఏనాడూ ఇటువంటి వివాదాలతో ముఖ్యమంత్రులు రచ్చచెకెక్కలేదు. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించినా ఒకవిధంగా కేంద్రపాలిత ప్రాంతమే. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంటు, సైనిక స్థావరాలు అన్నీ నేరుగా కేంద్ర ప్రభు త్వ అధికార పరిధిలో ఉంటాయి. ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి భూములు, పోలీస్, శాంతిభద్రతలపై అధికార పరిధి లేదు. ఇవి లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో ఉంటాయి. ఆయన కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి కావటంతో కేంద్రం మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతుంది. ఇతర రాష్ట్రాలవలె కాకుండా ఒక చట్టం చేసే ముందు ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం చేసిన చట్టానికి భిన్నంగా కేంద్రం చట్టం చేస్తే- అదే చెల్లుబాటు అవుతుంది. ఇతర రాష్ట్రాల విషయంలో రాష్ట్రాలకు సంబంధించిన అంశాలూ కేంద్రం ఆ విధంగా చట్టాలు చేయలేదు. ఇతర రాష్ట్రాలకు వలే ఢిల్లీకి ప్రత్యేకంగా కేంద్ర సర్వీసుల అధికారుల కేటాయింపు వుండదు. కేంద్రపాలిత ప్రాంతాలకు అన్నింటికీ కలిపి కేటాయిస్తారు. వారు కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటారు. ఈ అంశాలను గమనిస్తే కేజ్రీవాల్ ఇప్పుడు లేవనెత్తుతున్న అభ్యంతరాలు అర్థం లేనివని స్పష్టవౌతుంది. నిత్యం వివాదాల ద్వారా వార్తలకెక్కడం ద్వారా తన రాజకీయ మనుగడ కాపాడుకొనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు తప్ప మరోటి కాదు.
ఢిల్లీకి ఎన్నికల సమయంలో పూర్తి రాష్ట్ర హోదా కోసం కృషి చేస్తానని కేజ్రీవాల్ హా మీ ఇచ్చారు. అందుకోసం రాజకీయం గా కృషి చేయడంలో తప్పులేదు. కానీ ఆ పేరుతో ప్రస్తుత రాజ్యాంగపర ఏర్పాట్లను సవాలు చేసే విధంగా ముఖ్యమంత్రి హో దాలో వున్న వ్యక్తి వ్యవహరించడం తీవ్ర ఆక్షేపణీయం. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, బిజెపి సహితం అటువంటి హామీలు ఇచ్చాయి. కానీ కేంద్రంలో అధికారంలో వున్నపుడు మాత్రం ఈ విషయమై నోరెత్తరు. అందుకు ఏకాభిప్రాయం కావాలని బిజెపి ఇప్పుడు అంటున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించడం ఆచరణలో సాధ్యంకాదని గుర్తించాలి. ఆ విధంగా చూస్తే ప్రపంచంలో ఏ దేశ రాజధాని కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ఒకే నగర రాజ్యంగా ఉన్న దాఖలాలు లేవు. రోమ్, ప్యారిస్, లండన్, బెర్లిన్, మాస్కో, టోక్యో, బీజింగ్, వాషింగ్టన్.. ఏ నగరమైనా తీసుకోండి. ఒక దేశపు రాజధాని నగరం ఆ దేశానికి అంతర్జాతీయ ముఖద్వారవౌతుంది. అందుచేత ఆ నగరానికి జాతీయ అంతర్జాతీయ బాధ్యతలు ఉంటాయి. దానిపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాధికారం ఉండటం అభిలషణీయం. ఈ విషయమై రాజకీయ పార్టీలు పారదర్శకంగా చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలి. అంతేగానీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆ పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం భావ్యం కాదు. అయితే కొన్ని రాజధాని నగరాలకు బలమైన నగర ప్రభుత్వాలు ఉన్నాయి. లండన్ మేయర్ అధికార పరిధిలో పోలీసులు ఉంటారు. వాషింగ్టన్‌ను సమాఖ్య జిల్లాగా పరిగణించి కాంగ్రెస్ అధికార పరిధిలో ఉంచారు. అయితే ప్రపంచంలోనే శక్తివంతమైన ఈ రాజధాని నగరానికి తమ కాంగ్రెస్‌కు ప్రతినిధులను పంపుకొనే అవకాశం లేదు. కేవలం అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఓటువేస్తారు.
ఈ అంశాలన్నీ కేజ్రీవాల్‌కు తెలియనివి కావు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభిస్తుందని ఆయన ఎదురుచూడగలరని భావించలేం. అయితే ఏదో ఒక అంశంపై నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఘర్షణకు పదే పదే కాలుదువ్వుతూ జాతీయ స్థాయిలో రాజకీయంగా తన ఉనికిని కాపాడుకొంటూ రావడమే ఆయన ఎత్తుగడగా స్పష్టవౌతుంది. తద్వారా 2019 నాటికి ప్రధానమంత్రి పదవికి తానే సరైన పోటీదారుడినని దేశ ప్రజల గుర్తింపు పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నిక కాగానే అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్ధికి సం పూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఢిల్లీ అభివృద్ధికి రెండు, మూడు ఏళ్ళయినా కృషి చేసి ఉంటే ప్రజల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొనేవారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పై సంవత్సరంపాటు ఎంత కర్కశంగా విమర్శల వర్షం కురిపించినా పశ్చిమ బెంగా ల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇప్పుడు కేంద్రంతో మంచిగా ఉండి రాష్ట్ర అభివృద్ధికోసం ప్రయత్నించాలనే నిర్ణయానికి రావడం గమనార్హం. అయితే కేజ్రీవాల్ ఎన్నడూ ఢిల్లీ పరిపాలన పట్ల చెప్పుకోదగిన ఆసక్తి చూపడంలేదు. నిత్యం ఏదో ఒక సంచలనంతో వార్తలలో వ్యక్తిగా మిగలడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావమే భారత రాజకీయాల్లో ఒక వినూత్న ప్రమాణం అని చెప్పవచ్చు. 1977లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఏర్పాటుచేసిన జనతాపార్టీ దేశ ప్రజలలో ఎలాంటి ఆకాంక్షలను కల్గించిందో, ఈ పార్టీ సహితం అటువంటి ఉ త్సుహకతను కల్గించింది. జనతా పార్టీ ప్ర భుత్వం విఫలం కావడానికి రెండేళ్ళు పట్టినా ఆప్ ప్రభుత్వం విఫలం కావడానికి సంవత్సర కాలం కూడా పట్టలేదు. కేజ్రీవాల్ అనుసరిస్తున్న ఏకపక్ష, దుందుడుకు విధానాలతో విభేధించి పార్టీ వ్యవస్థాపక సభ్యులే పలువురు నిష్క్రమించడం గమనార్హం. తనకు తోడ్పాటు అందించి, తన ఎదుగుదలకు కారకులైన వారికి చెయ్యివ్వడం కేజ్రీవాల్‌కు మొదటినుండి అలవాటు.
తొలుత అరుణారాయ్ నాయకత్వంలోని సమాచార హక్కు ఉద్యమంలో పనిచేశారు. ఆమె ప్రోత్సాహంతోనే సొంతంగా స్థాపించిన ‘పరివర్తన్’ ఎన్.జి.ఓ నిలదొక్కుకోగలిగింది. రామన్ మెగసెసే అవార్డు రావడానికి సహితం ఆమె సిఫార్సే కారణం. అయితే ఓ దశకు చేరుకోగానే ఆమె ముఖం చూడడం మానివేశాడు. ‘పరివర్తన్’లో కలిసి పనిచేసి, ఎంతో అండగా ఉన్న అంజలి భరద్వాజ్, పన్నిని ఆనంద్‌లను సహితం తర్వాత వదిలించుకున్నాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తనను ప్రోత్సహించిన ‘గురువు’ అని చెప్పుకున్న అన్నా హజారే మాట వినకుండా రాజకీయ పార్టీ ఏర్పాటుచేశాడు. ‘ఆప్’ ప్రారంభంలో ఆర్థికవనరులు సమకూర్చడం, అవసరమైన విధానాల రూపకల్పన, యంత్రాంగం ఏర్పాటు, రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో అండగా ఉన్న ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను ఎలా వదిలించుకున్నాడో ఇటీవలనే చూశాం. ప్రశాంత భూషణ్ తదితరులు సామ్యవాద, వామపక్ష బృందాలను కలుపుకొని పార్టీ పరిధిని విస్తరింపచేసుకోవాలని, భావ సారూప్యంగల పార్టీలతో పొత్తులకు సిద్ధం కావాలని భావించారు. అదే జరిగితే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా తానొక్కడే ప్రజల దృష్టిలో పడడం సాధ్యపడకపోవచ్చని కేజ్రీవాల్ భావించినట్లుంది. అందుకనే సొంతంగా ప్రధానమంత్రి పదవికి ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. భిన్నమైన రాజకీయాలు అందిస్తామని వచ్చిన కేజ్రీవాల్ ఇతర పార్టీలకన్నా భిన్నమైన నాయకత్వం ఇవ్వలేకపోతున్నారు. కేవలం తాను చెప్పినట్లే జరగాలి, తన నాయకత్వమే కొనసాగాలి అనే రీతిలో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, సమిష్టి నాయకత్వం వంటి పదాలకు విలువ లేకుండా చేస్తున్నారు. ఈ పరిణామాలపట్ల ‘ఆప్’కు ప్రాణం పోసిన లక్షలాదిమంది కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఆప్‌కు అధికారం కట్ట బెట్టిన ఢిల్లీ ఓటర్లు నేడు జరుగుతున్న పరిణమాలను చూసి తాము మోసపోయామని వాపోతున్నారు.
నరేంద్ర మోదీ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని ఆ స్థానంలోకి రావాలని ప్రయ త్నం చేస్తున్న కేజ్రీవాల్ ఒక విషయం మరచిపోతున్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు మోదీ దృష్టి ప్రధానమంత్రి పదవిపై లేదు. ముఖ్యమంత్రిగా స్థిరపడి ప్రజలను మెప్పించే విధంగా ఎలా పరిపాలన అందించాలా అని మాత్రమే దృష్టి సారించారు. పుష్కర కాలంపాటు ముఖ్యమంత్రిగా అందరి ప్రశంసలు పొందడంతో దేశ ప్రజల అందరి దృష్టి ఆయనపై పడింది. కేజ్రీవాల్ సహితం ముందుగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా మంచి పాలన అందించారని ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా చూపంతా ప్రధానమంత్రి పదవిపై పెట్టుకొని తప్పటడుగులు వేస్తే చరిత్రలో కలిసిపోవడం సహజం.