ఉత్తర తెలంగాణ

ఊసరవెల్లి (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దన్నగా అహంకరించి
మేధోవలసల్ని ఆహ్వానించిన
అమెరికా ఆకశాన నిలిచి
ప్రపంచానికొక విడిదైంది!
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైన గద్ద
రెక్కలొచ్చి ఒక చూపు చూసింది
అంటే తెల్లధనం కరుడుగట్టింది
ఆ పార్థీడ్, స్టాచ్యూపై రెట్టవేసింది
బహుళతత్వాన్ని ఆదరించి
ఊర్థ్వముఖ ప్రగతిని పొంది
మతం పేరున నిషేధమంటూ
అది మధ్యయుగాల బాటను పట్టె
ఇన్నాళ్లు సెల్ స్క్రీన్‌పై
స్వేచ్ఛలు పలికిన గద్ద
ఇనుపగోళ్లు, రక్తపు ముక్కుతో
అగుపించి హేళన జేసే!

- డాక్టర్ బి.వి.ఎన్.స్వామి
కరీంనగర్
సెల్.నం.9247817732
**
లేడీ కండక్టర్

బస్సు ఎక్కినది మొదలు దిగేంతవరకు
మగచూపులు కొన్ని ఆబగా
నఖ శిఖ పర్యంతం పరిశీలిస్తున్నా
మొరటు చేతులు కొన్ని టిక్కెట్టుకై
లేత చేతికొనవేళ్లను తాకుతున్నా
మొద్దు శరీరాలు కొన్ని
సున్నిత దేహాన్ని రుద్దుకుంటూ పోతున్నా
విచ్చలవిడి మృగ వెకిలి చేష్టలు కొన్ని
మంచితనాన్ని చికాకు పెడుతున్నా
లక్ష్యసాధనతో వాటినేమీ లక్ష్య పెట్టకుండా
మూల మలుపులకు తూలి పడిపోవక
ఎత్తుపళ్లాలకు బిత్తరపోయి చూడక
కుదుపుల అదిలింపులకు బెదరిపోకుండా
నిబ్బరంగా నిలదొక్కుకు నిలబడుతూ
తీయని పలకరింపుల ముచ్చట్లతో
దూరభారగతుల్ని దరి చేర నీయక
ఆప్యాయతకు ఆహ్వానం పలుకుతూ
ఆనందాలను వెదజల్లే పాలవెల్లి..
సామాన్యులతో పాటు అసామాన్యుల చేత
శభాశనిపించుకునే అనురాగ తల్లి..
రాజీపడుతున్న జీవితానికి రాజీనామా చేయలేక
విద్యా వినయం తెలిసిన వివేకంతో
ఉద్యోగ ధర్మాన్ని నిగ్రహంగా నిర్వహిస్తూ
పేదరికాన్ని ఇంటిపెత్తనాన్ని
స్టేజీల వారీగా లెక్కించుకుంటూ
ఓర్పును నేర్పుతో నెట్టుకొస్తున్న
సమాజ ఇజాన్ని చదువుకున్న సగటు జీవి..!
సహోద్యోగులతో పాటుగా ప్రయాణీకుల చిత్తప్రవృత్తుల్ని
అడుగడుగునా మందలిస్తూనే అడుగు ముందుకేస్తున్న
ప్రగతిశీల అభ్యుదయ భావనాఝరి..!!

- రాకుమార, గోదావరిఖని, సెల్.నం.9550184758
**

మధుర జ్ఞాపకం

ముత్యాలలల్లిన ముక్కెర పెట్టి
పచ్చలు గుచ్చిన పాపిటి బిళ్ల
చూడామణిని కొప్పున ధరించి
మరకత మణుల మాటీలేసి
వజ్రాలద్దిన దుద్దులు పెట్టి
కెంపులు కూర్చిన కంకణాలను,
వైఢూర్యాల కడియాల్దొడిగి
నవరత్న ఖచిత వడ్డాణాన్ని
సన్నని నడుముకు మిన్నగదాల్చి
మువ్వలు పొదిగిన వెండి గజ్జెలు
పగడాల్జెక్కిన వంక ఉంగరం
ఇంద్రనీలాల చంద్రహారం
పుష్యరాగాల పుత్తడి పేరు
పద్మరాగాల పట్టు రవిక
గోమేధకాల సిలుకు చీరతో
సిగారించి సిగ్గుల మొగ్గ
ప్రేమ మీరగా పెనిమిటి తోడి
మోదము తీరగా మొగుని వెంట
అతివ వెడలెను అత్తారింటికి!
బీరిపోయిరి అమ్మా నాన్న
చిన్నబోయెను చిట్టి తమ్ముడు!
చెమ్మగిల్లెను చెలుల కన్నులు!
మళ్లీ వచ్చే దాకా
మధుర జ్ఞాపకం!!

- రాపెల్లి పాండురంగం, గ్రామం: రుద్రంగి, జిల్లా రాజన్న సిరిసిల్ల
సెల్.నం.9963866167
**

ఇది నీకు తగునా?

దూరభారమైన దారుల్లోని
అడుగు జాడలను చూడు
చమర్చిన చెమ్మ తడిని
ఎక్కిన మెట్టునడుగు
దిగిన మెట్టును చూడు
ఒరిసిన గాయం తాలుకా గురుతులను
నువ్వు నలుమూలల తరచి వింటే తెలిసేది..
ప్రతిధ్వనించిన ధ్వనుల్లోని ఉద్వేగపు ఊపిరిని
మూగబోయిన స్వరాన్ని విను
జీరబోయిన గొంతును చూడు!
ఇప్పుడేం మిగిలింది
నీకు నాకు మధ్య నిశ్శబ్దం తప్ప
పెంచుకున్న నమ్మకమూ ముగిసింది!!
కళ్లు మూసిన నిన్ను చూడడమెందుకు?
పలకని నిన్ను పిలవడమెందుకు?
నమ్మిన నీపై ‘నమ్మకం’ నమ్మకాన్ని వమ్ము చేసాక!
సుప్రభాతాలు, అభిషేకాలు, అర్చనలు
హారతులట, నైవేద్యాలట!
లోక కల్యాణం మరచిన
విశే్వశ్వరా ఇది నీకు తగునా?

- రామానుజం సుజాత, రేకుర్తి, కరీంనగర్, సెల్.నం.9701149302
**

ఆశల రెక్కలు

బతుకు పోరాటమై
వెతల సంచారమై
తెలుగు నిస్తేజమై
విగత జీవమైన విధి రేఖలు
ఆధునికత ఎరుగని
అనంత అనంతాలల్లో
రాహువు మింగిన చంద్రులు
గ్లోబలీకరణ ముసుగులో
పల్లెలను కాటేసిన రాజ్యం
కారు చీకట్లను కమ్మినప్పుడు
గమ్యం కనుమరుగై
గతి తప్పిన జీవితంపై
ఆశల రెక్కలకు ఊపిరిపోస్తూ
రేపటి రూపానికి వారో భాష్యమై
పుక్కిట పట్టిన పురాణం
పది మందికి పంచాలన్న ఆరాటం
చిన్నబోయిన అరుగుల మీద
చిత్రపటం ఢంకానాదమై
మనల మురిపించిన వీధి కథకులు
ఇప్పుడు ఎండమావి కోయిలలై మిగిలిరి
సిరధమనుల సహచర్యం
మానవ జీవనానికి దర్పణమై
పల్లె కోవెలల్లో గాలి దీపాలై నిల్చిన
కళాకారులెందరో సాక్షిగా
కథ కాలి మువ్వల బంధం
పుణరుజ్జీవన తోరణమై
చెదిరిన సంస్కృతి మీద
నిర్భయంగా నాట్యం చేయాలి.

- వజ్జీరు ప్రతాప్
పరకాల, సెల్.నం.9989562991