డైలీ సీరియల్

పూలకుండీలు 46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ మాటలను విన్న కిషోర్, అనితలు షాక్ తిన్నవాళ్ళ మాదిరిగా ఒక్కసారిగా స్తబ్దులై కొంతసేపు వౌనంగా కూర్చుండిపోయారు.
వాళ్ళనాస్థితిలో చూసిన డాక్టర్ విశ్వామిత్రా వెంటనే స్పందిస్తూ ‘‘చూడండీ! మీకిప్పుడు పిల్లలు కలగడానికి అవకాశం లేదన్నాను గాని అసలు పిల్లలే లేకుండాపోయే పరిస్థితి వుండకుండా పోదు గదా! ’’ నిశ్చితంగా వాళ్ళ వంక చూస్తూ అన్నాడు.
‘‘అదేంటో చెప్పండి డాక్టర్!’’ దారి తప్పి దప్పిగొన్న ఎడారి బాటసారికి ఒక్కసారిగా నీటి బుగ్గ ఎదురైతే ఎంతటి ఆనందాన్ని పొందుతాడో అంతటి ఆనందాన్ని డాక్టర్ మాటల్తో పొందుతూ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి అడిగారు.
‘‘సింపుల్, ఏదైనా అనాధ శరణాలయం నుండి ఓ శిశువును తెచ్చుకుని పెంచుకోండి! మీరలా చేసినట్టయితే ఓ అనాధ శిశువుకు మంచి జీవితాన్ని ఇచ్చినవాళ్ళవుతారు. మీకూ పిల్లలు లేరన్న బాధ వుండదు’’ చెప్పుకొచ్చాడు డాక్టర్ విశ్వామిత్ర.
ఆ మాటలు వింటూనే ముఖం అప్రసన్నంగా పెట్టిన అనిత ‘‘ఇంతా జేస్తే మీరిచ్చే సలహా ఇదా!?’’ నాలుక చప్పరిస్తూ అంది.
‘‘ఏం నా సలహా నచ్చలేదా?’’ ముఖంమీద చెదిరిపోని చిరునవ్వుతో అడిగాడు డాక్టర్ విశ్వామిత్ర.
‘‘ఔను డాక్టర్! ఇందాక మాటల మధ్య మీరో సామెత చెప్పారు గదా? అట్లానే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పే సామెతొకటి నాకు గుర్తొస్తున్నది చెప్పనా?’’ చిరునవ్వును బలవలంతంగా పెదవులమీదికి తెచ్చుకుంటూ అంది అనిత.
‘‘వై నాట్?’’ మెడలో వున్న స్టెతస్కోప్‌ను తీసి తన ముందున్న టేబుల్ మీద పెడుతూ ఆసక్తిగా ముందుకు వంగి అన్నాడు డాక్టర్ మిత్రా.
‘‘కాయో కసరో తన చేలో పండాలి. కుంటో గుడ్డో తన కడుపున పుట్టాలి అంటూ చెప్పేది’’ తన మాటల్లో పసలేనట్టు తనకే అర్థమవుతుంటే కళ్ళు తేలవేస్తూ చెప్పింది అనిత.
‘‘నిజమే డాక్టర్! ఏదైనా తన స్వంతం అనుకున్నపుడు మనిషి పొందే అనుభూతి ఎంత తనదనుకున్నా ఓ పరాయి వస్తువుమీద కలుగదు గదా?’’ అంటూ భార్యకు వత్తాసు పలికాడు కిషోర్.
‘‘వీళ్ళు ఉత్త చదువుకున్న మూర్ఖుల్లా వున్నారే’’ అనుకున్న డాక్టర్ ‘‘అనితా! మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డే మీకు కావాలనుకుంటే ఒక పని చెయ్యొచ్చు!’’ ఓ విధమైన కొంటె చూపుతో ఆవిడ వంక చూస్తూ చిలిపితనం ఉట్టిపడుతున్న స్వరంతో అన్నాడు డాక్టర్ విశ్వామిత్రా.
‘‘చెప్పండి డాక్టర్!’’ ఆతృత నిండిన స్వరంతో అంది అనిత.
‘‘ఏం లేదు, ఓ మంచి పిల్లను చూసి తీసుకొచ్చి దగ్గరుండి మీ ఆయనకు మరో పెళ్లి చేశావంటే సరి, నువ్వు అనుకుంటున్నట్టు మీ రక్తసంబంధమే మీకు లభిస్తుంది’’ డాక్టర్ మాటల్లో ఏ మాత్రం తగ్గని చిలిపితనం తొంగి చూస్తూనే వుంది.
‘‘ఏంటి డాక్టర్ మీరంటుంది!’’ ఒక్కసారిగా విస్తుబోతూ అంది అనిత.
‘‘లేకపోతే ఏంటమ్మా! మీ చాదస్తం? ఇంతింత చదువులు చదువుకుని, ఈ దేశం వచ్చి ఇంతింత ఉద్యోగాలు చేసుకుంటూ కూడా పాతకాలపు ముసలమ్మలా! కడుపున పుట్టిన బిడ్డ కాకరకాయ అంటూ చాదస్తంగా మాట్లాడితే ఏం చెప్పాలి?’’ అంటూ సుతిమెత్తగా చివాట్లు పెట్టాడు డాక్టర్ విశ్వామిత్రా.
‘‘నా బాధ మీకు చెప్పినా అర్థం కాదు డాక్టర్! ఆ రోజున కిషోర్ వద్దంటున్నా వినకుండా నేనే అందం, చందం, ప్రొఫెషన్, గాడిద గుడ్డు అంటూ ఏవేవో సొల్లు మాటలు మాట్లాడి రెండుసార్లు అబార్షన్ చేయించుకున్నాను. నేను చేసిన తప్పుకు కిషోర్ కూడా నష్టపోవడం నాకిష్టం లేదు డాక్టర్! మిడి మిడి జ్ఞానంతో నేను చేసిన తప్పును నేనే సరిదిద్దాలి. దీంతో నా ఆవేదనేంటో మీకర్థమై వుంటుంది డాక్టర్’’ దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుకతో చెప్పుకొచ్చింది అనిత.
అనితను ఆ స్థితిలో చూసిన డాక్టర్ విశ్వామిత్ర మనసులో ఆమె పట్ల ఒక డాక్టర్‌గాకన్నా ఒక తండ్రిగా సానుభూతి వెల్లువెత్తుతుంటే ‘‘పోనీ ఓ పని చేస్తారా?’’ అన్నాడు ఏదో ఆలోచిస్తూ.
‘‘ఏంటో చెప్పండీ!’’ అన్నట్టు భార్యాభర్తలిద్దరూ ఒకేసారి తలెత్తి డాక్టర్ వంక చూశారు.
‘‘సరోగసీకి వెళతారా?’’ ఆలోచనలో నుండి బయటకొస్తూ అన్నాడు డాక్టర్ విశ్వామిత్రా.
దానికి వౌనమే వాళ్ళ సమాధానమయ్యింది.
‘‘వీళ్ళ వౌనానికి కారణం సరోగసీని గురించి అవగాహన లేకపోవడమే’’ అనుకున్న డాక్టర్ విశ్వామిత్రా ‘‘సరోగసీ పద్ధతి గురించి మీకు తెలియదులా వుందే’’ అన్నాడు.
‘‘నిజంగానే అదేంటో మాకు తెలియదు సార్! కెరీర్‌గ్రాఫ్ పెంచుకోవడం ఎలా అన్నదాన్ని గురించి తప్ప మిగతా దేనిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకెప్పుడూ రాలేదు’’ తమకు తెలియని విషయాన్ని నిజాయితీగా అంగీకరిస్తూ చెప్పుకొచ్చారు అనిత, కిషోర్‌లిద్దరూ.
కొంతసేపటి తరువాత అనిత ‘‘అసలింతకూ ఆ సరోగసీ అంటే ఏంటి సార్!’’ అంటూ మళ్లీ ప్రశ్నించింది.
‘‘అచ్చ తెలుగులో చెప్పాలంటే అద్దె గర్భం అని అర్థం’’. ఇన్ని చెప్పినా మళ్లీ దాన్ని గురించే అడుగుతున్న వాళ్ళ సంకుచిత స్వభావానికి ఒకింత జాలిపడుతూ చెప్పాడు డాక్టర్ విశ్వామిత్ర.
‘‘అద్దె గర్భమా!?’’ ఒక ఆశ్చర్యపు సుడిగాలి ఏదో వాళ్ళను స్పర్శిస్తూ వెళ్లిన అనుభూతికి లోనవుతూ ఒకేసారి అన్నారు అనితా, కిషోర్‌లిద్దరూ.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు