S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటి రంగాన్ని విస్తరిస్తాం

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ ఐటి రంగం దేశంలో అగ్రగామిగా దూసుకుపోతోందని, ఐటి రంగం తన కార్యకలాపాలను విస్తరిస్తోందని, రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నూతన ఐటి విధానం, ప్రోత్సాహకాలకు అనేక బహుళ జాతి కంపెనీలు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. మంగళవారం ఇక్కడ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజస్ అసోసియేషన్ (హైసీ) వార్షిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటి ఉత్పత్తుల ఎగుమతులు 87 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయన్నారు. ఐటి రంగం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా ఉందన్నారు.

ఎన్‌టిపిసి షేర్ సేల్‌కు విశేష స్పందన

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్‌టిపిసిలో ప్రభుత్వ వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి మంగళవారం విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా ఎన్‌టిపిసిలో 5 శాతం వాటాను కేంద్రం అమ్మేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే 32.98 కోట్ల షేర్లకుగాను 46.35 కోట్ల షేర్లకు సంస్థాగత మదుపరుల నుంచి బిడ్లు దాఖలయ్యాయి. దీంతో 1.41 రెట్లు అధికంగా బిడ్లు వచ్చినట్లైంది. కాగా, బుధవారం రిటైల్ మదుపరులకు 8.24 కోట్ల షేర్లను అమ్మనున్నారు. ఈ ఒఎఫ్‌ఎస్ ద్వారా ప్రభుత్వానికి 7,800 కోట్ల రూపాయల నిధులు రానుండగా, ఒక్కో షేర్ ధరను 168 రూపాయలుగా నిర్ణయించారు.

స్టార్టప్‌ల కోసం ఏపి రూ. 500 కోట్ల నిధి

ముంబయి, ఆగస్టు 29: స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా వచ్చే ఏడాది మార్చికల్లా 500 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ సలహాదారు జెఎ చౌధరి మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ నిధికి 100 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం, మిగతా 400 కోట్ల రూపాయలను ఎస్‌ఐడిబిఐ వంటి పలు సంస్థల నుంచి సేకరిస్తామన్నారు.

హచిసన్‌కు రూ. 32 వేల కోట్ల పన్ను నోటీసు

న్యూఢిల్లీ, ఆగస్టు 29: వొడాఫోన్ డీల్ వ్యవహారంలో హాంకాంగ్‌కు చెందిన హచిసన్ నుంచి ఆదాయ పన్ను శాఖ 32,320 కోట్ల రూపాయలను కోరుతోంది. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు భారత్‌లోని తమ మొబైల్ వ్యాపారాన్ని హచిసన్ 2007లో 11 బిలియన్ డాలర్లకు అమ్మినది తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పన్ను చెల్లింపులు జరగలేదన్న ఆదాయ పన్ను శాఖ.. వడ్డీ, జరిమానా కలుపుకుని మొత్తం 32,320 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు హచిసన్ హోల్డింగ్స్ లిమిటెడ్.. హాంకాంగ్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. దాదాపు 7,900 కోట్ల రూపాయల పన్ను, 16,430 కోట్ల రూపాయల వడ్డీ, మరో 7,900 కోట్ల రూపాయల జరిమానా అని వివరించింది.

రూ. 1,000 నోట్లు రావు: కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 29: వెయ్యి రూపాయల నోట్లను తిరిగి చలామణిలోకి తెచ్చే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 200 రూపాయల నోట్లను పరిచయం చేసిన నేపథ్యంలో వెయ్యి రూపాయల నోట్లూ మళ్లీ రానున్నాయన్న వార్తలు సోమవారం వచ్చాయి. అయితే దీనిపై మంగళవారం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ అలాంటిదేమీ లేదని ప్రకటించారు. నిరుడు నవంబర్ 8న నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనలో భాగంగా పాత పెద్ద నోట్ల (500, 1,000)ను మోదీ సర్కారు రద్దు చేసినది తెలిసిందే. వాటి స్థానంలోనే కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను తెచ్చారు.

షేడ్‌నెట్ హౌస్‌లకు 75 శాతం సబ్సిడీ

హైదరాబాద్, ఆగస్టు 29: రైతులు అధిక దిగుబడి కోసం ‘షేడ్‌నెట్ హౌస్’లను ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన కమిషనర్ ఎల్ వెంకట్రామి రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ (నెక్లెస్‌రోడ్డు)లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యాన మహోత్సవం-2017 ప్రాంగణంలో మంగళవారం ఆయన రైతులతో మాట్లాడారు. షేడ్‌నెట్ హౌస్‌ల నిర్మాణానికి 75 శాతం ఖర్చును సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తోందని తెలియజేశారు. షేడ్‌నెట్‌లలో మైక్రో ఇరిగేషన్ విధానంలో పంటలకు నీటిని అందించేందుకు వీలుందన్నారు.

మార్కెట్‌లోకి సరికొత్త బ్లూస్టార్ వాటర్ ప్యూరిఫయర్స్

హైదరాబాద్, ఆగస్టు 29: ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ బ్లూస్టార్.. మార్కెట్‌లోకి సరికొత్త వాటర్ ప్యూరిఫయర్లను తీసుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో సంస్థ ప్రతినిధులు వీటిని విడుదల చేశారు. 21 రకాల మోడల్స్‌ను పరిచయం చేయగా, వీటి ధరల శ్రేణి కనిష్టంగా 7,900 రూపాయలు, గరిష్ఠంగా 44,900 రూపాయలుగా ఉంది. స్టెల్లా, ఎడ్జ్, ప్రిస్మా, ఇంపెరియా, మాజెస్టో, ప్రిస్టినా సిరీస్‌లలో ఆర్‌ఒ, యువి, ఆర్‌ఒ ప్లస్ యువి, ఆర్‌ఒ ప్లస్ యువి ప్లస్ యుఎఫ్ తదితర 21 రకాల మోడల్స్‌ను బ్లూస్టార్ తెచ్చింది.

తిరుచానూరులో 4 నుంచి పవిత్రోత్సవాలు

తిరుపతి, ఆగస్టు 29: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు 3వ తేదీ సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. 4న పవిత్రప్రతిష్ట, 5న పవిత్ర సమర్పణ, 6న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. కాగా పవిత్రోత్సవాల సందర్భంగా పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.

విశాఖలో భారీ చోరీ

విశాఖపట్నం, ఆగస్టు29: విశాఖ నగరానికి సమీపంలోని పోతినపల్లయ్యపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఒక ఇంట్లో దుండగులు తుపాకీ, కత్తులు చూపించి 3 కేజీల బంగారాన్ని దోచుకుపోయారు. క్రైం డిసిపి షిమాషి బాజ్‌పాయ్ విలేఖరులకు వివరించారు. రాజస్థాన్‌కు చెందిన రాకేష్‌కుమార్ పిఎంపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వెండి వ్యాపారం చేస్తున్నాడు. రాకేష్‌కుమార్‌కు మంగళగిరికి చెందిన వెంకటరమణతో నాలుగేళ్లుగా పరిచయం ఉంది. రాకేష్‌కుమార్ కూడా బంగారం వ్యాపారం చేస్తానని వెంకటరమణతో చెప్పి సుమారు 3 కేజీల బంగారు నగలను వెంకటరమణకు ఆర్డర్ ఇచ్చాడు.

భూమా కుటుంబానికి కలిసొచ్చిన ఉప ఎన్నిక

కర్నూలు, ఆగస్టు 29: కర్నూలు జిల్లా రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేకత కలిగిన భూమా కుటుంబానికి ఉప ఎన్నికలు అచ్చొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ కుటుంబం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా వీరిలో భూమా వీరశేఖరరెడ్డి మినహా అందరూ ఉప ఎన్నిక ద్వారానే చట్టసభలకు ఎన్నిక కావడం గమనార్హం. 1989 సాధారణ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఎన్నికైన భూమా వీరశేఖరరెడ్డి 1992లో గుండెపోటుతో మరణించారు. దీంతో అదే ఏడాదిలో జరిగిన ఉప ఎన్నికలో ఆయన సోదరుడు భూమా నాగిరెడ్డి పోటీచేసి విజయం సాధించారు.

Pages