సాధన

డిస్కవరీ

1984 ఆగస్టు 30వ తేదీన అమెరికా అంతరిక్ష కార్యక్రమంలో కీలక నౌకగా, నింగికి నేలకు ప్రయాణాలు చేయడం ఆరంభించిన డిస్కవరీ 26 ఏళ్లలో 39 సార్లు అంతరిక్షానికి వెళ్లి వచ్చింది. అన్ని సార్లు అంతరిక్షానికి వెళ్లి వచ్చిన వాహక నౌక మరోకటి లేనే లేదు. ఇది మొత్తం మీద 365 రోజులు అంతరిక్షంలో గడిపింది. 14.8 కోట్ల మైళ్లు ప్రయాణం చేసింది. భూమి చుట్టూ 5830 పరిభ్రమణాలు చేసింది.

ఉప ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లోని 18 అసెంబ్లీస్థానాలు, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి జూన్ 12న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు 9 రాష్ట్రాల పరిధిలోని 27స్థానాలకు జూన్ 12న ఉప ఎన్నికలు జరుగుతాయి. షెడ్యూలుప్రకారం మే 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మే 25 నుండి నామినేషన్లను స్వీకరిస్తారు. 26న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉప సంహరణకు మే 28 వరకూ గడువు ఉంటుంది. జూన్ 12న పోలింగ్ జరుగుతుంది.

గిలానీ

పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీపై ముడుపుల కేసుల్ని తిరగదోడేందుకు నిరాకరించడం ద్వారా ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు పాకిస్తాన్ సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది. ఇందుకు ఆయనను జైలుకు పంపించకుండా మినహాయింపునిస్తూ, కోర్టు విచారణ ముగిసే వరకూ నామమాత్రపు శిక్షను విధించింది.

భగభగలు

సముద్ర అవక్షేపాల్లోని మీథేన్, లోగడ భూమి వేడెక్కడానికి కారణమైందని ఇంత వరకూ శాస్తవ్రేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే భూమి కక్ష్యలోని మార్పులే ఈ పరిణామానికి దారితీశాయని తాజా పరిశోధనల్లో తేలింది. 5.5 కోట్ల సంవత్సరాల కిందట భూమి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. ఆ వేడి వాతావరణం కొంత కాలం కొనసాగిన తర్వాత చల్లబడింది. మళ్లీ అలాంటి పరిస్థితులు మరో రెండు మార్లు వచ్చాయి.

బార్నెస్

ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను బ్రిటన్ రచయిత జూలియన్ బార్నెస్ గెలుచుకున్నారు.లోగడ 1984, 19996, 2005లో మూడుసార్లు నామినేట్ అయినా దక్కని విజయం ఆయనను నాలుగోసారి వరించింది. ద సెన్స్ ఆఫ్ యాన్ ఎండింగ్ అనే నవలకు గానూ బార్నెస్‌కు ఈ పురస్కారం దక్కింది.

ఐపిఎల్ -5

వరుసగా ఐదోసారి క్రికెట్ కుంభమేళా ప్రారంభమైంది. 3వ తేదీన చెన్నైలో ప్రారంభకార్యక్రమం జరిగింది. మొత్తం 54 రోజుల పాటు 76 మ్యాచ్‌లు జరుగుతాయి. చెన్నైలోనే మే 27వ తేదీన జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. 2008లో ఐపిఎల్ -1లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించగా, 2009లో డక్కన్ చార్జర్స్ తుది విజేతగా నిలిచింది. 2010, 2011లో చెన్నై సూపర్‌కింగ్ తుది విజేతగా నిలిచింది. ఈసారి ఐపిఎల్-5లో 9 జట్లు బరిలో నిలిచాయి.

గ్రహ వ్యవస్థ

విశ్వ ఆవిర్భావానికి ముందు నాటిగా చెబుతున్న గ్రహవ్యవస్థను ఐరోపా శాస్తవ్రేత్తలు గుర్తించారు. విశ్వ ఆవిర్భావ సమయంలో అంతరించిపోకుండా ఉన్న ఈ గ్రహవ్యవస్థ 13వేల కోట్ల సంవత్సరాల నాటిది కావచ్చని అంచనా. ఈ గ్రహకూటమిలో హెచ్‌ఐపి 11952 అనే నక్షత్రం , రెండు గ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒక గ్రహం నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 290 రోజులు కాగా, మరో గ్రహానికి పట్టే కాలం ఏడు రోజులు మాత్రమే.

పేదరికం

పేదరికం కొలమానాన్ని ప్రణాళికా సంఘం మరింత తగ్గించింది. రోజుకు తలసరి వినియోగం వ్యయం పట్టణ ప్రాంతాల్లో 28.65 (నెలకు 859.6 రూపాయిలు), గ్రామాల్లో 22.42 (నెలకు 672.8) కన్నా ఎక్కువ ఉన్న వాళ్లు పేదలు కారని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఐదేళ్లలో దేశంలో పేదరికం 7.4 శాతం తగ్గిందని లెక్కలు కట్టింది.

శత శతకం

క్రికెట్‌లో సెంచిరీలు వంద చేసిన మహత్తర రికార్డును సచిన్ టెండూల్కర్ ఎట్టకేలకు నమోదుచేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన మరో క్రీడాకారుడు లేనేలేడు. భవిష్యత్‌లో కూడా పుడతాడనే నమ్మకం కూడా కనిపించడం లేదు. ఉండరని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఏడాది కాలంగా సచిన్ టెండూల్కర్ ఈ రికార్డు సృష్టించాలని అభిమానులు నరాలు తెగిపోయే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఎన్‌సిటిసి - తెలుసుకుందాం

ఎన్‌సిటిసి అంటే జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం. దేశంలో నిఘా విభాగాల మధ్య సమన్వయాన్ని సాధించడం, నిర్ణయాల ప్రక్రియలో మెరుపువేగంతో వ్యవహరించడానికి అవకాశం కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంతో పటిష్టమైన ఉగ్రవాద నిఘా వ్యవస్థకు ఇదొక రూపం. అయితే ఇది జాతీయ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్రాల అధికారాలను ఇది మింగేస్తుందని వాటి వాదన.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading