వెన్నెల

వీడే... మన హీరో

  • 28/11/2014
  • -శ్రీనివాస్
సాంఘిక చిత్రాల శకం కమర్షియల్ ఫార్మాట్‌కు మారాక -మనవాడు అక్కడే ఉండిపోయాడు. సేఫ్‌జోన్‌లోనే డ్రామా నడుపుతున్నాడు. కొత్తదనం వైపు చూడడు, చూసే సాహసం చేయడు. వాడే -తెలుగు హీరో. చూడు ఒకవైపే చూడు. రెండోవైపు చూడాలనుకోకు. తట్టుకోలేవ్... మాడిపోతావ్. చూడప్పా సిద్దప్పా నేను సింహం లాంటోణ్ణి. అది గడ్డం గీసుకోదు. నేను గీసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్లు వీళ్లూ చెప్పడమేగానీ నాక్కూడా తెలీదు. ఈ డైలాగులు విన్నవాళ్లెవరైనా తెలుగు హీరో ఆహార్యంపై ఊహాచిత్రం గీసేయగలరు. అలాంటి ఊహాచిత్రంగానే ఉండాలని -తెలుగు హీరో కూడా ఫిక్సయిపోయాడు. సాంఘిక చిత్రాల శకాన్ని కమర్షియల్ ఫార్మాట్‌కు తీసుకొచ్చాక హీరో అక్కడే ఉండిపోయాడు. అదే సేఫ్‌జోన్ అనుకుంటున్నాడు. అతను మారలేదు, మారాలనుకోవడం లేదు. సినిమా ఏదైనా -కొన్ని ప్రత్యేకమైన లక్షణాలున్నవాడే హీరో. డౌట్ లేదు. కానీ తెలుగు హీరోకు అలాంటి లక్షణాలతోపాటు ప్రత్యేకమైన బండగుర్తులూ ఉంటాయి. అవి -వయసుతో సంబంధం లేని పాత్రలు. ఓపికతో నిమిత్తం ఫైట్లు. ఆవారాగానూ అమ్మాయిల్ని పడగొట్టే విద్య. పంచ్ డైలాగులతో ప్రత్యర్థులను పాతరేసే విరోచితం. తెలుగు హీరోయిజం ఇంతేనా అంటే -ఇంతేమరి. పొరబాటున ఏ హీరో అయినా మారాలనుకున్నా -అభిమానుల అహం దెబ్బతింటుంది. ఫ్యాన్స్‌ను కష్టపెట్టడం ఇష్టంలేక -హీరో కూడా మారడు, మారలేడు. దశాబ్దకాలంగా తెలుగు సినిమా తెరపై నడుస్తున్న కథ ఇది. ఆరు పాటలు -విదేశాల్లో. నాలుగు ఫైట్లు -తలకాయలు తెగేలా. పది డైలాగులు -పంచ్’లూడిపోయేలా. ప్రీక్లైమాక్స్ వరకూ కాలక్షేపం కబుర్లు, హీరోయిన్‌తో చిందులేస్తూ గడిపేసిన వాడే -క్లైమాక్స్ సీన్స్‌లో జీవితాన్ని కాచి ఒడపోసి విజయం సాధించినంత బిల్డప్. అదీ -తెలుగు హీరో స్టయల్. *** క్యారెక్టర్‌లో చాలా డైమన్షన్స్ ఉన్నాయి. ఇలాంటి రోల్ ఇంతవరకూ ఎవ్వరూ చేయలేదు. కెరీర్‌లో ఇదో భిన్నమైన సినిమా. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు -హీరో.. లేదంటే హీరో గురించి దర్శకుడో చెప్పే రొటీన్ డైలాగ్ ఇది. కానీ -స్క్రీన్ మీద హీరో మాత్రం మళ్లీ అలాగే కనిపిస్తాడు. కొత్తదనం కబుర్లు ఉత్తమాటేనని నిరూపిస్తాడు. నాటితరం హీరోల నుంచి నేటితరం యువ హీరోల వరకూ ఇలాంటి ఫక్తు కమర్షియల్ ఫార్మెట్‌నే ఫాలోఅవుతూ, హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఏ తెలుగు హీరో కూడా ఆసక్తి చూపించకపోవడం విశేషం. తమిళంలో వైవిధ్యమైన నటుడిగా జాతీయస్థాయి పేరు సంపాదించుకున్న కమల్‌హాసన్ చేయని పాత్రంటూ లేదు. తర్వాత వచ్చిన యువ హీరోలూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ భిన్నమైన పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగు హీరోలు మాత్రం ప్రయోగాత్మక పాత్రలంటే ఆమడదూరం జరుగుతున్నారు. ఏ సినిమా అయినా ఒకే రకమైన గెటప్. ఏమాత్రం తగ్గని డ్రెస్సింగ్ బిల్డప్. చీల్చి చెండాడేసే హీరోయిజం. మీరు మారరా? అని అడిగి చూడండి. హీరోల నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. -‘సరైన కథలు రావడం లేదు. అయినా టాలీవుడ్‌కు ప్రయోగాలు పడవు. చేస్తే ఎవరూ చూడరు. ముఖ్యంగా ఫ్యాన్స్ జీర్ణించుకోరు’. నిజానికి ప్రేక్షకులకు అలాంటి పాత్రల పట్ల ఆసక్తి లేకపోతే కమల్ ఇన్ని పాత్రలు చేసేవాడా? భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగేవాడా? అలాంటి పాత్రలు చేయకుంటే -జాతీయస్థాయి ఇమేజ్ వచ్చి ఉండేదా? ఈ ప్రశ్నలకు సమాధానం మన హీరోలకు నచ్చదు. కేవలం ఫక్తు కమర్షియల్ మసాలా కథలపై ఆధారపడుతూ ముందుకు సాగుతున్న హీరోల్లో మార్పురావాలి. సినిమా స్థాయి పెరుగుతున్నా, ఒక్క హీరోకూ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు ఎందుకు దక్కడం లేదో ఆలోచించాలి. హీరోయిజం ఇలాగే ఉండాలా? పరభాషా సినిమాల్లోనూ, జాతీయ అంతర్జాతీయ చిత్రాల్లోనూ హీరోలంతా ఇలాగే కనిపిస్తున్నారా? అన్న ప్రశ్నలు వేసుకోవాలి. చిత్రం ఏమిటంటే -వారసత్వంగా వస్తున్న హీరోలు, యువ హీరోలు సైతం ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ హీరోయిజంగా నమ్మి పరగులు తీయడం. వీళ్లంతా భిన్నమైన కోణాన్ని ఎందుకు ఎన్నుకోలేక పోతున్నారన్నది అర్థంకాని ప్రశ్న. ‘లైఫ్ హీరోయిజాన్ని’ ఆవిష్కరించే చిత్రాలు ఎందుకు ఎన్నుకోవడం లేదన్నది వేయిడాలర్ల ప్రశ్న. ఆమధ్య తమిళ నటుడు సూర్య గజనీగా ఆకట్టుకున్నాడు. చిత్రం కమర్షియల్‌గానూ బాక్సాఫీస్ కలక్షన్లను కొల్లగొట్టింది. అంతెందుకు అదే చిత్రాన్ని హిందీలో అమీర్‌ఖాన్ చేసి బాలీవుడ్‌లో సంచలనం సృష్టించాడు. అదే గజనీ పాత్రను తెలుగులో ఏ హీరో చేయడానికి ముందుకు రాలేకపోయాడు. ఈమధ్యే లారెన్స్ రూపొందించిన ‘కాంచన’ చిత్రంలో శరత్‌కుమార్ హిజ్రా పాత్రతో మెప్పించాడు. సినిమా కమర్షియల్‌గా భారీ వసూళ్లు రాబట్టింది. మరి ఇలాంటి ప్రయత్నాలు తెలుగు హీరోలు ఎందుకు చేయడం లేదు? అంటే చిత్రమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఇలాంటి సినిమాలు రూపొందించే సత్తా దర్శకులకు లేదు, ఇలాంటి సినిమాల నిర్మాణానికి నిర్మాతలు ముందుకు రారు, ఇలాంటి పాత్రలు పోషించే హీరోలు ఎవరున్నారు? అన్న వివరణల దగ్గరే తెలుగు సినిమా ఆగిపోతుంది. వీటిని దాటుకుని వైవిధ్యమైన సినిమా తెలుగులో రూపొందడానికి చాలా సమయం పడుతుందనే విషయం అర్థమవుతుంది. కమర్షియల్ మసాలా ఫార్మాట్‌ను కాస్త పక్కనపెట్టి -‘లైఫ్ హీరో’గా వైవిధ్యమైన పాత్రల్లో నటించేందుకు యువ హీరోలైనా ముందుకు రావాలి. హీరో నిర్వచనాన్ని ఏకొద్దిగా మార్చుకోగలిగినా -తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో గౌరవం, గుర్తింపు దక్కడం ఖాయం. కొత్త జనరేషన్‌లోనైనా ప్రయోగాలకు శ్రీకారం చుట్టగలిగితే -తెలుగు సినిమా మూస ధోరణిలోనే పోతుందన్న అపవాదు తొలగించే ఆస్కారం ఉంటుంది. అందుకే -హీరోలే కాదు, తెలుగు ప్రేక్షకులూ సన్నద్ధం కావాలి. **

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading