యువ

ట్రెండీ.. అ‘డ్రెస్’

  • 22/02/2012
  • -బాసు
వొంటిని కప్పేది వస్తమ్రే అయినా -సందర్భాన్ని బట్టి స్టయిల్ ఉంటుంది. స్టయిల్‌ను బట్టి లుక్ మారుతుంది. లుక్‌ను బట్టే ఎదుటివాళ్ల దగ్గర మన విలువ పెరుగుతుంది. మర్యాదపూర్వకమైన గౌరవం దక్కాలంటే -మన వేషధారణలోనూ జాగ్రత్త తీసుకోవాలి. అందుకు సందర్భాన్ని బట్టి డ్రెస్ డిజైన్లను ఎంపిక చేసుకోవాలి. అలాంటి సందర్భాలు, అలాంటలాంటి డ్రెస్ డిజైన్లు ఎలా ఉండాలంటే... డ్రెస్‌వేర్ సెలక్షన్‌లో లక్ష్మీ సూపర్బ్. ఖర్చుకి వెనుకాడకుండా మంచి డిజైన్స్‌లో లేటెస్ట్ మోడల్స్ వెతికి మరీ సెలెక్ట్ చేసుకుంటుంది. పదిమందిలో తళుక్కుమని మెరవాలని ధరిస్తే ‘నీ డ్రెస్ చాలా బావుంది’ అన్న నోళ్ళే వెనకాల ‘ఈ అమ్మాయికి డ్రెస్ సెన్స్ లేదని’ గుసగుసలాడడం వినేసరికి కాస్త చిన్నబుచ్చుకుంది. లోపం ఎక్కడుందానని ఆలోచించడం మొదలుపెట్టింది. విషయం త్వరగానే అర్థమయ్యింది. ఇప్పుడామెను ట్రెడిషనల్ శ్రీలక్ష్మీ.. మోడ్రన్ మహాలక్ష్మి అంటూ ప్రశంసిస్తున్నారు. మొత్తానికి విజయలక్ష్మిలా గుడ్‌లుక్‌తో దూసుకుపోతుంది. నేడు యువతకు డ్రెస్‌వేర్ సెలక్షన్ పట్ల మక్కువ ఎక్కువ. క్రెడిట్ కార్డు ఖాళీ అయ్యేంతవరకు మార్కెట్‌లో హల్‌చల్ చేసే మోడల్స్‌ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాటిని ధరించడంలో చూపే శ్రద్ధ, సమయం సందర్భం గురించి ఆలోచించడంలో కానరాకపోవడంతోనే చిక్కులు. ఈ మెళకువలు ఎవరు పాటిస్తారో వారు అన్ని చోట్లా తళుక్కుమంటూనే ఉంటారు. మనిషి అందంగా కనిపించడంలో, హుందాగా కనిపించడంలో డ్రెస్‌వేర్‌దే ప్రధాన పాత్ర. అలాంటి డ్రెస్‌వేర్‌ని సెలెక్ట్ చేసుకోవడంలోనే టేస్ట్ బయటపడుతుంది. ధరించే దుస్తులే గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెడతాయి. యువతకు ఇవన్నీ పట్టని విషయాలు. వారికి కావాల్సింది లేటెస్ట్ మోడల్స్‌లో మెరిసిపోవడమే. ‘డ్రెస్‌కోడ్’ అంటూ ఆంక్షలు పెడితే చిర్రెత్తిపోతారు. మోడ్రన్ దుస్తుల్లో ఎదుటపడి ఎలా వున్నామని ప్రశ్నిస్తే ‘బావున్నారన్న’ సమాధానం వస్తేనే సంతృప్తి చెందుతారు. ప్రస్తుతం అమ్మ నాన్న డ్రెస్‌వేర్ సెలక్షన్ చేసే రోజులు పోయాయి. ఇప్పుడంతా రెడీమేడ్ షోరూముల్లో పిల్లలదే ఇష్టారాజ్యం. అందుకే నిమిషానికో మోడల్ మార్కెట్‌లో ధగధగ మెరిసిపోతోంది. నానాటికి ట్రెడిషనల్ డ్రెస్‌వేర్ పట్ల ఆసక్తి యువతలో కనుమరుగైపోతుంది. ఎలాంటి దుస్తులు ధరించినా అవి సమయానికి, సందర్భానికి తగినవిగా వుంటేనే అందం.. గౌరవం. మారే కాలంతోపాటు మారడం తప్పుకాదు. అయితే ఫ్యాషన్స్‌తోపాటు ట్రెడిషనల్స్ కూడా ఫాలో అప్ చేసుకోవాలి. నిత్యం కనిపించే లుక్‌లో ఛేంజ్ తీసుకురావడమే ఫ్యాషన్. అందుకే మీరు మోడ్రన్ డ్రెస్‌వేర్ ఎక్కువ ధరిస్తుంటే వీక్లీవన్స్ ట్రెడిషన్ (సంప్రదాయ) డ్రెస్‌వేర్‌కి ఛాన్స్ ఇచ్చి చూడండి. తేడా మీకే తెలుస్తుంది. నేటి తెలుగమ్మాయి నిత్యం చుడీదార్‌లోనే కనిపిస్తుంది. వీక్‌లో ఒక్కసారి లంగావోణిలోకనిపిస్తే? పదహారణాల పడుచుతనం తొంగిచూసి, పదిమంది కళ్ళకు తగ్గ దిష్టిని తీయించుకునేలా చేస్తుంది. అంతేకాదు నేడు జరుపుతున్న ఫ్యాషన్ పెరేడ్స్ కూడా ట్రెడిషనల్‌కే పెద్ద పీటవేస్తున్నారు. దుస్తులు శరీరాన్ని కప్పివుంచడానికే కాదు మేలు చేయడానికి కూడా ఉపయోగపడాలి. అందుకే డ్రెస్‌వేర్ సెలక్షన్స్‌లో యూత్ కాస్త మెళుకవలు పాటించాలి. ధరించే మోడల్ హాయినివ్వాలి. మీరు ధరించే దుస్తులు ఎదుటవారిని ఇంప్రెస్ చేసేవిగా వుండాలి. ఎక్స్‌పోజ్‌డ్ దుస్తులు ధరించడం మీకు ఇబ్బందికాకపోయినా ఎదుటివారిని ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటప్పుడు అది ఎదుటివారి బలహీనతగా భావించడం సరికాదు. మన సమాజ సంస్కృతి సంప్రదాయలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని గ్రహించాలి. ‘్ఫంక్షన్.. ఫంక్షన్..’ ఈ పదం వినపడగానే గుర్తుకొచ్చేది డ్రెస్‌వేర్ సంగతులే. ఆ రోజు ఎలాంటి డ్రెస్‌వేర్ ధరించాలా? అని మనసు లక్ష ప్రశ్నలు వేసుకుంటుంది. సంప్రదింపులు చేస్తుంది. సలహాలు తీసకుంటుంది. ఆఖరికి నచ్చిందే చేస్తుంది. ‘శభాష్!’ అన్న కామెంట్లు వినిపిస్తే సంబరపడతారు. ‘కనీసం డ్రెస్ సెన్స్ కూడా లేదా?’ అని వినబడితే నొచ్చుకుంటారు. ‘్ఫంక్షన్’ అన్న పదం వినబడగానే రెడీ అయిపోకూడదు. ఫంక్షన్ దేనికి? తీరుతెన్నులు.. వచ్చే అతిథులు ఎవరు? ఎక్కడ జరుగుతుంది యిలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. అప్పుడే తగిన డ్రెస్‌వేర్ సెలెక్ట్ చేసుకోగల్గుతారు. శరీరాకృతి కూడా డ్రెస్‌వేర్‌కి సరిపడాలి. లేకపోతే కామెంట్స్‌కి గురి కావాల్సి వుంటుంది. సన్నగా వుండేవారు కాస్త లావుగా కనిపించాలన్నా.. లావుగా వున్నవారు కొంచెం సన్నగా దర్శనమివ్వాలన్నా.. పొట్టివారు కొద్దిగా పొడుగా కనిపించాలన్నా... పొడుగువారు హైట్‌కి తగ్గ విధంగా లుక్‌లో పడాలన్నా డ్రెస్‌వేరే ఒక ఆయుధం. సన్నగా వుంటే కాటన్ దుస్తులు ఫ్రిఫర్ చేసుకోవాలి. లావుగా వుంటే సిల్క్ మిక్స్‌డ్ బెటర్. పొట్టివారు టాప్ దుస్తులు కురచగా వేసుకోవాలి. పొడుగువారు కాస్త లూజ్ మోడల్స్ వాడాలి. శారీరక రంగును బట్టి కూడా డ్రెస్‌వేర్ ధరించాలి. లేకపోతే కాకి ముక్కుకి దొండపండు సామెత గుర్తుచేసిన వారవుతారు. తెల్లగావుంటే డార్క్ కలర్స్ మిమ్మల్ని బాగా ఎలివేట్ చేస్తాయి. నలుపు మీ రంగైతే లేత రంగుల్లో చిన్న డిజైన్లు బెటర్. చామనఛాయ రంగులో వున్నవారు రెండు విధాల కాంబినేషన్స్ వాడటం మంచి లుక్‌నిస్తుంది. అమ్మాయిలు. అబ్బాయిలు నేడు పోటీపడి అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు అందుకుంటున్నారు. అక్కడ డ్రెస్‌కోడ్ వుంటే సరేసరి! లేకపోతే వీకెండ్ తీసేయగా మిగతా ఆరురోజుల్లో త్రీ లుక్స్‌లో కనిపించే దుస్తులు ధరించాలి. అప్పుడు మీలోనే కాదు ఎదుటివారిలో కూడా మీ పట్ల ఫ్రెష్‌నెస్ కనిపిస్తుంది. మీరు ఎంచుకున్న రంగానికి తగినవిధంగా డ్రెస్ లుక్ వుండాలి. ఫ్రెష్‌లుక్ యిచ్చామన్న భావన మీలో కలిగితే మీరు ఆ రోజంతా రీఛార్జ్ అవుతూనే వుంటారు. డ్రెస్‌లుక్‌తో అభినందనలే కాదు విజయాలు కూడా దక్కించుకోవచ్చు. పెద్దలను కలిసే సమయాల్లో.. పండుగలు.. పెళ్ళిళ్ళు వంటి సంప్రదాయ వేడుకల్లో.. దైవదర్శన వేళల్లో సంప్రదాయ దుస్తులకే ఎక్కువగా ఓటు వేయాలి. ఇంటర్వ్యూల సమయంలో గుడ్ ఇంప్రెషన్ పడే విధంగా మీ డ్రెస్ వుండాలి. లైట్ కలర్‌పై చెక్స్ అయితే బెటర్. ఇక ఎంతో ఇష్టపడే మార్కెట్ ఫ్యాషన్లను యువజనోత్సవాలో ధరిస్తేనే అదుర్స్. దుస్తుల విషయంలో అనుకరణలకు దూరంగా వుంటే బెటర్. ముఖ్యంగా సినీస్టార్‌ని ఫాలో కావడం మీకు మైనస్‌ని తెచ్చిపెడుతుంది. దుస్తులు శరీరాన్ని కప్పివుంచేవిగా వుండాలే తప్ప శరీరానికి అతుకులు వేసినవిగా వుండకూడదు. డ్రెస్‌వేర్ సెలక్షన్‌లో ఎక్కువగా మీ యిష్టమే ప్రతిబింబించాలి. వాటిపై విమర్శల శాతం ఎక్కువగా కనిపిస్తుంటే మీ యిష్టాన్ని సరిచేసుకుంటూ ముందుకుసాగండి. ఈ విషయంలోఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురైతే మీ కుటుంబంలోని సభ్యులనుగాని మీ యిష్టాలను గౌరవించే వారినిగాని సలహా అడగండి. ఎందుకంటే మీగురించి వారికంటే ఎవరికీ ఎక్కువ తెలియదు. నిండైన వస్త్రం శారీరక ఆభరణమని గుర్తించండి. అదే మీ అందం.. ఆనందం.. హుందాతనాలకు ప్రతీక!
X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading