S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రశంసలు

పొగడ్తని చాలామంది ఇష్టపడ్తారు. పొగడ్తకి ప్రశంసకి భేదం ఉంది. తెలివైన వ్యక్తులు పొగడ్తని ఇష్టపడరు. కానీ ప్రశంసని ఇష్టపడ్తారు. ప్రశంసని ఇష్టపడని వ్యక్తులు ఎవరూ ఉండరు. అందరూ ప్రశంసని కోరుకుంటారు కానీ, ఇతరులని ప్రశంసించటానికి ఇష్టపడరు. ఇది లోకరీతి. కొంతమందికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కొంతమంది చాలా గొప్పగా రాయగలరు. మరి కొంతమంది గొప్పగా పాడగలరు. ఇంకా కొంతమంది మంచి చిత్రాలు గీయగలరు. మరి కొంతమంది బాగా పాఠం చెప్పగలరు. ఇట్లా ఎన్నో రంగాలని ఉదహరించవచ్చు. వాళ్లలో ఎంత ప్రతిభ వున్నా ఆ రంగాలకి సంబంధించిన వ్యక్తులు ఆ ప్రతిభని గుర్తించడానికి ఇష్టపడరు. ప్రశంసించడం సంగతి దేవుడెరుగు, ఇది నేటి సమాజంలో వున్న దుస్థితి.
ఇందుకు సంబంధించి ఎన్నో సంఘటనలని చెప్పవచ్చు. కానీ ఇటీవల జరిగిన ఓ సంఘటన గురించి చెబుతాను. నేను న్యాయమూర్తిగా పనిచేసి ఆ తరువాత వేరే పదవిలో కొనసాగుతున్నాను. కొంతకాలం అకాడెమీలో పని చేశాను. క్రిమినల్ ‘లా’కు సంబంధించిన పాఠాలు బాగా చెప్పగలను. అప్పుడప్పుడు అకాడెమీల్లో గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటాను. నా క్లాసులకి బాగా ప్రతిస్పందన ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు.
ఈ మధ్య ఓ అకాడెమీలో క్లాస్ తీసుకున్నాను. క్లాస్ బాగా జరిగింది. క్లాసులో వున్న న్యాయమూర్తులని చూస్తే ఆ విషయం అర్థమైంది. నాకు కూడా ఆ విషయం బోధపడింది. ఆ క్లాసులో చాలామంది తెలిసిన న్యాయమూర్తులు ఉన్నారు.
నా క్లాసు జరిగిన మరునాడు ఆ అకాడెమీ డైరెక్టర్ వాళ్లతో మాట్లాడుతూ ‘మీకు ఇంకా ఏ క్లాసులు అవసరం వున్నాయ’ని అడిగాడట.
దానికి నాకు తెలిసిన న్యాయమూర్తి లేచి సెషన్స్ ట్రయల్ క్లాసులని నాతో చెప్పించమని కోరాడట. నా క్లాసులు చాలా ఆసక్తికరంగా ఉంటాయని కూడా చెప్పాడట.
‘మీకు ఏ సబ్జెక్టులు కావాలో చెప్పండి. అంతేకానీ ఎవరితో చెప్పించాలో సూచించకండి’ అని డైరెక్టర్ కఠినంగా జవాబు చెప్పారట.
ఈ విషయం ఆ న్యాయమూర్తి నాకు చెప్పి బాధపడ్డాడు. నాకు అదేమీ పెద్ద వింతగా అన్పించలేదు. బాధపడాల్సిన అంశంగా కూడా అన్పించలేదు.
‘ఈ లోకం ఇతరుల గొప్పతనాన్ని, ఇతరులలో వున్న ప్రతిభని గుర్తించడానికి ఇష్టపడదు. ఒక వ్యక్తిని ఇతరులు ప్రశంసిస్తే సమకాలీనులు ఆ ప్రశంసని ఇష్టపడరు. ఎక్కువమంది అతన్ని ఇష్టపడితే అతన్ని మళ్లీ గెస్ట్‌గా పిలవడానికి ఇష్టపడరు. అదే విధంగా జూనియర్ అధికారుల సూచనలు వినడానికి కూడా చాలామంది ఇష్టపడరు. ఇది లోకరీతి’ అని చెప్పి అతన్ని సమాధానపరిచాను.
మళ్లీ ఈ విధంగా అతనికి చెప్పాను.
‘ప్రశంసని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అయితే అది నిజమైన ప్రశంస అయి ఉండాలి. పొగడ్తలా ఉండకూడదు. ఎవరినైనా నిజంగా ప్రశంసించాల్సి వస్తే మనఃస్ఫూర్తిగా ప్రశంసించాలి. అదే విధంగా కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తే మామూలుగా కాకుండా హృదయపూర్వకంగా చెప్పాలి. అప్పుడు ఆ ప్రశంసలు, ఆ కృతజ్ఞతలు ఆ వ్యక్తికి తాకుతాయి’
ఆ న్యాయమూర్తి సంతృప్తి చెందాడు.

- జింబో 94404 83001