S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ట్రేడ్ సీక్రెట్

నేను డెక్ మీద ఓ కేన్వాస్ కుర్చీలో కూర్చుని నా ఫిషింగ్ రాడ్‌కి ఉన్న గేలాన్ని నీళ్లల్లోకి వేస్తూంటే చెట్ల మధ్య నించి ఓ కారు పైకి వచ్చే శబ్దం వినిపించింది.
నా కేబిన్ సరస్సుకి వెనకాల, అంతా ప్రయాణించే రోడ్‌కి చాలా దూరంగా ఉంది. నా ప్రైవేట్ రోడ్ గేట్ ముందు ‘ఇతరులకి ప్రవేశం లేదు’ అనే బోర్డ్ కూడా ఉంది. నా దగ్గరికి వచ్చే సందర్శకులు సాధారణంగా సేల్స్‌మెన్. వాళ్లు కూడా పనె్నండు మైళ్ల దూరంలోని చిన్న ఊరి నించి నా ఆహ్వానం మీదే వస్తారు. ఆ రోజు నేను ఎవర్నీ పిలవలేదు. నేను నెమ్మదిగా లేచి లోపలకి వెళ్లి, 3006 రైఫిల్‌ని అందుకుని వచ్చేది ఎవరో చూడటానికి మళ్లీ బయటకి వచ్చాను.
పైన్ వృక్షాల చాటు నించి వచ్చే ఆ కారు వెండి రంగు లింకన్. దాన్ని నేను అంతకు మునుపు ఎన్నడూ చూడలేదు. నంబర్ ప్లేట్‌ని బట్టి అది ఇల్లినాయ్ రాష్ట్రానికి చెందిందని గ్రహించాను. దాన్ని బట్టి వచ్చేది ఎవరో చూచాయగా గ్రహించాను. ఆ కారులో మగ డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేరు. దాన్ని నా జీప్ పక్కన ఆపి తలుపు తెరచుకుని డ్రైవర్ బయటకి వచ్చాక కాని నేను అతని మొహాన్ని చూడలేదు.
ఆశ్చర్యం!
ఎడ్ మలాకి!
అతని ముద్దు పేరు ఈజీ ఎడ్ మలాకి.
నేను చూసినప్పటికీ, ఇప్పటికీ అతనిలో పెద్దగా మార్పు లేదు. తలకి నల్లరంగు వాడటం మానేశాడు. మొహంలో అదనపు ముడతలు. గతంలోలానే సిల్క్ షర్ట్, బ్రాంజినీ టై ఖరీదైన సూట్‌లో వున్నాడు. పది పౌన్లైనా పెరిగి ఉంటాడు.
కారు దిగగానే నన్ను చూసి చేతిని ఊపుతూ ఆనందంగా నవ్వాడు. అతని నవ్వు షార్క్ నవ్వులా నాకు తోచింది. నేను రైఫిల్‌ని గోడకి ఆనించి, పోర్చ్‌లోకి వస్తున్న అతనికి ఎదురెళ్లాను.
‘హలో గ్రిఫ్’ నా చేతిని అందుకుని గబగబ కదుపుతూ చెప్పాడు.
అతని వేలి వజ్రపుటుంగరం మీద సూర్యకిరణాలు పడి మెరిసింది. ఎడమ చేతికి ఖరీదైన పాటెక్ ఫిలిప్ ప్లేటినం వాచీ ఉంది.
‘ఇలా ముందు చెప్పకుండా వచ్చినందుకు ఏం అనుకోకు మిత్రమా! నిన్ను చూసి చాలా కాలమైంది. అసలు నిన్ను కనుక్కోవడమే కష్టమైంది’ అడిగాడు.
‘ఆరేళ్లు’ చెప్పాను.
‘నిజానికి ఏడున్నర. ఈ చోటు కనుక్కోవడం తేలిక కాదు’
‘నాకు అలా ఇష్టం’
‘కాని నువ్వు మరీ ఇలా సన్యాసిలా అవుతావని అనుకోలేదు’ మలాకి చుట్టూ చూస్తూ చెప్పాడు.
‘మనుషులు మారుతూంటారు’
‘అవును. ఇంకా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. నీ రిటైర్‌మెంట్ వల్లా?’
‘నువ్వు దేని కోసం వచ్చావో ఆ విషయం సూటిగా చెప్పు మలాకీ’ కోరాను.
‘నేను ఐదు గంటలు డ్రైవ్ చేసి వచ్చాను. నాకు డ్రింకేమీ ఇవ్వవా? ఇంకా ఐరిష్ విస్కీనే తాగుతున్నావా?’ అడిగాడు.
‘అప్పుడప్పుడు’
‘నీ పాత్ర మిత్రుడికి డబల్ పెగ్ విస్కీ ఇస్తావా?’
మేము ఎన్నడూ మిత్రులం కాము. కాని ఆ విషయం అతనితో వాదించడం ఇష్టం లేక లోపలికి తీసుకెళ్లి అతనికి రెండు పెగ్గులు, నాకో చిన్న పెగ్‌ని గ్లాసుల్లో వంచాను. అతను పైన్ గోడలని, ఇంట్లోని సామాన్ని, నేనే నిర్మించిన పుస్తకాల షెల్ఫ్‌లని, ఫైర్ ప్లేస్‌ని చూసి చెప్పాడు.
‘నీ అభిరుచి నాకు నచ్చింది’
నేనేం మాట్లాడలేదు.
‘అరె! నీకు ఫోన్ ఉందా? డైరెక్టరీలో నీ నంబర్ నాకు కనపడలేదే?’ దాన్ని చూసి అడిగాడు.
‘అన్‌లిస్టెడ్ నంబర్. నేను ఫోన్ చేయడానికే తప్ప నాకు ఎవరూ చేయకూడదని అన్‌లిస్టెడ్ నంబర్ని తీసుకున్నాను’
‘టివి ఎక్కడుంది? పడక గదిలోనా?’
‘నాకు టివి లేదు. అక్కర్లేదు కూడా. ఐనా ఇక్కడికి సిగ్నల్స్ రావు’
‘చలికాలం రాత్రుళ్లు నువ్వు ఏం చేస్తూంటావు?’
‘చదువుకుంటాను. రేడియో వింటాను. పజిల్స్ నింపుతూ ఫైర్ ప్లేస్ ముందు నిద్రపోతాను’
‘ఒంటరిగానా?’
‘అవును’
‘గర్ల్‌ఫ్రెండ్స్? గతంలో నీ చుట్టూ వాళ్లు ఉండేవాళ్లు’
‘అవి పాత రోజులు. ఇప్పుడు ఒంటరి జీవితమే నచ్చుతోంది’
‘నీకు ఆడవాళ్ల అవసరం లేదా? నీ వయసింకా అరవయ్యేగా?’
‘వచ్చే సంవత్సరానికి అరవై నిండుతాయి’
‘ఏభై తొమ్మిది ఇంకా వృద్ధాప్యం కాదు. నాకు అరవై ఐదు. ఐనా ఆడవాళ్లని ఇంకా సన్యసించలేదు’ పెద్దగా నవ్వాడు.
‘అది వయాగ్రా మహత్యం’ చెప్పాను.
మళ్లీ నవ్వాడు. మేము మా గ్లాసులతో సరస్సు పక్కనే ఉన్న డెక్ దగ్గరికి వెళ్లాం. మలాకి చెక్క రెయిలింగ్ మీద నించుని సరస్సు వంక కొద్ది క్షణాలు చూసి అడిగాడు.
‘అవతలి తీరం మైలు ఉంటుందా?’
‘మైలున్నర దూరం. సరస్సు అవతల కనిపించే పైన్ వృక్షాల మధ్య నించే నువ్వు వచ్చింది’
‘సరస్సు చుట్టూ మూడు వైపులా పైన్ వృక్షాలు, ఇటు వైపు కొండ. మంచి ప్రదేశంలోనే నివసిస్తున్నావు. చుట్టుపక్కల ఇళ్లేమైనా ఉన్నాయా?’ మలాకి అడిగాడు.
‘అతి సమీపంలోని ఇల్లు రెండు మైళ్ల దూరంలో ఉంది. వాళ్లు వేసవిలోనే చేపలు పట్టడానికి వస్తూంటారు’
‘నువ్వూ చేపలు పడుతూంటావా?’
‘సరదాకి పట్టుకుని వదిలేస్తూంటాను. సేద తీరావు కాబట్టి ఇంక అసలు విషయానికి వస్తే సంతోషిస్తాను’
‘జింకలు? రైఫిల్ కూడా ఉంది కదా?’
‘సంవత్సరానికి ఒకటి లేదా రెండు’
‘నువ్వింకా గురి చూసి పేల్చగలుగుతున్నావా?’
‘కాలక్షేపానికి ఆ సాధనని కొనసాగిస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే మనిద్దరి సమయం వృథా కాదు’ విసుగ్గా చెప్పాను.
ఐరిష్ విస్కీ తాగి, దాని ఘాటుకి దగ్గి, మళ్లీ తాగి చెప్పాడు.
‘నాకో సమస్య వచ్చింది. చాలా పెద్ద సమస్య’
‘లేకపోతే నువ్వు ఇక్కడికి రావు. అదీ ఒంటరిగా’
‘ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో తెలీకుండా పోతోంది. నువ్వు నీ వృత్తిని మానేసాక నీ అవసరం మళ్లీ వచ్చింది. నా బాడీగార్డ్‌లని కూడా నేను నమ్మలేను. గ్రిఫ్! నా వ్యాపారంలో చాలా గడ్డు సమస్యలు ఏర్పడ్డాయి’
‘విషయం సూటిగా చెప్తావా?’
‘ఫ్రేంక్‌కి, నాకు మధ్య బాగా చెడింది’
‘ఏం జరిగింది?’
‘ఆధిపత్య పోరాటం. అది నా వైపు నించి కాదు. ముసలితనంలో ఫ్రేంక్‌కి అత్యాశ పెరిగింది. తన నేర సామ్రాజ్యాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు’
‘ఐతే? నేనేం చేయగలను?’
‘నేను విప్పి చెప్పాలా? నువ్వేం చేయగలవో నీకు తెలీదా?’ మలాకి ప్రశ్నించాడు.
‘కిరాయా? ఇన్ని సంవత్సరాల తర్వాత’
‘అవును. కిరాయే. నువ్వు గొప్ప కిరాయి హంతకుడివి’
‘నేను వృద్ధాప్యంలో పడ్డాను. ఎవరైనా యువకుడ్ని నియమించచ్చుగా? డెట్రాయిట్, మయామి, ఎల్.ఏ. ఇలా చాలా చోట్ల వాళ్లు దొరుకుతారు’
‘ఐతే నాకు కావాల్సింది నమ్మదగ్గ కిరాయి హంతకుడు. గ్రిఫ్! నువ్వు ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరించేవాడివి. కొందరిలా చంపాల్సిన వ్యక్తితో చేతులు కలిపేవాడివి కావు. నీలోని నైపుణ్యం కూడా నేటి యువకులకి లేదు. జిమీ అరడజను మంది అంగరక్షకులతో ఓ మారుమూల ఇంట్లో దాక్కున్నా నువ్వు అతన్ని చంపే దారి కనుక్కుని చంపావు. నీకా నైపుణ్యం ఎలా వచ్చింది?’ ప్రశ్నించాడు.
‘ట్రేడ్ సీక్రెట్’ నవ్వాను.
మలాకి ఇంకాస్త విస్కీని తాగి అడిగాడు.
‘పాత రోజుల్లో నీకు ఐదు వేల డాలర్లు ముట్టేవి. అవునా?’
‘జిమీని చంపినందుకు నువ్వు నాకు ఇచ్చింది అదే’
‘ఫ్రేంక్‌ని చంపేందుకు నీకు ఏడున్నర వేల డాలర్లని ఇస్తాను’ మలాకి చెప్పాడు.
‘సారీ. నాకు ఆసక్తి లేదు’
‘ఎందుకు లేదు? ఏడున్నర వేలు చాలా పెద్ద మొత్తం’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘అది నిజమే. కాని నాకు ఆ డబ్బనవసరం లేదు’
‘ప్రతీ వాళ్లకి డబ్బవసరం వస్తుంది. ఇప్పుడు కాకపోతే తర్వాత రావచ్చు’
అతను చెప్పింది నిజమే. నా పడక గదిలోని మంచం కింద ఉన్న ఇనప సేఫ్‌లో ఉన్న కొన్ని వేల డాలర్లు నాకు జీవితాంతం సరిపోవు. ఏడున్నర వేలతో నేను కొత్త వాటర్ హీటర్ని కొనచ్చు. రూఫ్‌ని మరమ్మత్తు చేయించచ్చు. ఐతే అవన్నీ ఇప్పుడు ముఖ్యం అని నేను అనుకోవడం లేదు. ఉన్నదాంతో కొన్ని సంవత్సరాలు ఆనందంగా గడపాలని ఉంది.
‘సారీ మలాకి. నా మనసు మారదు’
‘బెట్టు చేయకు. నేను ఇవ్వగలిగేది ఏడున్నర వేలే. దాంతో నువ్వు పర్యాటక యాత్రని చేయచ్చు. యూరప్‌కి లేదా సౌత్ అమెరికాకి’
‘గత ఐదేళ్లుగా నేనీ అడవిలోంచి ఎక్కడికీ వెళ్లలేదు. నాక్కావాల్సిందంతా ఇక్కడే ఉంది. ఎంత డబ్బున్నా నా జీవితాంతం ఇక్కడే ఉంటాను తప్ప బయటకి కదలను’ స్థిరంగా చెప్పాను.
‘కాని నాకు నీ అవసరం ఎంతుందో తెలీదా?’
‘తెలుసు. ఐనా నా సమాధానం నోనే’
వెంటనే మలాకీ మొహం కోపంతో జేవురించింది.
‘గతంలో నేను నీకు చాలా డబ్బిచ్చాను గ్రిఫ్. ఆ విశ్వాసం కూడా లేదా?’
‘నాకు ఉచితంగా ఏదీ ఇవ్వలేదు. ఇచ్చిన ప్రతీ సెంట్‌కీ తగిన పని చేసి పెట్టాను. కాబట్టి విశ్వాసం ప్రసక్తే లేదు’
‘నువ్వు నాకీ పని చేసి పెట్టాలి. విన్నావా?’ నా వైపు చూపుడు వేలితో చూపిస్తూ చెప్పాడు.
అతని మాటల్లో హెచ్చరిక ధ్వనించింది.
‘ఎవరైనా నన్ను బెదిరించడం నాకు ఇష్టం లేదు’ మృదువుగా చెప్పాను.
‘నీ ఇష్టాయిష్టాలు నాకు అనవసరం. నాకు నువీ పని చేసి పెట్టాలి. ఫ్రేంక్‌ని వెంటనే చంపాలి. అంతే. నువ్వు చేయకపోతే నేను ఇంకొకర్ని నియమించాల్సి ఉంటుంది’
‘నేను ఇందాక చెప్పిందీ అదే’ చెప్పాను.
‘ఫ్రేంక్‌ని చంపడానికి కాదు. అది నీ వల్ల తప్ప మరింకెవరి వల్లా సాధ్యం కాదనే నీ దగ్గరికి వచ్చాను. నిన్ను చంపడానికి’ కఠినంగా చెప్పినా అతని కళ్లల్లో అర్థింపు కనిపించింది.
నన్ను లాంగ్ రేంజ్ రైఫిల్‌తో ఎవరైనా చెట్ల చాటు నించి లేదా కొండ రాళ్ల వెనక నించి చంపడం చాలా తేలికని నాకు తెలుసు.
‘సరే. ఇక తప్పదనుకుంటాను’ చిన్నగా నిట్టూర్చి చెప్పాను.
‘అంటే ఒప్పుకున్నట్లేనా?’ ప్రశ్నించాడు.
‘ఒప్పుకున్నాను’
అతని కళ్లల్లో వెంటనే రిలీఫ్ కనిపించింది.
‘మంచిది. నువ్వు తెలివి గలవాడివి. నువ్వు నాకు సహాయం చేస్తావని తెలుసు’ నవ్వుతూ చెప్పాడు.
తన ఇనీషియల్స్ కుట్టిన సిల్క్ చేతి రూమాలుతో మొహం మీది చిరుచెమటని తుడుచుకుని, నా భుజం మీద తట్టి చెప్పాడు.
‘ఇంకో డ్రింక్‌తో మన ఒప్పందం ఖరారు చేసుకుందాం’
నేను లోపలకి వెళ్లి గ్లాస్‌లని నింపాను. పడక గదిలోకి వెళ్లి ఓ సంచీని భుజాన తగిలించుకుని మళ్లీ నా కోసం వేచి ఉన్న మలాకీ దగ్గరికి, డెక్ మీదకి చేరుకున్నాను. అది చేపలు పట్టే వారి సంచీ అని గుర్తించి అతను చెప్పాడు.
‘నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చి ఉంటే నీ కోసం సరస్సు చుట్టూ వెతకాల్సి వచ్చేది’
‘మనం చెరువు గట్టుకి వెళ్దాం పద. చేపలు పడుతూ పథకాన్ని ఆలోచిద్దాం’
‘వాతావరణం బావుంది. ఫ్రేంక్ గురించి, అతని అలవాట్ల గురించి వివరంగా చెప్తాను పద’
మేము డెక్ మెట్లు దిగి సరస్సు ఒడ్డుకి నడుస్తూండగా చెప్పాడు.
‘ఫ్రేంక్ నీకు బాగా తెలుసు. నువ్వు నీ వృత్తిలోంచి తప్పుకున్నావని అతనిక్కూడా తెలుసు కాబట్టి నిన్ను అనుమానించడు. నువ్వు అతని ఇంట్లోకి వెళ్లి, అతన్ని చంపి, కిటికీలోంచి బయటకి వచ్చి కాంపౌండ్ వాల్ దూకి పారిపోవచ్చు. అతను నిన్ను నమ్ముతాడు...’
‘అటు చూడు. అక్కడ నీళ్లల్లో...’
మలాకీ నేను చూపించిన వైపు చూస్తూండగా నా సంచీ లోంచి బయటకి తీసిన పాయింట్ 38 కేలిబర్ రివాల్వర్‌తో అలవాటుగా పాయింట్ బ్లేంక్ రేంజ్‌లో అతని తల వెనక రెండుసార్లు కాల్చాను. పాత రోజుల్లో అలాగే చంపేవాడ్ని. పడిపోతున్న అతని కాలర్ పట్టుకుని సరస్సులోకి పడకుండా ఆపాను. అతను మరణించాడో లేదో తనిఖీ చేసి, అతని పర్స్‌ని, వజ్రపు ఉంగరాన్ని, ఫిలిప్ గడియారాన్ని తీసి సంచీలో వేసుకున్నాను. అతని శవాన్ని టార్పాలిన్‌లో చుట్టాను. తర్వాత రాళ్లతో దాన్ని నింపి, తాడుతో కట్టి పడవలో సరస్సు మధ్యకి తీసుకెళ్లి తోసేస్తాను. అతను వచ్చిన లింకన్ కారుని కూడా మాయం చేయాలి. ఈ పర్వతాల్లో అది తేలిక. నా పరికరాలతో దాన్ని వివిధ భాగాలుగా విప్పదీసి, అక్కడక్కడా వెదజల్లితే ఎప్పటికి, ఎవరూ దాన్ని కనుక్కోలేరు.
మళ్లీ కేబిన్‌లోకి నడిచి రిసీవర్ అందుకుని ఓ నంబర్ తిప్పి చెప్పాను.
‘నా మనసు మార్చుకున్నాను. మీరు చంపమన్న వ్యక్తిని చంపడానికి ఊప్పుకుంటున్నాను. కానీ ఐదు కాదు, ఏడున్నర వేల డాలర్లు కావాలి’
‘డబ్బు విషయంలో నీతో వాదించను. సరే. కాని నీ మనసు ఎందుకు మార్చుకున్నట్లు?’ ఫ్రేంక్ అవతల నించి అడిగాడు.
‘నేనా ప్రశ్నకి జవాబు చెప్పను. రేపు నీ మనిషిని డబ్బుతో ఇక్కడికి పంపు. అతనికి కావాల్సిన రుజువులని అందజేస్తాను’ చెప్పాను.
‘రేపా? ఇంత త్వరగా మలాకీని చంపగలవా? అదెలా సాధ్యం?’ ఫ్రేంక్ అడిగాడు.
‘అది నా వృత్తి’
‘ఓకే ఓకే. అది నీ ట్రేడ్ సీక్రెట్. అవునా గ్రిఫ్?’
‘అవును ఫ్రేంక్. ట్రేడ్ సీక్రెట్’ చెప్పాను.
మలాకీ ఎంత గొప్ప రౌడీ ఐనా ఒక్క విషయంలో నన్ను తక్కువ అంచనా వేశాడు. బెదిరిస్తే నేను అతన్ని చంపచ్చని ఎందుకు ఆలోచించలేదు?’ *

బిల్ ప్రాంజినీ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి