S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దెయ్యం

విశాఖ - భువనేశ్వర్ పాసింజర్ ఆరు గంటలు ఆలస్యంగా కప్పను తిన్న పాములా... మెల్లగా.. కీచుమనే శబ్దాలు చేస్తూ జాడుపూడి రైల్వేస్టేషన్‌లో ఆగింది.
దిగి.. ప్లాట్‌ఫాం మీదకు వచ్చాను.. ఆకాశం మేఘావృతమై ఉంది. గడియకో.. నిమిషానికో వర్షం కురిసేలా ఉంది. వాచీ చూసుకున్నాను. ఒంటి గంట దాటింది.
రాత్రి.. దట్టమైన చీకటి.. స్టేషన్‌లో - స్టేషన్ మాస్టారి క్యాబిన్ దగ్గర తప్ప ఎక్కడా వెలుతురు లేదు.
మెల్లగా బయటకు వచ్చాను. దుమ్ముతో కూడిన గాలి విపరీతంగా వీచింది.. స్టేషన్ బయటనున్న పెద్ద రావిచెట్టు ఆకులు మీద పడ్డాయి.. ఒక్క నిమిషం నా మీద నాకే చిరాకేసింది.
ఓ పోలీసు కానిస్టేబుల్ నా దగ్గరకు వచ్చాడు.
‘ఎవరు సార్.. ఇంత రాత్రివేళ.. ఇక్కడ ఎందుకు సార్?’
‘నేను శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్‌లో పని చేస్తున్నాను. సి.ఎం. జిల్లా పర్యటనకు వస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు, చౌక దుకాణాల్లో సామాన్లు సరఫరా వంటి వాటి తనిఖీ కోసం కవిటి వెళ్లాలి. మీటింగ్ చూసుకొని బయలుదేరేసరికి ఈ వేళైంది. శిలగాంలో మా వాళ్లున్నారు. వెళ్లాలి’
‘జాగ్రత్త సార్. ఆ దారి మంచిది కాదు. ఈవేళలో ఆ దారంట.. జాగ్రత్త సార్..’ అని చెప్పి చీకట్లో కలిసిపోయాడు.
ఒంటరిగా.. జాతీయ రహదారి మీద. చీకట్లో.. గాలి.. వాన ఎక్కడో పడుతోంది. తడి మట్టి వాసన. ఎండాకాలం.. అకాల వర్షాలు.. కరువు మండలంలో ఆకలిగా ఉంది. నిద్ర వస్తోంది.
‘వస్తారా?’ ఏదో ధ్వని. ఎవరిదో మాట. గాలిలో లీలగా మల్లెల వాసన.. ఎవరో వ్యక్తి పక్కనున్నట్లు భావన.
చూశాను. ఎవరూ లేరు. భ్రమా? భయమా? భయం.. నా జీవితంలో ఇంతవరకు ఎదురుకాలేదు. ఏటికి ఎదురీదడం అలవాటై పోయింది. రాజీపడటం.. రాజీలు చేసుకుంటూ పోవటం.. ఇదే నాకలవాటైంది. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో చేరిన నాటి నుంచి నీతిని వదలలేదు. అలాగని అవినీతిని విడనాడలేదు. నీతివంతమైన అవినీతి ఎలా ఉంటుందో రెవిన్యూ శాఖలో జాయిన్ అయిన తొలి రోజుల్లోనే నేర్చుకోవచ్చు.. ఓ ఆర్గనైజ్డ్ క్రైం.. ఈ పదం వాడటంలో తప్పులేదనుకుంటాను.
‘వస్తారా.. ఓ ట్వంటీ ఇస్తే చాలు..’ మళ్లీ సన్నగా మాటలు వినిపించాయి. ఈసారి.. నా రెవిన్యూ దృష్టిని సారించాను. వ్యక్తి ఎవరో ఉన్నారు. మల్లెల వాసనతోపాటు చీప్ సెంట్ కలిసిన వాసన...
ఎవరో బ్రోతల్.. నా మూడు పదుల సర్వీసులో ఎంతోమంది ఆడవారు ఈ విధంగా అడగటం నాకు కొత్త కాదు. నా భార్య నాకు చాలు అనుకొనేవాడిని.. నాకిద్దరు ఆడపిల్లలున్నారు. అలా అడిగిన వారి అవసరాలను తీర్చుకొని ‘అది’ తీసుకోకుండా.. నేను చేయగలిగిన పనైతే చేశాను.. చెప్పాను గదా.. నీతిని తప్పని అవినీతి మా శాఖలో అవసరం...
‘వెళదాం.. టైమవుతున్నాది..’ ఒక స్ర్తి.. దాదాపు నాలుగు పదుల వయస్సు ఉంటుంది. బాగుంది.. శరీరం పొంకంగానే ఉంది. ఓ మెరుపు మెరిసింది.
దగ్గరలోనున్న చెట్టు కిందకు చేరుకున్నాం.. ఒకట్రెండు లారీలు మెల్లగా ఆగి.. వేగంగా వెళ్లిపోయాయి.
‘మా బేరాలే.. మీరున్నారని.. ఆగలేదు’ ఆమె మాట మర్యాదగానే ఉంది.
‘చూడమ్మా.. ఆ అవసరం నాకు లేదు. నీ అవసరం ఇరవై అయితే.. ఇస్తాను. తీసుకో. నీ దారిన నువు వెళ్లు. నాకు ఏభై ఏడు సంవత్సరాలు. మరో మూడేళ్లలో రిటైర్ అవుతాను..’ అని జేబులో చేయి పెట్టి.. ఓ యాభై నోటు తీసి అమె చేతిలో ఉంచాను.
ఆమె కాసేపు తటపటాయించింది. ఆకాశంలో మెరుపు.. ఆమె ముఖం వైపు చూశాను.. ఏదో బాధ. స్పష్టంగా చూశాను. దుఃఖం కాబోలు.
ఇంతలో ఓ ఆటో వచ్చింది. ఎక్కాను. సంత దగ్గర రోడ్డులో దిగుతానన్నాను.. నేను ఎక్కాను. తను కూడా ఎక్కింది..
మా ఇద్దర్ని ఆటోడ్రైవర్ నిర్లిప్తంగా చూశాడు.
ఆటోలో ఆమె .. నాకు దగ్గరగా.. బాగా దగ్గరగా.. తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలనో.. లేక నా మాటల వలనో...
సంత రోడ్డు వచ్చింది. దిగాను. సమయం.. వాచీ చూశాను. రెండు కావస్తోంది.. నా మిత్రుడు తన బండిని.. అక్కడ దాబా దగ్గర పెట్టి తాళం ఇచ్చినట్టు సాయంత్రమే ఫోన్‌లో చెప్పాడు.
నేను దాబా వైపుగా అడుగులు వేశాను. ‘వస్తావా.. ఏమైనా తింటావా’ అడిగాను.
ఆమె కళ్లల్లో ఆకలి నాకు తెలిసింది.
ఆమె ఏడుస్తూ.. ‘రాను. అక్కడ ఇద్దర్నీ చూస్తే.. బాగుండదు. నాకు కాదు.. మీకు’ అని ఆగింది. ఆకలిగానే ఉంది.. ఆమె బాధ నాకు తెలిసింది. పక్కనున్న ఖానా మీద కూర్చోని.. ముఖం రెండు చేతులలో దాచుకొని ఏడ్చింది. ‘ఎక్కడకు వెళ్లాలి?’ అడిగాను.
తను చెప్పింది.
‘అరె.. నేను వెళ్లే దారిలోనే కదా’ అన్నాను.
అవునంది.
‘అయితే ఇక్కడే కూర్చో.. బండి తెస్తాను.. వెళదాం. సరేనా.. ఏడవకు. బాగోదు...’ అన్నాను.
నేను దాబా దగ్గరకు వెళ్లి నా వివరాలు చెప్పాను. పుస్తకంలో రాసుకున్నాడు. సెల్‌ఫోన్‌లో నా ఫొటో తీసుకున్నాడు. నా ఐ.డి. కార్డును కూడా ఫోన్‌లో నిక్షిప్తం చేశాడు. జాగ్రత్తపరుడే. ‘ఏదో మా జాగ్రత్త సార్. మీ మిత్రుడు.. మంచి కాంట్రాక్టర్. మాకు రెగ్యులర్ కస్టమర్..’ అతని నోటిలో నుంచి మాటలు ముద్దగా వస్తున్నాయి. మందు వాసన...
దాబాలు నిర్వహించేవారు అలానే ఉంటారు కామోసు.. రెండు చపాతీలు పేక్ చేయించాను. బండి తీసుకొని బయలుదేరాను. ‘జాగ్రత్త సార్.. ఆ దారిలో దెయ్యాలుంటాయి. ముఖ్యంగా మర్రిచెట్టు టర్నింగ్‌లో.. ఈ మధ్యనే ఓ ఎదవ చచ్చాడు. దెయ్యాల్ని చూసి సార్.. జాగ్రత్త సార్’ చెప్పాడు.
‘ఓకే థాంక్స్.. వస్తాను’ అని బండి స్టార్ట్ చేశాను. జంక్షన్‌కు వచ్చాను. ఆమె చేతిలో చపాతీల పార్సిలుంచాను. ‘ఎక్కు’ అన్నాను.
ఆమె వెనుక కూర్చుంది. బండి బయలుదేరింది.
మెల్లగా వెళుతున్నాను.
రోడ్డు పెద్దగా బాగుండదు.
రోడ్డులో అటూ ఇటూ గాలికి. జుత్తు విరబోసుకొని కోపంతో ఊగిపోతున్న దెయ్యాల్లా కొబ్బరిచెట్లు.. దట్టమైన తోటలు.. కీచురాళ్ల మీద.. గుడ్లగూబల అరుపులు.. సన్నగా.. ఓ రెండు చినుకులు పడ్డాయి. భుజం పైన కాదు.. వెచ్చని కన్నీరు.. బహుశా ఆమె ఏడుస్తున్నదనుకుంటా.
‘ఆపండి’ అంది. ఆగాను.
చూశాను. పెద్ద మర్రిచెట్టు. చుట్టూ చీకటి. ‘వస్తానండి.. మీ వంటి మంచి వ్యక్తిని నా జీవితంలో ఇదే చూడటం.. ఈ రోజుకి నన్ను.. మా అమ్మని ఆకలి నుండి తప్పించారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఒళ్లు అమ్ముకునే సాని ముండనని ఈసడించుకోవద్దు. బాబూ.. వస్తాను’ అని చెప్పి చీకట్లో కలిసిపోయింది. దూరంగా.. కనుచూపు మేరలో.. ఏదో వెలుగు.
అవును.. అక్కడ స్మశానం ఉంది. ఆ దిశగా ఆమె..?
సన్నని భయం నన్ను ఆవహించింది.
* * *
ఉదయం. సమయం ఏడు గంటలు కావస్తోంది. శిలగాం - ఏమీ మారలేదు.
‘ఏరా.. చేరుకున్నావా.. ఎలా ఉన్నావ్.. ఉంటావా.. వెళ్లిపోతావా. పని అయిపోతే.. బండి.. మళ్లీ ఆ దాబాలోనే ఇచ్చి.. నేను.. వైజాగ్ వెళుతున్నా.. రిటర్న్‌లో తీసుకుంటా.. లేదంటే నీవుంటానంటే.. పనవగానే ఇంటికి వచ్చేయ్.. సరేనా’ నా మిత్రుడి ఫోన్.
‘లేదు... వెళ్లిపోతాను. సి.ఎం. కార్యక్రమం ఉంది. నివేదికలు ఇవ్వాలి.. కలెక్టర్‌గారు చాలా స్ట్రిక్ట్. సకాలంలో పనులు పూర్తి కావాలి.. వెళ్లిపోవాలి..’ అన్నాను. ‘సరే’నని ఫోన్ డిస్‌కనెక్ట్ చేశాడు.
ఇంతలో భీమయ్య వచ్చారు. ఆయన మాట శిలగాంలో వేదవాక్కు. లేండ్‌లార్డ్. ఆయన దగ్గర అప్పు చేయని రైతు.. సహాయం పొందని అధికారి, నాయకు లేరంటే అతిశయోక్తి కాదు.
‘సార్.. అందరిని రమ్మనండి.. కొత్త కార్డులు ఎవరికి అవసరమో.. రుణమాఫీలు ఎవరికి చేయాలో లిస్టులు రాద్దాం. నేను మళ్లీ శ్రీకాకుళం వెళ్లిపోవాలి.. లిస్టులు
పక్కాగా ఉండాలి’ అన్నాను టీ తాగుతూ.
రాత్రి అనుభవం ఈయనకు చెబుదామా.. వద్దా అనుకున్నాను. ఊరుకున్నాను.
‘సరే.. సార్. మీకెందుకు శ్రమ. ఆ జాబితా నేను తయారుచేయిస్తాగా.. మా గ్రామం సంగతి మీకు తెలియంది కాదు గదా.. అవన్నీ నేను చూస్తానుగా’ అన్నారు.
నేను స్నానపానాదులు ముగించుకొని.. టిఫిన్ చేసి.. సరిగ్గా తొమ్మిది గంటలకు శ్రీరామమందిరం దగ్గరకు చేరుకున్నాను.
శిలగాం.. కవిటి మండలంలో అదో మేజర్ పంచాయితీ.. మంచి వాతావరణ. ఓ బలమైన సామాజిక వర్గం జనం అక్కడున్నారు. అందరికీ ఆదాయ వనరు కొబ్బరి. పశుసంపద.. కాని తొంభై తొమ్మిదిలో వచ్చిన తుపాను.. ఆ తరువాత వచ్చిన పైలాన్ తుపానులకు ఉద్ధానం పూర్తిగా నాశనం అయిపోయింది. చెట్లన్నీ పడిపోయాయి. ఉన్నవాటికి నల్లదోమ, ఆకుముట్టి వంటి తెగుళ్లతో దిగుబడి పడిపోయింది.. సంవత్సరానికి మూడు దిగుబడులు.. చెట్టుకు పది.. పదిహేను పణాలు (ఎనభై కాయలు ఒక పణా) వచ్చే కాయలు.. వచ్చే చెట్లు కాస్తా రెండు మూడు పణాలకు పడిపోయింది... ఆనాటికి నేను కవిటి రెవిన్యూ ఆఫీసులో ఆర్.ఐ.గా ఐదేళ్లుగా పని చేస్తున్నాను. ఇవన్నీ నాకు తెలుసు. వారంతా నాకు తెలుసు.. వీరి గురించి కూడా తెలుసు.
‘ఏదో ఆలోచిస్తున్నారు సార్..’ తలారి రామయ్య ప్రశ్న.
‘నేను పనిచేసినప్పటికి.. ఇప్పటికి బాగా మారిపోయింది..’ అన్నాను. నా భావనలో.. కాస్త వ్యంగ్యం జోడించి. రామయ్యకు అర్థం కాలేదు.
‘సహజం కదయ్యా’ అన్నాడు.
పది గంటల సమయంలో అందరూ రామాలయం దగ్గరకు చేరుకున్నారు. నేను ప్రారంభించాను. ‘కవిటి మండలంలో.. మేజర్.. మైనర్ పంచాయితీలు కలిపి.. దాదాపు నాలుగు వేల కొత్త కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి.. మనకి సంబంధించి.. నూట ఇరవై వరకు ఉన్నాయి. అదే విధంగా రుణ మాఫీ రైతుల జాబితాలో తప్పులున్నాయని ఫిర్యాదులున్నాయి. వాటిని మార్చాలి.. ఈ రెండు పనులకు సంబంధించి లిస్టులు కావాలి..’ అన్నాను.
భీమయ్యగారి అబ్బాయి బాబూరావు నా పక్కన చేరి ‘సార్.. ఇదిగో లిస్టు చదువుతాను. వినండి’ అన్నాడు.
‘చదవండి.. కాని.. ఆ పేర్లు అందరికీ ఆమోదం కావాలి కదా.. వారంతా దరఖాస్తు చేసుకొన్నవారై ఉండాలి సుమా’ అన్నాను. బాబూరావు చదివాడు. ఎవరూ మాట్లాడలేదు. వారి ముఖాల్లో అయిష్టత కనపడుతోంది.
‘ఏం బాబూరావు.. ఏంటిది’ అన్నాను.
ఇంతలో మెల్లగా - తలారి రామయ్య నిలబడి.. చేతులు కట్టుకొని-
‘బాబూ.. ఒక్కమాట. ఆ లిస్టులో.. నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందయ్యా. అందరూ బాగా డబ్బున్న వారేనయ్యా.. ముఖ్యంగా.. ఆ మర్రిచెట్టు కిందనున్న.. ఆ వెర్రిముండ.. సుందరమ్మ పేరు లేదయ్యా.. అదో దరిద్రపుదయ్యా. ఓ కార్డుంటే ఆసరా ఉంటదయ్యా.. కూతురు కామేశ్వరి రాత్రిళ్లు ఒళ్లమ్ముకుంటదయ్యా.. ఆ డబ్బులతో.. వాళ్లు బతుకుతున్నారయ్యా.. దాని కోసం నేను తాలూకాఫీసు చుట్టూ తిరిగానయ్యా.. కలెక్టర్‌ను కలిసి దరఖాస్తు చేశానయ్యా..’ అన్నాడు.
నేనూ బాబూరావు ముఖాలు చూసుకున్నాం.
నిజమే.. నిజమైన అర్హుల.. దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లున్న జాబితా.. నేను వస్తున్నప్పుడే ఆఫీసు నుంచి నాతో తెచ్చుకున్నాను. ఆ పేర్లేవీ ఈ జాబితాలో లేవు. నాకర్థమయింది. పార్టీ కార్యకర్తలు.. నాయకులు కుమ్మక్కయ్యారు. జాబితా మారింది. ఇప్పుడేం చేయాలి? నేనేమీ మాట్లాడకుండా.. బాబూరావు ఇచ్చిన ‘కవరు’ జాబితాను తీసుకున్నాను. అందరూ కోపంగా వెళ్లిపోయారు. కవరులో ఏముందో నాకు తెలుసు.
నేను బండి స్టార్ట్ చేశాను. రామయ్యను వెనుక రమ్మన్నాను. బాబూరావు నా వైపు గర్వంగా చూసి ఓ నవ్వు నవ్వాడు.. నేను గెలిచాను అన్నట్టుగా.
నా జేబులో కవరు నాగుపాములా అనిపించింది. అర్హులకు న్యాయం చేయవా అని అంతరాత్మ ప్రశ్నించింది.
అంతరాత్మ నొక్కేసాను.
* * *
‘చెప్పు రామయ్యా.. ఎవరా సుందరమ్మ? ఇక్కడేదో దయ్యం ఉందని అంటున్నారు. నిజమేనా..’ అని రాత్రి నా అనుభవం చెప్పాను.
పగలైనా.. జనం లేరు. మర్రిచెట్టు కింద బండిని ఆపాను.
‘అది.. సుందరమ్మ కూతురు కామేశ్వరయ్యా. నా చెల్లెలు. సుందరమ్మను భీమయ్య కొన్నాళ్లుంచుకున్నాడు. పెద్దోళ్లు.. పెద్ద కులంవాళ్లు.. అవసరాలు తీరాక వదిలేశారు. కుష్టుతో మంచం పట్టింది. ఇప్పుడు దాని కూతురు కామేశ్వరిని బాబూరావు పాడు చేశాడు. దెయ్యాలు వారయ్యా.. వావివరసలు లేని ముండల ముఠాకోరులు.. గ్రామం తగలబడుతున్నదయ్యా..’
‘మరి వారి జీవనం..’ అడిగాను.
‘దెయ్యాంలా బతుకుతున్నారయ్యా. కామేశ్వరి రాత్రులు కంచిలి.. జాడుపూడి స్టేషన్‌లో తిరుగుతుంటాది. దానికి ఎయిడ్స్ సోకిందయ్యా. తల్లీ పిల్లా చస్తారు.. అనారోగ్యమొస్తే.. రాత్రులు చీకట్లో తెల్లబట్టలేసుకుని.. కూర్చుంటారు. తప్పతాగి ఆ దారిన వచ్చే చచ్చునాయాళ్లు జడిసి ఛస్తారు. వాళ్ల జేబుల్లో డబ్బు తీసుకుంటారు.. వాళ్లు దెయ్యాలు కాదు బాబయ్యా.. గ్రామంలో వారే దెయ్యాలు...’
నాకు నోటంట మాట రావడం లేదు. ఇలా జీవిస్తున్నవారున్నారా సమాజంలో.. ఉన్నారు. చూస్తున్నాను కదా.
ప్రభుత్వాలు చేస్తున్న పథకాలు.. కోట్లాది రూపాయలు ఏమవుతున్నాయి? అఫ్‌కోర్స్.. ఏమవుతున్నాయో నాకు తెలుసు.
నా జేబులో కవరు తీశాను. రామయ్య చేతిలో ఉంచాను. హాయిగా అనిపించింది. ‘ఆ రెండు దెయ్యాలను.. కొన్నాళ్లయినా మనుషులుగా జీవించమను. కార్డులు.. రుణమాఫీ.. పింఛను సంగతి నేను చూస్తాను.. వస్తాను’ అని అతడిని అక్కడే వదిలేసి బయలుదేరాను.
దూరంగా చూశాను.. ఓ నిట్రాట గుడిసె.. నిస్తేజంగా..
స్మశానంలో ఏదో శవం కాలుతున్నాది.. పొగ దట్టంగా..
దెయ్యాలు స్మశానంలో లేవు. సమాజంలో కొంతమంది మనుషుల రూపంలో ఉన్నాయి.. అయినా.. నిజమైన దెయ్యాలకు ఇక్కడ చోటేది? మేమంతా ఉన్నాం కదా!
*

- భమిడిపాడి గౌరీశంకర్
9492858395

- భమిడిపాడి గౌరీశంకర్ 9492858395