S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాయకత్వం.. ఒక కళా ప్రతిభ

నవ జీవితం ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా, ఎంతలా ఆధునికత్వాన్ని వొడిసి పట్టుకుంటున్నా అర్థవంతమైన పాఠాలు నేర్చుకోవటానికి సంసిద్ధమయ్యే ఉంటుంది. ఆ సంసిద్ధతకు ఏ మత గ్రంథమైనా ఒక్కటే.. విలువలను అందించే సిద్ధాంతాలు ఆ విశ్వ రచనల నుండి వెలికి రావాలి. ఈ బాటలో భగవద్గీతకు తొలి తాంబూలం లభిస్తూనే ఉంది.
జీవితం ఎంతలా దూసుకుపోతున్నా మనం ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థులమే. మన జీవన విధానంపై ఎంతటి పట్టు ఉన్నా అప్పుడప్పుడూ తప్పటడుగులు వేస్తూనే ఉంటాం. మనం జీవన పయనంలో విద్యార్థులమైతే తప్ప ఈ తప్పటడుగుల నుండి తప్పించుకోలేం. అందుకే విలువైన పాఠాలు ఏదో రూపంలో మనకు అందుతూనే ఉండాలి. ఆ పాఠాలు వింటూ ‘సెల్ఫ్ మాస్టరీ’ని సాధ్యం చేసుకోవాలి. అంటే సాధికారిత మన స్వంతం కావాలి.. మనదైన పంథాలో మన జీవితాలకు మనమే రూపకర్తలం కావాలి... మన జీవితానికి మనమే నాయకులం కావాలి.
జీవించటం ఒక సృజన. జీవితం తీర్చిదిద్దుతున్న తీరుకు మూర్త రూపం. మొత్తానికి కనిపించే మనమందరం కళాకారులమే. ఈ ‘క్రియేటివిటీ’ అనేది ఒక్క కళాకారులకు మాత్రమే స్వంతం అనుకోవటం ఒకప్పటి మాట. ఈ రజు అటు పొలిటికల్ ఫీల్డ్‌కైనా ఇటు కార్పొరేట్ వరల్డ్‌కైనా సృజన ధోరణులు అనేక విధాల అవసరమవుతున్నాయి. దీనే్న ‘లీడర్‌షిప్’ అంటాం.. ‘మేనేజ్‌మెంట్’ అంటాం.. ‘అడ్మినిస్ట్రేషన్’ అంటాం. అయితే మనకంటూ కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. ఈ ప్రత్యేకతలనే మనం ‘మేనేజిరియల్ స్కిల్స్’ అంటున్నాం.
వృత్తి జీవనంలో మనలోని ప్రతి ఒక్కరం నాయకులమే. అంటే మనం ఉద్యోగిస్తున్న వ్యవస్థలో మనకు ‘ఆర్గనైజేషనల్ స్కిల్స్’ ఉంటే తప్ప మనం ‘ఆర్గనైజ్డ్ లీడర్స్’గా రాణించలేం. ఇలా సంస్థాగతంగానే కాదు అసలు జీవితానే్న నాయకత్వ ప్రతిభతో పండించుకోవాలి. ఈ దిశలో మనలోని ప్రతి ఒక్కరికి ఒక ‘మోరల్ డైరెక్షన్’ కావాలి... దాంతో ఒక ‘సిస్టమాటిక్ అండర్‌స్టాండింగ్’ సాధ్యం కావాలి. ఇక్కడ మోరల్ డైరెక్షన్ అంటే ధర్మమార్గంతోపాటు సమ్యక్ దృష్టి కూడా సాధ్యమవ్వాలి.
సిస్టమాటిక్ అండర్‌స్టాండింగ్ అంటే ప్రణాళికాబద్ధ అవగాహనతోపాటు సమ్యక్ అవగాహన కూడా. అంటే ఒక పద్ధతి, ప్రస్తుతానికి సంబంధించిన అవగాహన అన్నమాట.

ఈ సమ్యక్ అవగాహనను, సమ్యక్ దృష్టిని అందించగల సారథి కృష్ణుడు. అందుకోగల సమర్థుడు అర్జునుడు.
ఇటువంటి కృష్ణార్జునులను మనం దైనందిన జీవితంలో చూస్తుంటాం. మనమే అర్జునులం కాగలిగితే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలోను కృష్ణులను చూడగలం. అనుభవాన్ని ప్రోది చేసుకున్న విచక్షణాశీలురే కృష్ణులవుతారు. కానీ కేవలం అధికారంతోనో, పైబడిన వయసురీత్యానో కృష్ణులు కాలేరు. ఇక్కడ కృష్ణతత్వానికి కావలసింది ‘క్వాలిటీ మేనేజ్‌మెంట్’.. ‘మేనేజిరియల్ ఇష్యూస్’ని అంటే సంస్థాగత సమస్యల్ని పరిష్కరించగల నేర్పరితనం.
ఇలా చూస్తే గీతలో కృష్ణుడు ఒక లీడర్‌లా, ఒక మేనేజర్‌లా, ఒక అడ్మినిస్ట్రేటర్‌లా, ఒక టీచర్‌లా, ఒక మెంటార్‌లా, ఒక ఫ్రెండ్‌లా, ఒక అడ్వైజర్‌లా, ఒక కౌన్సిలర్‌లా.. ఇలా అనేక కోణాలలో కనిపిస్తాడు. అంటే సమర్థతకు, సారథ్యానికి ప్రతిరూపమే కృష్ణుడు. ఈనాటి వ్యవస్థలో మనమూ ఇంతటి సమర్థతతో రాణిస్తే తప్ప మనలోని లీడర్‌కు అస్తిత్వం సిద్ధించదు. ఈనాటి మన జీవనం వ్యాపార సంస్కృతిలో తలమునకలవుతోంది. ఈ అధునాతన వ్యాపార మనుగడకు కావలసిన వౌలిక సిద్ధాంతాలు భగవద్గీతలో ఉన్నాయి. ఉదాహరణకు ఈనాడు మన కార్పొరేట్ ప్రపంచంలో చెప్పుకుంటున్న మిషన్ అండ్ కోరల్ వాల్యూస్‌ను, న్యూకాపబిలిటీస్‌ను, కనెక్షన్స్ అండ్ కమ్యూనికేషన్‌ను, పర్పస్ సెంట్రిక్ పర్స్పెక్టివ్‌ను మనం గీతలో అనేక సందర్భాల్లో చూడగలం. మొత్తానికి క్రమశిక్షణ, విలువలు, సమర్థతలు, ఉత్తేజిత చేతలు, భావప్రకటనలు, ప్రాయోజిత దృక్పథాలు అన్న అంశాలకు సంబంధించిన వివరణలు గీతలో మనకు లభిస్తాయి. ‘ఉన్నతి’ లక్ష్యంగా తెలివితేటలతో ‘వర్కోహాలిక్’లం కావటం, పని విషయంలో స్వార్థాన్ని పక్కనపెట్టి ఫలితం కోసం అంకిత భావంతో, సమర్పణాతత్వంతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవలసిన అవసరాన్ని గీత స్పష్టంగా చెప్తుంది.
కృష్ణుడు విశ్వనాయకుడు. అంటే కృష్ణుడి నాయకత్వ చర్యలు ప్రతి ఒక్కరూ ఆదరించదగ్గవే. ఇలా అందరికీ మార్గదర్శిగా నిలబడటం పూర్ణ పురుష లక్షణం. కృష్ణుడు విశ్వహితాన్ని కాంక్షించేవాడు కాబట్టే-
‘స్వే స్వే కర్మణ్యభిరతస్సంసిద్ధిం లభతే నరః
స్వకర్మ నిరతస్సిద్ధిం యథావిందతి తచ్ఛృణు’
అని అంటాడు. అవును, మానవ జన్మలోని మనం కర్మాసక్తులమై సంసిద్ధి పొందాలి. కృష్ణుడిదీ మానవజనే్మ కాబట్టి కృష్ణుడు సైతం కర్తవ్యపరాయణుడై కర్మాచరణతో సంసిద్ధిని పొందవలసిందే. అంటే మన మనుగడలో కర్తవ్య పరాయణత, కర్మాచరణలే అందుకోబోయే ఫలితాలకు మూలాలు అవుతుంటాయి. కురుక్షేత్రంలోని విశ్వపురుషుడైన కృష్ణుడికైనా, పోరుకు సిద్ధమైన సైనికుడికైనా కర్తవ్య పరాయణత, కర్మాచరణలు సహజాలంకారాలే.
మనం ఉంటున్న వ్యవస్థలో సైతం.. అది కుటుంబం అయినా, వ్యాపార సంస్థ అయినా, ఉద్యోగ వ్యవస్థ అయినా తరతమ భేదాలు, అధికార వ్యత్యాసాలు లేక ప్రతి ఒక్కరికీ వర్తించేదే! బాసిజాలు, సూపర్‌వైజింగ్‌లు కర్మ ఫలితాన్ని సక్రమంగా అందుకోవటం వరకే!! సంసిద్ధిని పొందటం అంటే ఇదే.
‘స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్’ అన్నది కూడా కృష్ణోపదేశమే. అంటే వ్యవస్థ కోసం చేసే కర్మలు మన కర్మలు కావనేగా! అంటే స్వధర్మం వేరు, సామాజిక లేదా వ్యవస్థీకృత ధర్మం వేరు అనే. నాయకుడు వ్యవస్థ కోసం వర్తించాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలతో కర్తవ్యోన్ముఖుడు కాకూడదు. నాయకుడి వ్యక్తిగత పాత్ర వ్యవస్థ కోసం బాధ్యత వహించటం వరకే. సమాజ, విశ్వహితాలే నాయకుడి అంతఃకరణ స్పందనలు.
అసలు, నాయకులు యోగి సమానులు కావాలి. యోగులకున్నంత నిగ్రహశక్తి నాయకులకు ఉండాలి. ‘న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్’ అంటూ చేసిన కృష్ణోపదేశంతో ఇష్టంతో జనించే ఆనందం, అనిష్టంతో కలిగే ఉద్వేగ స్వభావం నాయకులకు సహజాలు కావాలన్నది స్పష్టం. ఇంకా బాహ్యాడంబరత లేని అంతఃకరణం వల్లనే స్వస్వరూప సుఖం సాధ్యమని అంటే స్వస్వభావ ప్రకాశనం సాధ్యమని ‘బాహ్యస్పర్శేష్వ సక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్’ అన్న కృష్ణోపదేశం ద్వారా అర్థమవుతుంది.
‘యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే’ అన్న ఉపదేశ తరంగిణి ద్వారా ఇంద్రియ భోగాల దుఃఖకారకాలు కాబట్టి వాటి వెంట పడటమో, వాటికే అంకితం అయిపోవటమో నాయకులకు ఏ కోశానా పనికిరాదు. బలహీనతలకు వశం కాకపోవటం, పిరికితనాన్ని చెంతకు చేర్చకపోవటం, పౌరుషాన్ని పటిష్టపరచుకోవటం నాయక బలం అన్నది గీత నేర్పే మొదటి పాఠం. మనం గ్రహిస్తుంటే గీత దృష్టి అంతా సమదర్శనం, సమభావం, సంశయ నివృత్తి, ఇంద్రియ నిగ్రహం, మానసిక కాలుష్య రాహిత్యం, విశ్వహితం చుట్టూ కేంద్రీకృతమైనట్టు స్పష్టమవుతుంటుంది. ఈ లక్షణాలతో మన వర్తనం సాగుతుంటే మనలోని ప్రతి ఒక్కరం నాయకులం క్రిందే లెక్క. *

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946