S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాణం పోయలేం!

చీకటి వ్యాపిస్తుంటే, దాన్ని జయిస్తూ నగరంలో విద్యుద్దీపాలు వెలగసాగాయి. మనిషి ప్రకృతిలో తనకు ఆటంకంగా ఉన్న వాటిని జయిస్తూ, తనలోని అవగుణాలను అధిగమించలేక పోవడం మానవత్వానికి సవాలుగా మిగిలిపోయింది ఆది నుంచీ! కాబట్టే, మానవ విజ్ఞానానికి ఇంకా పరిపక్వత రాలేదనిపిస్తుంటుంది. ఆడి కారు వీధి దీపాల కాంతిని మరింత ప్రకాశవంతం చేస్తూ దూసుకుపోతోంది చరిత్రని పునరావృతం చేయడానికన్నట్లు. ఎవరో హఠాత్తుగా కారుకి అడ్డుగా వచ్చి నిలబడ్డారు. సడన్ బ్రేక్ వేసి, ‘ఏఁ.. ఛస్తావా?’ అన్నాడు సురేంద్ర డోర్ గ్లాస్ దింపి, తల బయటకు పెట్టి.
‘క్షమించండి బాబూ! రామార్పాడు రింగ్‌కి అర్జంటుగా వెళ్లాలి. చాలాసేపట్నుండి, సిటీ బస్సులు గాని, ఆటోలు గాని రాలేదు. అందుకే బాబూ! లిఫ్ట్ అడుగుదామని...’ నడివయసులో ఉన్న గంగయ్య అనే ఆ వ్యక్తి అన్నాడు.
‘లిఫ్ట్ రింగ్ రోడ్‌కి అడిగినట్లు లేదు, యమలోకానికి అడిగినట్లుంది. సరే.. ఎక్కు’ అంటూ డోర్ తీశాడు సురేంద్ర.
అతను ఎక్కి కూర్చున్నాడు. సురేంద్ర విసుగ్గా గేర్ మార్చి, కారును ముందుకు పోనిచ్చాడు. అతని మనసంతా గజిబిజిగా ఉంది. దారీ తెన్నూ కనిపించని అడవిలో ప్రయాణిస్తూ, ఏదైనా శబ్దం వినిపిస్తే, అదేంటో కూడా చూడకుండా కత్తి ఉన్న చేతిని అటు విసురుతున్నట్లు ముందుకు పోతున్నాడు. మధ్యలో ఓ అపరిచితుడు లిఫ్ట్ అడగడం మరింత చిరాగ్గా ఉంది. కుదరదని వెళ్లిపోవచ్చు. కాని, తను చేయగలిగిన సహాయాన్ని ఎవరైనా అడిగితే కాదనలేని మనస్తత్వం.
రోడ్డు మీద రద్దీ కాస్త ఏమైనా తగ్గిందేమో అని చూస్తున్నాడు గంగయ్య. ఎందుకో ప్రభుత్వ జనాభా లెక్కలకు మించి దేశంలో జనం ఉన్నట్లు అనిపించిందతనికి. గుణదల దాటిన తర్వాత కాస్త రద్దీ తగ్గిందనిపించింది. చొక్కా కింద దాచుకొన్న దాన్ని తీయాలనుకొన్నాడు. కాని, తీయలేకపోయాడు. గుండెల్లో ఏదో బాధగా అనిపించింది. ‘అమ్మా!’ అంటూ చొక్కా కిందకు పెట్టబోయిన కుడిచేతిని తీసి, చొక్కా మీద నుంచి గుండెల మీద ఎడం ప్రక్కన వేసుకొని, పెద్దగా మూలిగాడు.
‘ఏమైంది?’ విసుగ్గా అడిగాడు సురేంద్ర దృష్టిని రోడ్డు మీదే ఉంచి.
ప్రక్క వ్యక్తి నుంచి ఏ సమాధానం రాలేదు. తలతిప్పి చూశాడు. ప్రక్య వ్యక్తి సీటులో మెలి తిరిగిపోతున్నాడు. కారును రోడ్డు పక్కగా ఆపి, ‘ఏమైంది?’ అని మరలా అడిగాడు సురేంద్ర ఈసారి కొంచెం కంగారుపడుతూ.
‘గుండెల్లో పోటు’ కీచుగా అన్నాడు గంగయ్య పళ్ల మధ్య బాధను బిగపడుతూ.
‘పగ కన్నా ప్రేమ గొప్పది’ అన్న వాక్యమేదో మెదడులో కదలాడినట్లనిపించింది సురేంద్రకు. అతని ప్రాణంకన్నా తన పగ ముఖ్యం కాదనిపించింది. వెంటనే కారు వెనక్కి తిప్పాడు. తనకి ఆ నగరంలోని అణువణువూ తెలుసు. కారుని దగ్గర్లోని ఆసుపత్రికి పోనిచ్చాడు. రిసెప్షన్‌లో పేరడిగితే, అతను గంగయ్య వైపు చూశాడు. గంగయ్య తన పేరు చెప్పాడు బాధను ఓర్చుకుంటూ. డాక్టర్లు అతనికి వైద్యం చేసి, సురేంద్రతో ‘మైల్డ్ హార్టెటాక్’ అని చెప్పారు. అతను క్రెడిట్ కార్డుతో బిల్ పే చేసి, గంగయ్య దగ్గరకు వెళ్లాడు.
‘మీ వాళ్ల ఫోన్ నెంబర్ చెప్పు. వాళ్లకు ఫోన్ చేసి రమ్మని చెప్పి, నేను వెళతాను. బిల్ నేను కట్టేశాను. మీరేం కట్టనవసరం లేదు’ అని, గంగయ్య చెప్పే ఫోన్ నంబర్ వినడానికి సిద్ధంగా ఉన్నాడతను. సంపదలో పుట్టి పెరిగిన అతనికి అక్కడ చెల్లించిన మొత్తం లెక్కలోనిది కాకపోవడంతో తనేదో ఘనకార్యం చేశాడన్న ఆలోచనలో లేడు. పైగా తనా రోజు చేయాలనుకొన్న పని ఆగిపోతుందన్న ఆలోచన అతన్ని తొందరపెడుతోంది.
గంగయ్య రెండు చేతులూ జోడించి, ‘బాబూ! నా సంగతి తర్వాత మాట్లాడదాం! ముందు మీరు జాగ్రత్త. వ్యాపారంలో మీ శత్రువు రాజారావు మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. మిమ్మల్ని చంపడానికి నన్ను ఏర్పాటు చేశాడు. నాకున్న అవసరం దృష్ట్యా డబ్బుకు కక్కుర్తిపడి పాపం చేస్తున్నానని తెలిసినా, మిమ్మల్ని చంపడానికి ఒప్పుకున్నాను. కాని, మీరు నాకు వైద్యం చేయించి బతికించారు. నన్ను క్షమించండి బాబూ! మీరు చేసిన ఉపకారానికి జన్మజన్మలకూ రుణపడి ఉంటాను’ అంటూ సురేంద్ర చేయిని తన రెండు చేతులతో పట్టుకొని నుదుటికి ఆనించుకొని, భోరుమన్నాడు.
సురేంద్ర నెత్తి మీద పిడుగు పడ్డట్లు హతాశుడయ్యాడు. రెండు మూడు క్షణాలు చేష్టలుడిగిన వాడిలా గంగయ్యను అలా చూస్తూ ఉండిపోయాడు. కాని, గంగయ్య అతనికి కనిపించడం లేదు. అంతా శూన్యంగా ఉంది. తనని చంపడానికి వచ్చిన మనిషి పొడిచే లోపు గుండెపోటుకి గురయ్యాడు. తాను చంపాలనుకొన్న మనిషిని చంపకుండా రాజారావు రూపంలో ఆటంకం ఏర్పడింది. రాజారావుకి తానేం హాని చేయకపోయినా, వ్యాపారంలో పోటీ పడలేక తనని చంపాలనుకొన్నాడు. తప్పు చేయని వానికి విక్ష పడకూడదన్న సూత్రం ఆధారంగా ఈ గంగయ్య అనే వ్యక్తికి గుండె పోటు వచ్చి, తనకు హాని జరక్కుండా ఆగింది. అంటే తాను చంపాలనుకొంటున్న వ్యక్తి కూడా ఏ తప్పూ చేయలేదా? చేసి ఉండడు. లేకపోతే, తాను అంత కసిగా అతన్ని హతమార్చాలని వెళుతూ గంగయ్యకు లిఫ్ట్ ఇవ్వడానికి ఎక్కించుకోవడమేమిటి? అతడు కారుకి అడ్డు తప్పుకోగానే తను కారును పోనిచ్చి ఉండాలి కదా! ఏదో మహత్తర శక్తి తనని అలా చేయనివ్వలేదు. అదే తనని హత్యానేరం నుంచీ, నిజం తెలుసుకొన్నాక పడే పశ్చాత్తాపం నుంచీ కాపాడింది. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకొన్నాడనిపించి శరీరం జలదరించింది. తొందరపాటుతో తీసుకొన్న నిర్ణయం వల్ల తానో పాపం చేసేవాడు. అయితే, ఆ శక్తి తనని కాపాడిందా? లేక, కొందరు నేరాలు, ఘోరాలు చేసి కూడా ఏ శిక్షలకూ లోనుకాకుండా సుఖ సంతోషాలతో జీవిస్తున్నట్లుగా, వాడు తనకు హాని చేయాలని చూస్తున్నా, వాడిని కాపాడుతోందా? వాడు తప్పు చేసే మనిషి కాదని మనసుకు అనిపిస్తున్నా, సాక్ష్యాధారాలు వాడు దురుద్దేశంతో ఉన్నాడని తెలియజేస్తున్నాయి. మోసం చేశాడని ప్రాణం తీసేయడం సులభమే! కాని, చేయలేదని తెలిస్తే, ప్రాణం పోయలేడు కదా! కాబట్టి, తన నిర్ణయాన్ని తాత్కాలికంగా మార్చుకోవాలనుకొన్నాడు.
జేబులోంచి సెల్ తీసి, ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. సెల్‌లో ఛార్జింగ్ లేదు. రిసెప్షన్‌లోని ల్యాండ్‌ఫోన్ నుంచి చేశాడు.
‘హలో! నేను సురేంద్రని...’
‘నీకు బుద్ధుందా? ఇంట్లో పెద్దవాళ్లు, పసిపిల్లలు ఉన్నప్పుడు సెల్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవాలి కదా! చెల్లెమ్మ మాధవి ఫోన్ చేసింది. మావయ్యకు అదే మీ డాడీకి ఏదో అనారోగ్యం కలిగి, కాళ్లూ చేతులూ మంచానికేసి కొట్టుకొంటున్నారట. తను భయపడిపోయి నీకు ఫోన్ చేస్తే, నీ సెల్ స్విచాఫ్ అయి ఉందట. నాకు ఫోన్ చేసింది నువ్వు నా దగ్గరున్నావేమోనని. నా దగ్గరకు వస్తున్నట్లు కూడా నువ్వు చెప్పలేదట కదా! కంగారుపడవద్దని చెల్లెమ్మకు చెప్పి, మా వాడికి ఫోన్ చేసి మీ ఇంటికి పంపాను. నువ్వేం కంగారుపడకు. మావయ్యగార్ని హాస్పిటల్లో చేర్చాడు. ఇప్పుడు బాగానే ఉందట’ అవతల నుంచి హరికృష్ణ అన్నాడు.
‘కంప్లైంట్ ఏంటన్నారు డాక్టర్లు?’ సురేంద్ర గొంతులో కంగారు ధ్వనిస్తోంది. అతనికి తండ్రంటే ప్రాణం. తాను పుట్టగానే తల్లి చనిపోతే, తల్లీ తండ్రీ తానై పెంచాడు. బంధువుల బలవంతం మీద వేరే పెళ్లి చేసుకొని, ఆమె తనని సరిగా చూడ్డం లేదని విడాకులిచ్చేశాడు. అటువంటి తండ్రికి ఈ రోజు అస్వస్థత కలిగితే, ఓ పనికిమాలిన పని కోసం బయలుదేరి, దగ్గర లేకుండా పోయాడు.
‘నిజంగానే కంగారు పడవలసిందేమీ లేదు సూరీ! నేను ఫోన్‌లో వివరంగా తెలుసుకొన్నాను. నువ్వు హాస్పిటల్ దగ్గరకు వెళ్లు. నేనూ అక్కడికే వస్తున్నాను’
‘సరే!’ అని, ఫోన్ కట్ చేసి కారు దగ్గరకు నడిచాడు. కారు ఏలూరు రోడ్‌లో దూసుకుపోతోంది. అతని దృష్టి రోడ్డు మీద, ఆలోచనలు తండ్రి అనారోగ్యం మీద ఉన్నాయి. హరికృష్ణ గుర్తుకొచ్చాడు. తన తండ్రికి దూరపు బంధువైన చలమయ్య నిడమానూరులోని తమ పొలాలను పండించి, పైసా కూడా తేడా లేకుండా జమా ఖర్చు చెప్పేవాడు. అతనంటే తన తండ్రికి ఎంతో నమ్మకం. ఆ చలమయ్య కొడుకే హరికృష్ణ. అతను బాగా చదువుతున్నాడని, అతని చదువుకు తన తండ్రి సహాయం చేసేవాడు. తండ్రికి తన మీద అమితమైన ప్రేమ, హరికృష్ణ తెలివితేటల మీద అపారమైన నమ్మకం. చలమయ్య ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నట్లే, హరికృష్ణ తనకు జీవితాంతం తోడుగా ఉండాలని ఆయన కోరిక. హరికృష్ణ చదువు పూర్తవగానే పిలిచి, తామిద్దర్నీ సమాన భాగస్వాములను చేస్తూ ఓ వ్యాపారాన్ని ప్రారంభింపజేశాడాయన. తను కూడా హరికృష్ణని ఓ బంధువుగాను, ఓ స్నేహితుడుగాను చూశాడు తప్ప, తమ పొలాలను చూసుకోవడానికి నియమించిన పనివాని కొడుకుగా ఎప్పుడూ చూడలేదు. తండ్రి ఎప్పుడూ ‘మనకు ఆత్మీయులు వీళ్లే! మిగిలిన బంధువులూ, స్నేహితులూ ముఖస్తుతి చేస్తూ, మనం బాగుంటే చాటున ఏడుస్తూ, పాడైతే మన వెనక నవ్వుకొంటారు. కాని వీళ్లు మనం ఏడిస్తే తట్టుకోలేరు, ఆనందంగా ఉంటే సంబరపడిపోతారు. కాబట్టి, మనం వాళ్ల కష్టం, సుఖం మనవిగానే ఎప్పుడూ భావించి, మన కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలి’ అనేవాడు.
తనూ అలానే చూశాడు ఇన్నాళ్లు. వ్యాపారం ప్రారంభ దశలో ఉన్నప్పుడు హరికృష్ణ తన చెల్లెలి పెళ్లిని తన తాహతుకు తగ్గట్లు చేయాలనుకొంటే, తను అంతకన్నా మంచి సంబంధం చూసి, ఘనంగా పెళ్లి చేయడానికి అవసరమైన సహాయాన్నంతా చేశాడు. చలమయ్య చనిపోయినప్పుడు తన కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినట్లు చలించిపోయాడు. దగ్గరుండి అన్నీ చూసుకొంటూ, దుఃఖంలో ఉన్న తన వ్యాపార భాగస్వామికి అండగా నిలిచాడు. తమ మధ్య ఉన్న బంధుత్వం ఏమిటో తెలియదు గాని, ఓ తల్లికి పుట్టిన బిడ్డలకన్నా ఎక్కువ ప్రేమానురాగాలతో మెలగుతున్నారు.
కారు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించింది. పార్క్ చేసి, రిసెప్షన్ దగ్గరకు వెళ్లాడు. అతన్ని చూసి, దూరంగా ఉన్న హరికృష్ణ కొడుకు పరుగున వచ్చి ‘తాతగారికి బాగానే ఉందన్నారంకుల్ డాక్టర్లు! వన్నాట్ త్రీ నెంబర్ రూంలో ఉన్నారు’ అన్నారు.
‘నడు’ అన్నాడు సురేంద్ర తండ్రిని చూడాలన్న ఆత్రుత నిండిన గొంతుతో.
ఆ అబ్బాయి ముందు నడుస్తున్నాడు. అతని వెనుక సురేంద్ర నడుస్తున్నాడు. ఏదో గుర్తుకొచ్చి, ‘చక్రీ’ అన్నాడు సురేంద్ర.
ఆ అబ్బాయి వెనక్కి తిరిగి, ‘ఏంటంకుల్?’ అన్నాడు.
‘నీకు బిటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా!’
‘అవునంకుల్’
‘రేపు ఎగ్జామ్ ఉందా?’
‘ఉందంకుల్!’
‘అయ్యో! చదువుకోకుండా ఇలా వచ్చేసావు. పైగా స్ట్రెయిన్ అయిపోతున్నావు. వెళ్లు, వెళ్లి రెస్ట్ తీసుకో! రేపు ఎగ్జామ్ బాగా రాయి. ఇక్కడ నేను చూసుకొంటాను’
‘్ఫర్లేదంకుల్! డాడీ ‘పరీక్ష పోతే మరలా రాసుకోవచ్చు. ప్రాణం పోతే తిరిగి రాదు’ అని చెప్పి, నన్ను తాతయ్యగార్ని హాస్పిటల్‌లో జాయిన్ చేయడానికి పంపారు. ఆయన దూరంగా ఉన్నారట. ఆయన వచ్చేటప్పటికి ఆలస్యమవుతుందని ఫోన్ చేసి నన్ను పంపారు’ చక్రీ తన తండ్రి తనకు అప్పజెప్పిన బాధ్యత గురించి చెప్పాడు.
సురేంద్ర అవాక్కయ్యాడు. తెల్లవారితే పరీక్ష రాయవలసిన కొడుకుని అర్ధరాత్రి, మంచులో వ్యాపార భాగస్వామి తండ్రి ప్రాణం కాపాడ్డానికి పంపించిన హరికృష్ణ ముందు తాను చాలా మరగుజ్జులా ఉన్నట్లనిపించింది. హరికృష్ణని ఫామ్‌హౌస్‌కి వెళ్లమని చెప్పింది తనే! తనూ బయలుదేరింది అక్కడికే!
తండ్రి ఉన్న గదికి వెళ్లాడు. తండ్రికి ఆక్సిజన్ పెట్టారు. ఆయన స్పృహలో లేడు. తండ్రి ప్రక్కన మంచం మీద కూర్చున్నాడు. ఆయన కళ్లు తెరవలేదు. ఆయన్ని తదేకంగా చూశాడు. కళ్లు చెమర్చాయి. మనసు మందలిస్తోంది. ‘ఆయన కొడుకువై ఉండి, మనుషులను అంచనా వేయలేక పోయావు. ఇనే్నళ్లుగా ఆయన ఆత్మీయులుగా భావించిన మంచి మనుషులను దూరం చేసుకోబోయావు. రెండు తరాలుగా మీ క్షేమమే తమ క్షేమంగా భావించిన మనుషులను అపార్థం చేసుకొని, ఇనే్నళ్లు నీకు ఓ సోదరుడుగా, ఓ స్నేహితుడుగా నీకు మంచి జరగాలని కాంక్షించిన నీ రక్షణ కవచాన్ని నువ్వే హతమార్చాలనుకొన్నావు. ఆపదని వస్తే, పరాయి వారిక్కూడా సాయం చేసే నువ్వు, నీ కోసం బతికే మనిషిని చంపాలన్న కిరాతకత్వం నీకెలా వచ్చింది? నీ కవచాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని నీకెవరో తప్పుడు సమాచారం ఇస్తే, మూర్ఖునిలా వాళ్ల ఉచ్చులో పడిపోయావు. కొడుకు భవిష్యత్తుకన్నా కాటికి కాళ్లు చాపుకొని కూర్చున్న నీ తండ్రి ప్రాణమే ముఖ్యమనుకొన్న నీ రక్షకుణ్ణి చంపుకోకు’
సురేంద్ర తల విదిలించాడు. తనకు వచ్చిన సమాచారం నిజంగానే తప్పుడు సమాచారమా? అలా తప్పుడు సమాచారం పంపి, హరికృష్ణని తనకు దూరం చేయవలసిన అవసరం ఎవరికుంది? తన కంపెనీలోనే తమ అనుబంధాన్ని ఓర్వలేక ఎవరైనా చేసుంటారా? అదే నిజమైతే ఎంత ఘోరం జరిగిపోయేది?
అయినా, తమ కుటుంబానికి అంత సేవ చేసిన ఆ కుటుంబంలోని వ్యక్తి తనని చంపాలని చూస్తున్నాడనీ, తన ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడనీ ఎవరైనా సాక్ష్యం చూపిస్తే మాత్రం, అతన్ని చంపేయాలనుకోవడం ఏమిటి? ఇన్నాళ్లు తమకు చేసిన దానికి తను ఏం కృతజ్ఞత చూపినట్లు? క్షమించి, తన క్షేమం దృష్ట్యా దూరంగా పొమ్మని చెప్పాలి గాని, కృతఘు్నడై అతన్ని చంపేయాలనుకోవడం ఏమిటి? తన భార్య మీద ఎప్పట్నుంచో కన్నుందని అతనే అన్నట్లు ఎవడో వీడియో పంపితే, తాను నమ్మడం ఏమిటి? అతను ఎటువంటి వాడో తనకు తెలీదా? ‘చెల్లెమ్మా’ అంటూ ఎంత స్వచ్ఛంగా పిలుస్తాడు? ఇందాక ఫోన్‌లో ‘చెల్లెమ్మ మాధవి’ అన్నపుడు ఆ గొంతులో అత్యంత పవిత్రత వినిపించింది కదా!

తన భార్య మీద తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడని వినగానే రక్తం మరిగిపోయి, విచక్షణ కోల్పోయి, చంపేయాలన్న ఆవేశంతో రగిలిపోయాడు. ఆ వీడియోలు పంపిన వాడు మగవాడి బలహీనత గురించి బాగా అధ్యయనం చేసిన వాడు, ఏ విషయాన్ని ప్రస్తావిస్తే, మగవాడు ప్రాణ స్నేహితుడని గాని, రక్తం పంచుకొన్న సోదరుడని గాని చూడకుండా చంపేయడానికి సిద్ధపడిపోతాడో అటువంటి చండాలమైన విషయంతో తన మెదడును పనిచేయకుండా చేసేసి, ఆలోచించుకొనే అవకాశం లేకుండా చేసేశాడు.
ఏ నెంబర్ నుండి వాట్సాప్‌లో తనకు వీడియోలు వచ్చాయో తెలుసుకొంటే, వాడ్ని పట్టుకోవచ్చు. కాని, వేరే వాళ్ల సెల్‌ని ఒక్క నిమిషం తీసుకొని, తన సెల్ నుంచి ఆ సెల్‌కి పంపి, ఆ సెల్ నుంచి పంపాలనుకొన్నా వాని సెల్‌కు పంపేసి, రెండో సెల్ నుంచి సెన్డ్ వీడియోలను డిలేట్ చేసేయవచ్చు.అలా జరిగితే, తను ఎంక్వయిరీ చేయించడంవల్ల ఓ అమాయకుణ్ణి బలి చేసిన వాడవుతాడు తప్ప, తప్పు చేసిన వాడు దొరకడు. తన మనిషిని నమ్మడం మానేసి, ఎవడో పంపిన తప్పుడు సమాచారం గురించి ఆలోచించడం కన్నా అవివేకం ఏముంటుంది? తనకు ఇద్దరూ ఆడపిల్లలే అయినా, చక్రీకన్నా సంవత్సరం పెద్దవాళ్లైన కవల పిల్లలు. లేకపోతే తన ఆత్మబంధువైన హరికృష్ణ ఏకైక సంతానాన్ని తనింటి అల్లుణ్ణి చేసుకొనేవాడు.
తాను ఎంత పెద్ద కిరాతకం చేయబోయాడో తలుచుకొంటూ, సృష్టిని క్రమబద్ధంగా నడిపించే ఆ మహత్తర శక్తి తనని ఆపకపోయి ఉంటే, తాను ఈపాటికి హరికృష్ణను చంపేసేవాడనీ, ఇప్పుడు తన తప్పు తెలుసుకొంటే మాత్రం తీసిన ప్రాణం తిరిగి పోయలేక పోయేవాడు కదా అని మధనపడుతున్నాడు. నూట మూడో గదిని వెతుక్కుంటూ హరికృష్ణ వచ్చాడు. అతను కనిపించగానే సురేంద్ర అతన్ని కౌగిలించుకొని ఏడ్చేశాడు. తెల్లవారితే ఉగాది. ముందు రోజే షడ్రుచులూ చవి చూశాడు. అంత రాత్రి వేళ కోకిల కూయకపోవచ్చు గాని, ఎక్కడ్నుంచో అతని మనసుకు కోకిలగానం వినిపిస్తోంది.
మర్నాడు ఓ ఇద్దరి జీవితాల్లోకి చేదు ప్రవేశించింది. హరికృష్ణ రాత్రి సురేంద్ర ఫోన్ చేసిన లాండ్‌లైన్ ఓ ఆసుపత్రిదని తెలుసుకొని, గంగయ్య సహకారంతో రాజారావుని అరెస్టు చేయించాడు. సురేంద్రకు తప్పుడు వీడియోలు పంపిన వాడ్నికూడా కనిపెట్టి, వీడియోల్లోని పెదవుల కదలికకు, ఆడియోల్లోని మాటలకు జత కుదరడం లేదని రుజువు చేసి, వాడ్ని కూడా పోలీసులకు అప్పజెప్పాడు. తను చెప్పకుండా ఆ విషయాలన్నీ హరికృష్ణకు ఎలా తెలిశాయో సురేంద్రకు అర్థం కాలేదు. అందుకే తన తండ్రి తనకు హరికృష్ణని వ్యాపార భాగస్వామిని చేశాడని మాత్రం అర్థం చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం సురేంద్రకు వసంత కోకిల గానం వీనుల విందుగా వినిపించింది. ఆ నగరంలోని అతని ఇంటి దగ్గర్లోని ఓ చెట్టు మీద నుంచి దగ్గర్లో మరికొన్ని చెట్లుంటే వసంత రుతువంతా కోకిలల కవి సమ్మేళనాలు వినిపిస్తూ ఉండేవేమో!
*

టి.వి.సుబ్రహ్మణ్యేశ్వరరావు
9908893669

- టి. వి. సుబ్రహ్మణ్యేశ్వరరావు