S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జల సేన

ఈస్ట్రన్ ఫ్లీట్‌కు కలర్స్ బహుకరిస్తున్న
అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం

ఎంతగా శాంతిని కాంక్షిస్తున్నా...
మరెంతగా శత్రుత్వం వద్దనుకున్నా...
ఏ దేశానికైనా రక్షణ వ్యవస్థ అనివార్యం. అంతర్గత భద్రతతో పాటు భూమి, ఆకాశం, సముద్రం - ఇలా మూడు వైపులనుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు అనుక్షణం అప్రమత్తత అవసరం. తీరప్రాంతం అధికంగా కలిగిన భారత్ వంటి దేశాలకు తీర రక్షణ పెను సవాలు వంటిది.
ముంబైపై ఉగ్రదాడి అనంతరం తీర ప్రాంత రక్షణ మరింత కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తీరప్రాంతాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చడంలో భారత నౌకాదళం అందిస్తున్న సేవలు నిరుపమానం. సముద్రం వైపునుంచి ఎటువంటి ముప్పు ఎదురుకాకుండా
కంటికి రెప్పలా తీరానికి రక్షణ కవచంగా నిలుస్తోంది. నాలుగో శతాబ్దంలో అంటే వౌర్యుని కాలంలో ఏర్పడిన తొలి నౌకా విభాగం నేడు అంచెలంచెలుగా ఎదిగి ఆధునిక సంపత్తితో అలరారుతోంది.

భారత దేశానికి అత్యంత కీలకమైన తూర్పు తీరం గేట్ వే ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి. మేజర్, మైనర్ పోర్టులతో కళకళలాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. తూర్పు తీరానికి బంగ్లాదేశ్, శ్రీలంక సరిహద్దులు. వాణిజ్య పరంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ తీరంపై ఉగ్రవాదుల కన్ను పడడానికి కూడా వీల్లేని విధంగా తూర్పు నౌకాదళం రక్షణ కవచంగా నిలుస్తోంది. తూర్పు తీర రక్షణ కోసం సరిగ్గా 50 సంవత్సరాల కిందట ఆవిర్భవించిన తూర్పు నౌకాదళం ఇప్పుడు స్వర్ణోత్సవాలను జరుపుకుంటోంది. భూమి, ఆకాశం, నీటి మీద ఎక్కడైనా శత్రు జాడ కనిపిస్తే క్షణాల్లో తుదముట్టించే శక్తి, సామర్థ్యాంలు ఈ తూర్పు నౌకాదళం సొంతం. సహజ సిద్ధంగా ఏర్పడిన విశాఖ పోర్టును ఆనుకుని తూర్పు నౌకాదళం కార్యకలాపాలను కొనసాగిస్తోంది. శత్రు దుర్భేద్యమైన ఈ తీరంలో సుశిక్షితులైన సైనికులు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు అనుక్షణం అప్రమత్తంగా ఉంటాయి. అంతేకాదు, తీరం వెంబడి ఉన్న చమురుశుద్ధి కర్మాగారాలు, పోర్టులు, అనేక భారీ పరిశ్రమలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు నిరంతర నిఘాను కొనసాగిస్తోంది. భారత నావికాదళంలో మరెక్కడా లేని విధంగా అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్ ఈ తూర్పు తీరంలోనే అందులోనూ విశాఖలోనే ఉండడం గమనార్హం. చేతిలో ఆయుధమే కాదు, గుండె నిండా ప్రేమను నింపుకొన్న ఈ నావికా సైన్యం పౌర సేవలోనూ ముందంజలో ఉంది.
వౌర్యుని కాలం నుంచే...
భారత దేశానికి 4000 సంవత్సరాల సముద్ర వారసత్వ చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 2300లోనే ప్రస్తుతం గుజరాత్‌లోని నంగ్రోళ్ సమీపంలో మొట్టమొదటి నౌకా తీరం ఏర్పాటైంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో వౌర్య సామాజ్య్రంలో మొట్టమొదటి నౌకా విభాగాన్ని ఏర్పాటుచేసింది. చాణుక్యుడు తను రచించిన అర్థ శాస్త్రంలో నావాధ్యక్షను ప్రస్తావించాడు. అంటే నౌకా నిర్వాహకుని పేరుతో నదీ జలాల వినియోగాన్ని వివరించాడు. చుట్టుపక్కల దేశాల మధ్య రాకపోకలు, సంస్కృతులకు సముద్ర రవాణా మూలమైంది. వౌర్య, చోళ, శాతవాహన, విజయనగర, మొగల్ సామ్రాజ్యాల్లో నౌకాయానం బాగా వృద్ధినొందింది. వేదాలు, పాళి, తమిళ భాషల్లో మన సముద్ర వారసత్వ సంపద గురించి వర్ణించారు. బుద్ధుల కాలం నాటి చారిత్రక ఆనవాళ్లనుబట్టి భారత సముద్ర వారసత్వానికి అపారమైన చరిత్ర ఉందని రుజువైంది. ప్రముఖ కళాకారులు గీసిన చిత్రాల ఆధారంగా అలనాటి సముద్ర వర్తక, వాణిజ్యాలు ఏవిధంగా సాగేవన్నది అర్థమవుతుంది. వౌర్యులు, శాతవాహనుల కాలంలో సముద్ర వాణిజ్య కార్యకలాపాలు ముమ్మరంగా పెరిగాయి. అశోకుని కాలంలో పటిష్ఠమైన సముద్ర వాణిజ్య వ్యవస్థ రూపుదిద్దుకుంది. వాణిజ్య అవసరాలకే వినియోగిస్తున్న సముద్రంపై నెమ్మది నెమ్మదిగా ఆధిపత్యపోరు మొదలైంది. దేశాల మధ్య విభేదాలు, ఆధిపత్యపోరు, అంతకంతకు రగులుతూ వచ్చాయి. పొరుగు దేశాల్లో చొరబాట్లకు సముద్ర మార్గం అనువుగా మారింది. ఇదే సమయంలో బ్రిటిష్ వారు భారత దేశంలోకి చొచ్చుకు వస్తున్న సమయంలో సముద్ర జలాల్లోనే వారికి గుణపాఠం చెప్పేందుకు ఛత్రపతి శివాజీ నౌకాదళంతో ఎదురెళ్లాడు. ఇందులో అడ్మిరల్ ఖానోజీ అంగ్రి తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి మరాఠా పాలకుల ప్రతిష్ఠ నిలిపారు. దీని తరువాత భారత దేశంతోపాటు, పొరుగు దేశాలు కూడా నౌకాదళ ప్రాధాన్యతను గుర్తించాయి. ఆ తరువాత బ్రిటిష్ వారు భారత దేశాన్ని పాలిస్తున్న సమయంలో రాయల్ ఇండియన్ నేవీని ఏర్పాటు చేశారు. ఇది 1946 నాటికి 78 ఓడలు, 2000 మంది సిబ్బంది కలిగి ఉండేది.
ఇదీ ప్రస్థానం
1950 జనవరి 26న భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా పేరుమార్చారు. భారత నౌకాదళ యుద్ధ నౌకలకు ఇండియన్ నేవల్ షిప్స్‌గా పేరుపెట్టారు. భారత దేశానికి స్వాతంత్య్రం రాకమునుపు రాయల్ ఇండియన్ నేవీ మనుగడలో ఉండేది. స్వాతంత్య్రానంతరం భారత దేశం నుంచి పాకిస్తాన్ వేరుపడినప్పుడు రాయల్ ఇండియన్ నేవీ కూడా రెండుగా చీలిపోయింది. రాయల్ ఇండియన్ నేవీ, రాయల్ పాకిస్తాన్ నేవీగా విడిపోయాయి. 1950 జనవరి 26న రాయల్ ఇండియన్ నేవీ నుంచి రాయల్‌ను తొలగించారు. అప్పటి నుంచి ఇండియన్ నేవీగా పిలవబడుతూ వస్తోంది. ఆ తరువాత 1958 ఏప్రిల్ 22న భారత నౌకాదళానికి తొలి నౌకాదళ ప్రధానాధికారిగా ఆర్‌డి కటారి నియమితులయ్యారు. కటారి బాధ్యతలు చేపట్టిన తరువాత భారత నావికాదళంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సాయుధ సంపత్తిని ద్విగుణీకృతం చేశారు. ఆత్యాధునిక యుద్ధ నౌకలు, విమానాలను నౌకాదళంలో చేర్చారు. భూమి, జలం, ఆకాశ మార్గాల నుంచి శత్రువులు భారత దేశంపై కనె్నత్తయనా చూడ్డానికి వీల్లేని విధంగా నావికాదళాలను సర్వసన్నద్ధం చేశారు. భారత నావికాదళం అంటే కేవలం యుద్ధం కోసమే కాదు, శాంతి సమయంలో ప్రజలకు సేవలందించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కూడా భారత నావికాదళ కార్యకలాపాల్లో ఒక భాగం. భారతదేశ రక్షణ కోసం నౌకాదళం తన సైన్యాన్ని తీర ప్రాంతమంతా విస్తరించింది. తూర్పు, పశ్చిమ, దక్షిణ తీరాలతోపాటు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇండియన్ నేవీ స్థావరాలను ఏర్పాటు చేసింది. వీటిని కమాండ్ కార్యాలయాలు అంటారు. ఇందులో ప్రధానమైనవి తూర్పు, పశ్చిమ నౌకాదళ కేంద్రాలు. 1968లో ఆరంభమైన తూర్పు నౌకాదళం ఇప్పుడు ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు స్వర్ణోత్సవాలు జరుపుకుంటోంది.
తూర్పు నౌకాదళ ఆవిర్భావం
1968 మార్చి ఒకటో తేదీన తూర్పు నౌకాదళం ఆవిర్భవించింది. ఈ కమాండ్‌కు తొలి ఫ్లాగ్ ఆఫీసర్‌గా రియర్ అడ్మిరల్ కెఆర్ నాయర్ నియమితులయ్యారు.

తూర్పు నౌకాదళం ఉత్తరాన సుందర్‌బన్స్ నుంచి దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ విస్తరించి ఉంది. భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఆధునిక యుద్ధ విమానాలతోపాటు, సాయుధ సిబ్బంది, అణు జలాంతర్గామి కలిగిన ఏకైక నేవల్ కమాండ్‌గా తూర్పు నౌకాదళం గుర్తింపు తెచ్చుకుంది.
పరిధి విస్తారం.. బాధ్యత అనంతం
తూర్పు నౌకాదళ పరిధి, బాధ్యతలు అపారం. తూర్పు నౌకాదళం పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి వరకూ విస్తరించి ఉంది. హార్బర్ సెక్యూరిటీతోపాటు, కోస్ట్‌గార్డు, మెరైన్ పోలీస్, సివిల్ పోలీస్‌తో సమన్వయం తీర రక్షణ బాధ్యత తూర్పు నౌకాదళానిదే. తూర్పు నౌకాదళం భారత సముద్ర జలాల్లో శత్రు చొరబాట్లను, పైరసీని అరికట్టడంతోపాటు, భారత దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన ఆయిల్ రిఫైనరీలు, పోర్టుల పరిరక్షణ బాధ్యతను కూడా తీసుకుంది. 2600 కిలో మీటర్ల నిడివి కలిగిన తూర్పు తీరంలో 30 శాతం అంటే ఆరు లక్షల చదరపు కి.మీ. పరిధిలో ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ (ఇఇజెడ్) విస్తరించి ఉంది. ఈ తూర్పు తీరంలో 13 మేజర్ పోర్టులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అపారమైన చమురు నిక్షేపాలు ఉండడంతో, వీటిని ఆధారంగా చేసుకుని ఆయిల్ రిఫైనరీలు పెద్ద ఎత్తున నెలకొల్పారు. భారత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టిన తరువాత సముద్ర వాణిజ్యం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. తూర్పు తీరంలో జల రవాణాకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా భారత నౌకాదళంపైనే పడింది. వీటితోపాటు డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) కార్యకలాపాలకు తూర్పు తీరమే వేదికగా మారింది. భారత రక్షణ, సాంకేతిక అవసరాల కోసం ప్రయోగించే ఉపగ్రహ ప్రయోగశాల శ్రీహరికోటకు భారత నౌకాదళం రక్షణ కవచంగా ఉంది. అలాగే పలు క్షిపణులను తయారు చేసే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరెటరీస్ (ఎన్‌ఎస్‌టిఎల్)కూడా విశాఖలో ఉంది. క్షిపణి ప్రయోగాలకు భారత నౌకాదళం అండగా నిలుస్తోంది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే మత్స్య పరిశ్రమ తూర్పు తీరంలో బాగా విస్తరించి ఉంది. దీని రక్షణ బాధ్యత కూడా భారత నౌకాదళానిదే.
స్నేహానికి ప్రాణమిస్తుంది!
తనకు తానుగా ఏ దేశంపైనా కాలుదువ్వని భారత ప్రభుత్వం తన సైన్యాన్ని కూడా అందుకు అనుగుణంగా తయారు చేసింది. భారత నౌకాదళం శాంతి సమయాల్లో పొరుగు దేశాలతో కలిసి సంయుక్త విన్యాసాలు చేస్తుంటుంది. అనేక దేశాలు మన దేశానికి వచ్చి భారత నౌకాదళ అనుభవాలను, యుద్ధ సన్నద్ధ పరిస్థితులతోపాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకుని వెళుతుంటాయి. తూర్పు నౌకాదళం ఇంద్ర పేరుతో రష్యన్ నేవీతో, సింబెక్స్ పేరుతో సింగపూర్ నేవీతో సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తూ వస్తోంది. అలాగే రెండు సంవత్సరాలకు ఒకసారి ‘మిలాన్’ పేరుతో దక్షిణ ఆసియా దేశాలతో పోర్టుబ్లెయర్ వద్ద అంతర్జాతీయ విన్యాసాలను నిర్వహిస్తూ వస్తోంది.
విలయానికి ఎదురెళ్లి..
తూర్పు తీరంలో అనేక సందర్భాల్లో ప్రకృతి విలయాలు సంభవించాయి. ఆ భయానక పరిస్థితులను కూడా లెక్క చేయకుండా, అల్లకల్లోల సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లి, అక్కడ ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడిన సంఘటనలు తూర్పు నౌకాదళ చరిత్రలో అనేకం. ఇక హుదూద్ తుపాను ధాటికి తూర్పు నౌకాదళం చిన్నాభిన్నమైపోయింది. తూర్పు నౌకాదళానికి సంభవించిన నష్టాన్ని పక్కనపెట్టి, అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను ఆదుకుంది నావికాదళం. విశాఖ తీరంలో స్నానాలకు వెళ్లి అనేక మంది గల్లంతయ్యేవారి జాడ కనిపెట్టేందుకు హెలికాప్టర్లు సహకరిస్తుంటాయి.
విశాఖలో నావికాదళ సమీక్ష
భారత నావికాదళం సగర్వంగా భావించే ఓ అద్భుత కార్యక్రమం ప్రెసిడెంట్ ఫ్లీట్. త్రివిధ దళాధిపతి అయిన భారత రాష్టప్రతి తన పదవీ కాలంలో ఒకసారి నావికాదళ సమీక్ష నిర్వహిస్తారు. బ్రిటిష్ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. 1953లో అప్పటి రాష్టప్రతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ పశ్చిమ తీరమైన ముంబైలో నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూకి సారథ్యం వహించారు. రాష్టప్రతి కోసం ఓ యుద్ధ నౌకను ప్రత్యేకంగా అలంకరిస్తారు. నౌక అగ్ర భాగాన రాష్టప్రతి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చుంటారు. ఆయన పక్కనే ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, నౌకాదళ ప్రధాన అధికారి ఉంటారు. భారత నౌకాదళానికి చెందిన ప్రధాన నౌకలు సముద్రంలో బారులుతీరి ఉంటాయి. వీటన్నింటినీ వరుసగా చూస్తూ రాష్టప్రతి నౌక ముందుకు సాగుతుంది. భారత నౌకాదళ చరిత్రలో ఇటువంటి ప్రెసిడెంట్ ఫ్లీట్లు పశ్చిమ తీరంలోనే జరుగుతుంటాయి. తూర్పు తీరంలో ఇప్పటి వరకూ ఒకే ఒకసారి ఈ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. 2006 ఫిబ్రవరి 12న అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం ఈ ఫ్లీట్‌ను సందర్శించారు. ఇందులో 50 యుద్ధ నౌకలు, 55 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్, కెఎ 31 తరహా హెలికాప్టర్లు పాల్గొన్నాయి. ఈ ఫ్లీట్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత రాష్టప్రతి తొలిసారిగా జలాంతర్గామిలో ప్రయాణం చేసింది కూడా విశాఖ తీరం నుంచే. భారత రాష్టప్రతి జలాంతర్గామిలో ప్రయాణించడం భారత నౌకాదళ చరిత్రలో ఇదే ప్రథమం.
తూర్పు నౌకాదళ చరిత్రలో మరపురాని ఘట్టం
తూర్పు నౌకాదళ చరిత్రలో మరపురాని ఘట్టాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఒకటి. తూర్పు తీరం ఆవిర్భవించిన 48 సంవత్సరాల తరువాత తొలిసారిగా విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2016 ఫిబ్రవరిలో జరిగింది. ఈ ఫ్లీట్ రివ్యూలో సుమారు 55 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. స్వదేశీ, విదేశీ నౌకలు సుమారు 90 వరకూ ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ సమీక్ష నిర్వహించారు.
కఠోర శిక్షణ
శత్రు సేనలను తుదముట్టించడమే కాదు, విపత్కర పరిస్థితుల్లో వారి కంట పడకుండా తప్పించుకోవాలి కూడా. ముఖ్యంగా జలాంతర్గాముల సిబ్బందికి ఇది చాలా అవసరం. ఇందుకోసం కఠోర శిక్షణ తీసుకోవలసిందే. భారత నౌకాదళం ఎక్కువగా రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లను వినియోగించేది. ఇందుకోసం సమగ్ర శిక్షణ కేంద్రాన్ని 1974 డిసెంబర్ 21న ప్రారంభించారు. 1986లో దీన్ని ప్రత్యేకంగా సబ్‌మెరైన్ శిక్షణా కేంద్రంగా మార్చారు. 70 ఎకరాల్లో ఈ శిక్షణా కేంద్రాన్ని నిర్మించారు. ఇందులో ఎస్కేప్ ట్రైనింగ్ స్కూల్, స్కూల్ ఫర్ అడ్వాన్స్‌డ్ అండర్‌సీ వార్‌ఫేర్ ఫర్ ట్రైనింగ్ ఆన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ ఉన్నాయి. సబ్‌మెరైన్‌లో ఎటువంటి ప్రమాదం సంభవించినా, అందులో నుంచి బయటపడేందుకు కావల్సిన శిక్షణ ఇస్తుంటారు. సబ్‌మెరైన్‌కు సంబంధించి సమగ్ర శిక్షణ విశాఖలోనే ఇస్తున్నారు. సబ్‌మెరైన్‌ల విభాగ ప్రధాన కార్యాలయం సబ్‌మెరైన్ ఫ్లాగ్ అథారిటీ విశాఖలోనే ఉంది. భారత నౌకాదళంలో ఉన్న జలాంతర్గాముల్లో ఎక్కువగా విశాఖ తీరంలోనే ఉన్నాయి.
ఇఎన్‌సి వద్ద బ్రహ్మాస్త్రం
తూర్పు నౌకాదళం వద్ద అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రంలాటి బ్రహ్మోస్ క్షిపణి ఉంది. ఈ క్షిపణి ప్రయోగించేందుకు మిసైల్ డిస్ట్రాయర్ రాజపుత్, రాణా, రంజిత్, రణ్ వీర్, రణ్ విజయ్‌లను ఎంపిక చేసుకున్నారు. ఈ యుద్ధ నౌకలపై కమోవ్25, కమోవ్ 28 యాంటీ సబ్‌మెరైన్ హెలికాప్టర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అంత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణితోపాటు, అత్యాధునిక ఆయుధాలను ఇవి మోసుకెళతాయి. శత్రు లక్ష్యాలను, వారి నుంచి ఎదురవబోయే దాడులను ముందుగానే గుర్తించి సిబ్బందికి సిగ్నల్స్ ఇచ్చే వ్యవస్థ వీటిలో ఉన్నాయి. ఈ యుద్ధ నౌకల నుంచే బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం జరిగింది.
ఇవీ ప్రత్యేకతలు
తూర్పు నౌకాదళ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. సహజసిద్ధంగా ఏర్పడిన నౌకాశ్రయంలో తూర్పు నౌకాస్థావరం ఉంది. ఈ స్థావరం శత్రు దుర్భేద్యమే. నౌకాస్థావరాన్ని ఆనుకునే నేవల్ డాక్‌యార్డ్ పనిచేస్తోంది. ఇందులో డ్రై డాక్ కూడా ఉంది. యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లకు వెంట వెంటనే మరమ్మతులు చేసి, తిరిగి జలప్రవేశం చేయించగల సామర్థ్యం ఈ నేవల్ డాక్‌యార్డుకు ఉంది. అలాగే నౌకాస్థావరానికి మరోపక్క నౌకా నిర్మాణ కేంద్రం ఉంది. సుమారు ఆరు సంవత్సరాల కిందట ఈ నౌకా నిర్మాణ కేంద్రాన్ని భారత రక్షణ శాఖ తన అధీనంలోకి తీసుకుంది. ఇకపై యుద్ధ నౌకల నిర్మాణం ఇక్కడే జరగబోతోంది. ఇదిలా ఉంటే, భారత నౌకాదళానికి వ్యూహాత్మక స్థావరాలు చాలా కొద్దిగా ఉన్నాయి. వీటిలో ఒకటి విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద నిర్మితమవుతోంది. ఇక్కడ మన అణు జలాంతర్గామిని ఉంచబోతున్నారు. ఆయుధాలతోపాటు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా శత్రువులను మట్టుపెట్టేందుకు అవసరమైన కమాండో శిక్షణా కేంద్రం విశాఖలోనే ఉంది. మెరికల్లాంటి యువకులకు ఇక్కడ కఠోర శిక్షణ ఇస్తుంటారు. సిబ్బంది నివాసం కోసం డాల్ఫిన్ హిల్స్‌పై అత్యద్భుతమైన క్వార్టర్స్‌ను నిర్మించింది నేవీ. శత్రు దుర్భేద్యమైన ఈ టౌన్‌షిప్ నుంచి ప్రకృతి అందాలను ఎంతసేపు తిలకించినా తనివితీరదు. నేవీ డేని పురస్కరించుని విశాఖలో నేవీ వీక్ నిర్వహిస్తారు. నేవీ ఆయుధ సంపత్తికి సంబంధించిన ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి, వాటి గురించి ప్రజలకు వివరిస్తారు. నేవీ నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారిని యుద్ధ నౌకలో నాలుగైదు గంటలపాటు ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. అలాగే నేవీ డే రోజున బీచ్ రోడ్డులో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయ.

ఎదురులేని ‘డేగ’
తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి అత్యంత సమీపంలోని విశాఖ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న ఐఎన్‌ఎస్ డేగ ఈస్ట్రన్ నేవీకి మరొక వ్యూహాత్మక ఎయిర్ స్టేషన్. 1972 డిసెంబర్‌లో కొద్దిపాటి హెలికాప్టర్లతో ఈ ఎయిర్ స్టేషన్ ప్రారంభమైంది. నాలుగేళ్ల తరువాత ఎయిర్ స్టేషన్ అభివృద్ధి ఊపందుకుంది. 1986లో ఈ ఎయిర్ ఫీల్డ్ నేవీ అధీనంలోకి వచ్చింది. 1991 అక్టోబర్ 21న దీనికి ఐఎన్‌ఎస్ డేగా అని నామకరణం చేసి, జాతికి అంకితం చేశారు. ఇప్పుడు ఈ డేగాలో ఛేతక్ హెలికాప్టర్లు, హాక్, అడ్వాన్స్‌డ్ జెట్ ట్రైనర్స్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్‌క్రాఫ్ట్ (పిటిఎ) ‘లక్ష్య’తో తూర్పు తీరంపై డేగ సిద్ధంగా ఉంది.

శత్రువు పక్కలో బల్లెం
‘అరిహంత్’

ఐఎన్‌ఎస్ అరిహంత్... ఈ పేరు వినగానే శత్రు దేశాలకు కంటిమీద కునుకు ఉండదు. భారత నావికాదళానికి అంత్యంత శక్తినిచ్చే అణు జలాంతర్గామి ఇది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అరిహంత్ ప్రస్తుతం సీ ట్రయల్స్‌లో ఉంది. త్వరలోనే ఇది సమరానికి సిద్ధమవుతుంది. దీన్ని విశాఖలో ఓ వ్యూహాత్మక ప్రదేశంలో ఉంచనున్నారు. అలాగే న్యూక్లియర్ పవర్డ్ అటాక్ ఐఎన్‌ఎస్ చక్ర జలాంతర్గామి కూడా తూర్పు నౌకాదళానికి రక్షణ కవచంగా ఉంది.

అరుదైన బహుమానం

రత నౌకాదళంలో శౌర్య పరాక్రమాలతో సేవలందించిన నౌకాదళ కేంద్రాలకు అత్యంత ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్స్‌ను బహుకరిస్తుంటారు. భారత రాష్టప్రతి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రెసిడెంట్స్ కలర్స్ తూర్పు నౌకాదళ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్కసారే దక్కింది. ఈ కలర్స్ ప్రెజెంటేషన్‌ని 1924లో ఇంగ్లాండ్ కింగ్ జార్జ్-5 రాయల్ నేవీలో ప్రవేశపెట్టారు. 1935 డిసెంబర్ తొమ్మిదో తేదీన రాయల్ ఇండియన్ నేవీ దీన్ని అనుసరించింది. స్వాతంత్య్రానంతరం త్రివిధ దళాల్లో అత్యంత సాహసోపేత యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించిన పశ్చిమ నౌకాదళానికి 1951 మే 27న అప్పటి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ ప్రెసిడెంట్ కలర్స్ ముంబైలో ప్రదానం చేశారు. వీనుల విందుగా వినిపిస్తున్న నేవీ బ్యాండ్ ఒకపక్క.. ధవళ వర్ణ దుస్తులతో మెరిసిపోతున్న సైనికులు మరోపక్క, త్రివిధ దళాధిపతి హోదాలో రాష్టప్రతి హుందాగా కమాండ్ సైనికులకు త్రివర్ణ పతాకంతోపాటు, భారతీయ నేవీ పతాకం కలిపి ఉన్న ఒక తెల్లటి జెండాను సైనికులకు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా జరిగే పరేడ్ ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంటుంది. 1987 మార్చి 25న అప్పటి రాష్టప్రతి జ్ఞానీ జైల్ సింగ్ విశాఖలో తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో కలర్స్ ప్రెజెంట్ చేశారు. అలాగే 2006 ఫిబ్రవరి 13న అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం ఈస్ట్రన్ ఫ్లీట్‌కు కలర్స్ ప్రదానం చేశారు. తూర్పు నౌకాదళ చరిత్రలో ఇవి మరపురాని ఘట్టాలుగా నిలిచిపోయాయ..

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ స్టేషన్ ‘రజాలి’

తూర్పు నౌకాదళానికి అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ఎయిర్ స్టేషన్ తమిళనాడులోని అరక్కోణం జిల్లాకు సమీపంలో ఉన్న రజాలి ఎయిర్ స్టేషన్. ఇది తూర్పునౌకాదళానికే కాదు, ఇండియన్ నేవీకే ప్రీమియర్ ఎయిర్ స్టేషన్‌గా చెప్పవచ్చు. తూర్పు, దక్షిణ తీర ప్రాంతాలకు మధ్య భూ, ఉపరితల, సముద్ర మార్గాల్లో శత్రు సేనల పీచమణచడానికి కావల్సిన సాయుధ సంపద అంతా ఇక్కడే నిక్షిప్తమై ఉంటుంది. శత్రు జాడ ఎక్కడున్నా, క్షణాల్లో వెళ్లి, వారిని తుదముట్టించగలిగే, యుద్ధ విమానాలు ఇక్కడ టేకాఫ్‌కు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. 1985లో ఈ ఎయిర్ స్టేషన్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధీనంలోకి వచ్చింది. ఆ తరువాత ఇండియన్ నేవీ వ్యూహాత్మక ఎయిర్ స్టేషన్‌గా దీన్ని తీర్చిదిద్దింది. 1992లో మార్చి 11న అప్పటి రాష్టప్రతి ఆర్ వెంకటరామన్ దీన్ని జాతికి అంకితం చేశారు. 2320 ఎకరాల విస్తీర్ణతలో అతి పొడవైన, అతి వెడల్పయిన రన్‌వే కలిగిన రజాలి ఎయిర్ స్టేషన్ ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్ స్టేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే భారత నావికాదళంలో అతి పెద్ద టియు-142 యుద్ధ విమానాలు ఎనిమిదింటిని ఇక్కడే ఉంచారు. టియు-142 విమానాలు డి కమిషనింగ్ తరువాత భారత నౌకాదళంలో అతి పెద్ద విమానాలుగా గుర్తింపు పొందిన బోయింగ్ పి8ఐ విమానాలను ఇప్పుడు ఈ ఎయిర్ స్టేషన్‌లో ఉంచుతున్నారు. ఇక్కడ హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ ఉంది. నేవల్, కోస్ట్‌గార్డ్‌కు చెందిన వివిధ రకాల హెలికాప్టర్లు, డార్నియర్ 228 తరహా హెలికాప్టర్లు ఇక్కడే ఉంటాయి.

- కె.వి.జి. శ్రీనివాస్