S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గోల మనుషులం

అంతా ప్రశాంతంగానే ఉంది. అంతట్లో ప్రార్థనకు సమయం అవుతుంది. ఒకసారి కాదు. దినంలో అయిదుసార్లు అవుతుంది. ఇక ఆస్తికులను పిలిచే కార్యక్రమం మొదలవుతుంది. ఊరికే పిలిస్తే అభ్యంతరం లేదు. మైకుల గోల మొదలవుతుంది. అవి మామూలు స్థాయిలో ఉంటే అభ్యంతరం లేదు. మైకులు మరీ ఎక్కువగా అరుస్తాయి. మైకులు ఉన్నాయని తెలియని ఆ మువజ్జిన్ మరింత గట్టిగా అరుస్తాడు. ఒకరే అరిస్తే ఫరవాలేదు. అన్ని దిక్కుల నుంచి లెక్కలేనంత మంది పిలుపు మొదలుపెడతారు. ఒక్కొక్కరు ఆ పిలుపును ఒక రకంగా పాడతారు. అందులో పద్ధతులు శ్రావ్యం నుంచి మరో చివరిదాకా పెక్కు రకాలుగా ఉంటాయి. ఇక ప్రార్థనా స్థలాలు మిగతా వాటి నుంచి కూడా ఈ రకమయిన పిలుపులు మొదలయితే, పరిస్థితి ఏమవుతుందని నాకు భయం మొదలవుతుంది.
పండగేదో వస్తుంది. అప్పుడిక రోజంతా గోల మొదలవుతుంది. ఈ సంవత్సరం దయతలచి నల్లబట్టల వాళ్లు మైకుల్లో గోల మొదలుపెట్టినట్లు లేదు. మా ఇంటి ముందు ఒక మిద్దె మీద ఏటా ఒకసారి కనీసం ఇటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. నేను ఆనాడు ఇల్లు వదిలి దినమంతా మరెక్కడో తిరుగుతాను. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ పేరున తొమ్మిది రోజుల పాటు జరిగిన గోలను తలచుకుంటే నాకు కొంచెం భయమే అనిపిస్తుంది. మొదట్లో చాలా సంబరపడ్డాను. మరుగున పడిన బతుకమ్మ మళ్లీ బతికిందని ఆనందించాను. మా ఇంటి ప్రాంతంలో ఆ రోజునంతా పాటలు వినిపించారు. సాయంత్రాలలో మా ఆవిడతో సహా చాలామంది బతుకమ్మ ఆడారు. డాండియా కూడా ఆడారు. ఇదంతా బాగానే ఉంది. కానీ, వారమంతా ఒకే బతుకమ్మ పాట, ఒకే డాండియా పాట వినవలసి వచ్చింది. పాపం వాళ్లకు మరి నాలుగు రికార్డు లేదా సీడీలు దొరికితే బావుండుననిపించింది.
మొన్ననొక పెళ్లికి వెళ్లాను. అది ఎక్కడో కాదు. నగరం నడిబొడ్డులోని ఒకానొక పెద్ద కళ్యాణ మంటపాల సమూహంలో. అక్కడ నాకు తెలిసి రెండు పెద్దపెద్ద హాళ్లు ఉన్నాయి. కానీ, నేను వెళ్లవలసిన పెళ్లి ఆ రెంటిలోనూ నాకు కనిపించలేదు. కొంచెం పరిశోధన తరువాత పైన మరొక చిన్న హాలు ఉందని తెలిసింది. నేను వెళ్లింది పెళ్లికి కాదు. ముందు రోజు జరిగే ఎదురుకోళ్లు అనే తతంగానికి. ఆ కార్యక్రమానికి చిన్న హాలు చాలుననుకున్నారు. జనం మాత్రం చాలా ఎక్కువమందిమే పోగయ్యాము. గోల పెరిగింది. మంగళ వాయిద్యం వాళ్లు హాలులోనే కూచుని అదరగొట్టేస్తున్నారు. రహస్యం లేదు గాని నాకు చెవుడు ఉంది. అందుకేనేమో నాకు పెద్ద ధ్వనులు భరించడం సాధ్యం కాదు. తప్పదు గనుక తల తిరుగుతున్నా, అక్కడే తచ్చాడుతున్నాను. అంతలో పులి మీద పుట్రలాగ బయట నుంచి బ్యాండ్ మేళం మొదలయింది. అది శ్రావ్యంగా సినిమా పాటను వినిపించి ఉంటే కొంతవరకూ భరించగలిగే పరిస్థితి ఉండేదేమో! కిందనున్న మరొక హాలులో శుభకార్యం నిర్వహిస్తున్న వారికి సంతోషం మరీ ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకనే వాళ్లు భూమ్యాకాశాలు దద్దరిల్లిపోయే పద్ధతిలో డామాడోళ్లు ఏర్పాటు చేశారు. చెవులు పగిలిపోయాయి! బుర్ర బొంగరమయింది! రాజకుమారుడులాగ గుర్రమెక్కి వచ్చిన పెళ్లికుమారుడు దర్జాగా హాలులోకి వెళ్లిన తరువాత కూడా మోత బహుశా కొనసాగింది. ఈలోపల మరొక గోల. సంతోషాన్ని పట్టలేక ఆడపిల్లవారు ఆకాశాన్ని రంగులతో నింపారు. అందుకు రాకెట్లను వాడారు. ఒక పక్కన వాటి గోల. చాలవన్నట్టు లడీ బాంబులు! వేలకు వేలు! ఇక నాకు ఎన్నడూ పెళ్లిళ్లకు వెళ్లకూడదు అన్నంత వైరాగ్యం మొదలయింది. కానీ, వారం రోజుల్లోనే మళ్లీ పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది.
మొత్తానికి ఆ మధ్యన చదివిన ఒకానొక పుస్తకం జ్ఞాపకం వచ్చింది. దాని పేరు ‘సైలెన్స్’. అంటే నిశ్శబ్దం. గోల నిండిన ప్రపంచంలో ప్రశాంతత ప్రభావం లేదా శక్తి అనే ఉపశీర్షికతో వచ్చిన ఆ పుస్తకం నాకెంతో నచ్చింది. నేను చేతనయినంతసేపు నిశ్శబ్దంగా ఉంటాను. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరూ కలిసి అనవసరంగా మాట్లాడుకునే అలవాటు లేదు. పెద్దవాడినయ్యాక కూడా ఆ అలవాటు లేదు. పెళ్లయి పిల్లలు కలిగిన తరువాత కూడా ఆ అలవాటు కొనసాగింది. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఇంట్లో ఉన్న నలుగురము నిశ్శబ్దంగా నాలుగు మూలల కూచుని ఎవరి పనిలో వాళ్లు ఉండడం మా ఇంట్లో మామూలే. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాము. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి మీటింగ్‌లు ఏర్పాటు చేసేది. తాను ఏదో ప్రదర్శన ఇస్తానని మిగతా ముగ్గురినీ పిలిచి కాలక్షేపం చేసేది. తాను వట్టొట్టి వంట చేసి చూపించడం నాకింకా గుర్తు. మా పాత ఇంట్లో అంటే అపార్ట్‌మెంట్స్‌లో యాభై కుటుంబాలు ఉంటాయి. అక్కడ అసోసియేషన్ మీటింగ్ జరిగేది. ఎందుకో తెలియదుగాని ఎప్పుడూ కొట్లాటలు జరిగేవి. మా పిల్లలు ఇద్దరూ కలిసి మీటింగ్ అనే మాటకు గోల అనే కొత్త అర్థాన్ని జోడించారు! అలవాటుకొద్దీ నేను, మా ఆవిడ గొడవపడుతుంటే, పిల్లలు వచ్చి ‘నో మీటింగ్’ అని అరిచేవారు! మేము మాట్లాడకుండా ఉండిపోయేవాళ్లం. ఇక మళ్లీ సైలెన్స్ పుస్తకంలోకి వస్తే, ముందుగా రచయిత పేరు చెప్పుకోవాలి. అతనో, ఆవిడో తెలియదు. చైనా, కొరియా ఎక్కడి మనిషో తెలియదు. కాస్త ధైర్యంచేసి పలికితే ఆ పేరును తిచ్ నాత్ హాన్ అనవచ్చునేమో! ఎలా పలకాలో తెలియదు. ఇదొక గోల. నిశ్శబ్దమయిన గోల. కానీ, పుస్తకంలో వున్న సంగతులు మాత్రం మనసుకు ప్రశాంతత కలిగిస్తాయి.
మన తలలో ఆగని ఆలోచన అనే అవకాశవాణి పద్ధతి రేడియో ఒకటి ఉందని ఆ పుస్తకం మొదటి పేజీలోనే ఉంది. మెదడులో నిండా గోల ఉంది. అందుకే బ్రతుకు మనల్ను ప్రేమగా పిలిచే పిలుపు కూడా వినిపించదు అంటారు రచయిత. మన మనసు మనల్ని పిలుస్తున్నదట. మనం మాత్రం పట్టించుకోవటం లేదట. మనసు మాటలు వినే వ్యవధి మనకు లేదట. ఎంత బాగుంది మాట!
మరింత ముందుకు మాట్లాడుకునేలోగా, మరో రేడియో గురించి చెప్పుకోవాలి. మా ఇంటికి బంధువులు వస్తారు. వాళ్లలో ఒకరిద్దరికి ‘రేడియో’ అని నేను మనసులోనే పేరు పెట్టుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దమే. వచ్చినవాళ్లు కూడా అర్థం చేసుకుంటే మాతోపాటు నిశ్శబ్దంగా ఉంటారు. ఒకరిద్దరు మాత్రం ఆ పద్ధతిని కాదంటారు. కొంత ధైర్యం చేసి మాటలు మొదలుపెడతారు. నేను కూడా మాట్లాడడం మొదలుపెడితే, ఆపడం గుర్తురాదు. నా సంగతి వేరు. ఎదుటి వారి సంగతి వేరు. వచ్చిన ఒక చుట్టం రేడియోలాగ అనవరతంగా, నిరవధికంగా కాదంటే ఆగకుండా మాట్లాడుతూ ఉంటే, నేను ‘రేడియో’ అనుకున్నాను. తిచ్ నాత్ హాన్ చెప్పిన రేడియోకన్నా, ఈ రేడియో కొంచెం కష్టం కలిగించే పద్ధతి.
మెదడులోని రేడియోను కట్టేయడం నేర్చుకోవాలి. మామూలు రేడియో ఎవరూ వినడం లేదు. వినే వాళ్లకు క్షమాపణలు. నేనయితే వినడం లేదు. దాన్ని కట్టేయడానికి వీలుంటుంది. ఎన్ని స్టేషన్లు మార్చినా, చప్పుడేగాని, నిశ్శబ్దం రేడియోలో ఉండదు. ఉండకూడదు కూడా! రేడియోలో కొన్ని క్షణాలకన్నా ఎక్కువ నిశ్శబ్దం వినిపిస్తే, అది లోపం కింద లెక్క. అంత వ్యవస్థ ఏదో రకంగా శబ్దాలను వినిపించడానికే కదా! వెనకట ఏ బిబిసిలోనో, ఒక హాస్య కార్యక్రమంలో జోక్ ఒకటి వాడుకున్నారన్న సంగతి గుర్తుకు వస్తుంది. కార్యక్రమంలో భాగంగా ఒక వ్యక్తి వచ్చి ‘ఇప్పుడిక ఒక వ్యాపార ప్రకటన’ అంటారు. ఆ తరువాత ఒక గంటలాంటిదేదో వినిపిస్తుంది. అన్ని ప్రకటనలకు ముందు వినిపించే పద్ధతి గంట అది. ఆ తరువాత కొంచెంసేపు నిశ్శబ్దం. అనుమానం వచ్చిన వాళ్లు రేడియోను కదిలించి, కాదంటే ప్రేమగా ఒక దెబ్బ వేసి, అయినా పలకకపోతే అప్పుడు అనుమానంలో పడతారు. అప్పుడు ఇందాకటి గొంతు మళ్లీ వస్తుంది. ‘అది నిశ్శబ్దం కాదండీ! మా నిశ్శబ్దం టైప్‌రైటర్ డిమాన్‌స్ట్రేషన్! కనుక మా ఫలానా బ్రాండ్ నిశ్శబ్దం టైప్‌రైటర్లనే వాడండి!’ అంటుంది ఆ తరువాత మళ్లీ టింగ్‌టాంగ్ గంట వినిపిస్తుంది. అదీ సంగతి.
ఆయనెవరో పెద్ద మనిషి నిశ్శబ్దం చాలా మంచిది అని గంటల కొద్దీ ఉపన్యాసాలు చెప్పేవాడట.
నిశ్శబ్దం గురించి మంచి పుస్తకం ఒకటి నిశ్శబ్దంగా రాయాలని, చదువుకునేవాళ్లు నిశ్శబ్దంగా చదువుకోవాలని ఆ తరువాత అందరూ చాతనయినంత నిశ్శబ్దంగా ఉండాలని, నాకు నిశ్శబ్దంగా ఆలోచనలు వస్తున్నాయి.
నాకు చెవుడు అని చెప్పాను కదా. ఒక చెవి పూర్తిగా వినిపించదు. పనిచేసే రెండవ చెవిని దిండుకు అదిమి పడుకుంటాను. ఇక నాకు ప్రశాంతత పండుగగా మొదలవుతుంది. పండుకునేందుకు మరింత వీలు మొదలవుతుంది. నిశ్శబ్దం చాలా బాగుంటుంది. అనుభవిస్తే అర్థమవుతుంది. మెదడు నిశ్శబ్దం, బయటి నిశ్శబ్దం రెండూ వీలయితే అది మరీ బాగుంటుంది. కానీ, ఈ పరిస్థితి అంత సులభంగా వీలుకాదు!

కె.బి. గోపాలం