S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుణపాఠం

కళింగపురాన్ని ఆనుకుని ఓ దట్టమైన అడవి ఉంది. అందులో అనేక జంతువులతోపాటు ఒక నక్క జీవిస్తూండేది.
ఉదయం లేచింది మొదలు అడవంతా తిరుగుతూ జంతువులను తన అబద్ధపు మాటలతో బురిడీ కొట్టించి మోసం చేస్తూ చివరకు చంపి తినడం తన నైజంగా పెట్టుకుంది నక్క.
ఎందుకో ఈ మధ్య నక్కలో మునుపటి ఉత్సాహం కన్పించక వౌనంగా ఉండసాగింది. నక్కలోని ఈ మార్పును గమనించి మిత్రుడైన తోడేలు అడిగింది - ఎందుకిలా ఉన్నావని.
‘ప్చ్.. జీవితం రొటీనై చప్పగా ఉంటోంది. ఎంతకాలమని ఈ అడవిలోని జంతువుల్నే చంపి తినాలి? వీటి మాంసం తినీతినీ వెగటుగా అన్పిస్తోంది. అందుకే ఇంకో చోటికి వెళ్లి హాయిగా బ్రతకాలనుంది’ అంది దిగులుగా ముఖం పెట్టి -నక్క.
‘అదేంటి మిత్రమా! అలా మాట్లాడుతున్నావ్’ అంది తోడేలు.
‘తిరిగిన చోటే ఎన్నిసార్లని తిరగగలం. తిన్న జంతువులనే ఇంకెన్ని దఫాలుగా తినగలం. అందుకే నేను రేపే జన సంచారమున్న పక్క గ్రామానికి వెళుతున్నా’ తెగేసి చెప్పింది నక్క.
తెలతెలవారుతూండగా నక్క భయంభయంగా కళింగ పురాన్ని చేరుకుంది. ఎక్కడ చూసినా రకరకాల పండ్ల తోటలు, పచ్చటి గడ్డి మైదానాలు, గుంపులు గుంపులుగా పొట్టేళ్లు, మేకలు, గొర్రెల మందలు బాగా బలిసి కండబట్టి వందల సంఖ్యలో ఆ గడ్డి మైదానాల్లో మేస్తూ కనిపించాయి.
నక్క నక్కినక్కి ఇంకొంచెం ముందుకు వెళ్లింది.
దిబ్బలపై కోళ్లు, కోడిపిల్లలు గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపించాయి. తనక్కావల్సిన ఆహారం పుష్కలంగా లభించటంతో సంతృప్తి చెందిన నక్క - ఆ రాత్రి పొలాల్లోని గొర్రెల మందపై పడి ఒక గొర్రె చంపి తృప్తిగా తింది. ఆ విషయాన్ని తోడేలును కల్సి చెప్పింది.
దీంతో - నక్క, తోడేలు జన సంచారం ఉన్న గ్రామానికి వచ్చేసాయి.
పగలంతా ఏ చీకటి ప్రాంతంలోనో దాక్కుని.. రాత్రి కావటంతోనే గొర్రెల మందపైనో, లేదా కోళ్ల గుంపులోనో దూరి.. వాటిని చంపి తినటం మొదలుపెట్టాయి.
ఏవో జంతువులు తమ గొర్రెలను, కోళ్లను చంపి తింటున్నాయని పసిగట్టిన గ్రామస్థులు ఒకరోజు వలపన్ని కాచుక్కూర్చున్నారు. ఆ సంగతి తెలీని నక్క, తోడేలు యధాప్రకారం రాత్రిళ్లు గొర్రెల మంద మీద పడ్డాయి.
సమయం కోసం వేచి చూసిన గ్రామస్థులు నక్కని, తోడేలుని బంధించి చెట్టుకి కట్టేసి చావచితక్కొట్టారు. ఆ ఊరి ఆచారం ప్రకారం ఇనుప చువ్వ ఎర్రగా కాల్చి వాతలు పెట్టి వదిలేశారు.
చావుతప్పి కన్నులొట్టపోయి వొళ్లంతా వాతలు తేలిన నక్క, తోడేలు బుద్ధి తెచ్చుకొని మళ్లీ గ్రామం జోలికి వెళ్లలేదు.

*************************************************

ప్రపంచ శాస్తవ్రేత్తలు

పైథాగరస్
పైథాగరస్ క్రీ.పూ.582లో గ్రీస్‌కు చెందిన ‘సామోస్’ అనే ద్వీపంలో జన్మించాడు. బాల్యం నుంచీ కూడా నీతి నియమాలు, విజ్ఞానశాస్త్ర అభిలాష ఎక్కువగా ఉన్నవాడు. పైథాగరస్ మొదట తత్వవేత్తగా ఉంటూ తర్వాత గణిత శాస్తవ్రేత్తగా రాణించాడు. రేఖా గణితంలో త్రిభుజాలకు సంబంధించిన అధ్యయనంలో ఆయనచే రూపొందించబడిన ‘పైథాగరస్ సిద్ధాంతం’ ఒక ప్రాథమిక ఆధారంగా ఇప్పటికీ గణితశాస్త్రంలో నిలిచి ఉంది. ఆయన తత్వభావనలు ‘పైథాగరస్ భావనలు’గా పేరుగాంచాయి.
పైథాగరస్ లోహపు తీగెలను పొడవుగా లాగి తిన్నగా చేసినపుడు, తీగెలు శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయన్న సిద్ధాంతానికి శ్రీకారం చుట్టాడు. రెండు క్లాంపుల మధ్య బిగుతుగా అమర్చిన తీగె, సాగివున్న స్థితిలో లేదా బిగుతుగా వున్న స్థితిలో ఉత్పత్తిచేసే సంగీతపరమైన శబ్దాలు భిన్నంగా ఉంటాయని చేసి చూపాడు.
ధ్వనికి సంబంధించిన ఈ ప్రయోగం ఆధారంగా ఒక తంత్ర సంగీత ప్రమాణం రూపొందించబడటం విశేషం. అణు సిద్ధాంతాన్ని ఆమోదించిన వారిలో ముఖ్యుడు. అనేక పరిశోధనలను సిద్ధాంతీకరిస్తూ తన యాభయ్యోపడిలో ఇటలీ సమీపంలోని క్రొటోనాలో స్థిరపడ్డాడు. ఆ కాలంలో ఎన్నో వ్యతిరేకతలను, విమర్శలను ఎదుర్కొన్నాడు.
రేఖాగణితం, గణితశాస్త్రం, ఖగోళ శాస్త్రాలకు సంబంధించిన ఆయన సిద్ధాంతాలకు విశేషమైన గుర్తింపు ఉంది. ఆ తర్వాతి శాస్తవ్రేత్త అయిన కోపర్నికస్ ఖగోళ శాస్త్రంలో పైథాగరస్ తనకు మార్గదర్శకుడని కొనియాడాడు. జీవించిన కాలంలో హేళనలను, విమర్శలను ఎదుర్కొన్న పైథాగరస్ మరణానంతరం ప్రపంచంలోనే గొప్ప ఖగోళ గణిత శాస్తవ్రేత్తగా కొనియాడబడు తున్నాడు. ఇంతటి మహా మేధావి క్రీ.పూ.507వ సం.లో మరణించాడు.

******************************************************

దూరం

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

‘వావ్! ఆకాశంలోని నక్షత్రాలని చూడు నాన్నా. ఇన్ని నక్షత్రాలని నేనెప్పుడూ చూడలేదు’ బీచ్‌లోని ధర్మజ తలెత్తి నల్లటి ఆకాశం నిండా కనపడే నక్షత్రాలని చూస్తూ తండ్రితో చెప్పింది.
‘ఆకాశం చూడటానికి అందంగా ఉంది కదా? సిటీ లైట్స్ బదులు నక్షత్రాలని చూడటానికి ఇది మంచి ప్రదేశం’ తండ్రి చెప్పాడు.
‘అవును. ఆ నక్షత్రం చూడు నాన్నా. అది అన్నిటికన్నా ఎక్కువగా మెరుస్తోంది’
‘దాని పేరు సైరస్. లేదా డార్క్ స్టార్ అని కూడా అంటారు. అది భూమికి బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం. అంతేకాక సూర్యుడి కంటే పెద్దది’
‘ఏమిటి? సూర్యుడి కంటే పెద్దదా?’ ధర్మజ ఆశ్చర్యపోయింది.
‘అవును. నిజానికి అది సూర్యుడికి రెట్టింపు సైజ్‌లో ఉంటుంది. అంతేకాదు. ఆకాశంలో కనిపించే చాలా నక్షత్రాలకన్నా ఇది బాగా చిన్నది. అందులోని ఓ నక్షత్రం సూర్యుడి కంటే రెండు వేల రెట్లు పెద్దది. అంటే ఈ రూపాయి బిళ్ల సూర్యుడైతే ఆ నక్షత్రం ఫుట్‌బాల్ ఫీల్డ్ అంత పెద్దది’ రూపాయి బిళ్లని చూపించి తండ్రి చెప్పాడు.
‘ఏదీ ఆ నక్షత్రం? కనపడటం లేదే?’
‘ఇక్కడి నించి కళ్లతో చూడలేం. బైనాక్యులర్స్‌తో కానీ, టెలిస్కోప్ కానీ కావాలి’
‘కానీ దాన్నికన్నా సైరస్ బాగా చిన్నదన్నావు. అది కనిపిస్తోందిగా? సూర్యుడు ఆ నక్షత్రాలకన్నా చిన్నవాడన్నావు. మనం సూర్యుడ్ని చూడలేనంత కాంతివంతంగా ఉంటాడు. ఎందుకిలా?’
‘కారణం నక్షత్రాల పరిమాణం కాదు ముఖ్యం. అవి భూమికి అది ఎంత దూరంలో ఉన్నాయి అన్నది ముఖ్యం. ఆ మూడూ ఒకే దూరంలో పక్కపక్కన ఉంటే, ఏది పెద్దదో నీకు తెలిసేది’ తండ్రి వివరించాడు.
‘ఓ!’
కొద్ది క్షణాలు ఆగి తండ్రి మళ్లీ చెప్పాడు.
‘పరమాత్మ విషయంలో కూడా ఇదే నిజం. భూమి మీద జీవించే మనకి కీర్తి, ధనం, సుఖం, పదవి లాంటివి పెద్దవిగా, ముఖ్యమైనవిగా తోచడంతో పరమాత్మ దూరంగా ఉండి చిన్నగా తోస్తాడు. కానీ, మనం పరమాత్మని ముఖ్యమైన వాడిగా భావించి ఆయనకి దగ్గరయ్యే కొద్దీ ఆయన కాంతి మిరుమిట్లు గొలిపి, మిగిలినవన్నీ డిమ్‌గా మారతాయి. ఓ నక్షత్రం పరిమాణం, వెలుగు తెలుసుకోవాలంటే దానికి దగ్గర అవడమే ఎలా దారో, అలాగే పరమాత్మకి దగ్గరైతేనే ఆయన శక్తి, కాంతి మనకి అర్థవౌతాయి’ తండ్రి వివరించాడు.

-జడపల్లె మాధవాస్సుధ