S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవనతీరాలు

‘అమ్మా!’ కోటి వీణియలు మీటినట్లు, మరెన్నో కోయిలలు కూసినట్లుందా పిలుపు. ఆమె మనసు పరవశించింది. తల తిప్పి చూసిందామె.
ఎదురుగా ప్రగతి. చేతిలో ఓ పాకెట్.
‘ఏంట్రా కన్నా?’ కన్నుల నిండా ప్రేమ, మదినిండా ఆప్యాయత నింపుకుని అడిగింది భవాని కూతుర్ని.
‘ఈ రోజు నర్సింగ్‌హోం యానివర్సరీ అమ్మా! ప్రారంభించి సంవత్సరం అయిపోయింది కదూ? ఆ శున సందర్భంగా నీకో చీర తెచ్చానమ్మా. ప్లీజ్ కాదనకు!’
‘ఇప్పుడెందుకమ్మా నాకు?’
‘అదేంటమ్మా అలా అంటావ్? ఈ ఉన్నతికి కారణం నువ్వు. ఎంతో ప్రయాసపడి కష్టనష్టాలకోర్చి నన్నీ స్థితికి తీసుకొచ్చావ్ నువ్వు. నీకేం చేసినా తక్కువేనమ్మా! నన్ను దీవించు’ తల్లి కాళ్లకు నమస్కరించింది ప్రగతి.
భవాని కళ్లు మూసుకుంది. ఆమె కళ్ల వెంట ఆనందాశ్రువులు రాలి ప్రగతి శిరస్సుని అభిషేకించాయి. ఆర్తిగా కూతుర్ని అక్కున చేర్చుకుంది భవాని.
తనా రోజు భర్త, ఆడబిడ్డ, అత్తలకు ఎదురుతిరిగి ‘అబార్షన్ చేయించుకోను’ అని నిర్భయంగా చెప్పినప్పుడు, వారి ప్రవర్తన, తానెదుర్కొన్న పరిస్థితులు, అగచాట్లు కళ్ల ముందు కదలాడాయి. ఆనాడు దైవం తనకి అనుకూలంగా ఉండటం వల్ల తానీనాడు ఈ స్థితిలో వుండగలిగింది.
‘ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావ్?’ తల్లి భుజాలు పట్టుకుని ఆమె కళ్లల్లోకి ప్రేమగా చూస్తూ అడిగింది ప్రగతి.
‘ఏం లేదురా తల్లీ! నే కన్న కలలు నీ రూపంలో నిజమై, నా ఎదుట నిలువెత్తు సాక్ష్యంగా నిల్చున్నందుకు ఆనందంతో నా గొంతు మూగవోయిందిరా!’ కూతురు తల నిమురుతూ అంది భవాని.
‘ఇదంతా నీ కృషి, పట్టుదల, ధైర్యం వల్లే కదమ్మా నాకు దక్కాయి. ప్లీజ్! చీర కట్టుకోమ్మా! త్వరగా. అలా బైటకెల్లి తిరిగి, హోటల్లో భోజనం చేసి వద్దాం. ఇంటి దగ్గర పనేం పెట్టుకోకు!’
‘నేనెందుకురా తల్లీ! నువ్వెళ్లిరా!’
‘అదేం కుదర్దు! ఎప్పుడూ అలానే అంటావ్. ఏదో ఆలోచిస్తూ ఇంట్లోనే ఉంటావ్. ఈ రోజు నువ్వు తప్పక రావల్సిందే! లేకపోతే నేనొప్పుకోను’
ఆమె ఏదో అనేలోపున హాల్లో ఫోన్ రింగయ్యింది.
‘హలో! డాక్టర్ ప్రగతి హియర్!’
... ....
‘ఓహో! అలాగా! ఎప్పుడు? సరే నే వస్తున్నా! నువ్వు అన్నీ రెడీ చెయ్’ ఫోన్ డిస్‌కనెక్ట్ అయింది.
‘సారీ అమ్మా! నేనిప్పుడే వస్తా. పని చూసుకుని’ వడివడిగా వెళ్లిపోయింది కంగారుపడుతూ.
చిన్నగా నవ్వుకుంది భవాని. ఆమెకు కూతురు మనస్తత్వం బాగా తెలుసు. వృత్తినే దైవంగా భావించే అంకిత స్వభావం ఆమెది. వృత్తిపట్ల ఆమెకు ఎనలేని గౌరవం.
భవాని ఎప్పుడూ కూతురికి హితబోధ చేసేది. జీవితపు విలువల గురించి బోధించేది. పది పైసలు కింద పడితే చప్పుడయి గోల పెడుతుంది. అదే పది రూపాయల నోటు కింద పడితే చప్పుడు కాదు. విలువ పెరిగే కొద్దీ గోల తగ్గుతుంది. గోపురం ఆకాశం వరకు నిర్మించినా పునాది మటుకు భూమి మీదే ఉంటుంది. అలాగే పర్వతమంత విజయం సాధించిన మనిషికైనా పాదాలు మాత్రం నేల మీదే ఉంటాయి. అప్పుడే మనిషి విజయానికి సార్థకత. ఇలా ఎప్పటికప్పుడు కూతురి వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉండేది. తల్లి స్ఫూర్తిదాయకపు వచనాలే ప్రగతిని ప్రగతి బాటలో నడిపించాయి.
అలా ఆలోచనలు కందిరీగల్లా మెదడుని తొలిచేస్తుంటే అలాగే కూర్చుండిపోయింది భవాని. ఆమె మనసు గతంలోకి జారుకుంది ఆమె ప్రమేయం లేకుండానే.
* * *
రాత్రి పనె్నండు గంటలు కొట్టింది గడియారం. భవానీకి నిద్ర రాలేదు. భర్త హాయిగా ఆదమరచి నిద్రపోతున్నాడు. మెల్లిగా పక్కమీద నుండి లేచి, కిటికీ దగ్గరగా వచ్చి వీధి వైపు చూసింది. కృష్ణపక్షపు చీకటి వీధినంతా పరచుకుని భయంకరంగా ఉంది, ఆమె మనసులాగే! వీధి నిర్మానుష్యంగా ఉంది. దూరంగా కుక్కల ఏడుపు వినిపిస్తోంది. కడుపు తడుముకుంది భవాని. బాధగా మూలిగింది ఆమె మనసు. ఇప్పుడు ఆమెకు మూడో నెల. ఇప్పటకి ఇద్దరాడ పిల్లలకి జన్మనిచ్చింది. ‘మగ నలుసు’ కావాలంటూ అత్త, ఆడబిడ్డల పోరు. వారికి వత్తాసు భర్త. వారందరి బలవంతం వల్ల మళ్లీ గర్భం ధరించే పరిస్థితి వచ్చింది.
‘ఈసారైనా మగపిల్లవాడిని కను. లేకపోతే నీకు, నీ బిడ్డకు భవిష్యత్తు ఉండదు’ అంటూ హుకుం జారీ చేశారు అత్త, ఆడబిడ్డ. వంత పాడేడు భర్త. ఇంట్లో వాళ్ల పోరు వల్ల స్కానింగ్ తీయించాడు భర్త. భవాని గర్భంలో ఊపిరి పోసుకుంటోంది ‘ఆడపిల్ల’.
అంతే! భగ్గుమని మండిపడింది అత్త. ‘్ఛఛీ ముదనష్టపుదానా! ఎందరు ఆడముండల్ని కంటావే? ఈ ఇంటికి శనిలా దాపురించావ్. నీ పీడ వదిల్తే కాని ఈ ఇంటికి పట్టిన శని విరగడ కాదు!’ అంటూ నానా రభస చేశారు. అంతటితో ఆగక,
‘ఒరే చేతకాని సన్నాసీ! నీ పెళ్లాంకి అబార్షన్ చేయించరా! ఏం వింటున్నావా?’ అంటూ రంకెలేసింది అత్త. దానికి గంగిరెద్దులా తలాడించాడు కొడుకు. భవాని ఎదురుతిరిగినా ఎవరూ పట్టించుకోలేదు.
భవాని మనసు ఉసూరుమంది. ఎన్నో కలలతో, అందమైన ఊహలతో, ఈ ప్రపంచాన్నీ, ప్రకృతినీ చూడాలని తన గర్భంలో చీకటి తపస్సు చేస్తున్న తన బిడ్డను, ముక్కలుముక్కలు చేసి చంపడం తను భరించలేదు. కాని తన చేతిలో ఏం వుంది? ‘ఆడపిల్ల’ అని తెలియగానే అదేదో తన అపరాధం అయినట్టు భర్త అసలు మాట్లాడటంలేదు. తల్లి, తోబుట్టువు మాటే అతనికి శిరోధార్యం. రేపు ఉదయం అబార్షన్ కోసం డాక్టర్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. భర్తవైపు చూసింది భవాని. హాయిగా నిద్రపోతున్నాడు. రేపు ఉదయం అతను చేయించబోయే భ్రూణ హత్య గురించి అతనిలో ఏ మాత్రం బాధ కనిపించడంలేదు. నిశ్చింతగా, గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు.
మరోసారి భవాని పొట్ట తడుముకుంది బాధగా.
‘అమ్మా!’ ఉలిక్కిపడి అటు, ఇటు చూసింది.
‘ఎవరు? ఎవరు పిలుస్తున్నారు?’
‘నేనమ్మా! నీ గర్భంలో శిశువుని! అమ్మా! రేపు నన్ను చంపబోతున్నారామ్మా? ఏం అమ్మా! నేనేం పాపం చేశాను?’ వౌనంగా రోదిస్తోంది భవాని.
‘నీ మనసులో రగులుతున్న ఆలోచనలు నాకు తెలుసమ్మా! నేను బ్రతుకుతానమ్మా! ఏం? నన్ను చంపకండమ్మా! ప్లీజ్’
భవాని కళ్లు వర్షిస్తున్నాయి. బాధతో సుళ్లు తిరుగుతోంది మనసు. అపురూపమైన బాధతో మరోసారి పొట్ట తడుముకుంది.
‘వినిపిస్తోంది తల్లీ! కాని నేనేం చెయ్యగలను తల్లీ? ఆడపిల్లగా జన్మించబోవడమే నువ్వు చేసిన నేరం. వీళ్ల నిర్ధారణ అదే తల్లీ! నేనేం చెయ్యగలను చెప్పమ్మా?’
‘ఏడవకమ్మా ప్లీజ్! నీ కన్నీళ్లు నన్ను బ్రతికిస్తాయి. నీ ప్రేమ, ఆప్యాయత నాకు తెలుసునమ్మా. అవన్నీ నేను నీ జీవితాంతం అనుభవించాలమ్మా! ప్లీజ్ ఆ అదృష్టం నాకివ్వవూ?’
రెండు చేతులతో ముఖం కప్పుకుని భోరుమని విలపించింది భవాని. ‘ఇప్పుడేంటి నా కర్తవ్యం? ఈ మానవ మృగాలను ఒప్పించలేను. నా చిట్టితల్లిని చంపుకోలేను. భగవంతుడా ఏది నాకు దారి?’ మాంగల్య బంధాన్ని పేగుబంధం ఎదిరించింది. ఓ నిశ్చయానికొచ్చింది భవాని.
* * *
అదురుతున్న గుండెల్ని అదిమిపట్టి, మనసు దిటవు చేసుకుని, కొండంత ధైర్యం మనసులో నింపుకుని, భగవంతునిపై భారం మోపి, కడుపు తీపి చంపుకోలేక, ఆ కటిక చీకట్లో ప్రయాణమైంది భవాని. గమ్యం లేని, తెలియని ప్రయాణం ఆమెది. అలా ఆ చీకట్లో ఎంతసేపు నడిచిందో ఆమెకే తెలీదు. అలా నడిచి నడిచి ఓ పల్లెను చేరుకుంది. ఇంకా చీకట్లు వీడిపోలేదు. అలసిపోయి ఓ బండ మీద చతికిలపడింది.
అప్పుడే అక్కడికి ఓ హెల్త్ వేన్ వచ్చింది. ఒక్కొక్కరుగా రోగులు అక్కడికి చేరుతున్నారు. అందర్నీ ప్రశ్నించి డాక్టర్ దగ్గరకు పంపుతోంది నర్సు.
బండ మీద నీర్సంగా కూర్చున్న భవాని వద్దకు వచ్చి ‘అమ్మా! నీ ప్రాబ్లం ఏమిటి?’ అనడిగింది. చీకట్లో ఆమెను సరిగ్గా చూడలేదు నర్స్. లేని ఓపిక తెచ్చుకుని నిల్చోడానికి ప్రయత్నించి తూలి పడబోయింది భవాని. భవానిని పట్టుకుని మళ్లీ కూర్చోబెట్టి ఆమె ముఖం వంక చూసింది.
‘ఓ! భవానీ! నువ్వంటే? ఏంటీ అవతారం?’
నర్సు మాటలకి ఆమెకేసి చూసి ‘నువ్వు... నువ్వు బాంధవివి కదూ?’ అంది ఆశ్చర్యంగా.
‘అవునే! నేను బాంధవినే! కాని నువ్వేంటిలా?’ అని చుట్టుపక్కల చూసి ‘నీతో ఎవరూ లేరా?’ అంది.
భవాని క్లుప్తంగా తన కథ చెప్పి, ఏ దారీలేక ఇలా రోడ్డున పడ్డానే!’ అంది కంటనీరు నింపుకుని.
‘ఏ దారీ లేకపోవడమేంటీ? నేను నీకు చూపిస్తాను మంచి దారి, నాతో రా’ అంటూ ఆప్యాయంగా భవాని చెయ్యి పట్టుకుని వ్యాను దగ్గరకు నడిపించింది.
‘చిన్ననాటి స్నేహాన్ని మర్చిపోకుండా నాకు సాయం చేస్తానంటున్నావ్. దేవుడే నీ రూపంలో వచ్చాడే! నీ రుణం ఎలా తీర్చుకోను?’
‘వద్దు.. వద్దు. రుణాలు, పణాలు అంటూ పెద్దపెద్ద డైలాగులు చెప్పకు. ఆపదలో ఆదుకున్నవారే అసలైన స్నేహితులు. ఆ పుణ్యం నాకు దక్కనీ!’
‘అవును! నీ పేరు సార్ధకం, నువ్వెప్పుడూ బాంధవివే!’ భవాని కళ్లలో నీరు మిలమిల మెరిసాయి.
‘మనం చదువుకునే రోజుల్లో నీకు చెప్పేదాన్ని. మన కాళ్ల మీద మనం నిలబడగలిగే అర్హత సంపాదించుకోవాలని. కాని నువ్వు చదువు మధ్యలోనే ఆపి పెళ్లి చేసుకున్నావ్, చూడు. ఇపుడు ఏమయిందో? ఆర్థికంగా ఆడది తన కాళ్ల మీద తాను నిలబడ్డాక పెళ్లి చేసుకుంటే, ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే, దాన్ని ఎదుర్కొనే స్తోమత ఉంటుంది. చదువు మనిషి బతకడానికి ఓ మంచి ఆయుధం!’
‘అవును! నువ్వన్నది నిజం!’
‘సర్లే అయిందేదో అయింది! ఏ అఘాయిత్యం చేసుకోకుండా నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే!’ అని భవానిని అభినందించి, ఆమెకు అండగా నిలచి కొండంత ధైర్యాన్నిచ్చింది బాంధవి.
డాక్టర్‌గారికి భవాని చరిత్ర క్లుప్తంగా చెప్పి, ఆమెకు ఏదైనా సహాయం చేయమని అర్థించింది బాంధవి. హాస్పిటల్ దగ్గర ఖాళీగా ఉన్న ఇంటిని భవాని కోసం కేటాయించారు. డాక్టర్‌గారి అండ దండలతో ఆ ఇంట్లో ఉండి, అక్కడ నర్సుల సహాయ సహకారాలతో సుఖ ప్రసవం జరిగి ఆడపిల్లకు జన్మనిచ్చింది భవాని. పిల్ల రబ్బరుబ్బొలా అందంగా, ఆరోగ్యంగా ఉంది.
డ్యూటీలకు వెళ్లే నర్సులకి వంట చెయ్యడం, వర్కింగ్ ఉమెన్‌కి కేరీజీలు సిద్ధం చెయ్యడం, కర్రీ పాయింట్ సదుపాయం కలిగించడం, అప్పడాలు, వడియాలు, స్నాక్స్ లాంటివి చేసి అమ్మడం, పెళ్లి పేరంటాలకి కేటరింగ్ సర్వీసు.. ఇలా రకరకాల పనుల వల్ల డబ్బు ఆర్జించి పిల్లను పెంచి పెద్ద చేసింది. తీరిక సమయాల్లో చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పేది.
‘పాపని స్కూల్లో వేద్దాం భవాని!’ అంది బాంధవి.
‘ఆ పని నువ్వే చెయ్యి’ అంది భవాని.
‘పాప చాలా తెలివైందీ, చురుకైందీ. దీనికి పేరేం పెడదామే!’ పాపను ముద్దాడుతూ అంది బాంధవి.
‘అదీ నువ్వే సెలెక్ట్ చెయ్యి’
‘ఇది నీలా బాధపడకుండా మంచి బాటలో నడవాలే! దీనికి ‘ప్రగతి’ అని పేరు పెడదాం!’ అంది పాపకి జుబ్బా తొడుగుతూ.
‘్భష్! ఆ పేరే బాగుంది!’
తనకు పెట్టిన పేరు సార్థకం చేస్తూ ప్రగతి ఒక్కో మెట్టు ఎక్కి ప్రగతిపథంలో పయనించి చదువులో చక్కని మార్కులు తెచ్చుకుంటూ, తల్లి కలలని పండించేలా ఉన్నతమైన చదువు చదివి డాక్టర్ పట్టా పుచ్చుకుంది.
‘అమ్మా! నువ్వు కన్నకలలు నిజం అయ్యాయి. నేను డాక్టర్ నయ్యానమ్మా!’ అంటూ తల్లికి నమస్కరించింది ప్రగతి.

‘ఇదంతా బాంధవి చలువ. అది వి.ఆర్. తీసుకుని పిల్లల దగ్గరకి వెళ్లిపోయింది’ మనసులోనే ఆమెకు ధన్యవాదాలు అర్పించుకుని,
‘వెయ్యేళ్లు హాయిగా వర్థిల్లు తల్లీ!’ అంటూ కూతుర్ని దీవించింది.
రోజులు గడుస్తున్నాయి. ప్రగతి మంచి డాక్టర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. చక్కని నర్సింగ్‌హోం నడుపుతోంది. తల్లిని చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటోంది.
* * *
‘అమ్మా! నువ్వింకా అలాగే ఉన్నావా? సారీ అమ్మా! లేటయిపోయిందా?’ కూతురు పలకరింపుతో ఆలోచనల నుండి తేరుకుని ఈ లోకంలోకి వచ్చింది భవాని.
‘లేదు... లేదు!’ అంటూ తేరుకుని,
‘అది సరే కానీ ఎలా ఉందమ్మా ఆ పేషెంట్‌కి?’ అంది.
‘కాస్త ఫరవాలేదమ్మా! హీ ఈజ్ ఆల్‌రైట్; సమయానికి వెళ్లి ఇంజక్షన్ ఇచ్చాను కనుక సరిపోయింది లేకపోతే ప్రమాదం జరిగేదే!’
‘పోనీలే పాపం! అంతా దేవుని దయ!’
‘కానీ అమ్మా! ఓ గమ్మత్తు’ అంది డ్రెస్ మార్చుకుంటూ.
‘ఏంటది?’ అంది ప్రగతివైపు చూస్తూ భవాని.
‘అదీ.. అదేనమ్మా. అతను మైకంలో కూడా నీ పేరు కలవరిస్తున్నాడు’
ఉలిక్కిపడింది భవాని.
‘నా.. నా పేరా? అదెలా?’ కళ్లు వెడల్పు చేసి కనుబొమలు పైకెత్తి చూస్తూ అంది.
ఫకాలున నవ్వింది ప్రగతి.
అర్థం కానట్టు చూసింది భవాని.
‘అవునమ్మా! నీ పేరు అన్నాను కాని ‘నిన్నూ’ అనలేదుగా? నువ్వెందుకలా కంగారు పడతావ్? అదే పేరు గలవాళ్లు మరి ఉండరా. ఏం?’
‘ఎందుకుండరు? ఉంటారు తప్పకుండా’ కాని ఆమెలో ఏదో తెలియరాని సంఘర్షణ. అలజడి. ‘ఎవరతను?’
ప్రగతి కుర్చీలో కూర్చుని వెనక్కి సాగిలపడింది. ఆమె ముఖం బాగా అలసటగా కన్పిస్తోంది.
‘అది సరే కాని, అతని పేరేమిటి తల్లీ?’ ఇంకా అతని గురించే ఆమె ఆలోచిస్తోంది.
‘అతని పేరూ.. ఆఁ.. అతని పరు చాలా మంది పేరమ్మా.. అదే వంశీకృష్ణ!’ కళ్లు విప్పి తల్లికేసి చూస్తూ అందామె.
పిడుగుపడ్డట్టు అదిరిపడిందా మాటకు భవాని.
తల్లి వాలకం చూసి, ‘ఏమయిందమ్మా! అమ్మా! ఏమయింది?’ అంటూ ఆతృతగా తల్లి పక్కన కూర్చుని అడిగింది.
‘అమ్మా ప్రగతీ! అతన్ని నేనోసారి చూడాలిరా!’ ఆమె కళ్లల్లో రకరకాల భావాలు.
ఆ స్థితిలో తల్లిని చూసి షాక్ అయింది ప్రగతి.
‘అమ్మా!’ అంది తల్లిని గట్టిగా పట్టుకుని.
‘అవునమ్మా! ప్లీజ్! అతన్నోసారి చూడాలి!’
ఆమె ముఖంలో ఏదో తెలియని బాధ.
‘అలాగేనమ్మా! తప్పకుండా! పద’
రెండు నిమిషాల్లో ఆయన గదిలో వున్నారిద్దరూ.
‘ఇదిగోనమ్మా! ఇదే అతనుండే రూము’
ఏదో తెలీని భావనతో బెడ్ వద్దకు చేరింది భవాని. ఆమె ప్రక్కనే ప్రగతి.
బెడ్ మీద పడి ఉన్నాడో వ్యక్తి నీరసంగా. మాసిన గడ్డం, లోతుకు పోయిన కళ్లు, ఎండిపోయిన పెదాలు.
అలికిడి విని, తలతిప్పి, కళ్లు తిప్పి చూశాడు. ప్రగతిని చూసి రెండు చేతులు జోడించి ‘నన్ను ప్రాణాపాయం నుండి కాపాడారు. నర్సమ్మ చెప్పింది. మీ రుణం ఎలా తీర్చుకోను డాక్టర్!’ కన్నీళ్లతో అతని కళ్లు మసకబారాయి. కళ్లు తుడుచుకుని చూసేడు. అతని చూపు పక్కనున్న వ్యక్తి మీద పడింది. అంతే! అతని కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. నిర్ఘాంతపోయాడు. అంతలోనే తేరుకుని,
‘్భ... వానీ..’ అని గొణిగేడు.
భవాని అతని వంకే చూస్తోంది. అతన్ని చూసిన ఆమెకు మదిలో ఏ భావనా కలగలేదు. ఒక నిజం కూతురికి చెప్పగలననే ధీమా ఒక్కటే కలిగిందామెలో.
‘అమ్మా! ఈయన నీకు తెలుసా? ఎలా తెలుసు? ఏమవుతారు?’
‘తెలుసు తల్లీ! బాగా తెలుసు. నీకు జన్మనిచ్చిందీ, నా ఖర్మకూ కారకుడితడే! నువ్వు అడిగినప్పుడల్లా మీ నాన్న పై దేశంలో వున్నాడంటూ మభ్యపెట్టేదాన్ని. నిజం చెపితే నువ్వు తట్టుకోలేవని, నిన్ను కడుపులోనే అంతం చెయ్యాలని చూశాడని, మీ నాన్న గురించి చెపితే నువ్వు తల్లడిల్లిపోతావని, నీతో అబద్ధాలు చెప్పి తప్పించుకునేదాన్ని. అలా చెప్పిన ప్రతిసారీ నేనెంత వ్యథ అనుభవించానో నీకు తెలీదమ్మా! నువ్వు అక్రమ సంతానానివి కాదు. ఆదరణ కరవైన సంతానానివి. ఈ నిజం నీకిప్పుడు చెప్పాను. నా మనసు తేలికైంది’
వంశీకృష్ణ కళ్లు వర్షిస్తున్నాయి. అతని మనసు బాధతో సుళ్లు తిరుగుతోంది.
‘నన్ను క్షమించమని అడిగే అర్హతను కూడా పోగొట్టుకున్నాను. ఏ బిడ్డనయితే నీ గర్భంలోనే అంతం చెయ్యాలనుకున్నానో ఆ దేవతే ఈనాడు నాకు ప్రాణభిక్ష పెట్టింది. ‘ఆడపిల్ల’ను వద్దనుకున్న వారికి నా బ్రతుకు ఓ గుణపాఠం భవానీ! నన్ను క్షమించి నా దగ్గరకు రాగలవా భవానీ! నిన్ను అడిగే హక్కూ, అర్హతా పోగొట్టుకున్నా. నిన్ను అర్థిస్తున్నా’
‘మీరు నన్ను హింసించి బాధించినా, మీరు నా గర్భంలో వేసిన ‘బీజం’ నాకు నూరేళ్ల పంట. నేను కన్నది అక్రమ సంతానం కాదని నా కన్న కూతురికి నిజం చెప్పాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని దానికి చూపించాను. నా పవిత్రత నా కన్నబిడ్డ ఎదుట నిరూపించుకున్నాను. ఈ ప్రగతి నీడలో నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది. సెలవ్’ అంటూ తృప్తినిండిన మనసుతో అతని నుండి దూరమైందామె. తల్లి తుది నిర్ణయాన్ని విని విస్తుపోయి ఏం చెప్పలేక నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది డాక్టర్ ప్రగతి.

-శివాని