S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తలపుల పందిరి కింద!

నా రాతకు ఒక పరిమితి ఉంటుంది. అదే నా మూర్ఖత్వము. గడిచిన వారాలలో ఒకసారి చిన్నతనంలో తిన్న పండ్ల గురించి రాసినట్టున్న. వ్యాసము చదివిన ఒక మిత్రుడు ఫోన్ చేసి, మీకు ఫలాన ఫలాన పండ్లు తెలియవా? అని అడిగినడు. ప్రపంచములో ఉండే పండ్లన్ని మా ఊరిలో, ఊళ్లో, ఊళ్లె ఉన్నయి గనుకనా? ఉన్నవన్ని నాకు గుర్తున్నయి గనుకనా? పులిచెరి పండ్లు అని ఉండేటివి. వాటిని గుర్తుతోని పులిచింత పండ్లు అని రాసినట్టున్న. అవి సీమచింతకాయలు అయి ఉండవచ్చు అని మరొకరు గౌరవంగ గుర్తు చేసినరు. అవును సీమచింతనే అయి ఉండాలి. ఉండాలె. మన ఊరిదయితే మామూలు చింతకాదు. మరొక ప్రాంతము నుంచి వచ్చినది సీమచింతకాయ. చిన్నతనంలో ఊళ్లోకి ఎవరో తెల్లని చుక్కలు ఉండే కోడి వంటి ఎగరలేని పక్షిజాతిని తెచ్చినరు. వాటిని సీమకోళ్లు అన్నరు. కొంతమంది తమ కవిత్వాన్ని జమచేసి, జతచేసి, జోడించి చీమకోళ్లు అన్నరు! మన టపాకాయలు కొన్నయితే సీమటపాకాయలు మరిన్ని!
బంగాళాదుంప అంటే ఆలుగడ్డ. అంటే పొటాటో! సమోసాలో ఆలూ ఉన్నంతవరకు, బీహార్‌లో లాలూ రాజ్యం ఉండును అన్నారు అక్కడి వాళ్లు అప్పట్లో. ఆలూ ఉంది. లాలూ రాజ్యం లేదు. బంగాళా అంటే బెంగాల్ కదా! అది మనకు కలకత్తా ప్రాంతం నుంచి వచ్చి అందిందా? బ్రిటిష్ పరిపాలన, బెంగాల్‌ను రాజధానిగా సాగింది. వయా అంటే బెంగాల్ మీదుగా వచ్చింది గనుక అది బంగాళాదుంప అయ్యిందా? అదేమో గానీ మనకు వంకాయ, అని ఒక కాయ బాగా తెలుసు. మిత్రుడొకడతను మరీ ఆదిలాబాద్‌లో కూరగాయలు అమ్మేటి అక్కన ‘వంగపండు ఎలాగిచ్చావ్?’ అని అడిగాడు. ఆమె ప్రశ్నార్థకంగా అతని వేపు చూసింది. తరువాత ఏమయిందీ యాది లేదు. మొత్తానికి అది వంగ కాదు కనుక వంకాయ అని నాకు అర్థమయింది. వంగ అంటే బంగ, అంటే బెంగాల్. మన దగ్గర మిరపకాయ బజ్జీలు తిన్నట్టే, కలకత్తాలో ‘బేగూనీ’ అనే వంకాయ బజ్జీలు తినడం నేను కళ్ళారా చూచాను. ఇంతకూ వంకాయలు బెంగాల్ నుంచి వచ్చినవా అని ప్రశ్న!
రవీంద్ర కవీంద్రుడు బంగదేశపు వాడు. మొత్తం దక్షిణ భారతదేశాన్ని ‘ద్రావిడ’ అని ఒక్క మాటలో చుట్టేశాడు. తరువాత ఉత్కళ, బంగా అన్నాడు. జనగణమనలో అదే గద వరుస! అసలు ఆ జాతీయ గీతం ఎవరిని ఉద్దేశించి పాడింది? అని పెద్ద సమస్య, చర్చ ఉంది. అందుకు మరొక సందర్భము వెదికెదముగాక! బంగ, బెంగళూరు మధ్యన ఈ రెండక్షరాలు తప్ప మరే రకంగానూ సంబంధం లేదు గదా! ఉంది, నాకు కనిపించింది.
ఎక్కడి నుంచో వచ్చిన దుంపను బంగాళా అన్నట్టే ఎక్కడి నుంచో వచ్చిన మిరపకాయను మనవాళ్లు బెంగుళూరు మిర్చి అంటున్నారు. అట్లాగే ఒకానొక బెంగుళూరు వంగకాయ కూడా ఉంది. ఇంతకూ ఈ రెండు కాయలను బెంగళూరులో ఏమంటారు? మన ఊరి మిర్చి, మన ఊరి వంకాయ అంటారా? నేను నిజంగనే మైసూరులోని హోటేల్లో ‘ఈ ఊరి వారు మైసూర్ బజ్జీని మన ఊరి బజ్జీ అంటారా?’ అని అడిగినట్టున్న! సీరియస్ అడుగుతున్నాను. బెంగళూరు, మైసూర్ పాఠక మిత్రులు ఈ ప్రశ్నలకు జవాబు రాయండి.
నాన్న దగ్గర చక్కని ఆకుపచ్చ రంగు శాలువా ఉండేది. అది బాగా పెద్దదిగా ఉండేది. ఉత్తరీయం జోడించి నాన్న దాన్ని కప్పుకుని పడుకునేవాడు. ఇంతకు దాని పేరు కాశ్మరము. ఉన్ని శాలువలకు కశ్మీర్ ప్రసిద్ధి గద. నాన్న తన దేశ యాత్రలో భాగంగా కాశ్మీర్, లేక కశ్మీర్‌లో ఉండగా దాన్ని కొని కాశ్మీరంగా కప్పుకుని వెంట తెచ్చుకుని ఉంటాడు.
లోకాభిరామం అంటే లోకం గురించిన ముచ్చట్లు అని అర్థం గదా! కాలక్షేపం కొరకు మాత్రమే అనిపించే మాటల్లో, నిజంగా చాలా సమాచారం ఒకచోట చేరుతున్నదని పండిత మిత్రులు అభిప్రాయం వెలిబుచ్చిన నాడు నాకు ఒక్క క్షణం ‘అవునా?’ అని, తదుపరి క్షణం ‘కదూ!’ అని అనిపించింది. అటువంటి మిత్రులు చాలామంది సలహా మేరకు, మూడు సంవత్సరాల వ్యాసాలను రెండు సంపుటాలుగా అచ్చువేయించే ప్రయత్నంలో ఉన్నాను. త్వరలోనే అవి అందరి అందుబాటులోకి రావాలని నా ప్రయాస!
మాటల గురించి మాట సాగుతున్నది గనుక మాటలతోనే ముందుకు సాగితే బాగ!
పాలు అని ఒక మాట ఉంది. దానికి అర్థం అడిగితే ఆవుపాలు, బర్రె పాలు, గాడిద పాలు ఏదో ఒక పాలు. అనగా క్షీరము. ఆ పాలలో మేమును కొంత పాలు పంచుకుందము అంటే పాలు అన్న మాటకు భాగము అని గద! మీరు ఏం చెబుతున్నారో నాకు ఏమీ పాలుపోవడం లేదు అన్నచోట అవే రెండు అక్షరాలకు అర్థం మారిపోయింది. ఫలానా రాజు పాలించెను అంటే అక్కడ అనే మాటలు మరొక సంగతిని చెపుతుంటయి.
పాలుకాచి తోడు పెడతారు. అంటే పాల నుంచి తయారయిన పెరుగు, మజ్జిగలను ఒక నాలుగు చుక్కలు వెచ్చని పాలలో కలుపుతారు. అప్పుడు ఈ పాలు, కొన్ని గంటలలో పెరుగు అవుతయి. ఇక్కడ పాలు తోడుకున్నయి అన్నమాట ఒకటి ఎదురవుతుంది. (నేను అందులోని సైన్సు గురించి గానీ, పెరుగు అనే మాట గురించి గానీ వ్యాఖ్యానం మొదలుపెడితే, తోడు ఏంగాను?) రాస్తున్న సోది చాలక, అందుకు తోడుగా ఇంకా హాస్యం కూడానా అనండి. ఇక్కడ తోడు వేరు. మీకు ఎంతమందికి తెలుసునో నాకు తెలియదు. మా పల్లెల్లో పాలు తోడుపెట్టడానికి మజ్జిగ అడగడానికి వచ్చిన వారు ‘తోడు వొట్టు’ అడుగుతరు. అది తోడుబొట్టు అని అర్థం చేసుకోవాలె. ఏకంగా గ్లాసు పాలు అవసరం లేదు, కొన్ని చుక్కలు చాలు అని అర్థం. చుక్కకు మరొక పేరు బొట్టు. తోడు కొరకు అవసరమయే బొట్టు తోడుబొట్టు. అది మాటల వేగంలో తోడువొట్టు అవుతుంది. మాకు నేతివొట్టు అనగా నేతిబొట్టు అనగా నెయ్యి చుక్క తినడము అలవాటు. ఇది సిసలయిన అబద్ధము. తోడుకు మజ్జిగ నాలుగు చుక్కలు చాలు. కానీ నెయ్యి నాలుగు చుక్కలు వేస్తే, చాలదు. తక్కువ నెయ్యి వేసినందుకు నా మేనల్లుడు మా అమ్మను ‘ఒక తుక్క వేసిందని’ వేలంత ఉండగా దెప్పి పొడిచాడు. మాటకు తోడు మాట. మట్టిని గుంటలో నుంచి తీయడము తోడుడు, తోడడము. దాని నుంచి నీటిని తీయడము నీరు తోడడము, చేదడము! అన్నట్టు కర్నాటక, హిందుస్తానీ సంగీతాలలో తోడి (హనుమత్యోడి’ అని ఒక రాగముంది తెలుసా?) వీడివాళ ప్రాణాలు తోడుతున్నాడయ్యా? అంటే ఏమిటి? నా గురించి వ్యాఖ్యగాక మరేమిటి?
నీరు చేదునట్టి తాడు పేరు చేదుతాడు. చేతాడు, చాంతాడు. ఇక ఆ తాటి చివరన కట్టిన బొక్కెన అను పాత్ర విశేషము నీటిని చేదును గనుక చేద. ఆ బావి పేరు చేదుబావి, చేదబావి, చాదబాయి.
ఒక్కసారి పైనున్న తోడు పారాగ్రాఫును తిరిగి తలుచుకుంటే నాకు చటుక్కున ఒక మాట తోచింది. తోడుకు తల్లిపిల్ల, తల్లివిల్ల అను మజ్జిగ అవసరము. మా చిన్నతనంలో రాత్రి అయిన తరువాత తోడు అడగకూడదని ఒక నమ్మకం ఉండేది. చీకటిలో అనగూడని మాటలు కొన్ని గుర్తున్నాయి. కోతి అనగూడదు. పెరుగుబువ్వ అనవలె. అట్లనే తోడుబొట్టు అనగూడదు. తల్లివిల్ల అనవలె. అంటే తల్లి - పిల్ల అని అర్థం. పాలు తల్లి, పెరుగు పిల్ల, ఈ పిల్ల తోడయితే, తల్లి మళ్లీ పిల్ల అవుతుంది. ఛాదస్తం! అసలు మా తరువాత తరాల వారంత ఇటువంటి సంగతులు, కనీసం మాటలను పట్టించుకోకుండనే హాయిగ, విజయవంతముగ బతుకుతున్నరు. అయినా పెరుగు తింటున్నరు. అంటే తోడు పెడుతున్నరనే గదా అర్థము. పక్కయింటి వాండ్లను అడగవలసిన అవసరం వస్తే నాలుగు డ్రాప్స్, బటర్‌మిల్క్ అడుగుతరు. అంతేగాని, గతాన్ని తవ్వి, తోడి, తోడు అడగవలసిన అవసరం లేదు గదా!
అయితే కడకు, చివరకు, కొనకు, అంతమున, ఆఖిర్ మేఁ నాదొక అనుమానం. వెనకటి వారికి మాటలు కరువయి ఉండెనా? ఎందుకు ఒక్కొక్క మాటకు ఎక్కువ అర్థాలు ఏర్పాటుచేసి అంత గజిబిజి తయారుచేసినరు?

కె. బి. గోపాలం