S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓ భార్య, ఓ భర్త - మరొకరు

ఫిలిప్ తన ప్రియురాలు ఫ్లోరా అపార్ట్‌మెంట్‌లో కూర్చుని ఉన్నాడు. తనకన్నా వయసులో ఇరవై ఏళ్లు చిన్నదైన ఫ్లోరా తనని ప్రేమించడం తన అదృష్టంగా నలభై మూడేళ్ల ఫిలిప్ భావిస్తాడు. తన భార్య తను ఓవర్‌టైం చేస్తున్నాడని భావించిన అనేక సందర్భాల్లో ఫిలిప్ ఫ్లోరాతో కలిసి ఖరీదైన రెస్ట్‌రెంట్లలో భోజనానంతరం డేన్స్ చేస్తూంటాడు.
‘నా వల్ల నీకు ఆనందంగా ఉందా?’ ఫ్లోరా మత్తుగా చూస్తూ అడిగింది.
‘చాలా. ఎందుకు అడిగావు?’
‘నిన్ను ఆనందంగా ఉంచడంలో నాకు ఆనందం ఉంది కాబట్టి’
‘ఇంకేమీ లేదా?’
‘నీతో పెళ్లి తప్ప ఇంకేం కోరగలను?’
‘్ఫ్లరా! నా భార్యలా నువ్వు ఖరీదైన బట్టలు, ఆభరణాలు, వస్తువులు కోరవు. అవి నన్ను ఆనందంగా ఉంచడానికైనా సరే’
‘అవును’
‘ఎందుకలా?’
‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఫిలిప్’
తనకి అవకాశం ఉంటే ఫ్లోరాని పెళ్లి చేసుకోవాలని ఫిలిప్ ఆ క్షణంలోనే సీరియస్‌గా నిర్ణయించుకున్నాడు. కాని తన భార్య తనకి విడాకులు ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా తమ పెళ్లికి మునుపులా తను పేదవాడై పోతాడు. అతను చాలా డిటెక్టివ్ కథలని చదివాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ కథల్లోని పాత్రలు ఎన్నుకున్న మార్గం ఒకటే. కాని భార్య హత్య చేయబడితే పోలీసులు మొదటగా అనుమానించేది భర్తనే అని కూడా ఆ కథల ద్వారా తెలుసుకున్నాడు. ఇప్పుడు పోలీసులకి ఆధునిక పద్ధతుల్లో సాక్ష్యాలు సేకరించడం తేలిక. తను ఫ్లోరాని ఎంత ప్రేమించినా జైల్లో కాని, ఎలక్ట్రిక్ ఛెయిర్‌లో కాని కూర్చోవడం ఫిలిప్‌కి ఇష్టంలేదు.
* * *
కొద్ది రోజుల తర్వాత ఫిలిప్‌కి షుస్టాక్ పరిచయం అయ్యాడు.
ఆ రోజు ఫిలిప్ ఆఫీస్ నించి ఓ బార్‌కి వెళ్లాడు. ఫ్లోరా చెప్పిన టైంకి రాలేదు.
‘నా పేరు షుస్టాక్’ కరచాలనానికి చేతిని చాపుతూ ఆ కొత్త వ్యక్తి చెప్పాడు.
ఫిలిప్ ఆ చేతిని అందుకోలేదు. తనకి డ్రింక్ ఇప్పించమని అడిగే మంచి దుస్తుల్లోని పేదవాడు అనుకున్నాడు.
కొద్ది క్షణాల తర్వాత అతను చెప్పాడు.
‘్ఫ్లరా ఇంకో అరగంటకి కాని రాదు’
ఫిలిప్ ఉలిక్కిపడ్డాడు.
‘్ఫ్లరా ఎవరు?’ అడిగాడు.
బదులుగా అతను వంకరగా నవ్వాడు.
‘మీరు పొరపడ్డారు’
‘కావచ్చు. మీరు ఫిలిప్ కాకపోతే, మీ భార్య హెలెన్ కాకపోతే, మీ ఆవిడ మీకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే, ఒకవేళ ఇచ్చినా అనేక తరాలుగా వచ్చిన ఆమె ఆస్థికి మీరు వారసులు కాకపోతే, సిటీ బేంక్‌లో పనిచేసే ఫ్లోరా మీ ప్రేయసి కాకపోతే నేను పొరబడి ఉండచ్చు’
‘నేను బ్లాక్‌మెయిల్‌కి లొంగను’ ఫిలిప్ కఠినంగా చెప్పాడు.
‘బ్లాక్‌మెయిలా? నాకా ఆలోచనే లేదు. నిజానికి మీకు సహాయం చేయడానికి వచ్చాను’
‘ఐతే ఆ సహాయం చేయండి. ఇక్కడ నించి మాయమై మళ్లీ కనపడకండి. ఫ్లోరా పేరు ఎప్పుడూ నా ముందు ఎత్తకండి’
‘నేను ఫ్లోరా, హెలెన్ పేర్లు వాడాను తప్ప వారితో నాకు పరిచయం లలేదు. మీ భార్యని కలిసే ఆలోచన కూడా లేదు’
వెయిటర్ని పిలిచి అతను తనకి ఓ మాక్‌టైల్‌ని తీసుకురమ్మని కోరాడు.
‘మరి ఆ పేర్లు మీకెలా తెలుసు?’ ఫిలిప్ ఆసక్తిగా అడిగాడు.
‘మీరూ నాకు ఇప్పుడే తెలుసు. నా సహోద్యోగి మిమ్మల్ని దూరం నించి చూపించాడు. మీ భార్యతో మీకు గల సమస్య గురించి కూడా నాకు తెలుసు. మీకు పరిష్కారం చూపించడానికి వచ్చాను’
‘నా భార్య, ఫ్లోరాల సమస్య పరిష్కారాన్ని మీ నించి నేను ఆహ్వానించలేదు’ ఫిలిప్ చెప్పాడు.
‘కాని మీ సమస్య నన్ను ఇక్కడికి ఆహ్వానించింది. మీ కష్టాన్ని తొలగించే ఉపాయం నా దగ్గర ఉంది’ షుస్టాక్ చెప్పాడు.
‘పరిష్కారం లేదు’ ఫిలిప్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత మళ్లీ షుస్టాక్ అడిగాడు.
‘మీరు డిటెక్టివ్ కథలని ఆసక్తిగా చదువుతారు కదా?’
‘మీకెలా తెలుసు?’
‘మిస్ ఫ్లోరా గురించి, హెలెన్ గురించి తెలిసినట్లుగానే, మా సంస్థ రీసెర్చ్ విభాగం సమర్థవంతంగా పని చేస్తుంది.’
‘సంస్థ?’ ఫిలిప్ ప్రశ్నించాడు.
షుస్టాక్ తలాడించి, సిగరెట్ అంటించుకుని మళ్లీ కొనసాగించాడు.
‘మర్డర్ ఇన్ కార్పొరేషన్ గురించి మీరు విన్నారా? మాకో పద్ధతి ఉంది. ఎవరూ కనిపెట్టలేని మనుషుల్ని తొలగించే పద్ధతి అది. కొంత రుసుముకి ఆ పద్ధతి మీకు అందుబాటులోకి వస్తుంది.’
‘మీరు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు’ ఫిలిప్ కోపంగా చెప్పాడు.
‘నిజంగా? అనేకసార్లు దీన్ని గురించి చదివి కూడా? నిజానికి ఇది చాలా పాత ఆలోచన. దీన్ని ఆచరణలో పెట్టడాన్ని బహుశ మీరు నమ్మలేక పోతున్నారు’
‘కాని..’ ఫిలిప్ ఆపేశాడు.
‘నాకు అర్థమైంది మీరు సందేహిస్తున్నారు. నా విజిటింగ్ కార్డ్ మీకు ఇచ్చి వెళ్తాను. వచ్చే మూడు రోజుల్లో ఉదయం తొమ్మిదిన్నర నించి సాయంత్రం ఐదులోగా మీరు నాకు ఈ నంబర్‌కి ఫోన్ చేసి సంప్రదించచ్చు. ఆ తర్వాత ఇక మీకు నేను దొరకను’
‘అంటే..?.. కొంత రుసుముకి... నా భార్యని హత్య చేస్తారా?’
‘నేను చెయ్యను. మా సంస్థలో నేను సేల్స్‌మేన్‌ని మాత్రమే. అందుకు వేరే నిపుణులు ఉన్నారు’
‘కాని మీ సంస్థ సేవని ఉపయోగించుకున్నాక పోలీసులు నన్ను అనుమానిస్తారు’
‘నా పేరు షుస్టోక్ అన్నది ఎంత నిజం కాదో అదీ అంతే నిజం కాదు. మీ భార్య హత్య చేయబడిందని పోలీసులు ఎన్నటికీ తెలుసుకోలేరు. మా నిపుణులు అది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించేలా చేస్తారు’
‘కాని...’
‘మీరు నిర్ణయించుకున్నాక నాకు ఫోన్ చేయండి. అప్పుడు మిగతావి మాట్లాడదాం’
అతను ఇద్దరి డ్రింక్స్‌కి డబ్బు చెల్లించి వెళ్లిపోయాడు. ఫిలిప్ అతని ఖాళీ కుర్చీ వంక ఆలోచనగా చూశాడు.
* * *
ఫిలిప్‌లో ఇప్పుడు కొత్త ఆశ చిగిర్చసాగింది. గంటలు గడిచే కొద్దీ నమ్మశక్యం కాదు అని అనుకున్న దాన్ని క్రమంగా నమ్మసాగాడు. అమెరికాలో చాలామంది కిరాయి హంతకులు ఉన్నారు. కాని ఏకంగా ఓ సంస్థే ఉందని వినడం ఇదే మొదటిసారి.
ఆ రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చినందుకు హెలెన్ అతని మీద విరుచుకుపడింది. ఫ్లోరాకి షుస్టాక్ గురించి చెప్పాలా? వద్దా అని ఆ రాత్రి ఆలోచించాడు. చివరికి చెప్పకపోవడమే మంచిదని అనుకున్నాడు.
మర్నాడు మధ్యాహ్నం మరి కొన్ని ప్రశ్నలకి జవాబులు తెలుసుకుంటే తప్పులేదు అనుకుని లంచ్ అవర్లో షుస్టాక్‌కి ఫోన్ చేశాడు.
‘మీరు సూచించిన పద్ధతి గురించి విశదంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’
‘దాన్ని గురించి ఇంకేం చెప్పను. మిగిలినదంతా రహస్యం. ఇద్దరి భద్రత దృష్ట్యా ఈ విషయం మీద ఇంక మాట్లాడలేను’
‘కాని మీరు సహజ మరణంలా చేయగలరా? ఉదాహరణకి హార్ట్ ఎటాక్’
‘పోస్ట్‌మార్టం రిపోర్ట్ చదివినా మీకు మీ భార్యిది హత్య అని తెలీదు. మేము ప్రయోగించే విషం ఫోరెన్సిక్ నిపుణులకి తెలీని అతి కొత్తది’
‘మీరు క్రితం సారి ఫీజ్ గురించి చెప్పలేదు’
‘పదివేల డాలర్లు’
‘సారీ. నా దగ్గర అంత లేదు’
‘మిస్టర్ ఫిలిప్. మా రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ గురించి చెప్పాను. మీ దగ్గర ఎంతుందో, ఎంత ఇవ్వగలరో తెలిసే ఆ మొత్తం అడిగాను’
‘అంత మొత్తం ఒక్కసారిగా ఇవ్వలేను. సగం ఇప్పుడు. సగం పని జరిగాక’
‘మా పద్ధతి ముప్పాతిక ఇప్పుడు, పాతిక తర్వాత, మీరు గంటలో ఏడున్నర వేలు బేంక్‌లోంచి డ్రా చెయ్యగలరు. డబ్బు ఎప్పుడు ఇస్తారో చెప్తే నేనే వచ్చి తీసుకుంటాను’ షుస్టాక్ చెప్పాడు.
డబ్బు తీసుకుంటూ అతను చెప్పాడు.
‘ఈ రాత్రి ఎనిమిదికి పని జరుగుతుంది. మీరు ఆ సమయంలో ఇంట్లో ఉండద్దు. ఎలిబీ కోసం ఏదైనా పబ్లిక్ ప్లేస్‌లో ఉండటం మంచిది’
‘అలాగే’ ఫిలిప్ సంతోషంగా చెప్పాడు.
* * *
రాత్రి ఆరున్నరకి తన అపార్ట్‌మెంట్‌కి వచ్చిన ఫిలిప్‌ని ఫ్లోరా అడిగింది.
‘ఏమిటి ఇంత ఎక్సైటింగ్‌గా ఉన్నావు?’
‘ఏం లేదు. మామూలుగానే ఉన్నాను. రేపు రాత్రి ఈ టైంకి మళ్లీ వస్తాను. బహుశ రేపు రాత్రి నేను ఇంటికి వెళ్లకపోవచ్చు’
అరగంట ఉండి వెళ్లిపోయాడు.
షుస్టాక్ సూచించినట్లు ఎలిబీ కోసం ఫిలిప్ ఆ రాత్రి ఏడున్నరకి తన ముగ్గురు కొలీగ్స్‌తో కలిసి బార్‌కి వెళ్లాడు. మిత్రులు గమనించకుండా చేతి గడియారం వంక ఎన్నోసార్లు చూసుకున్నాడు. సరిగ్గా ఎనిమిదీ పది అవగానే తన భార్య మరణించి ఉంటుందని భావించాడు. రాత్రి పదిన్నరకి మిత్రుల దగ్గర సెలవు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు.
‘హెలెన్’ పక్కవాళ్లు వినేలా గట్టిగా రెండుసార్లు అరిచాడు.
తర్వాత తలుపు తాళం తీసి కొద్దిగా భయంగా లోపలకి నడిచాడు.
‘హెలెన్’ పిలుస్తూ పడక గదిలోకి వెళ్తూంటే భార్య కంఠం కఠినంగా వినిపించింది.
‘్ఫలిప్! నువ్వేనా?’
ఉలిక్కిపడ్డాడు. పడక గదిలోకి వెళ్లి చూస్తే ఆమె లేప్‌టేప్‌లో పని చేసుకుంటోంది.
‘ఎందుకింత ఆలస్యమైంది?’ కోపంగా అడిగింది.
‘మిత్రులతో పార్టీకి వెళ్లొస్తున్నాను. నా కోసం ఎవరైనా వచ్చారా?’
‘ఊహు. నాకు ఫోన్ చేసి భోజనానికి రానని చెప్పచ్చుగా?’ అరిచింది.
షుస్టాక్‌కి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా అవతలి వైపు ఎవరూ ఎత్తలేదు.
* * *
షుస్టాక్ గ్లాసులోకి షాంపేన్‌ని మళ్లీ వంచుకుని చెప్పాడు.
‘ఈపాటికి ఫిలిప్ ఇంటికి చేరుకుని జరిగింది గ్రహించి ఉంటాడు’
‘ఇప్పుడే కాదు. కొన్ని రోజుల తర్వాత క్రమంగా మన మోసం అర్థం చేసుకుంటాడు’ ఫ్లోరా నవ్వుతూ చెప్పింది.
‘పోలీసులకి నా మీద ఫిర్యాదు చేయాలనుకున్నా ఏమని చేస్తాడు? తన భార్యని చంపడానికి ఒకరు డబ్బు తీసుకుని చంపలేదనా? ఈ నేరంలో మనకి భద్రత ఎక్కువ’
అతను డబ్బుని సమానంగా పంచాడు.
‘్థంక్యూ డియర్’ చెప్పింది.
‘్భర్యని చంపాలని అనుకోవడం చాలా పాత ఆలోచన. అలాంటి మనిషిని గుర్తించి, అతనికి చెందిన సమాచారాన్ని తెలుసుకోడానికి ఆట్టే ఖర్చు కాదు...’
‘మన తర్వాతి క్లైంట్?’ ఫ్లోరా అడిగింది.
‘అక్రమ సంబంధాలు ఏమీ లేని ఓ నలభై ఏడేళ్ల ధనవంతుడ్ని షికాగోలో గుర్తించాను. అతను స్టాక్ బ్రోకర్. వెళ్లి అతనితో పరిచయం చేసుకో. అతను నీలో ప్రేమలోకి దిగాక నాకు ఫోన్ చెయ్యి’ షుస్టాక్ అతని పేరు, ఫోన్ నంబర్, చిరునామా రాసిన కాగితాన్ని ఫ్లోరాకి ఇచ్చి చెప్పాడు.
*
(లారెన్స్ ఎం జానిఫెర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి