S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వసంత మేఘం

ఆనంద నిలయానికి పెయింట్ వేయడం పూర్తి కాగానే ఇంటికి పెళ్లి కళ వచ్చిందని రాగిణి మురిసిపోయింది.
ఆనంద్ రాగిణిల ముద్దుల కూతురు సృజన పెళ్లి. పెళ్లయ్యాక డాక్టర్ సృజన, డాక్టర్ మదన్‌మోహన్‌తో లండన్ వెళ్లిపోతుంది.
బంధుమిత్రులకు ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ఇ-మెయిల్స్ ద్వారా పెళ్లి పిలుపులు వెళ్లిపోయాయి. సంప్రదాయం కోసం కార్డులు పోస్ట్ చేయడమే. సిటీలో ముఖ్యమైన వారిని స్వయంగా వెళ్లి ఆహ్వానించాలనుకున్నారు ఆనంద్, రాగిణి దంపతులు.
పెళ్లి శుభలేఖలు వచ్చేశాయి. ఎవరెవర్ని పర్సనల్‌గా వెళ్లి పిలవాలో లిస్ట్ తయారైంది. సిటీలో అటు ఎల్.బి.నగర్ నుంచి ఇటు బిహెచ్‌ఇఎల్ వరకు, అత్తాపూర్ నుంచి మాదాపూర్ వరకు పిలవాల్సిన ముఖ్యుల కుటుంబాలు వున్నాయి. పెళ్లి పిలుపులకు నాలుగు రోజులైనా కావాలని అనుకున్నారు.
సృజన లిస్ట్ అంతా చూసింది.
‘నాన్నా! ఇందులో తాతయ్య పేరు లేదేంటి?’ అని తండ్రిని ప్రశ్నించింది.
‘లేదా! సరే! ఇప్పుడు యాడ్ చెయ్యి’ అన్నాడు ఆనంద్.
‘నాన్నా! నువ్వు తాతయ్య వాళ్లని పర్సనల్‌గా పిలిచి రావాలి. లేకపోతే నేనూరుకోను’ అన్నది సృజన.
‘పర్సనల్‌గానే కాదు, వెళ్లి కాళ్లు పట్టుకుని బతిమాలినా మీ తాతయ్య రాడు. నీకు అర్థం కాదులే ఆయనగారి పంతాలు, పట్టుదలలు’ అన్నది రాగిణి అసహనం వ్యక్తం చేస్తూ.
‘అమ్మా! ఇక ఆపుతావా! నువ్వెప్పుడూ తాతయ్య వాళ్ల మీదకు వొంటికాలు మీద లేస్తావు. ముందు మీరెళ్లి శుభలేఖ ఇచ్చి పిలిచి రండి’ సీరియస్‌గా అన్నది సృజన.
‘తల్లీ! అలాగే పిలుస్తాం. మీ తాతయ్య కాళ్లు పట్టుకుని రమ్మంటాడు మీ నాన్న. మీ నాయనమ్మ కాళ్లు పట్టుకుని పెళ్లికి తప్పకుండా రావాలని ఏడుస్తాను నేను. సరేనా?’ అన్నది రాగిణి కోపంగా.
‘వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమాలే సీను లేదు మీకు. అట్లా చేసి ఉంటే ఇంతకాలం సిటీలోనే ఉన్న తాతయ్య వాళ్లు దూరంగా ఎందుకు ఉండేవాళ్లు’ అన్నది సృజన.
‘మాటకు మాట తెగులు అని, మీరెందుకు వాదించుకుంటున్నారు? సృజనా! తాతయ్య వాళ్లని పర్సనల్‌గా పిలుస్తాము. వస్తారో రారో వాళ్ల ఇష్టం. ఓకే..’ అన్నాడు ఆనంద్.
సృజన వౌనంగా ఉండిపోయింది.
ఐతే ఆనంద్ తండ్రిని పెళ్లికి పిలవటానికి స్వయంగా వెళ్లలేదు. కొరియర్‌లో కార్డు పంపించి ఊరుకున్నాడు. కనీసం ఫోన్ కూడా చేసి ఆహ్వానించలేదు.
కెప్టెన్ రావుకి కొడుకు ఆనంద్ మీద ఆగ్రహం ఎందుకంటే ఫ్లాష్‌బ్యాక్‌లో కథ ఉంది.
కెప్టెన్ రావు ఉద్యోగ నిర్వహణలో ఎక్కువగా ఉత్తరాదిలో ఉండేవాడు. ఆయన ఇద్దరు కూతుళ్లు, కొడుకుల చదువుల కోసం భార్యని హైదరాబాద్‌లో వుంచాడు. మిలిటరీలో ట్రాన్సఫర్ల బెడద ఉండటం, పిల్లల చదువులు డిస్టర్బ్ అవడం కొలీగ్స్ కుటుంబాలలో చూశాడు. హైదరాబాద్‌లో బావమరిది బిల్డర్‌గా ఉన్నాడు. అతను వేసిన వెంచర్‌లోనే ఒక విల్లా కొని బావమరిదికి దగ్గరగా భార్యాపిల్లల్ని ఉంచాడు. కెప్టెన్ రావు వచ్చి పోతూండేవాడు. ఆనంద్ చదువు విషయంలో ఇంజనీరింగ్‌లో సీటు రావడంలో బావమరిది కృషి ఉంది. తమ కుటుంబానికి అన్ని విధాలా అండదండలు అందించిన బావమరిది అంటే రావుకి పిచ్చి అభిమానం. బావమరిది కూతురు సునీతని కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన భార్య కూడా సంతోషించింది.
ఆనంద్ ఇంజనీర్ అయిన తర్వాత ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాగిణిని ప్రేమించాడు. ఇద్దరూ ఒకే ఆఫీసులో కొలీగ్స్. ఇద్దరి ప్రేమా మూడు పువ్వులు ఆరు కాయలుగా, సినిమాలు, షికార్లతో వర్థిల్లింది. ఐతే పెళ్లి దగ్గరే పేచీ వచ్చింది.
బావమరిది కూతుర్ని కోడలుగా చేసుకోవాలనుకున్న కెప్టెన్ రావుకి షాక్ తగిలింది కొడుకు లవ్ ఎఫైర్ తెలిసి.
ఆనంద్ మీద మండిపడ్డాడు. రాగిణితో పెళ్లికి ససేమిరా అన్నాడు. కెప్టెన్ రావు భార్య, బావమరిది కూడా సమాధానపడ్డారు.
‘పోనీలే బావా! వాడికి ఇష్టం లేనప్పుడు ఎందుకు? పెళ్లి విషయంలో బలవంతపెట్టకూడదు. వాడి ఇష్ట ప్రకారమే కానివ్వు’ అన్నాడు బావమరిది.
భార్య కూడా బతిమాలింది కొడుకు ప్రేమ వివాహానికి ఒప్పుకోమని.
‘నా మాట వినని వాడు నా కొడుకేంటి? వాడికీ నాకూ సంబంధం లేదు. వాడి గుమ్మం తొక్కను. వాడూ ఇంటికి రావొద్దు’ అని భీకర ప్రతిజ్ఞ చేశాడు కెప్టెన్ రావు.
‘వాళ్ల వంశంలోనే ఉన్నాయి ఈ పంతాలు, పట్టింపులు’ అని గొణుక్కుంది రావు భార్య.
అది జరిగి పాతికేళ్లయింది. అప్పట్నుంచి తండ్రీ కొడుకులకు ఎడమొహం, పెడమొహం. ఐతే చిన్నప్పటి నుంచి సృజనకు తాతయ్య, నాయనమ్మలతో అనుబంధం ఏర్పడింది. తను చదువుతున్న స్కూలు తాతయ్య ఇంటికి దగ్గరగా ఉంది. కొడుకు మీద కోపం వున్నా మనవరాలిని ప్రేమగానే చూసేవాడు రావు. డ్రెస్సులు కొనిపెట్టేవాడు, నగలు చేయించేవాడు. మేనత్తలు కూడా సృజనను ఆప్యాయంగా చూసేవారు. తండ్రితో విభేదాలు వున్నా అక్క, చెల్లెలు కుటుంబాలతో బాగానే ఉన్నాడు ఆనంద్.
జీన్స్ అంటారుగా? తండ్రి పంతాలు, పట్టింపుల వారసత్వం కొడుక్కీ వచ్చింది. ‘తనను గుమ్మం తొక్కొద్దు’ అన్న తండ్రి ఇంటికి వెళ్లడు ఆనంద్. సృజన చెప్పినా స్వయంగా తండ్రిని పెళ్లికి పిలవలేదు. పెళ్లి శుభలేఖ కొరియర్‌లో పంపించి ఊరుకొన్నాడు.
* * *
ఆ రోజు రాత్రి తొమ్మిదింటికి డాక్టర్ సృజన, డాక్టర్ మదన్‌మోహన్‌ల పెళ్లి. వేదిక మల్లికార్జున, భ్రమరాంబ కళ్యాణ మండపంలో. ఆనంద నిలయం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. ఆనంద్ అక్కచెల్లెళ్ల కుటుంబాలు, రాగిణి పుట్టింటి బంధువులంతా ఇంటికి వచ్చారు.
మెహిందీ అనీ, సంగీత్ అనీ కార్యక్రమాలు సందడిగా జరిగాయి. సాయంకాలం ఐదవుతూ వుండగా తన క్లోజ్‌ఫ్రెండ్ సాహితి కారులో బయల్దేరింది సృజన.
‘అమ్మా! బ్యూటీషియన్ రోజీ దగ్గరికి వెళ్తున్నా. బ్రైడల్ మేకప్‌కి గంటపైన టైమ్ పడుతుందని చెప్పింది. కొంచెం లేటయినా వర్రీపడకు’ అన్నది సృజన.
‘ఆరున్నరకంతా వచ్చేయ్. మనం కనీసం ఏడింటికంతా ఫంక్షన్ హాలుకి వెళ్లిపోవాలి’ అని హెచ్చరించింది రాగిణి.
‘అమ్మాయి ఎక్కడికి వెళ్తోంది?’ అడిగాడు ఆనంద్ సృజన కారులో వెళ్లడం చూసి.
‘బ్రైడల్ మేకప్ కోసం బేగంపేట వెళ్తోంది’ చెప్పింది రాగిణి.
‘ఇప్పుడు ఎందుకు అంత దూరం వెళ్లడం? మేకప్ చేసే వాళ్లనే ఇంటికి రమ్మంటే సరిపోయేదిగా? అసలే ఆ రూట్‌లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. పీక్ అవర్స్ కూడా!’ అని చిరాకుపడ్డాడు ఆనంద్.
‘అలా కుదరదట. అక్కడ చాలా ఎక్విప్‌మెంట్ ఉంటుందట. పార్లల్‌లోనే గంటన్నర పడుతుందట బ్రైడల్ మేకప్‌కి’
‘సరే...సరే’ అన్నాడు ఆనంద్.
రాత్రి ఏడింటికి కూడా సృజన ఇంటికి రాలేదు. కాల్ చేస్తుంటే సెల్‌ఫోన్ స్విచ్చ్ఫా అని వస్తోంది. రాగిణికి కంగారు మొదలైంది. ఆనంద్ చిందులు తొక్కుతున్నాడు. గంటల్లో పెళ్లి పెట్టుకుని కూతుర్ని బైటకు ఎందుకు పంపావని. కారు డ్రైవ్ చేస్తున్న సాహితి సెల్ నెంబర్ ఎవరికీ తెలియదు. ఇంట్లో వున్న బంధువులు పెళ్లికూతురు ఎక్కడ? అని అడుగుతున్నారు. మేకప్ కోసం వెళ్లిందని చెప్పలేక చస్తోంది రాగిణి. ఆమెకు చాలా అసహనంగా ఉంది. కూతురు మీద కోపం ముంచుకువస్తోంది.
‘ఎక్కడ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుందో? ఆ బ్యూటీపార్లర్ ఫోన్ నెంబరయినా ఉందా?’ అన్నాడు ఆనంద్.
బ్యూటీపార్లల్ ఫోన్ నెంబర్ వెతికి కాల్‌చేసి సృజన గురించి అడిగింది రాగిణి. ఆరున్నరకే వెళ్లిపోయిందని వాళ్లు సమాధానం చెప్పడంతో పెద్ద షాక్ తిన్నది. గజిబిజి ఆలోచనలు వస్తున్నాయి. బి.పి. రెయిజవుతున్నట్టుగా ఉంది. భయంతో శరీరం వణుకుతోంది.
‘ముహూర్తం సమయానికి కళ్యాణ మండపానికి చేరకపోతే ఎట్లా?’ అనుకుంటే గుండె దడ హెచ్చింది.
ఆనంద్ ఇంట్లో వున్న బంధువుల్ని కళ్యాణ మండపానికి వెళ్లిపొమ్మని చెప్తున్నాడు.
తల్లీ తండ్రీ ఇక్కడ కంగారు పడుతూ ఉంటే అక్కడ సృజన తాతగారింటికి వెళ్లింది.
పెళ్లికూతురి వేషంలో ఇంటికి వచ్చిన సృజనను చూసి కెప్టెన్ రావు దంపతులు ఆశ్చర్యపోయారు. కలా? నిజమా? అనుకున్నారు. కళ్యాణ మండపంలో వుండాల్సిన మనవరాలు తమ ఇంటికి రావడం ఏంటి? అనుకుని అయోమయంగా చూస్తున్నారు.
సృజన చిరునవ్వుతో లోపలకి వచ్చి తాతకి, నాయనమ్మకి పాదాభివందనం చేసింది. తాపీగా ఇద్దరి మధ్యన కూర్చుంది.
‘సృజనా? వాటీజ్ దిస్? అక్కడ పెళ్లి పెట్టుకుని ఇక్కడికి రావడం ఏంటి?’ అని కెప్టెన్ రావు మనవరాలిని మందలించాడు.
‘అమ్మాయ్! అక్కడ మీ అమ్మానాన్న ఎంత కంగారు పడుతున్నారో? అప్పుడే ఏడయింది. తొమ్మిదింటికి ముహూర్తం. వెంటనే బయల్దేరు’ అన్నది నాయనమ్మ.
‘ఉహుఁ. తాతయ్యా! నువ్వు నాతో బయల్దేరి వస్తేనే వెళ్తా! లేకపోతే ఇక్కడే ఉంటా. నువ్వు లేకుండా నేను పెళ్లి చేసుకోను. నాయనమ్మా! వింటున్నావా? మీరు పెళ్లికి వస్తేనే నా పెళ్లి జరిగేది’ డిక్లేర్ చేసింది సృజన.
గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఉక్కిరిబిక్కిరైపోయారు తాత, నాయనమ్మలు. మనవరాలి పెళ్లి ఆగిపోతే నెపం తమ మీదకు వస్తుందని హడలిపోయారు. పంతాలకు, పట్టింపులకు ఇది సమయం కాదని అర్థమైంది. తమని కొడుకుతో కలపడానికి మనవరాలు తిరుగులేని అస్త్రం ప్రయోగించడం వారిని కలవరపెట్టింది.
పావుగంటలో తాత, నాయనమ్మ హడావిడిగా తయారై కారెక్కారు.
సృజన పెదవుల మీద మందహాసం వెల్లివిరిసింది. మొండి శిఖండి తాత మీద విజయం సాధించడంతో ఆమె ముఖంలో ఆనందం తాండవమాడింది.
కారులో తాత, నాయనమ్మల మధ్యన విజయగర్వం ప్రదర్శిస్తూ దర్జాగా కూర్చుంది సృజన.
‘సాహితీ! మమీకి కాల్ చేసి మనం సరాసరి మేరేజ్ హాల్‌కి వచ్చేస్తున్నాం. ట్రాఫిక్ ప్రాబ్లమ్ అని చెప్పు’ అన్నది స్నేహితురాలితో.
* * *
మల్లిఖార్జున భ్రమరాంబ మేరేజ్ హాలు ముందు అసహనంగా పచార్లు చేస్తున్నాడు ఆనంద్. పది మంది మధ్యలో వున్నా రాగిణికి మనస్థిమితం లేదు. పెళ్లికొడుకు ఆల్రెడీ కళ్యాణమండపానికి చేరుకున్నాడు. మామూలుగా అయితే ముందుగా పెళ్లికూతుర్ని తీసుకుని కళ్యాణ మండపానికి వస్తారు. పెళ్లికొడుకుని ఆహ్వానించడానికి ఎదురుచూస్తారు. ఇప్పుడు అంతా తారుమారైంది. అందరూ పెళ్లికూతురు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుతెన్నులు చూస్తున్నారు.
కళ్యాణ మండపం ఆహూతులతో నిండి ఉంది. పురోహితులు పెళ్లికొడుకుని పీటల మీద కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ పెళ్లి తతంగం మొదలుపెట్టారు. మరొకవైపు కొందరు డైనింగ్ హాల్లో విందు భోజనం కానిచ్చేస్తున్నారు.
కారు గేటు ముందు ఆగింది. కెప్టెన్ రావు దంపతులతో పాటు దిగిన పెళ్లికూతుర్ని చూసి అందరూ నోళ్లు తెరిచారు. తండ్రీ కొడుకుల మధ్య సంబంధాలు లేవని తెలిసిన విషయమే. వాళ్లిప్పుడు మనవరాలితో కలిసి రావడమే అందర్నీ ఆశ్చర్యంలో ముంచింది.
ఆనంద్, రాగిణి పెద్ద షాక్ తిన్నట్లయిపోయారు. అప్పటివరకు ప్రసన్నంగా ఉన్న సృజన సీరియస్‌గా మారిపోయింది.
‘నాన్నా! మీకేం చెప్పాను? తాతయ్యను పర్సనల్‌గా కలిసి కార్డు ఇవ్వమని చెప్పానా? మీరు సింపుల్‌గా పోస్టులో పడేస్తారా? కనీసం ఫోన్ అయినా చేసి అడిగారా? కార్డు వచ్చిందా లేదా అని. మరి తాతయ్య ఎట్లా వస్తారని అనుకున్నారు?’ అని సృజన ఎదురుదాడి మొదలుపెట్టింది తండ్రి మీద.
ఆనంద్ తల్లిదండ్రుల ముఖాల్లోకి సూటిగా చూడలేక, కూతురు ఎదురుదాడికి తట్టుకోలేక బిత్తరపోయాడు.
‘సృజనా! ఇప్పుడు గొడవేంటే? అవతల ముహూర్తానికి టైమైపోతోంది. పద... పద..’ అని మేనత్తలు ఇద్దరూ ఆమెను కళ్యాణ మండపంలోకి లాక్కుపోయారు.
ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అడుగులు వేసింది సృజన.
‘వసంత మేఘం వచ్చింది. ఇక ఎప్పుడైనా గాలివాన మొదలుకావొచ్చు’ అనుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు బంధువులు. కెప్టెన్ రావు తేడా వస్తే తుఫానులా చెలరేగిపోతాడని తెలుసు. వసంత మేఘం అంటే కెప్టెన్ రావుగారే. ఆయన పేరు వసంతరావు.

-వాణిశ్రీ