S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘వారసత్వ’ విజయం

గోడల చాటున ఎదిగి ఒదిగినది ఆ నగరం..
అక్కడ సంస్కృతి విరాజిల్లింది..
శ్రామికుల స్వేద బిందువులతో తడిసిన నేల అది..
స్వాతంత్య్రకాంక్షతో ‘దండి’కి దండు కదిలింది అక్కడి నుంచే..
జాతిపిత నడయాడిన నేల అది..
సబర్మతి పరవళ్లు తొక్కిన పుడమి అది..
గోడల నడుమ, ప్రత్యేక శైలిలో నిర్మించిన ఇళ్ల మండువాల నడుమ పరిఢవిల్లిన మతసామరస్యానికి నిలయం అది...
ఆరువందల ఏళ్లుగా తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న ఆ నగరం వారసత్వ ప్రత్యేకతలకు పట్టంకట్టింది ‘యునెస్కో’. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందింది. భారతదేశంలో ఇంతటి ఘనత పొందిన తొలి నగరం అహ్మదాబాద్.
ఢిల్లీ, ముంబై నగరాల నుంచి ఎదురైన పోటీకి ఎదురొడ్డి ప్రపంచ వారసత్వ నగరంగా విజయం సాధించింది. అయితే ఇది ఏ ఒక్కరివల్లో, ప్రచార ఆర్భాటాలతోనే దక్కిన గౌరవం కాదు. ఆ నేలపై వర్ధిల్లి సంస్కృతి సంప్రదాయాలు, అక్కడ పుట్టిపెరిగిన ప్రతి ఒక్కరి ఆరాటపోరాటాల ఫలితంగా ఈ ఘనత సాధ్యమైంది. అదీ ఒక్కరోజులో దక్కినది కాదు. దాదాపు రెండు దశాబ్దాల పోరాటానికి దక్కిన ఫలితం ఇది. భారత ఉపఖండంలో శ్రీలంకలో గాలె, నేపాల్‌లోని భక్తపూర్, ఇప్పుడు మన దేశంలోని అహ్మదాబాద్ ఈ ఘనత సాధించిన నగరాలుగా నిలిచాయి.
ఇదీ చరిత్ర
ప్రస్తుతం దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన స్మార్ట్ సిటీ అహ్మదాబాద్. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఆరవదిగా, వేగంగా అభివృద్ధి సాధిస్తున్న మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఏడవదిగా ఇప్పటికే ఖ్యాతి దక్కించుకున్న అహ్మదాబాద్ 2010 దశకంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మహానగరంగా ఫోర్బ్ జాబితాలో చోటుచేసుకుంది. మరో మాంచెస్టర్‌గా, వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా భాసిల్లిన ఈనగరానికి 606 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం సుమారుగా 65 లక్షల జనాభా ఉన్న అహ్మదాబాద్‌ను గుజరాతీలు ఆప్యాయంగా అమ్డావాద్ అని పిలుచుకుంటారు. పదవ శతాబ్దంలో ఆశవల్‌గా పిలిచిన ఈ నగరానికి సమీపంలో కర్ణావని మరో పట్టణాన్ని నిర్మించారు. ఆ తరువాతి కాలంలో రెండూ కలసిపోయాయి. 15వ శతాబ్దంలో అహ్మద్‌షా హయాంలో ప్రస్తుత అహ్మదాబాద్ నగరాన్ని నిర్మించారు. 500 మీటర్లు, 800

మీటర్లు పొడవు, వెడల్పుల కైవారంలో దీర్ఘచతురస్రాకారంలో భద్ర అనే ప్రాంతంలో ఓ కోటను నిర్మించారు. సబర్మతి నదికి అభిముఖంగా, ధృడమైన గోడలతో నిర్మించారు. పట్టణంలోకి చేరడానికి (కోట) 12 గేట్లు ఏర్పాటు చేశారు. 17, 18 శతాబ్దాల్లో పట్టణం విస్తరించింది. 18వ శతాబ్దంలో కోట దెబ్బతినడం మొదలైంది. బ్రిటిష్ పాలనలో వస్త్ర పరిశ్రమలో పనిచేసేవారు రావడం, మిల్లులు మూతబడ్డాక పాత భవనాల నిర్వహణ పట్టించుకోకపోవడం, ఆక్రమణలు, కోట గోడ అక్కడక్కడ కూలిపోవడం మొదలైంది. 20 శతాబ్దం వచ్చేటప్పటికి ఇది ఎక్కువైంది. మరోవైపు కొత్తనగరం అభివృద్ధి రుచి మరిగింది. ఆధునిక సొబగులు అందివచ్చాయి. శతాబ్దాల సంస్కృతిసంప్రదాయాలకు అద్దంపట్టే పాతనగరానికి ఇది తోడైంది. చాలామంది అహ్మదాబాద్ సంస్కృతికి ఏదో ఒక ఉన్నతమైన గుర్తింపు రావాలని ఉబలాటపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత ప్రధాని అహ్మదాబాద్‌ను ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించేందుకు యునెస్కోకు వినతులు పంపారు. రెండు దశాబ్దాల తరువాత ఆ కల నిజమైంది. అహ్మదాబాద్ సంస్కృతిని అద్దంపట్టేవాటిలో పాతనగరంలో కోట ఒకటైతే, ‘పొల్’ అనే గృహనిర్మాణ వ్యవస్థ మరొకటి.
‘పొల్’ ప్రత్యేకతలు ఇవీ!
అహ్మదాబాద్ పాత నగరంలో ‘పొల్స్’ అనే ప్రాంతాల్లో ప్రజలు మనుగడ సాగించారు. ఇప్పటికీ అవి భద్రంగానే ఉన్నాయి. ఇవి విభిన్నమైన ఆవాసాలు. ఒక కులం, మతం, ఒక కుటుంబానికి చెందినవారు, రక్తసంబంధీకులు మాత్రమే ఒకచోట నివసించే ప్రాంతం ‘పొల్’. నలుచదరంగా ఉండే ప్రాంతంలో ఒక ఇంటిని ఆనుకుని మరొక ఇల్లు ఉండే లా కట్టుకుంటారు. వెనుకగోడ అన్నింటికీ కలిపే ఉంటుంది. అన్ని ఇళ్ల ముందు ద్వారం మీదుగా వీధి ఉంటుంది. వీధికి ఇరువైపులా ఇళ్లుంటాయి. అందరూ కలసి మాట్లాడుకునేందుకు ఆ ఇళ్ల మధ్య వాకిలి ఉంటుంది. ఆ ఇళ్ల సమూహాన్ని ‘పొల్’ అంటారు. ఒకమాదిరి గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. లోపలి వచ్చిపోయేందుకు రెండు గేట్లు ఉంటాయంతే బయటకు వెళ్లేందుకు వచ్చేందుకు మరో మార్గం ఉండదు. సంస్కృతంలో ‘ప్రతోళి’ అన్న పదం నుంచి ‘పొల్’ అన్న పదం గుజరాతీ వాడుకభాషలోకి చేరింది. ప్రతోళి అంటే మూతబడి ఉన్న ప్రదేశానికి ప్రవేశద్వారం అన్న అర్థం వస్తుంది. ఒక పొల్‌లో ఇన్ని ఇళ్లుండాలన్న నియమం ఏమీ లేదు. పదుల సంఖ్యలోను, వందల సంఖ్యలోను, అంతస్తుల్లోను ఇళ్లుంటాయి. అన్నీ ఒకదానితో ఒకటి కలసిపోయి ఉంటాయి. ఇలాంటి ‘పొల్’ (ఇళ్ల సముదాయాలు) దాదాపు 360 ఇప్పటికీ ఉన్నాయి. వీటిని వారసత్వ సంపదగా అక్కడివారు భావిస్తారు. అద్భుతమైన పర్షియన్, హిందు, ముస్లిం, జైన్ సంప్రదాయాలకు అనుగుణంగా శిల్పకళ ఉట్టిపడేలా వీటిని నిర్మించారు. ఎక్కువగా కలపతో నిర్మించిన ఇళ్లే ఉన్నాయి. ఆరువందల ఏళ్లుగా వీటిని రక్షించుకుంటూ వస్తున్నారు. చాలావరకు శిథిలమైపోయినా కొద్దికాలంగా వీటికి మరమ్మతులు చేయడం మొదలెట్టారు. హవేలీ అనే నిర్మాణాలూ ఇక్కడ కనిపిస్తాయి. కాస్తంత సంపన్నులు పర్షియన్, హిందూ శైలిలో దాదాపు కలపతోనే ఈ బహుళ అంతస్తుల చావిడీలతోకూడిన ఇళ్లను కట్టారు. ఇక భద్ర కోట అహ్మదాబాద్ కీర్తికి నిలువెత్తు నిదర్శనం. ఈ కోటలోంచి పాతనగరంలోకి వెళ్లేందుకు మూడు ద్వారాల చౌక్ ఉంటుంది. మనేచౌక్ పునర్నిర్మాణం పూర్తయింది. రేడియల్ పేటర్న్‌తో కూడిన రహదారి సౌకర్యం ఉన్న ‘పుర’ అనేవి కాస్త అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నమాట. ముఖ్యంగా మొఘలులు, మరాఠా రాజుల నుంచి దాడులు, మతకలహాల నుంచి రక్షణ లక్ష్యంగా ఈ గేటెడ్ కమ్యూనిటీ తరహా ‘పొల్’ గృహనిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని అంటారు. పాతనగరం చుట్టూ ఉన్న గోడ (అందుకే సిటీ ఆఫ్ వాల్ అని అహ్మదాబాద్‌ను పిలుస్తారు) ను కట్టారని, సబర్మతి నది వరద నుంచి అది రక్షించేదని అటారు. ఈ హవేలీలు, పొల్స్ నిర్మాణాల్లో ఎటుచూసినా అద్భుతమైన శిల్పసౌందర్యం కళ్లను కట్టిపడేస్తుంది. ఇవన్నీ ప్రాచీన నగర జీవన విధానాన్ని కళ్లముందుంచుతాయి. ఇక కోటలో నాలుగువైపులా ఉన్న బురుజులు రక్షణ కోసమే కాకుండా జీవజాతుల పరిరక్షణకూ ఉపయోగించారు. ఆ బురుజులను ‘చౌబుతురో’ అని పిలుస్తారు. పావురాల వంటి పక్షులకు బురుజు పై భాగంలో ఆహారం, నీళ్లు ఉంచేవారు. ఆ ఆనవాయితీ ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇక కోట నగర చారిత్రక వైభవాన్ని గుర్తుచేస్తుంటుంది.
దండి యాత్రకు నాంది అక్కడే
జాతిపిత గాంధీజీ 1915లో అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు. దాదాపు పదిహేనేళ్లపాటు అక్కడ గడిపారు. ఆయన నడయాడిన ప్రాంతం ఇప్పుడు సబర్మతి ఆశ్రమంగా పేరుపొందింది. మొదట ఓ స్నేహితుడి ఇంటిలోనే ఉండి స్వాతంత్య్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత 1917లో విశాలంగా ఉండే సబర్మతి తీరంలోని ప్రస్తుత ఆశ్రమానికి మారారు. 1919లో నగరంలో మిల్లు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు చేసిన సమ్మె చరిత్రకు ఎక్కింది. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ పిలుపునకు అహ్మదాబాద్ కదిలింది. ఉప్పుపై గుత్త్ధాపత్యం ప్రకటించి పన్ను విధించినందుకు నిరసనగా గాంధీజీ ఇచ్చిన దండి యాత్ర సబర్మతి ఆశ్రమం నుంచే మొదలెట్టారు. మొదట వందమందిలోపు ముఖ్యులు ఆయనతో అడుగులు వేస్తే కొన్ని కిలోమీటర్లు నడిచేసరికి వేలమంది తోడయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన దండియాత్రకు తొలి అడుగు పడినది అహ్మదాబాద్‌లోనే. అప్పటినుంచి సబర్మతి ఆశ్రమం ఓ స్వాతంత్య్ర ఉద్యమానికి కీలకమైంది. ఇప్పుడు గొప్ప పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది. స్వామినారాయణ ఆలయం, జైనుల ఆధ్యాత్మిక ఆలయాలు, ముస్లింల మసీదులు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అందరూ కలసిమెలసి జీవిస్తారు. ఒకరి విశ్వాసాలను ఇతరు గౌరవిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం అక్కడ అడుగడుగునా కనిపిస్తుంది.
చేయిచేయి కలపి
అహ్మదాబాద్ నగరాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించేందుకు ప్రజలు ఓ ఉద్యమానే్న నిర్వహించారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్చంద సంస్థలు, స్థానికులు, ప్రజాప్రతినిధులు రెండు దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాల ఫలితం ఇప్పుడు దక్కింది. శిథిలమైన కోటను పరిరక్షించడం, పునరుద్ధరించడం, పురాతన, విశిష్ట గృహనిర్మాణ శైలికి అద్దంపట్టే ‘పొల్స్’ను కాపాడి మరమ్మతులు చేయడం, ప్రజలను చైతన్య పరచి వారసత్వ సంపదగా గుర్తించడానికి ఏం చేయాలో చెప్పడం వంటి పనులు చేపట్టారు. 1984లోనే అక్కడివారికి ఆ ఆలోచన వచ్చినా 1996లో క్రియాశీలకంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ ఏడాది నవంబర్ 19న ఖడియా (పొల్‌లో సమావేశ ప్రాంతం)వద్ద ‘దేశాయ్ ని పొల్ అనే’ చోట ప్రజలందరినీ చేర్చి అహ్మదాబాద్ ఘనతను వివరించి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందాలంటే అంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. 1997లో గాంధీజీ జయంతి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. 1998లో నేతాజీ జయంతి సందర్భంగా మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో నగర ప్రజల్లో కోరిక రగిలింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎఎంసి), థియేటర్ మీడియా సెంటర్ (టిఎమ్‌సి), అహ్మదాబాద్ కమ్యూనిటీ ఫౌండేషన్ (ఎసిఎఫ్) సారథ్యంలో అప్పటి నుంచి విస్తృ కార్యక్రమాలు మొదలెట్టారు. సబర్మతి ఆశ్రమం నుంచి ప్రఖ్యాత మసీదు వరకు 23 సందర్శనీయ ప్రాంతాలతో ‘హెరిటేజ్ వాక్’ టూర్‌ను మొదలుపెట్టారు. ప్రాచీన కాలంనాటి ఇళ్లకు ఆనాటి వైభవం దెబ్బతినకుండా మరమ్మతులు మొదలెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చించాయి. డచ్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు చేయి కలిపాయి. స్వచ్చంద సంస్థలు తోడయ్యాయి. 2010 నుంచి యునెస్కోకు ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. గతేడాది గుర్తింపు వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం అంత సులువేం కాదు. ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చివరకు ఈ ఏడాది అది సాధ్యమైంది. దేబాషిస్ నాయక్ అనే అధికారి నేతృత్వంలో సుదీర్ఘకాలంగా చేసిన ప్రయత్నం చివరకు ఫలించింది. భరతమాత మోముపై చిరునగవు కనిపించింది.

ఇవీ ‘వారసత్వ’ ప్రాంతాలు
యునెస్కో వారసత్వ ప్రాంతాలుగా గుర్తిస్తే ప్రయోజనం ఏమిటన్నది చాలామందిలో తలెత్తే ప్రశ్న. అలా చేయడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తాయి. దేశవిదేశాల నుంచి పర్యాటకుల రాకపోకలు విస్తృతమవుతాయి. చరిత్ర పదిలంగా కాపాడబడుతుంది. తొలగింపులు, కూల్చివేతలు, ఆక్రమణల బాధ ఉండదు. ప్రపంచంలో ఇప్పటివరకు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రాంతాలు లేదా స్థలాలు వెయ్యికిపైగా ఉన్నాయి. అలాగే వారసత్వ నగరాలు 287 ఉన్నాయి. ఆ నగరాల్లో తాజాగా చేరినది మన అహ్మదాబాద్. పారిస్, బ్రస్సెల్స్, రోబ్, ఎడిన్‌బరో, కైరో, వియన్నా వంటి దేశాల సరసన అహ్మదాబాద్ చేరింది. మన నగరాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు పోలండ్, క్యూబా, దక్షిణ కొరియా, జింబాబ్వే, పెరు, పోర్చుగల్, ట్యునిషియా, లెబనాన్, టర్కీ వంటి 20 దేశాలు మద్దతు ఇచ్చాయి. అన్నట్లు సబర్మతి నదికి అభిముఖంగా అహ్మదాబాద్ ఉందికదా...దీనికి సిస్టర్ సిటీగా గాంధీనగర్ అభివృద్ధి చెందింది...మన హైదరాబాద్, సికింద్రాబాద్‌ల మాదిరిగా!
హైదరాబాద్‌కు ఆ భాగ్యమెప్పుడో!
నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భాగ్యనగరం విశిష్ట సంస్కృతికి చిహ్నం. విభిన్నమతాలు, వర్గాలవారితో, ప్రాచీన కట్టడాలతో, చరిత్రాత్మక సంఘటనలకు నిలయం హైదరాబాద్. ప్రఖ్యాత చార్‌మినార్, గోల్కొండ కోట, దానికి సమీపంలోని కుతుబ్‌షాహి టూంబ్స్, తారామతి బారాదరి, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి గతవైభవ చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా, ఆ ప్రాంతాలను వారసత్వ కట్టడాలుగా గుర్తించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నాయి. కానీ ఆయా కట్టడాల చుట్టూ ఉన్న ఆక్రమణలు అందుకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఆయా ప్రాంతాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు అన్ని అర్హతలు ఉన్నా, వాటి సమీప ప్రాంతాల్లో పచ్చదనం లేకపోవడం, ఆక్రమణలు, ఇతర నిబంధనలను ప్రభుత్వాలు పాటించకపోవడం వల్ల గుర్తింపు సాధ్యం కావడం లేదు. కొన్ని సంవత్సరాలుగా పంపుతున్న ప్రతిపాదనలకు యునెస్కో స్పందిస్తోంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి పరిశీలించి అభ్యంతారలను చెప్పి వెళ్లిపోతున్నారు. వారు చెప్పిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించడంలో జాప్యం, లోపం ఉన్నాయి. అహ్మదాబాద్ తరహాలో అందరూ కలసి పనిచేస్తేనే ప్రయత్నం ఫలిస్తుంది. ఈ ఏడాది కూడా అవకాశం తప్పిపోయింది. వచ్చే ఏడాది అంటే 2018లోనైనా గుర్తింపు రావాలంటే యునెస్కో గతంలో వెల్లడించిన అభ్యంతారలను పరిష్కరించి సరికొత్త ప్రతిపాదనలను వచ్చే ఫిబ్రవరి1వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. కాగా ఎలాగైనా హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ, హైకోర్టు భవనం, కుతుబ్‌షాహి టూంబ్స్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వచ్చే ఏడు గుర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె.టి.ఆర్ ప్రకటించారు. చూడాలి ఈసారి ఏమవుతుందో!

-ఎస్.కె.రామానుజమ్