S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పిలుపు

‘మీకోసం ఓ అమ్మాయి వచ్చింది. పేరు మిస్ ఏన్. మీతో అపాయింట్‌మెంట్ ఉందని చెప్పింది’ జీనోకి అతని అపార్ట్‌మెంట్ వాచ్‌మేన్ ఇంటర్‌కం ఫోన్‌లో చెప్పాడు.
‘అవును. ఆమెని లోపలకి పంపు’ జీనో కోరాడు.
ముప్పై ఐదేళ్ల జీనో ముందు గది తలుపు తెరిచిన నిమిషంలో ఆమె అక్కడికి వచ్చింది. ఆకుపచ్చ రంగు కళ్లు, బంగారు రంగు జుట్టుగల పొడవైన ఆమె వయసు ఇరవై నాలుగని అంచనా వేశాడు. అందంగా ఉన్న ఆమెని లోపలకి ఆహ్వానించాడు.
స్టడీ రూంలో మూడు గోడలకి నిలువెత్తు షెల్ఫ్‌ల నిండా అతీంద్రియ శక్తులకి సంబంధించిన పుస్తకాలు, ఓ మూల స్టాండ్ మీద క్రిస్టల్ బాల్ ఉన్నాయి. ఆమె కూర్చున్నాక అడిగాడు.
‘మీకేం సహాయం చేయగలను?’
‘నా సవతి తండ్రి మా అమ్మని ఆత్మహత్యకి పురికొల్పుతున్నాడు’
‘సారీ. అతీంద్రియ శక్తులకి సంబంధించిన కేసులనే నేను తీసుకుంటాను. నేను ప్రైవేట్ డిటెక్టివ్‌ని కాను. ఇది నాకు సంబంధించింది కాదు’
‘మా అమ్మకి దెయ్యాలు, మీడియమ్స్ మీద నమ్మకం ఉంది. అది నా సవతి తండ్రి వల్లే ఏర్పడింది. ఇటీవల ఆయన ఓ మీడియంని మా ఇంటికి తీసుకువచ్చాడు. మరణించిన నా తండ్రి ఆత్మ ద్వారా మా అమ్మతో మాట్లాడింది. ఆ ఆత్మ పరలోకంలోని తన దగ్గరికి వెంటనే వచ్చేయమని మా అమ్మని కోరింది’
‘ఆ మీడియం ఎవరు?’
‘ఆమె పేరు మేడం టోరా. మీకు తెలుసా?’
‘తెలీదు’
‘మీడియమ్స్ చెప్పేది నిజమే అంటారా?’ ఏన్ ప్రశ్నించింది.
జీనో జాగ్రత్తగా జవాబు చెప్పాడు.
‘ఆత్మ ఉందని, లేదా లేదని ఇంతదాకా నాకు తృప్తికరమైన ఋజువు దొరకలేదు. నేను అనేక మంది మోసగాళ్లైన మీడియమ్స్‌ని చూశాను. అలా అని మీడియమ్స్ అంతా మోసగాళ్లని కూడా నేను చెప్పను’
‘ఈమె మోసగత్తె అని నా అనుమానం. రెండేళ్ల క్రితం మా నాన్న మా ఇంట్లోని టెర్రేస్ మీంచి పడి మరణించాడు. పోలీసులు అది ప్రమాదకర మరణం అని భావించారు. కాని ఆ మీడియం మా నాన్న గొంతుతో, ‘తనని ఎవరో వెనక నించి తోసారని, అది ఎవరి పనో తనకి తెలీదని’ చెప్పింది. మా అమ్మ ఆ పని తనే చేసానని అనుకుంటోంది. కాని మా అమ్మ దోమని కూడా చంపలేదు. ఇంక మా నాన్నని ఎలా తోసి చంపుతుంది? ఎవరైనా తోసి ఉంటే అది నా సవతి తండ్రి పనై ఉంటుంది’
‘ఆయన్ని దేనికి అనుమానిస్తున్నారు?’
‘మా నాన్న మా అమ్మకి చాలా ఆస్తి వదిలి వెళ్లాడు. ఆ సమయంలో డారిన్ - అంటే నా సవతి తండ్రికి - మా అమ్మతో స్నేహం ఉండేది.’
‘పిల్లలు సవతి తండ్రిని ద్వేషించడం సహజం’ జీనో చెప్పాడు.
‘నిజమే. ఆయనంటే నాకు ఇష్టం లేదు. ఆయన డబ్బు కోసమే మా అమ్మని పెళ్లి చేసుకున్నాడని నా నమ్మకం. మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటే ఆ డబ్బంతా ఆయనకి వెళ్తుంది. ఈ ప్రయత్నం చేసే డారిన్ మా అమ్మని కూడా చంపే ఉంటాడు’
‘నేనా విషయంలో నా అభిప్రాయాన్ని చెప్పలేను’
‘దయచేసి మీరీ కేస్‌ని తీసుకుంటారా?’
జీనో కొద్దిక్షణాలు ఆలోచించి అంగీకారంగా తల ఊపాడు. వెంటనే ఆమె మొహంలోకి వెలుగు ప్రవేశించింది. ముందుకి వంగి చెప్పింది.
‘ఈ రాత్రి మా ఇంట్లో సియాన్స్ జరగబోతోంది. మీరు వచ్చి మేడం టోరాని పరిశీలించచ్చు. నేను కాలేజీ నించి వేసవి సెలవులకి ఇంటికి వచ్చాను. మా వాళ్లకి మీరు పేరా సైకాలజీ లెక్చరర్ అని చెప్తాను.’
‘మంచిది,. ఎప్పుడు రావాలి?’
‘సియాన్స్ రాత్రి ఎనిమిదికి మొదలవుతుంది’
చిరునామా ఇచ్చి ఆమె వెళ్లిపోయింది.
* * *
ఏన్ తండ్రిని ఆమె సవతి తండ్రి చంపి ఉంటే అది చాలా తేలిక అని ఆ ఇంటి టెర్రెస్ మీదకి ఎక్కి చూసాక జీనో భావించాడు. హాలీవుడ్ హిల్స్‌లోని ఆ ఇల్లు పురాతన కోటలా ఓ లోయ అంచులో ఉంది. అక్కడ నించి కొన్ని వందల అడుగుల కింద నేల ఉంది.
‘ఆయన ఇక్కడ నించి పడ్డారు. లేదా తోయబడ్డారు’ ఏన్ గొంతు తగ్గించి చెప్పింది.
టెర్రెస్ చదునుగా ఉండి చుట్టూ మూడు అడుగుల పిట్టగోడ ఉంది. కుండీల్లో అనేక రకాల మొక్కలు ఉన్నాయి. మధ్యలో ఓ బల్ల, ఓ గొడుగు, నాలుగు కుర్చీలు ఉన్నాయి. జీనో అరగంట ముందే రావడంతో తల్లిదండ్రులకి పరిచయం చేసాక ఏన్ అతన్ని పైకి తీసుకెళ్లింది.
‘ఇక్కడ నించి కింద పడటం అంత తేలిక కాదు. పిట్టగోడ అడ్డుగా ఉంది’ జీనో చెప్పాడు.
‘మా నాన్న తాగి ఉన్నాడు. ప్రతీ రాత్రి ఆయన ఒంటరిగా ఇక్కడ కూర్చుని తాగినట్లుగానే ఆ రాత్రీ తాగారు. పోస్ట్‌మార్టంలో చాలా ఎక్కువ తాగినట్లుగా తెలిసింది. దాంతో తాగి తూలి పడ్డారని పోలీసులు భావించారు.’
‘నాకు అర్థం కానిది మీ అమ్మ తనే ఆయన్ని తోసి ఉండచ్చని అనుమానిస్తోందని చెప్పారు. ఎందుకని?’
‘ఆమెకి అది రూఢీగా తెలీదు. ఆ రాత్రి ఆమె కూడా తాగింది. వారి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్యా సఖ్యత లేదు. దేని గురించి అన్నది నాకు తెలీదు. బహుశ డారిన్ గురించై ఉండచ్చు. ఐతే ఆ సమయంలో మా అమ్మ తాగి తన గదిలోనే నిద్రిస్తోంది. తాగిన మత్తులో తను పైకెళ్లి మా నాన్నతో ఘర్షణ పడి తోసి ఉండచ్చని, తర్వాత తనా సంగతి మర్చిపోయానని అనుకుంటోంది’
పైకి వచ్చిన డారిన్ చెప్పాడు.
‘సియాన్స్ మొదలవబోతోంది. రండి’
మొదటి అంతస్థులో సియాన్స్ జరిగింది. ఆ గదిలో ఓ గుండ్రటి బల్ల, చుట్టూ ఆరు కుర్చీలు తప్ప ఇంకేం లేవు. రెండు కుర్చీల్లో ఇద్దరు ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. ఏన్ తల్లి హెలెన్ డ్రగ్ కోసం వేచి ఉన్న డ్రగ్ ఎడిక్ట్‌లా జీనోకి తోచింది.
మేడం టోరాని చూసి జీనో ఆశ్చర్యపోయాడు. అతను అంతదాకా కలిసిన చాలామంది మీడియమ్స్ వయసు మళ్లినవారు, అందవికారులు. కాని అందగత్తె అయిన మేడం టోరా వయసు ముప్పై. ఆకుపచ్చ మినీ డ్రస్ ధరించింది.
జీనో, ఏన్, మేడం టోరాల మధ్య కూర్చున్నాడు. డారిన్ లైట్లు ఆర్పి మేడం టోరా కళ్లకి ఓ సిల్క్ స్కార్ఫ్‌ని కట్టి, జీనో ఎదురుగా కూర్చుని ఓ కొవ్వొత్తిని వెలిగించాడు. వారంతా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కూర్చున్నారు.
మేడం టోరా తన తలని వెనక్కి వాల్చింది. క్షణాల్లో ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు పెరిగి ఆ ధ్వని గదిలో వినిపించసాగింది. తర్వాత ఆమె తల రుబ్బురోల్లా గుండ్రంగా తిరగసాగింది. ఆమెలో క్రమక్రమంగా ఆందోళన పెరగడం జీనో గమనించాడు. చివరకి ఆమె అడిగింది.
‘ఫ్రెడరిక్! వచ్చావా?’
‘ఫ్రెడరిక్ ఆమెకి ఆత్మలని తెచ్చే అతీంద్రియ శక్తిట’ ఏన్ గొంతు తగ్గించి జీనో చెవిలో చెప్పింది.
అకస్మాత్తుగా టోరా పెదవులు కదిలాయి. ఓ మగ కంఠం ఆమె నోట్లోంచి వినిపించింది.
‘నేను ఫ్రెడరిక్‌ని మేడం టోరా’
‘నీ పక్కన ఎవరైనా ఉన్నారా?’ టోరా గొంతు వినిపించింది.
‘ఉన్నారు... హెలెన్. ఉన్నావా? నేను కీత్‌ని’ ఈసారి ఆమె కంఠంలోంచి వేరే మగ గొంతు వినిపించింది.
‘కీత్. ఇక్కడే ఉన్నాను’ హెలెన్ చెప్పింది.
‘హెలెన్. నా దగ్గరికి రావడానికి నిర్ణయించుకున్నావా?’
‘లేదు కీత్. ఇంకా లేదు’
‘మనకి ఎక్కువ సమయం లేదు. త్వరలో నేను పై లోకానికి వెళ్లిపోవచ్చు. అదే జరిగితే ఇక మనం కలవకపోవచ్చు...’ క్రమంగా ఆ స్వరం తగ్గిపోసాగింది.
‘కీత్. వెళ్లకు. అప్పుడే వెళ్లకు’
‘గుడ్‌బై హెలెన్. గుడ్ బై మై డార్లింగ్’ ఆ కంఠం ఆగిపోయింది.
‘ఒద్దు కీత్. ఆగు. దయచేసి వెళ్లకు’ హెలెన్ డారిన్ చేతిని వదిలి లేచి నిలబడి అరిచింది.
మేడం టోరా తన చేతులు రెంటినీ కిందకి వేలాడేసి తల వెనక్కి వాల్చింది. హెలెన్ తలని టేబిల్ మీద ఆనించి ఏడవసాగింది.
జీనోకి ఆమె సగం స్పృహలో ఉన్నట్లుగా తోచింది. టోరా లేచి ఆ గదిలో ఎవరూ లేనట్లే బయటకి నడిచింది. జీనో, ఏన్ టెర్రెస్ మీదకి చేరుకున్నారు.
‘ఏమంటారు?’ ఏన్ సిగరెట్ వెలిగించి అడిగింది.
‘టోరా మోసగత్తా అన్నది మీ ప్రశ్నైతే దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా లేను. ఆమె వెంట్రిలాక్విస్టై ఉండచ్చు. లేదా మిమిక్రీ వచ్చి ఉండచ్చు. నిజమైన మీడియం అయి ఉండచ్చుకూడా. కాని అది ముఖ్యం కాదు. నేను గమనించింది మీ అమ్మలోని అపరాధ భావం. ఆమెని ఎప్పుడైనా, ఎవరైనా హిప్నటైజ్ చేశారా?’ జీనో అడిగాడు.
‘నాకు తెలీదు. దానికీ, దీనికీ ఏమిటి సంబంధం? బహుశ డారిన్, మేడం టోరాల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తూండి ఉండచ్చు. మా అమ్మ ఆత్మహత్య చేసుకోగానే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు’ ఏన్ క్రోధంగా చెప్పింది.
‘హిప్నాసిస్‌లో మనుషులు తాము మర్చిపోయినవి గుర్తు తెచ్చుకుని చెప్పగలరు. ఏ కారణంగానైనా మైండ్ బ్లాంక్ ఐతే అక్కడ ఉన్నవి బయటకి రప్పించచ్చు. అందుకు మీ అమ్మ ఒప్పుకుంటుందా?’ జీనో ప్రశ్నించాడు.
‘అడిగి చూస్తాను. కాని డారిన్ ఒప్పుకోకపోవచ్చు. అందువల్ల ప్రయోజనం ఉంటుందా?’
‘ఆమె హిప్నటైజ్ ఐతే ఉండచ్చు. కాని ఆమె అపరాధి ఐతే అది బయట పడచ్చు. అది మీకు, మీ అమ్మకీ ఇష్టమేనా?’
‘అడిగి చూస్తాను’
జీనో ఆ గదిలోనే మర్నాడు ఉదయం హెలెన్‌ని హిప్నటైజ్ చేశాడు. మేడం టోరాని కూడా దానికి హాజరవమని కోరితే వచ్చింది.
డారిన్, హెలెన్ కుర్చీలు పక్కపక్కన, మిగిలిన వారి కుర్చీలు దూరంగా వేశారు.
‘మిసెస్ హెలెన్! రిలాక్స్ అవండి. బిగుసుకుపోకుండా ఫ్రీగా కూర్చోండి. మీరు నా కంఠానే్న ఏకాగ్రతగా వింటున్నారు. మీ మనసుని తెల్లకాగితంలా ఏ ఆలోచనా లేకుండా చేస్తున్నారు. మీకు నా గొంతు తప్ప ఇంకెవరి మాటలూ వినపడటం లేదు... మీకు నిద్ర వస్తోంది. కళ్లు మూసుకోండి.. గాఢమైన నిద్ర...’
హెలెన్ తేలిగ్గా హిప్నటైజ్ అయింది. జీనో ఎదురుచూడనట్లుగా డారిన్ కూడా కళ్లు మూసుకుని తలని, చేతులని హెలెన్‌లా వేలాడేసాడు.
అతను హెలెన్ చేతిని పైకి ఎత్తమని కోరాడు. ఎత్తాక అది ఇనప చువ్వలా ఉందని సూచించి మడవమన్నాడు. ఆవిడ ప్రయత్నించినా మడవలేకపోయింది. ఆమె పూర్తిగా సమ్మోహనం చెందిందని నిర్ధారణ చేసుకున్నాక జీనో చెప్పాడు.
‘హెలెన్. ఇప్పుడు మనం రెండేళ్లు వెనక్కి వెళ్దాం. మీ మొదటి భర్త కీత్ మరణించిన నాటి రాత్రికి. ఆ రాత్రి గుర్తుందా?’
‘గుర్తుంది’ నిద్ర మత్తులో మాట్లాడినట్లుగా హెలెన్ కంఠం ముద్దగా వినిపించింది.
‘అతని మరణ సమయంలో మీరు టెర్రెస్ మీదే ఉన్నారా?’
ఆమె జవాబు చెప్పలేదు.
‘హెలెన్. మీరు అతనితో ఆ సమయంలో ఉన్నారా? జవాబు చెప్పండి’
‘లేదు. ఎక్కువ తాగి నా మంచం మీద నిద్రపోతున్నాను’
‘ఆ సమయంలో మీరు నిజంగా టెర్రెస్ మీద లేరా?’
‘లేను. మంచం మీద ఉన్నాను’
‘కీత్‌ని మీరు కిందకి తోయలేదా?’ జీనో కంఠం కొరడా దెబ్బలా ధ్వనించింది.
‘లేదు లేదు. మంచం మీద నిద్రలో ఉన్నాను’
డారిన్ కూడా సమ్మోహనంగా ఉన్నట్లు కనిపించడంతో జీనో అతన్ని అడిగాడు.
‘డారిన్! నా కంఠం మీకు వినిపిస్తోందా?’
‘వినిపిస్తోంది’
‘మీ కుడిచెయ్యి తిమ్మిరి ఎక్కింది. అర్థమైందా? తిమ్మిరి ఎక్కింది. దానికి ఏమైనా మీకు తెలీదు’
జీనో జేబులోంచి చిన్న సూది తీసి డారిన్ బొటన వేలి మీద స్వల్పంగా గుచ్చాడు. ఆ వేలి నించి నెత్తుటి బొట్టు వచ్చినా డారిన్ అరవలేదు. చేతిని కదపలేదు. జీనో అతని రక్తాన్ని తుడిచి చెప్పాడు.
‘డారిన్. తలుపు వైపు చూడు’
డారిన్ తల తిప్పి మూసిన తలుపు వైపు చూసాక జీనో చెప్పాడు.
‘ఓ మనిషి లోపలకి వస్తున్నాడు. కనపడ్డాడా?’
‘కనపడ్డాడు’ డారిన్ జవాబు చెప్పాడు.
‘అతను పోలీస్ ఆఫీసర్ డారిన్’
‘పోలీసా?’ డారిన్‌లో ఆందోళన కనిపించింది.
‘అవును. మఫ్టీలోని డిటెక్టివ్. అతను కీత్ హత్య గురించి ప్రశ్నించడానికి వచ్చాడు. అతని ప్రశ్నలకి నువ్వు నిజం చెప్పాలి’
వెంటనే మేడం టోరా గట్టిగా అరిచింది.
‘డారిన్. మూర్ఖుడివి కాకు. అక్కడ పోలీస్ లేడు’
ఆమె లేచి డారిన్ వైపు పరిగెత్తింది. ఇది ఊహించిన జీనో లేచి ఆమెకి అడ్డు వచ్చి చెప్పాడు.
‘మేడం. దీంట్లో మీరు జోక్యం చేసుకోకండి. అక్కడ పోలీస్ ఉన్నాడా? లేడా? అన్నది మీకెందుకు? మీరేదైనా దాస్తున్నారా?’
‘లేదు. కాని అతను మూర్ఖుడు అవడం నాకు ఇష్టం లేదు’ ఆమె పాలిపోయిన మొహంతో చెప్పింది.
‘హిప్నటిజం లక్ష్యం అదే కదా. మామూలుగా చెప్పనిది చెప్పించడానికేగా’ జీనో గట్టిగా చెప్పడంతో వెనక్కి వెళ్లి కూర్చుంది.
‘డారిన్. కీత్ మరణించిన రాత్రి మీరు టెర్రెస్ మీద ఉన్నారా?’
డారిన్ ఆందోళనగా కుర్చీలో కదిలాడు. బొటన వేలికి సూది గుచ్చుకున్న దానికి ఆలస్యమైన స్పందనలా. కాని మాట్లాడలేదు.
‘డారిన్. కీత్‌ని నువ్వు టెర్రెస్ మీంచి తోసావా?’
‘నేను, టోరా...’
టోరా మరోసారి మాట్లాడద్దని అరిచి తలుపు వైపు పరిగెత్తింది. జీనో ఆమెని ఆపి అడిగాడు.
‘అతను చెప్పబోయేది మీకు భయం కలిగిస్తోందా? ఈ పథకంలో మీ ప్రమేయం కూడా ఉందా?’
‘నా ప్రమేయం లేదు. కాని ఉందని డారిన్ అబద్ధం చెప్పచ్చని నా భయం. కీత్‌ని డారినే టెర్రెస్ మీంచి తోశాడు. చాలాకాలం తర్వాత అది నాకు చెప్పాడు’ ఆమె చేతులతో మొహం కప్పుకుని ఏడవసాగింది.
‘ఏన్! మీరు ఇప్పుడు పోలీసుల్ని పిలవచ్చు’ జీనో మృదువుగా చెప్పాడు.
తర్వాత డారిన్, హెలెన్‌లని మామూలు స్థితికి రప్పించాడు.
అరగంట తర్వాత పోలీసులు డారిన్‌ని, టోరాని తీసుకెళ్తూంటే ఏన్ ఆమెని అడిగింది.
‘నిజంగా మా నాన్న కంఠమేనా అది?’
అప్పటికే తేరుకున్న టోరా అహంకారంగా చెప్పింది.
‘నేన మోసగత్తెని కాను’
హత్య గురించి తెలిసీ దాచిందన్న నేరం మీద పోలీసులు ఆమెని పట్టుకెళ్లారు. ఆ గదిలో జీనో, ఏన్ మాత్రమే మిగిలారు.
‘నా సవతి తండ్రే నిజంగా మా నాన్నని టెర్రెస్ మీంచి తోసేసాడా? అతనికి శిక్ష పడుతుందా?’ ఏన్ అడిగింది.
‘పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రికార్డ్ ఐన మేడం టోరా ఆరోపణతో’
‘కాని కోర్ట్‌లో టేప్ రికార్డర్ సాక్ష్యాన్ని అంగీకరిస్తారా?’
‘కోర్ట్‌లో అంగీకరించరు. కాని ఆ టేప్‌ని వింటే డారిన్ తన నేరాన్ని అంగీకరించచ్చు’
‘ఆ సమ్మోహన స్థితి కొనసాగితే ఆయన అంగీకరించేవాడా?’
‘కాకపోవచ్చు. అలా చెప్పించ గలిగితే పోలీసులు ప్రతీసారి అనుమానితుల మీద హిప్నాసిస్‌ని ఉపయోగించేవారు. హిప్నాసిస్ మీద చాలా అపార్థాలు ఉన్నాయి. మన మనస్సాక్షికి వ్యతిరేకంగా ఎవరి చేతా ఏమీ చేయించలేం’
‘కాని గదిలో పోలీస్ ఉన్నాడని ఆయన నమ్మినట్లున్నాడు?’ ఏన్ అడిగింది.
‘ఆయన అంతఃచేతనకి వ్యతిరేకంగా ఏదీ నమ్మలేదు. ఉదాహరణకి మనుషులు సమ్మోహన స్థితిలో పదో అంతస్థు కిటికీలోంచి కిందకి దూకమని చెప్తే దూకరు. కాని కిటికీని అది ఇంకో గదికి తలుపు అని చెప్తే నడిచి వెళ్లి కింద పడతారు. నేను అనుమానించినట్లుగా మేడం టోరాకి ఇదంతా తెలుసు కాబట్టి ఆమె బయటపడింది.’
‘మిస్టర్ జీనో. టోరా కంఠం ద్వారా మాట్లాడింది మా నానే్ననా?’
‘అందులో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో నేను చెప్పలేను’ జీనో జవాబు చెప్పాడు.
(క్లింటన్ మేథ్యూ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి