S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేలతల్లి

రెండవ బహుమతి
రు.5 వేలు పొందిన కథ
**
‘పెద్దయ్యా! రేపు మంత్రిగారు వస్తున్నారట. ఆయన వచ్చేసరికి మనమంతా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి మన కోరికలేమిటో చెప్పాలట. ప్రభుత్వ నిర్ణయానికి ఒప్పుకుంటే మన షరతుల గురించి ఆలోచిస్తారట. ఇప్పుడే వెంకట్రాముడు ఫోన్ చేశాడు’ ఊరికి పెద్ద పరశురామయ్యకు చెప్పాడు భగవానులు.
పరశురామయ్యకు ఏమి చెయ్యాలో అర్థం కావటంలేదు. ఎన్నో తరాలుగా ఊర్లో వాళ్ల బ్రతుకులకు ఆధారమై వాళ్ల కడుపులు నింపుకుని ఎందరి కడుపులో నింపుతున్న మాగాణి భూములను ప్రభుత్వం తనకిమ్మంటుంది. కొత్తగా ఏర్పడే రాజధానికి అనుబంధంగా పారిశ్రామిక వాడల నిర్మాణానికి భూములు కావాలని కోరుకుంటుంది. ఇప్పటికే చాలాసార్లు వెంకట్రాముడితో చెప్పి పంపాడు ఊళ్లో వాళ్లు ఎవరూ ఒప్పుకోవటం లేదు అని. కానీ కొంతమంది సిద్ధంగా ఉన్నారు భూములు ఇవ్వడానికి. దానికి కారణం ప్రభుత్వం అలా ఇచ్చిన వాళ్లకు నెలనెల వడ్డీలు, కొత్తగా ఏర్పడే కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తానని ఆశ పెట్టింది అదొక వైపు. మరోవైపు రాజకీయ దురుద్దేశం. వాళ్ల పార్టీ వాళ్లు అడిగారని ఘనంగా ఇవ్వాలనే తాపత్రయం. ఎటూ తేల్చుకోలేక కొందరు తలపట్టుకుని కూర్చున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం’ అన్నట్లు. ఇవ్వను అంటే ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయం. ఇద్దామంటే నోటి దగ్గర కూడు పోగొట్టుకున్న వాళ్లమవుతామేమోనని భయం. ప్రభుత్వం ఇప్పుడు చెప్పిన మాట రేపటికి ఉంటుందో వుండదో. మళ్లీ ప్రభుత్వం ఇదే వస్తుందన్న నమ్మకం ఏమిటి? వందల కొలది ప్రశ్నలు అందరి మస్తిష్కాలను తొలిచివేస్తున్నాయి.
అందుకే పరశురామయ్య తన తరం వారిని పిలిచి విషయం ముందే చర్చించాడు. అందరూ మనది ముగిసిపోయే వయసు. మన పిల్లలది సర్దుకుపోయే వయసు. అసలు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది మనమూ మన పిల్లలు కాదు. వాళ్ల పిల్లలు అంటే మన మనవళ్లు. వాళ్లది యువతరం భావితరం. వారికి ఏది మంచి అనిపిస్తే మనమూ అదే చేద్దాం అని తీర్మానించుకుని వాళ్లందరికీ ఫోన్లు చేయించారు. వాళ్లందరూ కూడా నిన్ననే వూర్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఊర్లో వుండే యువకులందరూ సమావేశమై చర్చించుకున్న తరువాత ఏ విషయమూ వచ్చి చెప్తామని ముందుగానే చెప్పి పంపారు మనిషి చేత. దాని కోసమే ఎదురుచూస్తున్నాడు పరశురామయ్య.
ఆలోచనల్లో నుంచి తేరుకుని భగవానులు వైపు తిరిగి ‘్భగవాన్లూ! ఆయన రేపు వస్తున్నారని మనము హడావిడిగా నిర్ణయాన్ని తీసుకోనక్కరలేదు. మనవాళ్లు ఊరిలో అందరి తోటి మాట్లాడుతున్నారు కదా మాట్లాడనీ. ఈ విషయంలో ఎవరి నిర్ణయం వాళ్లు తీసుకోలేము. ఎందుకంటే ఇది ఊరందరి సమస్య. మన బ్రతుకుల సమస్య. ఎవరి కోసమో మనం మన జీవితాలు పణంగా పెట్టనక్కరలేదు. మన ఆలోచనలకూ కుర్రాళ్ల ఆలోచనలకు తేడా ఉండవచ్చు. మనకంటే పొలం మీద మమకారం ఎక్కువ కానీ వాళ్లకు అలా కాదేమో. ముందుచూపుతో ఆలోచిస్తారు వాళ్లు. చూద్దాం వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో. వాళ్ల మాట కాదని వెళ్లే ప్రసక్తే లేదు. ఆయన వస్తే అదే చెబుదాం. వెంకట్రాముడికి తొందరపెట్టొద్దని చెప్పు’ తేల్చి చెప్పాడు పరశురామయ్య.
పరశురామయ్య ఊరికి పెద్ద తలకాయే కాదు. నిదానస్తుడనీ, మంచివాడని ఎవరికీ హాని చేయడని నమ్మకం అందరికీ. రాజకీయంగా ఏ పార్టీ వాళ్లు సర్పంచులయనా ఈయన దగ్గరకి వచ్చేసరికి ఆ గొడవలు మరచిపోయి ‘పెద్దయ్య ఏం చెబితే అదే చేద్దాం’ అనేస్తారు. అంతటి విలువ వుంది పరశురామయ్య మాటకు. అదే కారణంగా పరశురామయ్య మాటకు విలువ వుంది కదా అని తొందరపడి నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు.
నిజానికి పొలాలను ఇవ్వడం పరశురామయ్యకు ససేమిరా ఇష్టంలేదు. ఆయన దృష్టిలో పొలం అంటే తల్లితో సమానం. దాన్ని ఇంకొకరికి ఇవ్వడమంటే కన్నతల్లిని వేరే వాళ్లకు అప్పగించడమేనని ఆయన భావం. అయినా ఆ విషయం ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు. భవిష్యత్తులో పొలం ఇచ్చిన మిగిలిన వూళ్ల వాళ్లు ఆర్థికంగా ఎదిగితే ఊరి జనం తనను తప్పుపడతారు. ఏమో పొలం ఇచ్చేస్తే కొత్త పరిశ్రమలు వచ్చి జనమంతా బాగుపడతారేమో. నిజానికి ఈ విషయాలేవీ తనకు తెలియవు. తెలిసిందల్లా పొలంలో పంటలు వేసి పండించడం. తనింత తిని మిగిలినది అందరికీ పంచిపెట్టడం. ఇదే తనకు గానీ తన తోటివాళ్లకు గానీ తెలిసిన విద్య. విశేషం. అందుకే నిర్ణయాన్ని పిల్లలకు వదిలెయ్యమన్నాడు.
ఇంతలో ‘తాతయ్యా’ అంటూ వచ్చారు హర్ష, శ్రీకర్, వసంత్‌లు. తలెత్తి చూసి ‘రండిరా రండి. మీ కోసమే ఎదురుచూస్తున్నాను’ అంటూ ‘రాజయ్యా! నాలుగు కుర్చీలు తీసుకురా. పిల్లలు వచ్చారు’ అని పాలేరును పురమాయించాడు.
‘ఎందుకు తాతయ్యా! రాజన్నను ఇబ్బంది పెట్టడం. మేం తెచ్చుకుంటాములే’ అని లోపలికి పోబోయారు.
‘్భలేవాళ్లు అయ్యలు. నేను ఎంతసేపు తెస్తా మీరుండండి’ అని ఆపి కుర్చీలు తెచ్చి వేశాడు రాజన్న.
హర్ష ఆ ఊరి సర్పంచ్ గారబ్బాయి. ఎం.బి.ఏ. పూర్తి చేసి పూనెలో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీకర్ ఆ ఊరి పంతులుగారి కొడుకు. ఎం.టెక్ చేసి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. ఇక వసంత్ హర్ష వాళ్ల పెదనాన్నగారబ్బాయి. అగ్రికల్చరల్ బిఎస్సీ చేసి ఊర్లోనే వ్యవసాయం చేస్తున్నాడు. వీళ్లు ముగ్గురూ మంచి స్నేహితులు. అంతే కాకుండా ఇంటర్ వరకూ కలిసే చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. అన్నిటికంటే వాళ్లకు ఊరంటే చచ్చేంత ఇష్టం. శ్రీకర్ అమెరికాలో వున్నా సంవత్సరానికి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి వెళతాడు. అనుకోకుండా నిన్ననే వూర్లోకి రావడం జరిగింది. వీళ్ల ముగ్గురూ వూరిలోకి వచ్చారంటే చాలు ఆ వూరిలో యువకులంతా వీరి వెంటే ఉంటారు. పెద్దవాళ్లకు కూడా వీరంటే మంచి అభిమానం.
‘తాతయ్యా! మీతో మాట్లాడుదామని బయలుదేరుతుంటే భగవాన్లు బాబాయి ఎదురయ్యాడు. రేపు మంత్రిగారు వస్తున్నారటగా. విషయం తేల్చమన్నారని ఫోన్ చేసి చెప్పారటగా’ అడిగాడు హర్ష.
‘అవున్రా. ఏదో మహా తొందర పడిపోతున్నారు. ఇది పారిశ్రామిక వాడ కాగానే మనము కుబేరులమయి పోతామని చెబుతున్నారు. మనలను ఆలోచించుకునే అవకాశమే ఇవ్వకుండా తొందర చేస్తున్నారు. మన భవిష్యత్ ఏమిటో మనకే అర్థం కాకుండా చేస్తున్నారు’ బాధ, ఆవేశం కలగలిపినట్లుగా ఉంది అతని స్వరం.
‘అవును తాతయ్యా. మనకంటూ ఒక అభిప్రాయమేర్పరచుకోను తావివ్వకుండా కళ్ల ముందు స్వర్గాన్ని చూపిస్తున్నట్లుగా అర్థమయింది మాకు మనవాళ్లు చెప్పిన మాటలు వింటూంటే. అయినా పొలాలు మనవి. వాటి మీద అధికారం మనది. మనకిష్టమైతే ఇస్తాము. లేకుంటే లేదు. మధ్యలో వీళ్ల పెత్తనమేమిటి’ అందుకున్నాడు వసంత్.
‘అది సరే. ఇంతకూ మన వూర్లో యువకులందరినీ కలిశారా? ఏమైనా మీ నిర్ణయమే మా నిర్ణయంరా. ఇందులో వేరే ఆలోచన లేదు. ఎందుకంటే భవిత మీది. మీకు ఏది మంచి అనిపిస్తే అదే మేమూ చేస్తాము’ మొత్తం బాధ్యత మీదే అన్నట్లుగా చెప్పాడు పరశురామయ్య.
‘ఊర్లో అందరినీ కలిశాము తాతయ్యా. ఎక్కువ శాతం మందికి పొలాలు ఇవ్వడం ఇష్టంలేదు. కానీ కొంతమంది సుముఖంగా వున్నా దానికి కారణం మనం వద్దన్నా ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుందేమో. అనవసరమైన గొడవలెందుకు అని. అయినా అందరినీ సమావేశపరచి లాభనష్టాలను బేరీజు వేసి ఒక నిర్ణయానికి వచ్చాము. అది అందరికీ సమ్మతంగానే అనిపించింది’ మధ్యలో ఆపి హర్ష వైపు చూశాడు శ్రీకర్.
‘అవును తాతయ్యా! మా అభిప్రాయాలు కూడా వారికి చెప్పాము. అది విన్న తరువాత అందరూ సంతోషంగా మా ఆలోచనలకు ఓటు వేశారు. అది మీకు మేము చెప్తాము. దాన్ని ఊరి పెద్దగా మీరు మంత్రిగారికి చెప్పండి. మీరుండగా మేము కల్పించుకుంటే బాగుండదు’ చెప్పాడు హర్ష.
‘పోనీలేరా. ఏదైనా ఊరందరినీ ఒకతాటి మీదికి తెచ్చారు. అయినా సర్పంచ్‌గా మీ నాన్న వుండగా నేను చెప్తే ఏం బాగుంటుంది?’ నసిగాడు పరశురామయ్య.
‘అదేం లేదు తాతయ్యా. నాన్నతోనే కాదు. ఊర్లో పెద్ద చిన్న అందరినీ కలిశాము. అందరూ ఒకే మాట మీదకు వచ్చాము. నాన్నయితే ఇలాంటి విషయాన్ని కచ్చితంగా వూరి పెద్దగా మీరే చెప్పాలని చెప్పారు’ పరశురామయ్య అనుమానం తీర్చాడు హర్ష.
‘మీరే సందేహాలు పెట్టుకోకండి తాతయ్యా. మా మాటే మీ మాటగా వాళ్లకు చెప్పెయ్యండి. ఇక వాళ్లు దానికి ఒప్పుకోకపోతే మనమేం చెయ్యాలో అదే చేద్దాం. అంతేగానీ వాళ్ల ఒత్తిళ్లకు తలొగ్గేదే లేదు’ ఖరాఖండిగా చెప్పాడు వసంత్.
‘అలాగేలేరా. మీరందరూ చెప్పిన తరువాత కాదనేదేముంది. ఇంతకూ ఏమి నిర్ణయం తీసుకున్నారు’ అసలు విషయంలోకి వచ్చాడు పరశురామయ్య.
‘మాకెవ్వరికీ పొలాలు వదులుకోవడం ఇష్టం లేదు తాతయ్యా. ఆ విషయమే అందరితోటి చర్చించాం. చాలామందికి పొలాలు ఇచ్చేస్తే డబ్బులు వస్తాయి. పెట్టే కంపెనీలలో ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇప్పుడు వ్యవసాయం పెద్ద లాభసాటిగా లేదు అని వాళ్ల అభిప్రాయం చెప్పారు. మొదట్లో మాకు కూడా అది సబబేనేమో అనిపించింది. కానీ శ్రీకర్ లోతుగా ఆలోచించి అందులో వున్న చెడు గురించి చెప్పాక గానీ మా ఆలోచనలలో లోపం అర్థం కాలేదు’ అని శ్రీకర్ వైపు చూశాడు వసంత్.
‘పారిశ్రామికవాడలొస్తే మన వాళ్లకు ఉద్యోగాలొస్తాయి. కానీ దాని వెనుకనే కాలుష్యం వస్తుంది. చెట్లు చచ్చిపోతాయి. మన వూరి చుట్టూ ఉండే పచ్చదనాన్ని ప్రభుత్వం కొంత నాశనం చేసి కాలుష్యం మరి కొంత నాశనం చేస్తే వాతావరణం సమతుల్యం దెబ్బతింటుంది. పరిశ్రమలకు దూరంగా మనం జీవించాలంటే మనం ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలి. అది ఎంత ఖర్చుతో కూడిన పనో అందరికీ వివరించాను. పోనీ ఇక్కడే ఉండిపోతే మన ఆరోగ్యాలు మొత్తం దెబ్బతింటాయి. పొలాలు అమ్మగా వచ్చిన డబ్బులే కాకుండా ఇంకా అప్పులు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవలసి ఉంటుంది. ఇదే విషయాన్ని ఇంకా విపులంగా అందరికీ చెప్పాను’ వివరించాడు శ్రీకర్.
‘అంతేకాదు తాతయ్యా. మన ఊర్లో వాళ్లకు వ్యవసాయం తప్ప వేరేమీ తెలియదు. వీళ్లు కార్మికులుగా వెళితే అక్కడ పని చెయ్యగలరో లేదో. ఒకవేళ కంపెనీ వాళ్లకు కనుక నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తీసిపారేస్తారు. అప్పుడు ఏ ప్రభుత్వాలు ఆదుకోలేవు. అప్పుడు మన పరిస్థితి ‘రెంటికీ చెడిన రేవడి’ అవుతుంది. ఇవన్నీ విన్న తరువాత మన వాళ్లలో నిజమైన ఆలోచన మొదలైంది. ‘మబ్బును నమ్ముకుని ముంత తగలేసుకుంటామా’ అన్న భయం కూడా కలిగింది. తరువాత ఈ విషయాలు మొత్తం నాన్నగారికి కూడా వివరించాము. ఆయన కూడా వూర్లో చాలామందితో చర్చించారు. ఈ విషయాలన్నీ మీకు ఎప్పటికప్పుడు చెబుదామంటే వసంత్ వద్దన్నాడు. వద్దురా తాతయ్యను ఇబ్బంది పెట్టవద్దు. అంతా అయిన తరువాత ఒకేసారి చెబుదామన్నాడు. చివరగా తాతయ్య ఏం చెబితే అదే చేద్దామని కూడా చెప్పాడు. అందుకే మీకు ఇంతవరకు చెప్పలేదు. సారీ తాతయ్యా!’ అని చెప్పాడు హర్ష.
‘అంటే ఎవరూ పొలాలు యివ్వడానికి ఒప్పుకోలేదన్నమాట. చాలా సంతోషకరమైన వార్త చెప్పారురా. బంగారమంటి మాగాణి భూములురా. పదిమందికి అన్నం పెట్టే అన్నపూర్ణ తల్లిరా ఈ పొలాలు. మీరు ఇంటర్‌నెట్ యుగం వాళ్లు కదా మీకు ఈ పొలాలంటే యిష్టం ఉండదేమో అనుకున్నా. నా అభిప్రాయం తప్పని మాకంటే మీకే కన్న వూరన్నా, కన్నవాళ్లన్నా మమకారం ఎక్కువని నిరూపించారు. చాలా ఆనందంగా ఉందిరా నాకు ఈ రోజు. కాకపోతే ఒక చిన్న బాధ మనసును తొలిచివేస్తోంది’ బాధగా వాళ్ల ముఖాల్లోకి చూశాడు పరశురామయ్య.
‘చెప్పండి తాతయ్యా. ఏమిటది?’ ముగ్గురూ ఒకేసారి అడిగారు.
‘ఏమీ లేదురా. ఈ రోజుల్లో ఎవరికీ వ్యవసాయం పెద్ద లాభసాటిగా లేదు. ఎటు చూసినా నష్టాలే. పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వ సహకారం లేక, దళారీల ఉచ్చులోపడి సగటు రైతు విలవిలలాడిపోతున్నాడు. దానికేదైనా మార్గం ఆలోచిస్తే మంచిదేమో. మీరు బాగా చదువుకున్న వాళ్లు, తెలివిగల వాళ్లు ఏదో ఒక ఆలోచన చెయ్యండి’ ప్రాధేయపూర్వకంగా అడిగాడు.
వెంటనే హర్ష చిరునవ్వు నవ్వుతూ ‘మీలాగే మాకూ అదే ఆలోచన వచ్చింది తాతయ్యా. దానికి కూడా మార్గం ఆలోచించాం. ఇదిగో ఈ వసంత్‌గాడే మాకో కొత్త సలహా ఇచ్చాడు. చెప్పరా వసంత్’ అని వసంత్‌ను పురమాయించాడు హర్ష.
‘కొత్తగా వచ్చిన ఆలోచన కాదు తాతయ్యా. ఇది కార్పొరేట్ వాళ్లు చేసే విధానం. సామూహిక వ్యవహారం అనొచ్చు ఒక రకంగా. మన ఊర్లో పొలం మొత్తాన్ని ఐదు లేక ఆరు భాగాలుగా చేసి మనందరమూ కూడా టీములుగా ఏర్పడి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైన పంటను వేసి ఎవరికి ఏ పంట సాగులో మంచి అనుభవం వుంటే వాళ్లు ఆ భాగంలో వేసిన పంట బాగోగులు చూస్తూ మనమంతా యజమానులమని కాకుండా మన పని మనమే చేసుకుంటూ ఎక్కువ భాగం కూలీల మీద ఆధారపడకుండా పొలాన్ని సాగుచేసుకుందాము. మనమంతా ఒకే మాట మీద వుంటే దళారీలు మన జోలికి రారు. పైగా ఇప్పుడు మన సరుకును మన కిష్టమైన ధరకు నెట్ ద్వారా తెలియజేసి అమ్ముకోవచ్చు. మన వూర్లో మనమే కోల్డ్‌సోర్టేజిలు కట్టుకుని పంటను దాచుకుని మంచి ధర వచ్చినపుడు మనమే అమ్ముకుందాము. అంతేకాదు తాతయ్యా వచ్చే లాభాన్ని కూడా పొలం నిష్పత్తి ప్రకారం అందరం పంచుకోవచ్చు. ఒకవేళ ఒక పంటలో నష్టం వచ్చినా ఇంకో పంటలో లాభం వచ్చి మొత్తం మీద ఎవరికీ నష్టం లేకుండా ఉంటుంది’ వివరించాడు వసంత్.
‘ఇంకో ఆలోచన కూడా తాతయ్యా. మన వూర్లో పొలం లేని వాళ్లకు కూడా ఎంతో కొంత పొలాన్ని మనందరం కలుసుకుని వాళ్లకు రిజిస్టర్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే మన వూర్లో ఎవరూ కూలీ అనే వాళ్లు లేకుండా రైతులుగానే ఉండాలని మా కోరిక. అలాగే కులమతాల కతీతంగా వూరిని మార్చాలని మా ఆశ. అందుకు మా వంతు సహకారం మేమూ చేస్తాము’ చెప్పాడు శ్రీకర్.
‘ఊరి చివర మనం చెరువు త్రవ్వుకుందాం. వర్షం వచ్చినపుడు ఆ నీరు నిలువ ఉంటుంది. చెరువు దగ్గరలో వుంటే బోరుల్లో కూడా తక్కువ లోతుకే నీళ్లు పడతాయి. పంటలకు సరిపోతాయి. మొదట్లో ఇవన్నీ కొంచెం కష్టంగానే వున్నా ఆచరణలోకి వచ్చేసరికి ఎంత మంచి ఆలోచన చేశామా అనిపిస్తుంది. మా ఆలోచనలలో ఏదైనా తప్పులుంటే చెప్పండి తాతయ్యా’ ముగించాడు హర్ష.
పరశురామయ్యగారి కళ్లు ఆనందంతో మెరిశాయి. కుర్చీలో నుంచి లేచి వచ్చి ‘మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానురా. ఈ కాలం కుర్రాళ్లంటే అల్లరిచిల్లరగా తిరిగే వాళ్లనీ, డబ్బు కోసం ఎంత దూరమైనా పరిగెత్తుతారని, బంధాలకు అనుబంధాలకూ విలువ ఇవ్వరని అనుకునేవాణ్ణి. కానీ మిమ్మల్ని చూసిన తరువాత, మీ మాటలు వినిన తరువాత నా అభిప్రాయం తప్పని తేలింది. పెద్దవాళ్లయుంటే మీ పాదాలకు వందనం చేసే వాణ్ణి. చిన్నపిల్లలయిపోయారు. అందుకే మనసారా దీవిస్తున్నాను’ అని ముగ్గురినీ దగ్గరకు తీసుకుని నుదుట చుంబించాడు.
‘అలా అనకండి తాతయ్యా. ఈ వూర్లో ఎన్ని ఇబ్బందులు ఎదురయినా మీ పిల్లలు అమెరికాలో వుండి రమన్నా వూరి మీద మమకారంతో మీరు వెళ్లలేదు కదా. మీరే మాకు ఆదర్శం. మీకో విషయం ఇప్పుడు చెప్తున్నాము. మాకు వచ్చిన ఈ ఆలోచనలన్నింటికీ మూల కారణం మీ పిల్లలు. మీకు ఊరంటే ఎంత అభిమానమో చెప్పారు. పొలాలు అమ్మివేయటం మీకు ఇష్టం లేదనీ, దాని వెనుక మీరు ఊరందరి కోసం పడే తపననీ వాళ్లు ఫోను ద్వారా తెలియజేశారు. మా ఆలోచనలు కూడా వాళ్లతో పంచుకున్నాము. అందుకని ఈ ఘనత మాది కాదు తాతయ్యా మనందరిదీ. మనందరం కలిసి మన తల్లిని కాపాడుకుందాం. ఎటువంటి సంకోచం లేకుండా మన అభిప్రాయాన్ని మంత్రిగారికి చెప్పండి’ అని చెప్పి పరశురామయ్యగారి కాళ్లకు నమస్కరించి లేచారు.
‘తప్పకుండా. ఎవరైతే మనకేమిటి? ఇది మన ఆస్తి. మన కన్నతల్లి ఈ భూమి. మీరు చెప్పినట్లే చెబుతాను. మంచిది నాయనా వెళ్లిరండి’ అని వెళుతున్న వాళ్ల వైపు గర్వంగా చూశాడు పరశురామయ్య.
*
కవితలతో మొదలు

వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించినా సాహిత్యమంటే మక్కువ. పదవీ విరమణ తరువాత మరింత శ్రద్ధగా కవిత్వ రచనపై దృష్టిపెట్టాను. ఇప్పటివరకు 70 కవితలు ప్రచురితమవగా చాలావాటికి బహుమతులూ వచ్చాయి. ఐదారు పత్రికల్లో నా కథలు ప్రచురితమయ్యాయి. నా తొలి కథ ‘పోపుబ్లాకు’ ఆంధ్రభూమిలోనే ప్రచురితంకాగా ఇప్పుడు నా కథకు బహుమతి రావడం ఆనందం కలిగించింది. కొత్త రచయితలకు స్ఫూర్తినిచ్చే పరిణామం ఇది. ఇతివృత్తం, భాష కొత్తగా ఉండే కథలకు గుర్తింపు లభిస్తుందని నా విశ్వాసం. కథలు రాయలేమోనన్న భయాన్ని పోగొట్టి విశ్వాసాన్ని నింపిన బహుమతి నాకు ఆంధ్రభూమి ఇచ్చింది.

శింగరాజు శ్రీనివాసరావు 9052048706