S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శిక్ష

టామ్ తన భార్య హెస్టర్ని, కూతురు క్లోరుూని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాడు. ఆయాసపడే ఇద్దరికీ కార్టిజోన్ ఇంజక్షన్స్ ఇచ్చాక డాక్టర్ టామ్‌ని పక్కకి పిలిచి చెప్పాడు.
‘ఇంకో చలికాలంలో ఇక్కడే ఉంటే వీళ్లిద్దరూ బతకరు. కొత్త అలర్జీలతో మళ్లీ ఆస్త్మా వస్తే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జీవించి ఉండరు. కాబట్టి మీ కుటుంబం మసాచుసెట్స్‌ని వదిలి ఫ్లోరిడా లాంటి వేడి ప్రాంతానికి వెళ్లి ఉండటం ఉత్తమం.’
‘మీరు ఇదివరకే ఈ సలహా ఇచ్చారు. కాని నా వ్యాపారం, ఆస్థిపాస్తులు, పుట్టిన రాష్ట్రం అన్నీ వదిలి వెళ్లాలంటే కష్టమే’ టామ్ నిస్సహాయంగా చెప్పాడు.
‘ఏది ముఖ్యమో మీరే తేల్చుకోవాలి. ముఖ్యంగా క్లోరుూకి తరచు వచ్చే బ్రోంకైటిస్ ఆస్తమాగా మారకుండా మీరు జాగ్రత్త పడాలి. పాల ఉబ్బసం అని, పెద్దయ్యాక తగ్గుతుందని భావించాను. కాని అలా జరగలేదు’ డాక్టర్ విచారంగా చెప్పాడు.
ఆ తర్వాత టామ్ పూర్తి బట్టతల, సగం బట్టతల, చక్కటి క్రాఫ్ గల ముగ్గురు డాక్టర్లని కలిశాడు. వాళ్లంతా కూడా స్వల్ప తేడాతో అతని ఫేమిలీ డాక్టర్ ఇచ్చిన సలహానే ఇచ్చారు.
ఆ రాష్ట్రంలోని ఎలర్జీలు ఫ్లోరిడాలో ఉండవని, ఆస్తమా రోగులకి ఆ వాతావరణం మంచిదని వాళ్లు చెప్పారు.
ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ అతని భార్య, కూతురు తీసుకుంటారు. ఏడో ఏట నించి, అంటే రెండేళ్ల క్రితం నించి క్లోరుూ నిత్యం తండ్రితో కలిసి ఇంట్లో దుమ్ము లేకుండా తుడుస్తుంది. దిండు గలీబుల్ని, పక్కమీది దుప్పట్లని టామ్ మూడు రోజులకోసారి వాషింగ్ మెషీన్లో వేస్తూంటాడు. అంతే కాని హెస్టర్ వారికి సహాయం చేయదు. ఆదివారాలు క్లోయి ఇంట్లోని కేండిల్ స్టిక్స్‌ని, బల్ల పైభాగాలని, ఫ్లవర్ వేజ్‌లని తళతళలాడేలా తుడుస్తూంటుంది. దాంతో ఆ ఇల్లు దుమ్ము లేకుండా మెరుస్తూంటుంది.
ఫాల్కన్ లాంటి చిన్న ఊళ్లో టామ్ ఆఫీస్‌లో, క్లోయి స్కూల్లో ఉన్నప్పుడు హెస్టర్‌కి ఏదైనా అవసరం ఉంటే పక్కింటి వారి సహాయం తీసుకుంటుంది. మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని, మిత్రుల్ని, ఇంటిని వదిలి టామ్ కుటుంబ సంక్షేమం కోసం ఫాల్కన్‌ని వదిలి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించాడు.
* * *
జూన్ వెళ్లి జులై వచ్చింది. హెస్టర్ ఆరు పౌన్ల బరువు పెరిగింది. ఇప్పుడు ఆస్తమా స్థానంలో సైనస్ ఇబ్బంది మొదలైంది. అది నోసల్ డ్రాప్స్‌తో తేలిగ్గా తగ్గే రోగమే.
హెస్టర్ స్వతహా ప్రతికూల స్వభావం గల మనిషి. ప్రతీ చిన్న విషయానికి అసంతృప్తిగా, అసహనంగా తండ్రీ కూతుళ్ల మీద అరుస్తుంది. వారిద్దరూ తను గీసిన గీటు దాటకూడదని ఆశిస్తుంది. టామ్ ఆఫీస్ నించి ఇంటికి వచ్చినప్పుడు క్లోయి ఇంటి బయట నిలబడి నవ్వుతూ స్వాగతం చెప్తుంది. టీవీ చూసే లేదా పత్రిక చదివే లేదా పడుకున్న హెస్టర్ టామ్ లోపలికి వెళ్లినా అతన్ని విష్ చేయదు. పొరుగావిడ విట్‌మేన్‌తో అనేకసార్లు ఆవిడ తోటలోని పూల చెట్లని తీసేయమని, వాటి పుప్పొడి వల్ల అలర్జీతో తనకి తుమ్ములు వస్తున్నాయని పోట్లాడేది. ఓ రోజు టామ్‌తో కోపంగా చెప్పింది.
‘ఏదో రోజు నేను గాజు పొడి కలిపిన కేక్‌ని ఆవిడకి తినిపిస్తాను’
‘నీ ప్రాణాల కోసం ఆవిడ ప్రాణాలు తీయడం తప్పు’ క్లోయి చెప్పింది.
‘నోర్ముయ్’ హెస్టర్ అరిచింది.
టామ్ ఫ్లోరిడాకి వెళ్లే విషయం చెప్తే అతని ఊహకి వ్యతిరేకంగా హెస్టర్ ఆనందించింది. ఆ రాత్రి భోజనాలు వడ్డించాక క్లోయిని పిలిచింది.
‘ఆకల్లేదమ్మా’ క్లోయి చెప్పింది.
‘ఎందుకు లేదు? వచ్చి తిను’
క్లోయికి ఇష్టమైన రోస్టెడ్ చికెన్ వండినా కొద్దిగా తినడంతో టామ్‌కి నిజంగా క్లోయికి ఆకల్లేదని అర్థమైంది.
‘రుచిగా లేదా?’ హెస్టర్ భర్తని అడిగింది.
‘బావుంది’
‘విన్నావుగా? తిను’ హెస్టర్ గదిమింది.
‘కడుపు నిండిపోయిందమ్మా. ఇంక తినలేను’
‘మొత్తం తిను’ హెస్టర్ అరిచిన అరుపుకి టామ్ చేతిలోని ఫోర్క్ జారిపోయింది.
తలెత్తి ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. హెస్టర్ క్లోయి వంక చూసే చూపులోని క్రోధం ఎప్పటికన్నా ఎక్కువగా ఉంది. తల్లి అరుపుకి భయపడ్డ క్లోయి కొంత తిని వాంతి చేసుకుంది.
‘్భజనం దగ్గర గొడవ చేయడం నాకు ఇష్టం ఉండదు’ హెస్టర్ భర్తతో చెప్పింది.
‘ఎదుటి వాళ్లు నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకోవాలని అనుకుంటావు. అదే నీ సమస్య’ టామ్ విసురుగా చెప్పాడు.
‘మీ ఇద్దరి సమస్యా నేను చెప్పేది మీ మంచి కోసమే అని మీరు అర్థం చేసుకోకపోవడమే’ హెస్టర్ కోపంగా చెప్పింది.
* * *
టామ్ కొత్త ఉద్యోగం వెతుక్కున్నాక ఫాల్కన్‌ని వదిలే ప్రయత్నం ఆరంభించాడు. ఫర్నిచర్‌తోసహా ఇంటిని అమ్మేశాడు. మిగిలిన సామాన్ని తను వెళ్లబోయే చోటికి పంపేశాడు.
క్లోయి తన పట్ల అవిధేయతగా ఉంటోందని హెస్టర్ అనేకసార్లు మందలిస్తూనే ఉంది.
‘చెప్పిన మాట వినకపోతే చెడిపోతుంది’ భర్తకి ఫిర్యాదు చేస్తుంది.
క్లోయి మిసెస్ విట్‌మేన్ ఇంటికి వెళ్లి మిగిలిన పిల్లలతో కలిసి ఈత కొలనులో ఈత కొట్టడం కిటికీ లోంచి చూసిన హెస్టర్ భర్తతో కోపంగా చెప్పింది.
‘ఎంత ధైర్యం! దాన్ని చూసారా? నేను వద్దన్నా వెళ్లి ఈత కొడుతోంది’
‘హెస్టర్. బయట ఎంత వేడిగా ఉందో తెలుసా?’
‘పాయింట్ అది కాదు. నేను దాన్ని ఈతకొలనులోకి వెళ్లద్దన్నాను’ హెస్టర్ ఆఖరి ఐదు పదాల మధ్యా విరామం ఇస్తూ నెమ్మదిగా చెప్పింది.
దానికి వ్యతిరేకంగా గినె్నలు, మూతలు విరామం లేకుండా శబ్దం చేశాయి. ఆమె తల తిప్పి టామ్ వంక చూస్తే ఆ కళ్లల్లోని క్రోధం కత్తి పదునులా అతనికి తోచింది. అది కేవలం క్రోధం కాక కొంత పిచ్చి కూడా ఉందేమోనని గతంలో ఎన్నోసార్లు కలిగిన అనుమానమే కలిగింది. క్లోయిని ఎన్ని వేలసార్లు ఆ ఉన్మాదంతో ఏడిపించిందో!
‘పిల్ల పెరిగే పద్ధతి ఇది కాదు. మీరు దాన్ని శిక్షించకపోతే నేనా పని చేయాల్సి ఉంటుంది’ హెస్టర్ గట్టిగా చెప్పింది.
‘గాజు పొడి కలిపిన కేక్ తినిపిస్తావా?’ టామ్ అడిగాడు.
‘దాని ప్రవర్తన వల్లే నేను ఎమోషనలై ఆస్తమా తిరగబెడుతోంది. నా రోగానికి నేను చికిత్స చేసుకోకూడదా?’ ఆమె ప్రశ్నించింది.
* * *
ఊరు వదిలే ముందు రోజు క్లోయి తన గదిలో మంచం మీద పడుకుని ఏడవడం టామ్ చూశాడు. అది ఊరు వదుల్తున్న బాధతో వచ్చే దుఃఖం కాదని, ఎగిరెగిరి పడే ఆమె భుజాలని, బుగ్గ మీద ఎర్రటి గుర్తులని చూసి గ్రహించాడు. తన తల్లి చెప్పే దానికి ఎదురు చెప్పకూడదని ఈ మధ్య తను క్లోయికి చెప్పడం ఆపేసాడని స్ఫురించింది. కారణం హెస్టర్ అవివేకని తను గ్రహించడమే.
ఓ తల్లికి స్వంత కూతురి మీద ఇంత ద్వేషం ఉండటం ఎలా సాధ్యం? అని పదేపదే కలిగే ప్రశ్నకి అతనికి జవాబు దొరకలేదు. తను వెళ్లి క్లోయిని ఓదారిస్తే జరిగేది తెలుసు కాబట్టి అతనా పని చేయలేదు.
ఆ రాత్రంతా టామ్ రకరకాల ఆలోచనలతో మేలుకునే ఉన్నాడు. మధ్యలో ఓసారి లేచి నిద్రపోతున్న క్లోరుూని చూశాడు. మానసికంగా అలసిపోయినప్పుడు కలిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోని మార్పుని ఆమెలో గమనించాడు.
మర్నాడు ఉదయం నిద్ర లేచాక క్లోయితో హుషారుగా చెప్పాడు.
‘కొత్త స్కూల్‌కి నీకు కొత్త డ్రెస్ కొంటాను పద’
‘ఇప్పుడు ఎందుకు? మనం వెళ్ళేది ఈ రోజే’ హెస్టర్ అడ్డుపడింది.
‘గంటలో తిరిగి వస్తాం’
తన మాట విననందుకు హెస్టర్ ఎప్పటిలా టామ్ వంక క్రోధంగా చూసింది. కారెక్కబోయే ముందు క్లోయి సందేహంగా అడిగింది.
‘అమ్మ మాట వినకుండా వెళ్తున్నందుకు అమ్మకి కోపం రాదా?’
‘అమ్మ మన ప్రయాణానికి చాలా సన్నాహాలు చేయాల్సి ఉంది’
దారిలో పబ్లిక్ ఫోన్ బూత్ ముందాగి కాలిఫోర్నియాలో తను అద్దెకి తీసుకున్న ఇంటి యజమానికి తను వచ్చే సమయానికి ఇంటి తాళం చెవి పంపే ఏర్పాటు చేయమని టెలిగ్రాం పంపాడు. అక్కడ నించి రైల్వేస్టేషన్‌కి చేరుకున్నాడు. కౌంటర్లోని అందమైన సేల్స్ గర్ల్‌తో చెప్పాడు.
‘శాక్రిమెంటోకి మూడు టిక్కెట్లు రిజర్వ్ చేయించాను’ జేబులోంచి రిజర్వేషన్ కాగితం తీసి చూపించాడు.
‘రిటర్న్ టిక్కెట్టా?’ ఆమె అడిగింది.
‘కాదు. వన్ వే’
ఆమె ఎంతవుతుందో చెప్పింది. జేబులోంచి పర్స్ తీసి నోట్లని ఇస్తూ టామ్ చెప్పాడు.
‘మా ప్రోగ్రాం మారింది. రెండు టిక్కెట్లు మాత్రమే కావాలి’
ఆమె ఇచ్చిన టిక్కెట్లని తీసుకున్నాక క్లోయి అడిగింది.
‘నిజంగా రెండు టిక్కెట్లేనా?’
‘నిజంగా రెండు టిక్కెట్లే’
క్లోయి తండ్రి చేతిని గట్టిగా నొక్కి ఆనందంగా నవ్వింది.
ఎడిటర్స్ నోట్: క్రైం కథల్లో ఆయుధం ఎప్పుడూ కత్తి, తుపాకీ, సుత్తీ, విషం మొదలైనవి. ఉర్సులా కర్టిస్ రాసిన ఈ కథలో ఓ అసాధారణమైన ఆయుధాన్ని వాడింది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి