S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాయకతత్వంలో విమర్శా అనుకూల అంశమే...

‘సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయా
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి’
- ఇది కృష్ణ ఉవాచ. నాయకుడికి ఉండవలసిన ప్రథమ లక్షణాలను ఈ కృష్ణ గీత విశదపరుస్తోంది. రాగద్వేషాలకు అంటే భావోద్విగ్నతలకు అతీతం కాగల నాయకతత్వం అవసరం అన్న ఉద్బోధ కృష్ణుడి మాటలలో కానవస్తుంది.
సుఖాన్ని దుఃఖాన్ని, లాభాన్ని అలాభాన్ని, జయాన్ని అపజయాన్ని సమంగా స్వీకరించగల తత్వం వొంటబట్టించుకోవటమే నాయకత్వ తొలి ప్రతిభా సంపద. ‘తతోయుద్ధాయ’ అనటంలో ‘ఆ తర్వాతనే యుద్ధం’ అనటాన్నిబట్టి ఈ ‘సమ’ సాధన తర్వాతనే నాయక ప్రతిభా సంపన్న కర్తవ్య పరాయణతతో, ఆచరణశీలతతో ముందడుగులు వేయటం. ఆ పడే అడుగులతో లభించే ఫలితంతో ‘పాపాన్ని పొందవు’ అనటంలో వ్యక్తిమత్వ లోపం ఉండదు అన్న అర్థం దాగి ఉంది. అంటే విజయపథంలో ‘అపనింద’లకు తావుండదు అని. ఒకవేళ చిన్న విమర్శ ఎదురైనా అది కూడా విజయాన్ని వరించటానికి ఒక సానుకూల సాధనంగా ఉపకరిస్తుంది తప్ప తదితరం కాదు. ‘టు ఆక్సెప్ట్ క్రిటిసిజమ్ ఈజ్ టు లెర్న్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్’ అనుకునే వాక్యార్థం ఇదే. అంటే, నాయక ప్రతిభకు విమర్శ సైతం అనుకూల అంశనే!
విజన్ అండ్ మిషన్ ఉన్న నాయకుడే విన్నర్ అయ్యేది. అంటే, నాయకుడికి సరియైన దృక్పథం ఉండాలి. దానికి నిర్దేశిత లక్ష్యం జత కలవాలి.. ఆచరణ ప్రణాళికలో స్పష్టత ఉండాలి - ఇవన్నీ ఉన్న వ్యక్తిమత్వంలోనే నాయకత్వం రాణించేది. వీటికితోడు ప్రభావితం చేయగల ప్రతిభ కూడా నాయకత్వానికి తోడవ్వాలి. అందుకే అంటుంటారు ‘లీడర్ షిప్’ అంటే ‘ఇన్‌ఫ్లుయెన్స్... నథింగ్ మోర్, నథింగ్ లెస్’ అని. కమిట్‌మెంట్, డిటర్మినేషన్‌లతో ప్రభావితం చేయగల వ్యక్తిమత్వ సంపన్నులే నాయకులు తప్ప చేంతాడంత అనుచరణ గణం ఉన్నంత మాత్రాన నాయకులని కాదు.. పోగేసిన జనంతో నాయకత్వం సిద్ధించదు. ఒక్క దార్శనికత, ఆచరణ శీలతతోనే నాయకత్వం శోభించేది.
ఇలా ఎంతలా చెప్పుకున్నా కొన్నికొన్ని సమయాలలో, కొన్నికొన్ని సందర్భాలలో అసందిగ్ధత చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. క్లిష్ట పరిస్థితుల్లోను ఈ అసందిగ్ధత మేకై దిగబడుతుంది. ఇలా క్రాస్‌రోడ్స్‌లో ఉన్నప్పుడు ‘సమ దర్శనం’తో, ‘స్వభావ సిద్ధత’తో, ‘సరియైన డైరెక్షన్’లో ముందడుగులు వేయగలవాడే నాయకుడవుతాడు. ఈ దార్శనికత నుండే లీడర్ ‘ఐడెంటిటీ’ వెలుగులోకి వచ్చేది.. నాయక అస్తిత్వం పరివ్యాప్తమయ్యేది.. పదుగురినీ ఆకట్టుకునేది.. పదిమందికీ ఆమోదయోగ్యమయ్యేది.. పదిమందినీ ఆచరణ పథంలో సమాయత్తపరచగలిగేది.
అంతమాత్రాన లీడర్ కేవలం ‘విజనరీ’ అయితే సరిపోదు... సర్వీస్ ప్రొవైడర్ కూడా అయి తీరాలి. ఇక్కడ సర్వీస్ అంటే కేవలం సేవా దృక్పథం అని మాత్రమే కాదు. దానికి మార్గదర్శనం, మార్గనిర్దేశనం కూడా జతకలవాలి. అంటే, మార్గదర్శకుడు, మార్గనిర్దేశకుడే ప్రతిభా సంపన్నుడైన నాయకుడన్నమాట.
ఇక్కడ నాయక లక్షణంగా ఇంకొక అంశాన్ని కూడా చెప్పుకోవాలి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అంటే ఒక మెట్టు నుండి మరో పై మెట్టుకి ఎక్కించగలవాడే నిజమైన నాయకుడు -అని. ఇంకొక మాట - తాను నేర్వటం - పది మందికీ నేర్పించటం - నాయక ప్రయాణంలో నిరంతర ప్రణాళిక అయి ఉండాలి. ఇటువంటి లక్షణ శోభితుడైన నాయకుడే ‘ఎఫెక్టివ్ లీడర్’ అనిపించుకుంటాడు.
నాయకుడు ఇతరులను ప్రభావ పరచగల ప్రతిభ కలవాడైనప్పటికీ ముందు తనలోని ప్రతిభను గుర్తెరిగి ఉండటం ముఖ్యం. తనలోని ఆ ప్రత్యేకతలే ఇతరులపై పాజిటివ్ ఇంపాక్ట్‌ను కలుగజేస్తాయి. తనవే అయిన ప్రత్యేక లక్షణాలే తన వ్యక్తీకరణ సాధనాలవుతుంటాయి. అవే ప్రామాణిక సందేశాలవుతుంటాయి. అంతే తప్ప అధికారంతో ప్రభావితం చేయాలనుకోవటం పొరపాటు. ఇంతటి ప్రతిభా సంపన్నుడైన నాయకుడే తాను చతికిలపడడు, ఇతరులనూ చతికిలపడనివ్వడు. తాను తలెత్తుకు ఉండాలంటే తనను తాను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటుండాలి. ఆ స్వ పరీక్షలో మైనస్ మార్కులు పడకుండా జాగ్రత్త పడుతుండాలి. పైగా అనుచరులను నొప్పించకుండా తన ఆచరణ పథం సాగాలి.
ఇలా చూసినపుడు కురుక్షేత్రమైన కర్మక్షేత్రంలో అర్జునుడిది అవసరం. తనను రథసారధిగా చేసుకోవటంతో అర్జునుడు తనను తలకెత్తుకున్నాడన్న విషయాన్ని గ్రహించినవాడు కృష్ణుడు. అందుకే తన అనుచరుడైన అర్జునుడి అవసరానికి తన ఆచరణ పథకాన్ని జోడించాడు.. చతికిలపడ్డ అర్జునుడ్ని సమరానికి సమాయత్తం చేయగలిగాడు. కాబట్టే, గీతోపదేశంతో కృష్ణుడు ‘ఆథంటిక్ లీడర్’ అనిపించుకున్నాడు. హృదయ దౌర్బల్యంతో నిర్వీర్యుడైన అర్జునుడ్ని తన గీతోపదేశంతో స్వస్థపరచి ఆచరణ పథం పట్టించటం అంటే కృష్ణుడు ఎఫెక్టివ్ లీడర్ అనే అర్థం.
ప్రభావపరచగల ప్రతిభామూర్తుల్ని ఎఫెక్టివ్ లీడర్స్ అన్నంత మాత్రాన వారు ఆథంటిక్ లీడర్స్ అని కాదు.. ఏ నాయకత్వ లక్షణాలలో నైతిక విలువలు, ధర్మాధికారత కలగలిసి ఉంటాయో అటువంటి నాయకులనే ప్రామాణిక నాయకులుగా పరిగణించాలి. నైతిక విలువల రక్షణ, ధర్మ సంరక్షణల విషయంలో కృష్ణుడు ఎఫెక్టివ్ అండ్ ఆథంటిక్ లీడర్ కూడా. కాబట్టి ‘లీడర్’ అంటే ‘ఎమ్‌పవర్డ్ టు క్రియేట్ ఎ బెటర్ వరల్డ్’ అని.
* * *
ఈనాడు మనం నాయకత్వాన్ని స్ట్రాటజిక్ లీడర్‌షిప్, డైరెక్టివ్ లీడర్‌షిప్, టీమ్ బిల్డింగ్ లీడర్‌షిప్, ఆపరేషనల్ లీడర్‌షిప్ అని నాలుగు తెరగుల చెప్పుకుంటున్నప్పటికీ ఈ చతుర్ముఖాలను కృష్ణుడిలో చూడగలం. ఇలా నాయకత్వ శోభాపరంగా కృష్ణుడ్ని మనం చతుర్ముఖ కృష్ణుడు అనీ చెప్పుకోవాలి. మొత్తానికి నాయక కృష్ణుడ్ని చతుర్ముఖుడని అంటున్నా, మరో విశేషాంశా సంపన్నుడిగా చెప్పుకుంటున్నా స్వభావసిద్ధ నాయకుడే.. అంటే నేచురల్ లీడర్ అనే.
ఇక్కడ, స్వభావసిద్ధ నాయకుడు అంటే తన స్వభావానికి అనుగుణంగా అనుచర గణాన్ని నడిపేవాడు అని మాత్రమే కాదు.. అనుచరుల స్వభావాలను ఎరిగి వారికి మార్గదర్శనం చేసే మార్గనిర్దేశకుడు అనీ అర్థం. ఒక విధంగా ఈ స్వభావ సిద్ధతతో నాయకుడి ప్రతిబింబం అనుచరులయితే, అనుచరులకి ప్రతిబింబం నాయకుడు అవుతుంటాడు. ఇలా కురుక్షేత్రంలోని కృష్ణుడు స్వభావసిద్ధ నాయకుడే.. అనుచరుడిలా అనిపించే అర్జునుడూ స్వభావ సిద్ధ నాయకుడే.
పార్థుడు స్వభావసిద్ధ నాయకుడు కాబట్టే తాను అస్త్రం చేత పట్టేటప్పటికి తనలోని కోపమూ, తనలోని కాంక్షా వైరి వర్గంలోని బంధుగణంలోనూ చూడగలిగాడు. తన మానసిక ప్రతిబింబాన్ని అయిన వారైన శత్రువర్గంలో చూసుకుంటే తప్ప తన అసలు రూపం కళ్ల ముందు ప్రత్యక్షం కాలేదు పాండవ మధ్యముడికి.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946