S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనిషికి మనిషి

ప్రత్యేక బహుమతి
రు.2,500 పొందిన కథ
**
‘ఏమైంది శ్రీనూ.. కారెందుకు ఆపావ్?’
‘నేనాపలేదు సార్.. అదే ఆగిపోయింది’
‘అదే ఆగిపోయిందా?.. ఎందుకాగిపోయిందీ..?!’
‘అదే నాకూ అర్థం కావడంలేదు సార్..’
మూడ్నాలుగు సార్లు ఇగ్నీషన్ తిప్పుతూ కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు కాని, ‘క్లచ్చ్‌చ్చ్‌చ్చ్..’ అన్న చప్పుడు వచ్చిందే తప్ప కారు మాత్రం స్టార్ట్ కాలేదు.

‘ఉండండి.. చూస్తాను!’ అంటూ డోర్ తీసుకుని కిందికి దిగి కారు ముందు వైపు వెళ్లి బోయ్‌నెట్ ఎత్తిపెట్టి, లోపలికి తొంగిచూస్తూ అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేదో చెక్ చేయసాగాడు.. డ్రైవర్ శ్రీనివాస్.
కారు వెనుక సీట్‌లో కూర్చున్న భూపతి నాయుడు అసహనంగా కదిలాడు. ఓసారి చేతికున్న వాచీ చూసుకున్నాడు. సాయంత్రం ఆరున్నర దాటింది.
కిటికీ అద్దం కిందకి దింపి బయటకి చూశాడు. చీకట్లు ముసురుకుంటున్నాయి. తారురోడ్డుకి రెండు వైపులా ఎత్తుగా పెరిగి వున్న చెట్లు రోడ్డుని మరింత చీకటి చేస్తున్నాయి. మరో యాభై రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ‘వెంకటాపురం’ చేరుకోగలమని రోడ్డుపక్కనున్న మైలురాయిని చూస్తే అర్థమయింది.
‘ఉన్నట్టుండి ఈ కారు ఎందుకు ఆగిపోయిందబ్బా..’ అనుకుంటూ నెమ్మదిగా డోర్ తీసుకుని కిందికి దిగిన భూపతి నాయుడు ‘ఏమైంది శ్రీనూ.. ఏమిటి ట్రబుల్?’ అనడిగాడు.
బోయ్‌నెట్ మూసి, దగ్గరికొస్తూ అన్నాడు శ్రీనివాస్ - ‘అన్నీ సరిగ్గానే ఉన్నాయ్ సార్... అయినా కారెందుకు ఆగిపోయిందో, మళ్లీ ఎందుకు స్టార్ట్ కావడం లేదో తెలీడం లేదు..’
‘అయితే ఇప్పుడేం చేయాలంటావ్‌రా?’ ఎటూ పాలుపోనట్లుగా అడిగాడు భూపతినాయుడు.
‘మెకానిక్‌కి చూపిస్తే తప్ప విషయమేంటో అర్థం కాదనిపిస్తోంది సార్!’
‘ఈ టైమ్‌లో మనకి మెకానిక్ ఎక్కడ దొరుకుతాడు శ్రీనూ? ముందుకైనా, వెనకకైనా కనీసం ఓ పాతిక కిలోమీటర్లు వెళ్తే కానీ ఏ ఊరూ వచ్చేట్లు కన్పించడం లేదు. పైగా, ఈ రోడ్డు మీద గంట నుంచి ఒక్క వెహికిల్ కూడా మనకి కన్పించలేదు కదా!’ అంటూ జేబులోని సెల్‌ఫోన్ తీసి ఎవరికో డయల్ చేయబోయాడు భూపతి నాయుడు. కానీ, దురదృష్టం రెట్టింపయినట్లు సెల్‌ఫోన్‌లో కూడా ఛార్జింగ్ అయిపోయి ‘డిస్‌ప్లే’ లేదు.
‘సార్.. ఇలా ఎంతసేపని ఉంటాం? నేను మెకానిక్ కోసం వెళ్తాను.. ఈలోగా ఏదైనా వెహికిల్ వస్తే మీరు లిఫ్ట్ అడిగి వెంకటాపురం చేరుకోండి..’ అని కారులోంచి టార్చ్‌లైట్ తీసుకొని వెంకటాపురం వైపు కాలినడకనే బయల్దేరాడు శ్రీనివాస్.
చేసేదేం లేక ఉస్సూరుమంటూ కారుకి ఆనుకొని నిల్చున్నాడు భూపతి నాయుడు - ఏదైనా వెహికిల్ వస్తే ‘లిఫ్ట్’ అడుగుదామని. చుట్టూరా చీకట్లు చుట్టుముట్టేస్తున్నాయి...
అలా గంటకు పైగా ఎదురుచూసినా.. ఆ దారిన ఒక్క వాహనమూ రాలేదు.
‘ఏంది సారూ.. ఈడున్నావు? యాడికి బోవాల?’
- అన్న మాటలు విన్పిస్తే తల తిప్పి చూశాడు భూపతి నాయుడు.
వెనె్నల వెలుగులో అతడికి కాస్త దూరంలో సైకిలు మీద వస్తూన్న ఓ పల్లెటూరి ఆసామి కన్పించాడు.
అతడు దగ్గరికి రాగానే విషయం చెప్పాడు - వెంకటాపురంలో ఉన్న తన మిత్రుడి ఇంట్లో జరిగే ఓ కార్యక్రమానికి హాజరవ్వాలని బయల్దేరితే ఇలా మధ్యలో కారు ఆగిపోవడం, మెకానిక్ కోసం డ్రైవర్ వెళ్లటం, వెహికిల్ ఏదైనా వస్తే ‘లిఫ్ట్’ అడుగుదామని తానిలా ఎదురుచూడ్డం..!
అంతా విని, ‘రుూ రేతిరి రుూ రోడ్డు మీద యింక యే వాహనమూ తిరగదు సారూ! నన్ను ‘నారాయణ’ అంటారు. రుూడకి దగ్గర్లోనే మా యిల్లుండాది. రుూ రేతిరికి మా యింట్లో బడుకొని పొద్దునే్న పోదువుగానిలే!’ అన్నాడు.
నిజానికి అతడు రాక ముందే భూపతి నాయుడు అనుకుంటూ ఉన్నాడు. ‘ఈ రాత్రి.. ఈ చలిలో.. ఇలా రోడ్డుపైనే జాగారం చేస్తూ గడపాల్సొస్తుందో, ఏమిటో?’ అని. అలాంటిది - నారాయణ వచ్చి తన ఇంటికి రమ్మనే సరికి కాస్త ఊరట కలిగినట్లనిపించినా - ఓ రెండు క్షణాలు ఆలోచించాడుస. ‘ఈ పల్లెటూరి బైతును నమ్మేదెలా? ఒకవేళ నమ్మినా ఇతనికి ఏ పూరిపాకో, రేకుల ఇల్లో అయితే అక్కడెలా ఉండేట్లు?’ ఎంత రాత్రయినా వెంకటాపురం చేరుకోవడమే మేలుగా అనిపించింది భూపతి నాయుడికి. కానీ, ఆ అవకాశమే దరిదాపులల్లో కనిపించటం లేదు.
‘్ఫర్వాలేదులే నారాయణా! నేను ఎలాగోలా వెళ్తాలే!’ అన్నాడు అన్యమనస్కంగానే.
నారాయణ ఏమనుకున్నాడో, ఏమో.. ‘ఎలాగెల్తావు సారూ? ఈ సీకట్లో, సలిలో ఎంతసేపిట్టా రోడ్డుమీదుంటావు? రేతిరయ్యే కొద్దీ యెముకలు కొరికే సలికి తట్టుకోగల ననుకుంటుండావా? నా మాటినీ.. రా.. కూసో.. మా యింటికెల్దాం!’ అంటూ భూపతి నాయుడు అనుమతి కోసం చూడకుండానే సైకిల్‌ని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టాడు.
భూపతి నాయుడు కాసేపు తటపటాయించి సైకిల్ క్యారియర్ మీద కూర్చున్నాడు. ఆటోల్లో, రిక్షాల్లో తిరిగే పరిస్థితి కాదు ఆయనదిప్పుడు.
దారిపొడవునా, నారాయణ ఏదో ఒకటి మాట్లాడుతునే ఉన్నాడు - పెరిగిపోతున్న ఖర్చులూ, దళారుల ఆగడాలూ, తమలాంటి రైతుల పాట్లు, కొండెక్కి కూర్చున్న ధరలూ.. ఇలా ఏవేవో!
నాయుడు ‘ఊఁ..’ కొడ్తూనే ఆలోచిస్తున్నాడు. ఆయన మనసు పరిపరి విధాల యోచిస్తోంది. ‘సమయానికి తన కారు డ్రైవర్ కూడా లేడు. ఈ నారాయణ గాడింట్లో వసతి ఎలాగుంటుందో, ఏమో?! అక్కడ బాత్రూమ్‌లు ఉన్నాయో, లేవో?! ఉదయానే్న ఏ చెరువు కట్టో చూపించడు కదా! అయినా - వీడ్ని ఎంతవరకు నమ్మొచ్చో, ఏంటో?’
బలమైన కుదుపుతో సైకిల్ ఆగడంతో ఇహలోకంలోకి వచ్చాడు భూపతి నాయుడు.
ఓ రేకుల షెడ్డు లాంటి ఇంటి ముందు ఆగి వుంది సైకిల్.
నారాయణ సైకిల్ దిగడంతోనే మూడేళ్లు, ఐదేళ్లు వయసు గల పిల్లలు అతణ్ణి చుట్టేశారు. జేబులోంచి వేరుశెనగ ఉండలు తీసి వాళ్లకిచ్చి, ‘నా మనవలు సారూ!’ అని నాయుడికి పరిచయం చేసి ఇంట్లోకి దారి తీశాడు నారాయణ.
రేకుల ఇల్లయినా ఓ పద్ధతి ప్రకారం ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది వుండడం చూసి ముచ్చటేసింది నాయుడుకి. లోవోల్టేజీతో వెలుగుతున్న కరెంటు బల్బు తన గుడ్డివెలుగుని గది మొత్తం సమానంగా పరచడానికి శాయశక్తులా శ్రమిస్తూ ఉంది. గదిలో ఓ మూల పలుగూ, పారలూ, తట్టలూ బోర్లించి వున్నాయి.
గోడకి ఆనించి పెట్టిన ఓ ఇనుప కుర్చీని తెచ్చి వేస్తూ ‘కూసో సారూ! కాస్త ఉడుకుడుగ్గా నీళ్లు పోస్కుంటే అలసట పోద్ది. ఈలోపల్నే భోజనం తయారవుద్ది!’ అని వంట గదిలోకి వెళ్లబోయిన నారాయణతో -
‘అరెరెఁ.. భోజనం గట్రా ఇప్పుడెందుకులే నారాయణా..’ అని నాయుడు అంటూండగానే-
‘అదేంది సారూ.. యే యేలప్పుడు తిన్నావో, యేందో! యెంతసేపూ.. కాసేపట్లో తయారుగాదూ?’ అంటూ అక్కడ్నుంచి కదిలి, వంటగదిలోకి వెళ్లి భార్యకు కాబోలు - లోగొంతుకతో ఏవో ఆదేశాలు జారీ చేశాడు. పది నిమిషాల్లో భూపతి నాయుడికి ఉతికిన తువావలు, కొత్త సబ్బు అందించి పెరట్లోని మల్లెచెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు.
రెండు బకెట్లలో వేడినీళ్లు సిద్ధంగా ఉన్నాయక్కడ. నాయుడు స్నానం ముగించుకొని వచ్చేసరికి గదిలో గచ్చు నేలపై పీటలు వాల్చి అరిటాకులు పరచి వున్నాయి.
‘మా యింటి బోజనం నీకు నచ్చుతాదో, లేదో?! రుూ పూటకి ఎట్నో సర్దుకో సారూ!’ అంటూన్న నారాయణ మాటల్లోని ఆత్మీయతకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి భూపతి నాయుడికి.
నారాయణ భార్య లక్ష్మమ్మ ‘యింకొంచెం యేసుకో సారూ!’ అంటూ కొసరి కొసరి వడ్డిస్తూంటే.. ఎందుకో - ఆ సమయంలో తన కన్నతల్లే గుర్తొచ్చిందాయనకి.
వేడివేడి అన్నంలో ఆవకాయ, పాలకూర పప్పు, పెరుగుతో భోజనం ముగించి లేచేసరికి నారాయణ మనవడు రెండు అరటి పళ్లు తీసుకొచ్చి అందించాడు.
రేకుల ఇంటి ముందు ఆరు బయట పరచి వున్న నులకమంచంపై కూర్చొని, అక్కడే ఆడుకుంటున్న నారాయణ మనవడూ, మనవరాలినీ చూస్తూ భూపతినాయుడు భుక్తాయాసం తీర్చుకుంటూండగా.. లోపల్నుంచి వచ్చాడు నారాయణ.
నాయుడికి మనసులో మాత్రం ‘్ఫ్యనూ, బాత్రూమ్ లేని ఈ ఇంట్లో ఒక రాత్రి ఎలా గడపాలి?’ అన్న ఆలోచన మెదుల్తూనే ఉంది.
‘రేయ్‌ఁ... పిలకాయలూ... యెంతసేపురా మీ ఆటలూ? పడుకొనేది లేదా? రేప్పొద్దున ఇస్కూలుకి బోవాలి గదా.. పోయి పడుకోండి!’ అని మనవలిద్దరినీ కసిరి ఇంట్లోకి తరిమి, ‘శాన అల్లరోళ్లు సారూ.. ఐనా, సదువులో మాత్రం తోటిపిలకాయల కంటే బాగా సదూతార్లే! వీళ్ల అమ్మా, నాయనా - అదే.. నా కొడుకూ, కోడలూ పనికోసం పక్కూరికి పోయున్నారు. అసలే పనుల్లేవాయె.. ఎక్కడ పని దొరికితే ఆడికి బోవాల గదా! అసలీ మధ్య పనుల్లేక...’
భూపతి నాయుడు చిటికెలు వేస్తూ ఆవులించడం చూసి నారాయణ మాట్లాడ్డం ఆపి - ‘పద సారూ! నువ్వు బాగా అలసిపోయుండావు. నీ పడక రుూడ గాదు. నాలుగిండ్లవతల నా తమ్ముడి కూతురి ఇల్లుండాది. వాళ్లాయన పక్కూర్లో పంచాయితీ ఆపీసులో క్లరకులే! ఆడ నీకు మంచి రూమూ, ప్యానూ ఉంటాది. బాత్రూములూ, అవీ సౌకెర్యెంగా ఉంటాయి. ఈడ నీకు యిబ్బందేలే!’ అని నాయుడుని బయల్దేరదీశాడు.
భూపతి నాయుడుకి ప్రాణం లేచివచ్చినట్లయ్యింది.
అక్కడికి వెళ్లాక నాయుడుని బయటే ఉండమని చెప్పి, వాళ్లింట్లోకి వెళ్లిన నారాయణ అక్కడ ఏం చెప్పి వచ్చాడో ఏమో... ఐదు నిమిషాల్లో నాయుడుకి మేడపైన గదిలో ముచ్చటగా ఏర్పాటు చేసిన పడక, దాని మీదకి ఇస్ర్తి చేసి వున్న దుప్పటి అమర్చబడ్డాయి.
పంచాయితీ ఆఫీసులో ఉద్యోగిగా పరిచయం చేయబడిన రాంబాబుకి నారాయణ మాట వేదవాక్కులా ఉన్నట్లుంది. భూపతి నాయుడుని అభిమానంగా పలకరించి కొత్తదనమూ, బిడియమూ పోయేలా చేశాడు. రాంబాబు పిల్లలు నాయుడికి గాలి తగిలేలా టేబుల్ ఫ్యాన్ అమర్చారు.
వాళ్లతో మాటల్లోకి దిగిన భూపతి నాయుడు ఆ పిల్లలు చెప్పే పద్యాలూ, పాడే పాటలూ వింటూ ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు.
* * *
కిటికీలోంచి వెచ్చటి కిరణాలు మొహం మీద పడేసరికి మెలకువ వచ్చింది నాయుడుకి.
అప్పటికే బారెడు పొద్దెక్కినట్లుంది. టైమ్ చూసుకొని ఎనిమిదవుతుండటంతో ఉలిక్కిపడ్డాడు. నిన్నటి బడలికతో ఒళ్లెరుగని నిద్ర వచ్చేసిందాయనకి. బయట ఎంతసేపట్నుంచి కాచుకొని వున్నాడో గానీ, నాయుడు మంచం దిగగానే గబగబా దగ్గరికొచ్చేశాడు నారాయణ-
‘సారూ.. మంచి నిద్ర పట్టేసినట్టుంది. సరే.... నేను పన్లోకి పోతావుండా! ఇది మీ యిల్లే అనుకో. స్నానం చేసి, నాష్టా చెయ్యి. ఓపికుంటే మా ఊర్లో రాములోరి గుడికెల్లు.. శానా బాగుంటాది!’ అని, ఇంకా ఏదో చెప్పబోయేంతలో...
నాయుడు తేరుకొని ‘నారాయణా! ఇప్పటికే నీకు చాలా శ్రమ కలిగించాను. నువ్వు నీ పని మీదుండు.. నేనిక బయల్దేరుతాను!’ అన్నాడు.
‘సరే సారూ! నీ కాపీ, పలహారం పూర్తయ్యేసరికి నేను బోజనం చేసుకొని వచ్చేస్తా!’ అని నారాయణ వడివడిగా వెళ్లిపోయాడు.
భూపతి నాయుడికి ఆ రోజు కూడా ఏర్పాట్లు బాగానే జరిగాయి. వేడినీళ్లు, షాంపూ సాచెట్లతో స్నానం చేసి వచ్చేసరికి వేడి పెసరట్లు, మంచి కాఫీ! అన్నీ పూర్తయ్యి పిల్లలతో కబుర్లాడుతూండగా నారాయణ సైకిల్‌తో వచ్చాడు. అక్కడ నుంచి భూపతి నాయుడుని మెయిన్ రోడ్డు దగ్గర దింపాడు.
ఉదయమే ఫోన్‌లో మాట్లాడి వుండటంవల్ల అప్పటికే కారు రిపేరు చేయించుకొని వచ్చి మెయిన్ రోడ్డు మీద ఎదురుచూస్తూ వున్నాడు డ్రైవర్ శ్రీనివాస్.
‘సారూ... మీరు ఊరు చేరేసరికి మద్యాన్నం దాటుతాదేమో! దారి మధ్యలో యెక్కడా బోజనం బాగుండదు. ఈ పెరుగన్నం ప్యాకెట్టు ఉంచండి.. గడ్డపెరుగుతో మా యింట్లో చేయించి తెచ్చాను’ అని బలవంతంగా నాయుడు చేతిలో ప్యాకెట్టు ఉంచాడు నారాయణ.
‘పరిచయస్తులే మనకేదైనా పనిబడితే తప్పించుకు తిరిగే ఈ రోజుల్లో... స్వార్థమే పరమావధిగా సర్వత్రా రాజ్యమేలుతున్న ఈ కాలంలో... ఏదో రోడ్డు మీద సహాయం కోసం చూస్తున్న తన కోసం ఇంత శ్రమపడిన ఈ మహానుభావుడికి తాను ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి!’ అనిపించింది నాయుడికి.
‘నారాయణా! నీ సహాయం, ఆదరణ నేనెప్పటికీ మర్చిపోలేను. నిన్నట్నుంచి నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను.. ఏమనుకోకపోతే చెప్పు.. నేనెవరో తెలీకపోయినా, ఇప్పటివరకు కనీసం నా పేరు కూడా అడగకుండా, తెలుసుకోకుండా నాకింత సహాయం చేసి, ఆదరించావు, ఎందుకు?’ మనసంతా ఆర్ద్రమై.. కళ్లలో అభిమానం ప్రతిఫలిస్తుండగా అడిగాడు భూపతి నాయుడు.
నారాయణ తేలిగ్గా నవ్వేశాడు - ‘ఇందులో నేను చేసింది ఏముందిలే సారూ! ఐనా... మనిసికీ, మనిసికీ మధ్య ఈ మాత్రం ఇచ్చిపుచ్చుకోవడాలు లేకపోతే ఎట్టా? ఒక మనిసి కస్టంలో వుంటే ఈ మాత్రం సాయం చేయకపోతే ఇంకోడు మనిసెట్లా ఔతాడు?’
ఆశ్చర్యంగా చూశాడు భూపతి నాయుడు. ‘చదువుకోకపోయినా - సాటి మనిషి పట్ల మనుషులకి ఉండాల్సిన దృక్పథాన్నీ, ‘మనిషితనాన్నీ’ ఎంత తక్కువ మాటల్లో ఎంత స్పష్టంగా చెప్పాడో కదా!’ అన్పించింది.
చదువుకీ - సంస్కారానికీ, విద్యకీ - విచక్షణకీ సంబంధం ఉండి తీరాల్సిన అవసరం లేదనిపిస్తోంది నారాయణని చూస్తూంటే. నారాయణ పట్ల తన మనసులోని ‘కృతజ్ఞత’ని వ్యక్తం చేయాలనుకుంటూ.. పర్సులోంచి రెండు రెండువేల రూపాయల నోట్లు తీసి అతడి చేతిలో పెట్టబోయాడు నాయుడు.
నారాయణ గబుక్కున తన చేతుల్ని వెనక్కి తీసేసుకుంటూ ‘ఏంది సారూ.. యిది? నేనే్జసిందాన్ని డబ్బుతో కొలుస్తున్నావా?’ అన్నాడు నిష్ఠూరంగా.
భూపతినాయుడు నొచ్చుకుంటూ ‘్ఛఛ... నా ఉద్దేశం అది కాదు నారాయణా! నీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలీక...’ అన్నాడు.
‘చెప్తిని కదా సారూ... సాటిమనిషిగా నేనే్జయగలిగింది చేశా. అట్టాగే కస్టంలో ఉన్నోళ్లకి ఓ మనిసిగా నీకు చేతనైంది చేయి సారూ... అదే ఋణం తీరే దారి!’ అని, ఇంకా భూపతి నాయుడు తన వంటే విస్మయంగా చూస్తూండిపోవటం గమనించి - ‘సరేగానీ, వేరే ఆలోచనేదీ చేయకుండా భద్రంగా పోయిరా సారూ! నేనెల్తాను మరి!’ అంటూ సైకిలు వెనక్కి తిప్పుకొని బయల్దేరాడు నారాయణ.

-ఎస్వీ కృష్ణజయంతి 90009 29663