S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉన్నత పీఠంపై ఉద్దండుడు

‘రామ్‌నాథ్ కోవిందా.. ఎవరితను?
ఈ పేరు పెద్దగా వినలేదే?
రాష్టప్రతి పదవికి అతని పేరును ఎన్‌డిఎ ప్రకటించినపుడు వికీపీడియాలో వెతికితేగానీ అతనెవరో తెలియలేదు’..
- ఇదీ మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్య.
ఔనా.. అతడు అంత పేరులేనివాడేనా? అది నిజమేనా?
కేవలం భారతీయ జనతా పార్టీకి చెందినవాడైనందునే ఈ విమర్శా?
దళితుడైనందున ఆ వర్గం ఓట్ల కోసం, వారి మద్దతు కోసమే అతడిని పోటీకి నిలబెట్టారా? అంతేనా? అతడి అర్హత అదొక్కటేనా? వాస్తవాలు తెలుసుకుంటే.. అతడి విలక్షణ వ్యక్తిత్వం అర్థం చేసుకుంటే అసలు విషయం బోధపడుతుంది.. అతడు సామాన్యుడు కాదని.. ఉద్దండుడని.
‘లా’ చేసిన కోవింద్ నిజానికి ఐఎఎస్ అవ్వాలనుకున్నారు.
కానీ న్యాయవాదిగా మారిపోయారు.
ఆ రంగంలో స్థిరపడాలనుకున్నారు.
కానీ రాజకీయాల్లోకి వచ్చారు.
కాంగ్రెసేతర తొలి ప్రధాని మొరార్జీకి పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసిన రామ్‌నాథ్ కోవింద్ ఇప్పుడు కాంగ్రెసేతర పార్టీల మద్దతుతో రాష్టప్రతి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు.
బీహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడు..ఉత్తరాదిలోని రాష్టప్రతి వేసవి విడిది ‘మషాబ్రా’ సందర్శనకు ముందస్తు అనుమతి లేదన్న కారణంగా నిరాకరింపబడిన కోవింద్ మున్ముందు సాధికారికంగా రాష్టప్రతి హోదాలో అడుగుపెట్టనుండటం విశేషం.
***
దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా, వౌనంగా, ప్రచార ఆర్భాటాలకు దూరంగా తనపని తాను చేసుకుని వెళ్లిపోతున్న ఓ అసాధారణ వ్యక్తి రామ్‌నాథ్ కోవింద్. ఎవరి గుర్తింపును కోరుకోని, గుర్తింపుకోసం తాపత్రయపడని నిరాడంబరుడు, నిగర్వి, విలక్షణ వ్యక్తి కోవింద్. అంతా అనుకున్నవిధంగా జరిగితే భారతదేశ పధ్నాలగవ రాష్టప్రతిగా ఈ నెల 25న బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తి రామ్‌నాథ్ కోవింద్. ఎన్‌డిఎ పక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగి, కొన్ని విపక్షాలనూ ఆకర్షించి, కాంగ్రెస్ సారథ్యంలోని కొన్ని ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన మీరాకుమార్‌పై విజయం ఖాయమని భావిస్తున్న తరుణంలో ఆయన వ్యక్తిత్వాన్ని, గొప్పదనాన్ని చాటిచెప్పే ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలు కోవింద్ కేవలం ‘దళితుడు’ అన్న ముద్రను చెరిపేసి అతడు ‘అసామాన్యుడు’ అని నిరూపిస్తాయి.
పేదకుటుంబం నుంచి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా డెరాపూర్ సమీపంలోని పరౌఖ్ అనే కుగ్రామంలో మైకులాల్ అనే పేద రైతు ఏడుగురి సంతానంలో రామ్‌నాథ్ కోవింద్ ఒకరు. ఇతడి ఐదేళ్ల వయసులో ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి తల్లి మరణించింది. అక్కచెలెళ్లే అతడిని గారాబంగా పెంచారు. చదువులో చురుకుగా ఉండే రామ్‌నాథ్ ప్రాథమిక విద్యను పరౌఖ్‌లోను, ఉన్నత విద్యను అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలోని మరో గ్రామంలోను చదివారు. ఆ తరువాత పై చదువులకు కాన్పూర్ వెళ్లారు. అక్కడే లా పూర్తి చేశారు. బ్రాహ్మణులు, బినియాలు ఎక్కువగా ఉండే పరౌఖ్‌లో తండ్రి మైకులాల్ ఆయుర్వేద వైద్యం చేసేవారు. చిన్న దుకాణాన్ని నడిపేవారు. ఒక్కోసారి పిల్లల ఫీజులు కట్టలేని స్థితి ఉండేది. ఎప్పటికైనా గ్రామంలో ఓ దేవాలయం కట్టాలన్నది మైకులాల్ ఆరాటం. రామాయణంపై పట్టు, ‘రామ్ రామ్’ అన్న పదాలను వల్లెవేయడం అతడికి ఇష్టం. దళితుల్లో కోలీ వర్గానికి చెందిన ఈ కుటుంబానికి పూట గడవడం కష్టంగానే ఉండేది. ఓ ఆలయంలో పూజారిగానూ మైకులాల్ వ్యవహరించారు. చివరకు ఆలయమూ కట్టారు. ఆ తరువాత ఆ గ్రామంలో జరుగుబాటు కాక కుటుంబం కాన్పూర్‌కు, ఆ తరువాత ఢిల్లీకి మకాం మార్చింది. అదే అతడి జీవితాన్ని మార్చేసింది. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాక పేదలకు, మహిళలకు, వృద్ధులకు అండగా నిలిచిన రామ్‌నాథ్ కోవింద్ చాలా కేసులను ఉచితంగానే వాదించారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో దాదాపు పదహారేళ్లు న్యాయవాదిగా పనిచేశారు. అంతకుముందు కేంద్రప్రభుత్వ న్యాయవాదిగా పదేళ్లపాటు సేవలందించారు. అతడి తండ్రి మైకులాల్‌కు గ్రామంలో పట్టుండేది. మొరార్జీదేశాయ్‌తో ఆయనకు పరిచయం ఉంది. ఆ పరిచయం ఎంతటిది అంటే.. రామ్‌నాథ్ కోవింద్ వివాహానికి స్వయంగా మొరార్జీ హాజరైనంత. చివరకు దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినపుడు వ్యక్తిగత కార్యదర్శిగా రామ్‌నాథ్ కోవింద్ సేవలందించారు.
అనుకున్నది ఒకటి...
నిజానికి చదువులో చురుకుగా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను స్కూల్ టీచర్లు ఎప్పుడూ మెచ్చుకునేవారు. కాన్పూర్ డిఎవిలో, ఆ తరువాత యూనివర్శిటీలో ఉన్నత చదువుల్లోనూ కోవింద్ రాణించారు. అయితే అతడి దృష్టి అంతా సివిల్స్ పైనే. దానికోసమే ఢిల్లీకి మకాం మార్చారు. తొలి రెండు ప్రయత్నాలు విఫలమైనాయి. మూడో ప్రయత్నంలో సివిల్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. కానీ ఐఎఎస్ అవకాశం రాలేదు. మిగతా విభాగాల్లో అవకాశం వచ్చినా ఆయన ఇష్టపడలేదు. చివరకు ‘లా’ ప్రాక్టీసుకే మొగ్గుచూపారు. సుదీర్ఘకాలం ఆ వృత్తిలో ఉండి పేదలకు, మహిళలకు అండగా నిలిచారు.
పేదలన్నా.. చదువన్నా ప్రాణం..
మనిషి ఎదగడానికి, సగర్వంగా, స్వాభిమానంతో జీవించడానికి విద్య కీలకమని ఆయన భావిస్తారు. ఎప్పుడూ చదువు గురించే ఆలోచిస్తారు. ముఖ్యంగా పేదవర్గాల విద్యాభ్యాసంపై ఆయన దృష్టి ఎక్కువ. రాజ్యసభ సభ్యుడిగా పనె్నండేళ్లపాటు పనిచేసిన ఆయన తన ఎంపిలాడ్స్ నిధులలో మెజారిటీ మొత్తాన్ని విద్యారంగానికే వెచ్చించారు. రాజకీయాల్లోకి వచ్చాక చాలామంది సొంత ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ కోవింద్ తను పుట్టిన ఊరిని పూర్తిగా మార్చేశారు. సిమెంట్, పక్కారోడ్లు, బోరుబావులు వేయించారు. స్కూలు భవనాలు, జూనియర్ కళాశాల.. ఇలా అన్ని సౌకర్యాలు కల్పించారు. తరచూ గ్రామానికి వెళ్లడం, అందరినీ పేరుపేరునా పలకరించడం అతడి అలవాటు. ఎంపి హోదాలో వెళ్లినపుడు ఆయనను నేతలు సన్మానించేవారు. ఓసారి అలా పరౌఖ్ వెళ్లినపుడు చాలామంది ఆయనకు వెండి, బంగారు కిరీటాలతో సన్మానించారు. మొత్తం పనె్నండు కిరీటాలు వచ్చాయి. వాటిలో 11 వెండివి. అప్పుడు ఆయన సున్నితంగా వారిని మందలించారు. వాటిని గ్రామానికి తిరిగి ఇచ్చేసి డబ్బు వృథా చేయవద్దని, రూపాయి ఉన్నా పేదల పెళ్లిళ్లకు ఇవ్వాలని, తనకు ఇచ్చిన కిరీటాలను పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు వాడాలని చెప్పారు. తన తాతముత్తాల నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని గ్రామానికి ఇచ్చేసారు. ఆ స్థలంలో ఓ భవనాన్ని నిర్మించి కమ్యూనిటీ హాల్ (మిలన్ కేంద్)్రగా మార్చేశారు. ఆ గ్రామంలో పేదల పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు దానిని ఉచితంగా వాడుకునేందుకు ఇచ్చే ఏర్పాటు చేశారు. టీవీ కార్యక్రమాలలో అశ్లీల ధోరణలను అరికట్టాలని తాపత్రయపడేవారు. విద్యావకాశాల విస్తృతిని కోరే ఆయన వెయ్యి రూపాయల నోటుపై అంబేద్కర్ ఫొటో పెట్టాలని అడుగుతూంటారు.
సిఫారసులకు వ్యతిరేకి
పనె్నండేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినప్పుడు, బిహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడు బంధువులు సహాయం కోసం వచ్చేవారు. మొత్తం అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల బంధువులు 27మంది ఉన్నారు. వారిలో కొందరు ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నించినపుడు మాటసాయం చేయాలని కోరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. తనలా కష్టపడి చదివితే ఫలితం వాటంతట అదే వస్తుందని, మన కోరికేమిటో భగవంతుడికి తెలుసు కనుక తీరుస్తాడని ఆయన చెప్పేవారని దగ్గరి బంధువులు గుర్తు చేస్తూంటారు. స్నేహమంటే అతడికి ప్రాణమని అతడి చిన్ననాటి స్నేహితుడు, సీనియర్ విద్యార్థి రాజ్‌కిశోర్ సింగ్ చెబుతారు. కోవింద్‌తో కలసి స్కూలుకు వెళ్లేవారమని, ఇప్పటికీ ఆయనతో పరిచయం కొనసాగుతోందని, అతడి ఇంటిని తామే పర్యవేక్షిస్తుంటామని అతడు చెబుతాడు. తనకు వచ్చిన బహుమతులను పేదలకే ఇచ్చేసేవారని మరో స్నేహితుడు జస్వంత్‌సింగ్ చెప్పారు. డబ్బులు దాచుకోవాలని పదేపదే చెప్పేవారని, బంధువులకూ అదే సూచించేవారని అతడు గుర్తు చేశాడు. స్నేహితులంటే ప్రాణమని, 2012లో తన భార్య మరణించినప్పుడు ఎంపిగా ఉన్న కోవింద్ తనను పరామర్శించడానికి స్వయంగా ఇంటికి వచ్చారని అతడివద్ద పిఎగా పనిచేసి రిటైరైన అశోక్ త్రివేది గుర్తు చేస్తూంటారు. అతి సాధారణ భోజనం చేసే కోవింద్‌కు తీపి పదార్థాలు పెద్దగా ఇష్టం ఉండవని వారు గుర్తు చేస్తూంటారు.
కల్యాణ్‌సింగ్ మహిమే అంతా
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో రెండుసార్లు శాసనసభకు ఎంపికవ్వాలని పోటీ చేసిన రామ్‌నాథ్ కోవింద్ విఫలమయ్యారు. ఆ దశలో కల్యాణ్‌సింగ్ యుపి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణులు, జాట్‌లు, రాజ్‌పుట్‌లు బలంగా ఉన్న యుపిలో తిరుగులేని పట్టు సంపాదించాలంటే ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న దళిత, నిమ్మవర్గాలను దగ్గర చేసుకోవాలన్నది కల్యాణ్‌సింగ్ యోచన. అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్ర నుంచి బయటపడాలన్నది ఆయన ఎత్తుగడ. అలాంటి సమయంలో కోవింద్ ఎదురైనపుడు- ‘నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. పార్లమెంట్‌లో’ అని వ్యాఖ్యానించిన కల్యాణ్‌సింగ్ రాజ్యసభ సభ్యుడిగా కోవింద్‌కు అవకాశం దక్కేలా చేశారు. ఆ తరువాత ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అందుకే ‘కల్యాణ్‌సింగ్ లాబ్’నుంచి వచ్చిన వ్యక్తిగా కోవింద్‌ను చెబుతారు.

కుష్టురోగుల సేవలో
చిన్నసాయం చేసి ఎక్కువ ప్రచారం చేసుకునే, ఫొటోలకు పోజులిచ్చే నాయకులున్న లోకం ఇది. కానీ రామ్‌నాథ్ కోవింద్ విలక్షణత ఏమిటో ఈ విషయం తేటతెల్లం చేస్తుంది. ఆయన భారతీయ జనతా పార్టీలో మాత్రమే పనిచేశారు. జనసంఘ్ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆయన ఎప్పుడూ పనిచేయలేదు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌లో పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా ఆర్
ఎస్‌ఎస్ ప్రచారక్ ఉజ్జయిన్ హుకుంచంద్ (జనసంఘ్)తో పరిచయం అతడిని మార్చింది. ఓసారి వారణాసికి వెళ్లినపుడు అక్కడ కుష్టురోగుల పిల్లలు పడుతున్న యాతన ఆయనను చలింపచేసింది. గుడారాల్లో వారు పడుతున్న అవస్థలు చూసి బాధపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ ఆశిష్ గౌతమ్ నాయకత్వంలో దివ్యప్రేమ్ సేవా మిషన్ (1997) చేస్తున్న సేవలు అతనికి బాగా నచ్చాయి. కుష్టురోగుల పిల్లలకు చదువుచెప్పించడం, వారి ఆలనాపాలనా చూడటం ఆ మిషన్ లక్ష్యం. ఎంపిగా ఉన్న కోవింద్ తను కూడా ఆ సేవాకార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఎంపి నిధుల నుంచి 25 లక్షలు విడుదల చేశారు. గంగాతీరంలో కుష్టురోగుల పిల్లల్లో బాలుర కోసం గంగావాటిక, బాలికల కోసం ప్రదీప వాటిక పేరుతో రెండు హాస్టల్స్ నిర్మించారు. ఏటా ఇద్దరు పిల్లల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తున్నారు. ఇప్పటికీ కోవింద్ సతీమణి సవిత ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. ఇది గత పదిహేడేళ్లుగా నిరంతరంగా వారు చేస్తున్న సేవ. రోగులకు కేవలం క్రిస్టియన్ సంఘాలే సేవలందిస్తాయనడం నిజం కాదని ఆయన ఇలా నిరూపించారని మిషన్ చెబుతూంటుంది.

పెద్ద కుటుంబమే..
ఇప్పటికీ స్వగ్రామం పరౌఖ్‌కు సమీపంలోని తమ పూర్వీకులు ఉండే డెరాపూర్‌లో పెద్దన్న ప్యారేలాల్ ఉంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ‘గుణ’లో మరో సోదరుడు ఉంటున్నారు. అన్నదమ్ముల కుటుంబాలన్నీ ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 27మంది కుటుంబ సభ్యులున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌కు భార్య సవిత, కుమారుడు ప్రశాంత్‌కుమార్, కుమార్తె స్వాతి ఉన్నారు. ఇద్దరూ స్థిరపడ్డారు. అయితే కోవింద్ పాల్గొనే కార్యక్రమాలకు కుమార్తె ఎక్కువగా హాజరవుతూంటారు. తన పూర్వీకులు, స్వస్థలాల్లో తన అన్న పిల్లలే అన్నీ చూస్తారు. స్నేహితులు మరికొన్ని బాధ్యతలు నిర్వహిస్తూంటారు. తన గ్రామానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్ రాష్టప్రతి కాబోతున్నారని తెలిసి దీపావళి ముందే వచ్చేసిందంటూ అక్కడివారు ఆనందభరితులవుతున్నారు.
మొరార్జీకి పి.ఎ.గా..
కాంగ్రెసేతేర తొలి ప్రధానిగా సంచలనం సృష్టించిన మొరార్జీ దేశాయ్ ఆ పదవిలో ఉండగా రామ్‌నాథ్ కోవింద్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. తండ్రి మైకులాల్‌తో మొరార్జీ, జయప్రకాశ్ నారాయణ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. చదువులో రాణించిన కోవింద్‌ను మొరార్జీ ప్రోత్సహించారు. 1974లో రామ్‌నాథ్ కోవింద్ వివాహానికి మొరార్జీ హాజరయ్యారు. ఆ తరువాత కొద్ది సంవత్సరాలకే మొరార్జీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే కోవింద్‌కు మంచి అవకాశం ఇచ్చారు.
‘‘రాష్టప్రతికి రాజ్యాంగమే సుప్రీం.
అదే భగవద్గీత, రామాయణం, ఖురాన్, బైబిల్’’
***
‘నేను ఎప్పుడూ దేశ సర్వతోముఖాభివృద్ధికే పనిచేస్తా. యువత ఆకాంక్షలు, ఆధునిక విద్య అభివృద్ధికి కృషి చేస్తా. 2022 నాటికి సరికొత్త భారతదేశం సాక్షాత్కారం చేయాలన్న కలను నిజం చేయడం మన బాధ్యత. అలా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం మన లక్ష్యం’
***
‘ఉత్తరప్రదేశ్ నా పుట్టిల్లు. గుజరాత్ నా రెండో ఇల్లు. మధ్యప్రదేశ్ నా కర్మభూమి. రాష్టప్రతిగా నాకు అందరూ సమానమే. రాజకీయాలు, పార్టీలు, కుల, మత, ప్రాంతీయ, వర్గ, లింగ భేదాలేమీ నాకు ఉండవు’
***
‘లా’ చేసిన ఆయన బిజెపి దళితమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, అఖిల భారత కోలీ సమాజ అధ్యక్షుడిగా, వివిధ పార్లమెంటరీ సంఘాల సారథిగా సేవలందించారు. దేశవిదేశాల్లో పర్యటించారు. రాజ్యాంగంపై గట్టి పట్టున్న రాజకీయవాది. అయినా నిరాడంబరుడిగా ఉండటానికే ఇన్నాళ్లూ ఇష్టపడ్డారు. అందుకే ఆయన పేరును ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా విపక్షాలు తేరుకోలేకపోయాయి.
***
ప్రత్యక్ష ఎన్నికల్లో ఏనాడూ పోటీ చేయని రామ్‌నాథ్ కోవింద్ రాజ్యసభలో పనె్నండేళ్లు సేవలందించారు. ఆ సమయంలో ఆయన 283 ప్రశ్నలు వేశారు. వాటిలో పనె్నండు మినహా అన్నీ మొదటిసారి ఎంపి అయినప్పటివే.

రాష్టప్రతి భవనం.. రాజసం
భారత రాష్టప్రతి నివాసం రాజసం ఒలకబోస్తూంటుంది. కోల్‌కతా నుంచి ఢిల్లీకి దర్బారు మారినపుడు, 1911లో వైస్రాయ్ కోసం పరిపాలన, నివాస భవనాన్ని నిర్మించాలని భావించారు. ఆ మరుసటి సంవత్సరం రెయిసినా, మాల్చా అనే గ్రామాల నుంచి నాలుగువేల ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రస్తుత రాష్టప్రతి భవన్ నిర్మాణం ప్రారంభించారు. 1929 నాటికి నిర్మాణం పూర్తయింది. బ్రిటిష్, హిందూ సంస్కృతికి అద్దం పట్టేలా దీనిని రూపొందించారు. మూడు లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని, 700 మిలియన్ల ఇటుకలను, స్టీల్‌ను వాడారు. 320 ఎకరాల్లో మధ్యలో కాపర్ డూమ్‌తో, ఇరువైపులా కలపి 340 గదులతో, వెనుకవైపు మొఘల్ గార్డెన్, రెండు పిల్లల మ్యూజియాలతో దీనిని తీర్చిదిద్దారు. స్వాతంత్య్రానికి పూర్వం వైస్రాయ్ హౌస్‌గా ఆ తరువాత రాష్టప్రతి భవన్‌గా పిలుస్తున్నారు. దీని రూపశిల్పి ఎడ్విన్ లుటియెన్స్. రైసినా హిల్స్‌గా పిలిచే రాష్టప్రతి భవనం రాచఠీవితో అలరారుతోంది. ఇందులో చిన్నపిల్లలు చేసిన వస్తువులతో ఒక మ్యూజియం ఉంటే, చిన్నపిల్లలు మెచ్చే వస్తువులతో మరో మ్యూజియం ఉంది.

-వాధూలస