S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మార్చగలం ( సండేగీత)

ప్రపంచాన్ని మార్చే శక్తి అందరిలోనూ ఉంది. కానీ ఈ విషయాన్ని ఎవరమూ గుర్తించము. గౌతమబుద్ధుడు, మహాత్మాగాంధీ, స్వామీ వివేకానందలకు మాత్రమే ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని మనం అనుకుంటాం. కానీ అది పాక్షిక సత్యం మాత్రమే.
మా ఇంట్లో మూడు బావులు వుండేవి. అందులో ఒక బావిలో చాలా నీళ్లు ఉండేవి. బాగా నీళ్లు ఉండటమే కాదు చాలా పైకి కూడా ఉండేవి. మా వాడకట్టులో ఉన్నవాళ్లు చాలామంది వచ్చి మా ఇంట్లో పెద్ద బావిలోని నీళ్లు తోడుకొని వెళ్లేవాళ్లు.
మా ఇంట్లో ఆరేడు కుటుంబాలు కిరాయికి ఉండేవాళ్లు. అందులో ఓ వ్యక్తి మేర లక్ష్మిరాజం. బట్టలు కుట్టేవాడు. అతని భార్య మా ఇంట్లో పనిచేసేది. చలికాలం పూట లక్ష్మిరాజం చాలా గమ్మత్తుగా ఉండేవాడు. ఒకలాంటి మానసిక ప్రవర్తన అతనిలో వుండేది.
ఓ రోజు ఉదయం మేమందరం బావి దగ్గర ఉన్నాం. లక్ష్మిరాజం చాలా వేగంగా వచ్చి బావిలోకి దూకాడు. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో మాకు తెలియదు. అతని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి ఈతరాదని చెప్పి ఏడ్వటం మొదలుపెట్టింది.
అక్కడే వుండి మా బర్రెపాలు పిండుతున్న మల్లయ్య అంతే వేగంగా బావిలోకి దూకి అతణ్ని రక్షించాడు. ఆ తరువాత అతన్ని మా బాపు హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించాడు. ఆ తరువాత అతను అలాంటి పని చేయలేదు.
ఆ రోజు మా మల్లయ్య బావిలోకి దూకి అతన్ని రక్షించకపోతే పరిస్థితి ఎలా ఉండేది. మా బావిలో ఓ మరణం సంభవించేది. ఓ కుటుంబం రోడ్డున పడేది. మా బావి నీళ్లు పాడుబడేవి. ఓ దుఃఖమయ వాతావరణం నెలకొనేది. ఓ భయంకరమైన పరిస్థితిని రాకుండా చేయగలిగాడు అక్షర జ్ఞానం లేని మా మల్లయ్య.
ఈ ప్రపంచాన్ని మార్చడానికి చాలా పెద్ద పనులు చేయాలని చాలామంది అనుకుంటారు. వ్యక్తుల జీవితాల్లో మార్పులు తీసుకొని రావడానికి కూడా ఏవో పెద్ద పనులు చేయాలని అనుకుంటాం. కానీ చాలా చిన్న సంఘటనలు కూడా మన జీవితాల్లో చాలా పెద్ద మార్పులు తీసుకొని వస్తాయని అనుకోం.
ఓ చిన్న పని, ఓ చిన్న సహాయం ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయి. మా మల్లయ్య చేసిన సహాయం, మా బాపు చేసిన చిన్న పని లక్ష్మిరాజం కుటుంబంలో చాలా పెద్ద మార్పు తీసుకొని వచ్చింది. వాళ్ల కుటుంబం చాలా అభివృద్ధి చెందింది. పిల్లలు బాగా స్థిరపడ్డారు. ఇంకా చిన్న పనుల వల్ల కూడా ఇంకా చిన్న సహాయాల వల్ల కూడా ప్రపంచం రోజురోజూ మారుతుంది. క్షణక్షణం కూడా మార్పు చెందుతుంది.
ఈ ప్రపంచంలో వున్న ఆకలిని మనం పోగొట్టలేం. కానీ మన చుట్టూ వున్న ఓ వ్యిక్తి ఆకలిని మనం సహాయంచేసి పోగొట్టగలం. ప్రపంచంలో శాంతిని మనం నెలకొల్పలేక పోవచ్చు. కానీ మన చుట్టూ వున్న శాంతియుత వాతావరణాన్ని పాడుచేయకుండా చేయగలం. అక్కడ శాంతిని కూడా సృష్టించగలం.
మర్చిపోవద్దు. మనమూ మన ప్రపంచాన్ని మార్చగలం.