S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహిళా క్రికెట్‌కు మంచి రోజులు!

‘అబ్బో.. మన అమ్మాయిలు అదరగొట్టేశారు..
ప్రపంచ కప్ మనదే.. కచ్చితంగా ఈసారి మిథాలీసేన విజేతగా నిలుస్తుంది’ ఇదీ మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆట చూసిన తరువాత తొణికిసలాడిన విశ్వాసం..
‘ఫైనల్‌లో గెలిస్తే ఇక మహిళల క్రికెట్‌కు తిరుగులేదు. భారత్‌లో మహిళల క్రికెట్‌కు మంచిరోజులు వచ్చినట్లే. అందుకోసమే జట్టు జట్టంతా గెలుపుకోసం తహతహలాడుతోంది’... ఇది భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీరాజ్ వ్యాఖ్య.
కానీ ఆటలో ఆశలు తీరలేదు. కప్పు చేజారిపోయింది. కానీ మనవాళ్లు దేశం మనసు గెలిచారు. మహిళల క్రికెట్‌కు మంచిరోజులు వచ్చేసినట్లే. కప్పుతో కాదు.. గొప్ప ఆటతీరుతో వారు ఇది సాధ్యం చేశారు. ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు మహిళల క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. ప్రసార మాధ్యమాల్లో ఎన్నడూ లేని రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. ఒకప్పుడు భారత మహిళల క్రికెట్ జట్టు గురించి ఎవరికీ తెలీదు. అంతెందుకు జట్టు సారథి, సచిన్‌లాంటి క్రీడాకారిణి మిథాలీరాజ్ గురించి కూడా చాలామందికి తెలీదు. అలాంటిది, ఈ ప్రపంచకప్ తరువాత జట్టులోని సభ్యులందరి ప్రతిభాపాటవాలు, జట్టు సాధించిన ఫలితాలు తెలిసొచ్చాయి. ప్రజాదరణ, ఆసక్తి, ప్రోత్సాహం, ఆర్థికంగా, ప్రచారపరంగా ఏమాత్రం ప్రాధాన్యం లేకపోయినా క్రికెట్‌పై పిచ్చితో ఆడుతూఆడుతూ వచ్చిన మన మహిళల క్రికెట్ జట్టు ఇన్నాళ్టికి ప్రజల మనసుల్లో ‘హీరోయిన్లు’గా చెరగని ముద్రవేశారు. ఐపిఎల్ మాదిరిగా మహిళల క్రికెట్‌కూ ఆటలపోటీలు నిర్వహించాలని, విశేష అనుభవం కోసం అంతర్జాతీయ వనే్డలు, టెస్టు మ్యాచ్‌లు, టి20 మ్యాచ్‌లు విస్తృతంగా నిర్వహించాలన్న డిమాండ్ ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తోంది. గట్టిగా ఈ డిమాండ్లు వినిపించేలా సమాజాన్ని జాగృతం చేసిన ఘనత మిథాలీసేనదే. నిన్నమొన్నటిదాకా చాలామందికి తెలీని ఎన్నో విశేషాలు ఇప్పుడు చాలామందికి చేరుతున్నాయి. ఇదంతా ఈసారి మహిళల క్రికెట్ ఇచ్చిన కిక్కే కారణం. ఆ కిక్కు ఏస్థాయిలో ఉందంటే.. ఈసారి మహిళల ప్రపంచకప్ క్రికెట్ పోటీలను 130 దేశాల్లో, 200 ప్రాదేశిక ప్రాంతాల్లో 31 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేశారు. పురుషుల క్రికెట్‌ను జనం ఎంతగా ఆస్వాదించారో అదే స్థాయిలో ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను తిలకించారు. టీవీలను అతుక్కుని, కళ్లింత చేసుకుని మరీ ఈ పోటీలను తిలకించారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మనవాళ్ల గెలుపుకోసం ఎంతో ఆసక్తిగా చూసి పరాజయ భారంతో వెక్కివెక్కి ఏడ్చారు. కానీ మన అమ్మాయిలను వారు తప్పుబట్టలేదు. ఈస్థాయికి మన మహిళల క్రికెట్‌ను తీసుకొచ్చినందుకు వారివెంటే నిలబడ్డారు. జయహో మిథాలీ అంటూ కీర్తించారు. భవిష్యత్ మనదేనన్న భరోసాతో ఆహ్వానం పలికారు.
1976లో తొలిసారిగా..
ఎప్పుడో 17వ శతాబ్దంలోనే క్రికెట్‌కు ప్రాణంపోసినా భారత్‌కు తెలిసింది 19వ శతాబ్దంలోనే. 1934లో మహిళలు క్రికెట్ ఆడటం మొదలెట్టారు. తొలి మహిళల క్రికెట్ మ్యాచ్ ఇంగ్లండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగింది. కానీ మనదేశంలో 1976 వరకు వారికి అవకాశం దక్కలేదు. చివరికి 1976లో తొలిసారిగా వెస్టిండీస్‌తో భారత్ తొలి మహిళల క్రికెట్ జట్టు టెస్ట్‌మ్యాచ్ ఆడింది. అక్కడికి రెండేళ్ల తరువాత ఇండియాలోని పాట్నాలో వెస్టిండీస్‌తో తొలి అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌ను ఆడారు. అంతకుముందు 1973లో విమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సారథ్యంలో మహిళల క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. శాంతా రంగస్వామి సారథ్యంలో తొలి మహిళల జట్టు పోటీల్లో పాల్గొంది. ఆ తరువాత విమెన్స్ క్రికెట్ అసోసియేషన్ బిసిసిఐలో మిళితం చేశారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ మహిళల క్రికెట్ జట్టు అనన్య సామాన్య ఫలితాలు సాధించింది. ఎన్నో రికార్డుల సృష్టించింది. అయితే ప్రసార మాధ్యమాల్లో ప్రచారం లేక, మహిళల క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో జనం దృష్టిలో పడలేదు. క్రికెట్ అంటే మగవారి ఆటగానే పరిగణించారు. వేతనాలు, పారితోషికాల విషయంలోనూ పురుషుల క్రికెట్‌తో పోలిస్తే చాలా అన్యాయమే జరుగుతోంది. అయినా ఆటమీద మమకారంతో మహిళ క్రికెటర్లు జీవితాన్ని అంకితం చేశారు. అద్భుత ఫలితాలు సాధించారు. ‘ఇప్పుడు మాకు అంతా కొత్తగా ఉంది. ఈసారి ప్రపంచ కప్ తరువాత మమ్మల్ని కొత్తగా ఆరాధిస్తున్నారు. ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. చివరకు వివిధ సంస్థలు తమతమ వ్యాపార ప్రకటనల్లో నటించే కాంట్రాక్టులు ఇచ్చేందుకు క్యూ కడుతున్నారు. ఇదంతా కొత్తగా ఉంది.. ఇక మహిళల క్రికెట్‌కు మంచి రోజులు వచ్చినట్లే’ అని సాక్షాత్తు మన జట్టు సారథి మిథాలీ రాజ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇది నిజమే. సెమీపైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటు ఝళిపించి లాగిపెట్టి, ఈడ్చిపెట్టి కొట్టిన ఏడు ముచ్చటైన సిక్సర్లు, 20 బౌండరీలు పురుషుల క్రికెట్‌లో తొలి ప్రపంచకప్ సాధించినప్పుడు కపిల్ స్వైరవిహారాన్ని గుర్తుకుతెచ్చాయి. ఆమెను అంతా కపిల్‌తోనే పోల్చారు. ఈసారి జట్టులో ఉన్న క్రీడాకారిణులలో ఎక్కువమంది మధ్యతరగతి నుంచి వచ్చి అద్భుతమైన రికార్డులు సృష్టించిన వారే. ఏడెనిమిదేళ్లపాటు భరతనాట్యం నేర్చుకుని ఆ తరువాత బ్యాటుపట్టి గత పదిహేను సంవత్సరాలకు పైగా దేశం కోసం ఆడుతున్న మిథాలీరాజ్ మహిళల క్రికెట్‌లో సచిన్‌లాంటి ఆటగత్తె. వనే్డల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళ క్రికెటర్. ఆమె ఇప్పటివరకు 6173 పరుగులు చేసింది. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన మహిళ క్రికెటర్, ఇంగ్లండ్ క్రీడాకారిణి ఛార్లెట్ ఎడ్వర్డ్ పేరిట ఉన్న 5992 పరుగుల రికార్డును మిథాలీ తుడిచిపెట్టింది. ఆరుసార్లు ఏసియాకప్ చాంపియన్‌షిప్‌ను సాధించిన మన మహిళ క్రికెట్ జట్టు ఇప్పటివరకు ప్రపంచకప్ పోటీల్లో మూడుసార్లు సెమీస్, రెండుసార్లు ఫైనల్స్‌కు చేరింది. 2005లో ఆస్ట్రేలియాతో 98 పరుగుల తేడాతోను, ఈసారి 9 పరుగుల తేడాతోనూ పరాజయం పాలైంది. కేవలం అనుభవలేమి, ఈసారి ఎన్నడూ లేనంత ఒత్తిడి ఉండటం దీనికి కారణం. టీ20 వరల్డ్‌కప్‌లో 2009, 2010లో సెమీస్‌కు చేరిన మన జట్టు నిలకడైన ఆటతీరుతో అద్భుతాలు సాధిస్తోంది. ఝులన్ గో స్వామి, హర్మన్‌ప్రీత్, మధానా, వర్మ, దీప్తిశర్మ ఇలా అందరూ అద్భుత ప్రతిభాపాటవాలు ఉన్నవారే. మహిళల క్రికెట్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి డయానా ఎడుల్జి, ఎక్కువ వికెట్లు తీసిన సంధ్య అగర్వాల్ తొలిరోజుల్లో ఈ ఆటకు ప్రాణం పోశారు. ఆ తరువాత శాంతారంగస్వామి, ఇటీవలి కాలంలో మిథాలీసేన మహిళల క్రికెట్‌ను కొత్తపుంతలు తొక్కించారు. మహిళల క్రికెట్ వనే్డల్లో ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మిథాలీరాజ్ చెక్కుచెదరని రికార్డు నెలకొల్పింది. వనే్డల్లో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన ఘనత జులన్‌గోస్వామికి దక్కింది. మహిళల క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఘనత మధనాకు దక్కింది. వెస్ట్‌బెంగాల్ నుంచి వచ్చిన గోస్వామి, మహారాష్ట్ర నుంచి వచ్చిన మధానా, గయక్వాడ్ వంటి క్రీడాకారిణులు ఇప్పటికే అద్భుతాలు సృష్టించారు. ఫుట్‌బాల్ అంటే ప్రాణం ఇచ్చే ఝులన్ గోస్వామి పదిహేనేళ్లకే బ్యాటు పట్టింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాటుతేలింది. మంచి ఆల్‌రౌండర్‌గా రాణించింది. హర్మన్‌ప్రీత్ కూడా అంతే. మగ క్రికెటర్లకంటే చక్కటి శైలిలో, కళాత్మకంగా ఆడటం ఆమెకే చెల్లింది. ధోనీలా కూల్‌గా ఉండటం మిథాలీరాజ్ ప్రత్యేక. ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు సాక్షాత్తు మన ప్రధాని మోదీ మన జట్టులోని ప్రతి ఒక్క సభ్యురాలి పేరుతో ట్వీట్ చేసి ప్రోత్సహించడం ఈసారి విశేషం. చెప్పొచ్చేదేమంటే.. ఫైనల్‌లో గెలిస్తే చాలు.. మహిళల క్రికెట్ మంచిరోజులు వస్తాయన్న మిథాలీరాజ్ మాటల్లో నిజం ఉంది. కానీ కప్పు గెలవకపోయినా మంచిరోజులు వచ్చేసినట్లే. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో మన క్రీడాకారిణులు కనబరచిన అంకితభావం, నైపుణ్యం, దేశభక్తి ఆ విషయాన్ని చాటాయి.
ర్యాంకింగ్‌లో నాలుగోస్థానం
అంతర్జాతీయ వనే్డ, టెస్టు, టి20 మ్యాచుల్లో ఐసిసి ప్రకటించిన తాజా ర్యాంకింగ్‌లో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, బెంగళూరు, ఐర్లాండ్ మన తరువాతి స్థానాల్లో ఉన్నాయి. భారత పురుషుల క్రికెట్ జట్టు సారధి విరాట్‌కోహ్లీ వార్షిక పారితోషికం కోట్లలో ఉండే మహిళల క్రికెట్ జట్టుసారథి మిథాలీరాజ్ వార్షిక వేతనం కేవలం 15 లక్షల రూపాయలు. ఇంతటి తేడా ఉన్నా ఆటలో ఎక్కడా తగ్గకుండా వారు సేవలందిస్తున్నారు. మహిళల క్రికెట్ గణాంకాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. *
తుషార్ అరోత్ ప్రధాన కోచ్‌గా వచ్చిన తరువాత మహిళల క్రికెట్ రాటుదేలింది. ప్రస్తుతం అతడే కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
**ఇప్పటివరకు మన మహిళల క్రికెట్ జట్టు 242 అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లు ఆడింది.
132 గెలిస్తే 105 ఓడింది. ఒక మ్యాచ్ టై అయితే నాలుగింటిలో ఫలితం తేలలేదు.

*ఈసారి ప్రపంచ కప్‌లో అద్భుత ప్రతిభ కనపరచిన సారథి మిథాలీరాజ్, జులన్ గోస్వామిలకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచక్రికెట్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలకు నిలయమైన లండన్‌లోని ‘హోమ్ ఆఫ్ క్రికెట్ మ్యూజియంలో వీరి జెర్సీలకు చోటు లభించింది. వీరి సంతకాలతో కూడిన జెర్సీలు ఇప్పుడు అక్కడ దర్శనమిస్తాయి. ప్రపంచ క్రికెట్‌లో మహామహులకు చెందిన ఎన్నో వస్తువులు అక్కడ సందర్శకులకు కనువిందు చేస్తూంటాయి. ఇప్పుడు తొలిసారిగా మనవారికి అలాంటి గౌరవం దక్కింది.

ఇదీ మన ఆట
*మన మహిళల క్రికెట్ జట్టు ఎన్నో ఘన విజయాలు సాధించింది. ఇప్పటివరకు మన మహిళల క్రికెట్‌లో 98మంది క్రీడాకారిణులు సేవలందించారు. వారిలో 13మంది కెప్టెన్లుగా వ్యవహరించారు. మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్ ప్రస్తుతం వనే్డ, టీ20లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
*వరల్డ్ టి20లో 73 మ్యాచ్‌లు ఆడితే 37 గెలిచాం, 36 టెస్టు మ్యాచ్‌లు ఆడితో ఐదింటిలో గెలిచాం, ఆరింటిలో ఓడిపోయాం. 25 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

హర్మన్..
హర్మన్..

దేశమంతటా ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ నామస్మరణే వినిపిస్తున్నది. సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్ వంటి మేటి క్రికెటర్ల స్థాయి ఆదరణను హర్మన్ అందుకుంటున్నది. పంజాబ్‌కు చెందిన ఈ యువ బ్యాట్స్‌విమెన్ మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో, బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై అజేయంగా 171 పరుగులు చేసి, జట్టును ఫైనల్ చేర్చడంతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకుంది. మన దేశంలో క్రికెట్ ఒక మతంగా వెలుగుతున్నదని, క్రికెటర్లను అందరూ దేవతలుగా ఆరాధిస్తారని అందరికీ తెలుసు. అయితే, ఆ ఆదరణ, అభిమానం పురుషుల క్రికెట్‌కు మాత్రమే పరిమితం. మహిళల క్రికెట్‌ను పట్టించుకునే వారే లేరు. మహిళల ప్రపంచ కప్ జరుగుతున్నదని తెలిసిన వారు చాలా తక్కువ. జట్టులో ఎవరెవరు ఉన్నారో తెలిసిన వారు దాదాపుగా లేరనే చెప్పాలి. పురుషుల విభాగంలో రంజీ క్రికెటర్ల పేర్లు కూడా అందరికీ సుపరిచితమే. కానీ, మహిళల విభాగానికి ఆ అదృష్టం లేదు. జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వంటి ఒకరిద్దరి పేర్లు అప్పుడప్పుడు మీడియాలో దర్శనమిస్తాయి. మహిళల వనే్డల్లో మిథాలీ అత్యధిక పరుగులు సాధించి రికార్డు నెలకొల్పింది. పురుషుల విభాగంలో సచిన్‌కు వచ్చినంత గుర్తింపుగానీ, ఆదరణగానీ ఆమెకు లేదనడం తప్పుకాదు. అదే విధంగా అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఝులన్ రికార్డు పుటల్లోకి ఎక్కింది. పురుషుల విభాగానికి వస్తే, ఈ రికార్డుకు మన బౌలర్లు చాలా దూరంగా ఉన్నారు. 534 వికెట్లతో ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో వసీం అక్రం (502), వకార్ యూనిస్ (416) వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు. భారత్ తరఫున వనే్డల్లో 337 వికెట్లు సాధించిన అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో నిలవగా, మొత్తం జాబితాలో అతనిది తొమ్మిదో స్థానం. కానీ, కుంబ్లేకు ఉన్నంత పేరుప్రఖ్యాతులు ఝులన్‌కు లేవన్నది వాస్తవం. అన్ని రకాలుగా నిదారణకు, నిర్లక్ష్యానికి గురవుతున్న మహిళల క్రికెట్‌లో హర్మన్ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. దేశంలోని క్రికెట్ అభిమానులంతా ఉలిక్కిపడి తనవైపు చూసేలా అద్వితీయ ప్రతిభ కనబరచింది. మహిళల ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో హర్మన్ విధ్వంసకర బ్యాటింగ్‌కు సోషల్ మీడియాలో లక్షల్లో లైక్స్ వస్తున్నాయంటే, ఆమె విజృంభణ ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఊహించుకోవచ్చు.
డెర్బీ వేదికగా, ఆస్ట్రేలియాతో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో 115 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 171 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచింది. కండరాల నొప్పి బాధిస్తున్నా, చక్కటి మద్దతునిచ్చే వారు లేరన్న ఆందోళన తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నా, గంటల తరబడి క్రీజ్‌లో ఉండడంతో అలసటకు గురైనా ఆమె పట్టించుకోలేదు. భారత వనే్డ చరిత్రలో రెండో అత్యుత్తమ స్కోరును నమోదు చేసింది. దీప్తి శర్మ 188 పరుగులతో ఈ జాబితాలో ముందున్నప్పటికీ, హర్మన్ ఇన్నింగ్స్ ప్రత్యేకతను సంతరించుకుంది. 2009 మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా బ్రాడ్‌మన్ ఓవల్ (బౌరల్)లో, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌తో హర్మన్ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌల్ చేసి, పది పరుగులిచ్చింది. అమితా శర్మ బౌలింగ్‌లో అర్మాన్ ఖాన్ కొట్టిన బంతిని క్యాచ్ అందుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్‌లోనూ రాణించి, 84 పరుగులు సాధించి భారత్‌ను గెలిపించింది. తన ఆల్ రౌండ్ ప్రతిభను నిరూపించుకుంది. అదే ఒరవడిని కొనసాగిస్తూ, 2013లో రెండు శతకాలను నమోదు చేసింది. ఆమె మొదటి సెంచరీ ఇంగ్లాండ్‌పై చేయగా, రెండో శతకం బంగ్లాదేశ్‌పై సాధించింది. ఆల్‌రౌండర్‌గా ఎదిగిన ఆమెను 2016 నవంబర్‌లో మహిళల టి-20 కెప్టెన్సీ వరించింది. నిజానికి 2012 మహిళల ఆసియా కప్ టి-20 ఫైనల్‌లోనే ఆమె తొలిసారి జట్టుకు నాయకత్వం వహించింది. రెగ్యులర్ కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ సభ్యురాలు ఝులన్ గాయాలతో బాధపడుతున్న కారణంగా, కెప్టెన్సీ పగ్గాలను చేపట్టింది. ఆమె నాయకత్వం వహిచిన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను 81 పరుగుల తేడాతో ఓడించి ఆసియా టి-20 కప్‌ను గెల్చుకోవడం విశేషం. నిరుడు ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్‌లో ఆమె భారత్‌కు విశిష్ట సేవలు అందించింది. భారత మహిళల టి-20 చరిత్రలోనే అత్యధిక ఛేజ్ ఆ మ్యాచ్‌లోనే నమోదైంది. హర్మన్ 31 బంతుల్లో 46 పరుగులు చేసి ఈ చారిత్రక విజయంలో తన వంతు పాత్ర పోషించింది. మహిళల క్రికెట్‌లో మేటి ఆల్‌రౌండర్లలో హర్మన్ పేరు కూడా చేరింది. సరిగ్గా ఏడాది క్రితం, మహిళల బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టు కాంట్రాక్టును సంపాదించింది. ఆస్ట్రేలియాలోనేగాక, మహిళల పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఎంతో పేరుప్రఖ్యాతులున్న ఈ టోర్నీలో ఆడిన తొలి భారతీయురాలిగా హర్మన్ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది మే మాసంలో ఇంగ్లీష్ కౌంటీల్లోకి అడుగుపెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ ఆమే కావడం విశేషం. ఎన్నో రికార్డులు తన ఖాతాలో చేర్చుకున్న హర్మన్ ఇప్పుడు క్రికెట్ అభిమానులకు ఇష్టురాలిగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఆమె బ్యాటింగ్‌ను 1983లో జింబాబ్వేపై కపిల్ దేవ్ సాధించిన 175 పరుగుల ఇన్నింగ్స్‌తో పోలుస్తున్నారు. ఆమె విజృంభణ వీరేందర్ సెవాగ్‌ను మరిపిస్తున్నదని, మైదానంలో దూకుడుగా ఉంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని గుర్తుతెస్తున్నదని క్రీడా పండితులు కీర్తిస్తున్నారు. మహిళల క్రికెట్‌కు దేశంలో గుర్తింపు తెచ్చిన వారిలో హర్మన్ కూడా చేరింది. అందుకే, దేశ ప్రజలు ఆమెకు జేజేలు పలుకుతున్నారు.

-విశ్వమిత్ర