S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విలువైన వస్తువు

నేను పేరిస్‌కి సాహసం కోసం రాలేదు. ఒకప్పుడు నేను పేరిస్‌లో క్రైలాన్ లేదా రిడ్జ్ హోటల్స్‌లో బస చేసేవాడిని. కాని ఇప్పుడు నా బస మారింది. ఫ్రెంచ్ వాళ్లు చక్కటి కాఫీని చేయలేరు. ఫోన్లో సరిగ్గా మాట్లాడలేరు. ఐతే నాకు ఈ రెంటి అవసరం లేదు. ఏప్రిల్లో కూడా పేరిస్ చల్లగానే ఉంది. నేను రూ డి రివోలి వైపు ఆ సాయంత్రం నడిచాను. స్టీల్ అస్థిపంజరం ఐఫిల్ టవర్, ఆర్క్ ట్రయంఫ్, ఇతర పర్యాటక కేంద్రాల దగ్గర పర్యాటకులు చాలామంది కనిపించారు.
నేను షాపు విండోల్లోని ఖరీదైన ఆభరణాలని చూస్తూ నడిచాను. పిగేల్లోని సెక్స్ షాపుల పక్క నించి నడిచి ఎవరూ లేని చీకటి ఆర్కేడ్ దగ్గరకి చేరుకున్నాను. అకస్మాత్తుగా పనె్నండు చిన్న కాళ్లు నన్ను చుట్టుముట్టాయి. ఓ క్షణం ఒంటరిగా ఉన్న నన్ను మరుక్షణం ఆరుగురు పిల్ల సైన్యం చుట్టుముట్టింది. చిరిగిన మురికి దుస్తులు ధరించిన ఆ నల్లటి పిల్లలు తమలో తాము నాకు అర్థం కాని విదేశీ భాషలో మాట్లాడుకోసాగారు. కొందరు నా చొక్కా అంచులని పట్టుకుంటే కొందరు చేతులు చాపారు. ఒకడు నా చేతిని అందుకుని ముద్దు పెట్టుకుంటే ఇంకొకడు డబ్బివ్వమని తన చేతిని చాపాడు. నేను ఆ ఆకస్మిక దాడి నించి తేరుకుని వాళ్ల మీద అరిచాను.
క్షణాల్లో వాళ్లు నిశ్శబ్దంగా, వేగంగా మళ్లీ చీకట్లోకి వెళ్లిపోయారు. అనుమానంగా నేను నా జేబులో చేతిని ఉంచుకుని చూసుకుని నా పర్స్ మాయం అయిందని గ్రహించాను. పెద్ద వాడినైన నన్ను పదేళ్లు మించని పిల్ల దొంగలు దోచుకోవడం నాకు అవమానంగా తోచింది. తక్షణం నాలో కోపం రగిలింది. నా పర్స్‌లోని డబ్బు నాకు ముఖ్యం కాదు. నాకు ముఖ్యమైంది, రహస్యమైంది, ప్రత్యామ్నాయం లేనిది మరొకటి అందులో ఉంది. దాంతోపాటు నాలోని ఆశ కూడా మాయమైంది. ఐతే పూర్తిగా కాదు.
ప్లేస్ వెండోమ్‌లోని పోలీసుస్టేషన్‌కి వెళ్లాను. యూనిఫాంలోని ఇన్‌స్పెక్టర్ కాని, జెండ్రామ్ కాని కనపడలేదు. ఆ చిన్న గదిలో కిటికీ పక్కన కూర్చున్న ఓ యువతి మొహంలో ఎలాంటి భావాలు లేకుండా, అడ్డుపడకుండా నా ఫిర్యాదుని విన్నాక కంప్యూటర్లో నాకు చెందిన ముఖ్య విషయాలు - పేరు, పుట్టిన తేది, పుట్టిన ఊరు, హోటల్ ఎడ్రస్, పర్స్‌లోని వస్తువుల జాబితా టైప్ చేసింది. ఐతే నేను ఆ రహస్య వస్తువు గురించి మాత్రం చెప్పలేదు. ఒకవేళ పర్స్ దొరికి దాని గురించి ఎందుకు చెప్పలేదని అడిగితే ఆ కంగారులో మర్చిపోయానని చెప్పదలచుకున్నాను.
ఆమె నాకు రసీదుని ఇచ్చి చెప్పింది.
‘మీ పర్స్ దొరకగానే మీ హోటల్‌కి ఫోన్ చేస్తాం’
పోలీసుస్టేషన్‌కి వెళ్లిన ఐదు నిమిషాలకే నేను ఆ రసీదుతో బయటకి వచ్చాను. అందులో ఎన్‌ఫాంట్స్ యుగేస్లేవ్స్ అనే పదం కనిపించింది. నేనా రసీదుని హోటల్ రిసెప్షనిస్ట్‌కి చూపిస్తే అతను చెప్పాడు.
‘వీళ్లు జిప్సీలు. వీళ్లు పిల్లలకి జేబులు కొట్టడం, హేండ్‌బేగ్‌ని ఎత్తుకెళ్లడంలో శిక్షణ ఇస్తారు. వారంతా ఈస్ట్రన్ యూరప్ నించి వచ్చిన అక్రమ వలసదారులు. వారిని నేరస్థులు అక్రమంగా రప్పించి చోర కళలో శిక్షణ ఇస్తారు. డికెన్స్ ఆలివర్ ట్విస్ట్‌లో రాసినట్లుగా ఫాగిన్ పాత్ర. పిల్లల్ని పట్టించుకోని తల్లిదండ్రుల నించి స్వార్థపరులైన నేరస్థులు డబ్బిచ్చి పిల్లల్ని కొని తీసుకు వస్తూంటారు.’
నాకు జరిగిన అనుభవం గురించి చెప్పాక రిసెప్షనిస్ట్ చెప్పాడు.
‘పిల్లలు ఐదారుగురు కలిసి ఓ బృందంగా పని చేస్తూంటారు’
నాకు పిల్లలంతా బాల్య నృత్య కళాకారుల్లా క్రమశిక్షణగా దొంగతనం చేయడం గుర్తొచ్చింది. ఒకరు చొక్కాని పట్టుకుని లాగారు. ఇద్దరు రెండు వైపుల నించి పక్కటెముకల్లో గుచ్చి నాకు అయోమయాన్ని సృష్టించారు. మరొకరు చేతిని ముద్దు పెట్టుకుంటూంటే, ఐదో వాడు నా పర్స్‌ని కొట్టేశాడు. వెనక నిలబడ్డ ఆరో పిల్లవాడికి ఆ పర్స్ అందగానే వేగంగా చీకట్లో కలిసిపోయాడు. అదంతా ఆఖరి క్షణం దాకా చక్కగా చేశారు.
‘పోలీసులు ఎందుకు పట్టించుకోరు?’ అడిగాను.
‘మిస్టర్. వారు ఎందుకు పట్టించుకోరంటే యుగోస్లావ్స్ కేవలం పర్యాటకుల నించే దొంగిలిస్తారు తప్ప స్థానికుల నించి కాదు. డ్రెస్‌ని, బూట్లని బట్టి వాళ్లు పర్యాటకుల్ని గుర్తించగలరు. వారి ఫిర్యాదులు వారు ఓసారి పేరిస్ నించి వెళ్లిపోగానే మూసేస్తారు. యుగోస్లావ్ పిల్లల్లో ఒకర్ని పట్టుకుని పోలీసుస్టేషన్‌కి తీసుకెళ్లినా వాడు దొంగనే సాక్ష్యం లేకుండా ఆ పర్స్ అప్పటికే దూరమై పోతుంది. ఆ పిల్లవాడికి ఫ్రెంచ్ భాష రాదు. వచ్చినా రానట్లే నటిస్తాడు. రుజువు లేకపోతే పోలీసులు మాత్రం ఏం చేయగలరు? పదమూడేళ్లలోపు పిల్లల్ని జైలులో పెట్టడం చట్టరీత్యా నిషిద్ధం.
‘అలాగా?’
‘పోయిన క్రెడిట్ కార్డులని మళ్లీ పొందచ్చు. నకిలీ సంతకంతో వాటిని వాడటం మూర్ఖత్వమే అవుతుంది. వారు కోరుకునేది డబ్బునే. కాబట్టి కొంత నిశ్చింత’ రిసెప్షనిస్ట్ చెప్పాడు.
‘పోలీసులు ఈ పిల్లల్ని పట్టుకోకపోతే..’
‘పిల్లలా? నేను మీకు స్పష్టంగా చెప్పలేదు. యుగోస్లావ్స్ సాధారణ పిల్లలు కారు. వారికి నిపుణులు శిక్షణ ఇస్తారు. నేను కొన్ని వదంతులు విన్నాను. వారికి డ్రగ్స్ అలవాటు చేస్తారు. దాని కోసం చెప్పింది చేస్తారు. ఆ పిల్లల దగ్గర కత్తులు ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసు. వారి యజమానులు చాలా ప్రమాదకరమైన వారు. కాబట్టి జరిగింది మర్చిపొమ్మని నా సలహా’ రిసెప్షనిస్ట్ చెప్పాడు.
‘మీ సలహాకి థాంక్స్’
ఐతే నేను మర్చిపోదలచుకోలేదు. నా గదిలోకి వెళ్లి ఆ రాత్రి నిద్రపోయాను. మర్నాడు సాయంత్రం నేను పేరిస్ నగరంలో రూ డి రివోలి లోని నీడల్లో తిరగసాగాను. యుగోస్లావ్స్ జపనీస్ పర్యాటకుల్ని దోచుకున్నారని ఆ ఉదయం పేపర్లో చదివాను. షటర్స్ మూసిన షాప్స్ ముందు నేను నడుస్తూ వారికి చక్కటి లక్ష్యం అవుతానని అనుకున్నాను. చివరికి మళ్లీ నా మీద ఆ దాడి జరిగింది. అకస్మాత్తుగా చీకటిగా ఉన్న ఓ సందులోంచి అరుస్తూ, చేతులు ఊపుతూ వచ్చి నేను ఉలిక్కిపడేలా చుట్టుముట్టి చేతులు చాపారు. ఇప్పుడు ఎవరు ఏ పాత్రని నిర్వహిస్తున్నారో నాకు అర్థమైంది. బిచ్చం అడుగుతూ చేతిని ముద్దు పెట్టుకునేవాడు, రెండు వైపులా చొక్కాని లాగే ఇద్దరూ, వెనకాల నాలుగైదు దూరంలో నిలబడ్డ పిల్లవాడు, నా ముందు నిలబడ్డ ఇద్దరు. అది కొత్త వాళ్లని కొద్దిక్షణాలు అయోమయంలో పడేస్తుంది. ఆ సమయం వాళ్లకి చాలు. నేను పర్స్ కోసం దూరంగా నిలబడ్డ కుర్రాడి వైపు తిరిగి నాలుగు అడుగులు వేసి వాడిని గట్టిగా పట్టుకున్నాను. వాడు నా చేతిని కొరికాడు. కాళ్లతో తన్నాడు. కాని అవి నన్ను ఇబ్బంది పెట్టలేదు.
కొద్దిదూరంలో ఆగి ఉన్న నా అద్దె కారులో వాడిని వెల్లకిలా పడేసి, నా జేబులోంచి బేడీలు తీసి వాడి మణికట్లకి తొడిగాను. తర్వాత కారుని ట్రాఫిక్‌లోకి పోనించాను. నా పక్కన కూర్చున్న ఆ పిల్లవాడు ట్టిగా అరిచాడు.
‘అరవక. అద్దాలు మూసి ఉంటే నీ అరుపులు బయటకి వినిపించవు’
నా మాటల్లోని సత్యాన్ని గ్రహించి వాడు అరుపులు మాని చెప్పాడు.
‘మెర్దె’
‘నీకు ఫ్రెంచ్ వచ్చన్నమాట’
వాడు జవాబు చెప్పలేదు. మా కారు రు సెయింట్ రోష్ వీధిలోకి తిరిగాక వాడు అడిగాడు.
‘ఎక్కడికి వెళ్తున్నాం?’
‘ఈ ప్రశ్నకి నువ్వే జవాబు చెప్పాలి’
‘అంటే?’
‘మీ మిత్రులు ఎక్కడ ఉంటారో అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పు’ కోరాను.
‘తీసుకెళ్లను’
‘నువ్వు నాకు సహకరించకపోతే నీ తల బద్దలు కొట్టి నీ శవాన్ని సీన్ నదిలో పారేస్తాను’ నవ్వుతూ చెప్పాను.
‘నీకు భయపెట్టడం కూడా రాదు’
స్టీరింగ్ వీల్ మీద నించి నా కుడి చేతిని తీసి వాడి మూతి మీద కొట్టగానే వెనక్కి పడ్డాడు.
‘ఇది సేంపుల్. ఈసారి గట్టి దెబ్బ తగులుతుంది’ చెప్పి గుప్పెట బిగించి మళ్లీ చేతిని ఎత్తాను.
వాడు భయంగా తన మిత్రులు ఎక్కడ ఉన్నారో వెంటనే చెప్పాడు.
నేను సీన్ నది వంతెన దాటి వాడు చెప్పిన ఎడమ ఒడ్డుకి చేరుకున్నాను. నేను ఊహించిన దానికన్నా ఎక్కువ దూరం వెళ్లాం. వాడి పేరు బోబో. తొమ్మిదేళ్లు. మూడేళ్ల క్రితం డబ్రోనిక్ వీధుల్లోంచి ఓ నేరస్థుడు వీడిని ఓ లారీ వెనక దాచి ఎత్తుకొచ్చాడు.
‘మీ లీడర్ ఎవరు?’ ప్రశ్నించాను.
‘లీ బాస్ అంటాం’
‘దొంగతనాలు అతనే నేర్పాడా?’
‘అవును. ఇంకా చాలా. నిన్ను అతను చూస్తే నీకు ప్రమాదం’
‘నా పర్స్ నాకు దొరకాలంటే లీ బాస్‌ని చూడాల్సిందే’
‘లీ బాస్ నీకు నీ డబ్బు మళ్లీ వెనక్కిస్తాడనుకుంటే నువ్వు ఉట్టి మూర్ఖుడివి’
‘నేను మూర్ఖుడిని కాను. నాక్కావాల్సింది డబ్బు కాదు’
‘క్రెడిట్ కార్డులా? లీ బాస్ వాటిని ఉపయోగించడు’
‘అవీ కావు. దాన్ని నువ్వు చూడలేదా?’ అడిగాను.
‘దేన్ని? లేదు. ఆ పర్స్ పీపీ తీసుకుని వేన్ లోని లీ బాస్‌కి ఇచ్చాడు’
‘అంటే ఇప్పుడు నా పర్స్ లీ బాస్ దగ్గర ఉందన్నమాట’
‘ఒకోసారి పర్స్‌లోని డబ్బు తీసుకుని దాన్ని పారేస్తాడు. అందులో నీక్కావాల్సిన వస్తువు ఏది? డైమండ్సా? నువ్వు స్మగ్లర్‌వా? కొకైనా? నీకు కావాలంటే నేను అమ్ముతాను’ వాడు చెప్పాడు.
‘దాని గురించి నేను లీ బాస్‌తోనే మాట్లాడుతాను’
కారు ఇండస్ట్రియల్ ఏరియా దాటి నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకుంది.
‘లీ బాస్ నిన్ను చంపేస్తాడు’ బోబో భయంగా హెచ్చరించాడు.
‘నాకా భయం లేదు’
‘ప్లీజ్ మిస్టర్. ఇక్కడికి నేను తీసుకు వచ్చానని ఆయనకి చెప్పకు’
పేరిస్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ గొట్టాలు అక్కడ నీళ్లల్లో కలుస్తున్నాయి. సొరంగం లాంటి పెద్ద గొట్టంలోకి చిన్న దారి ఏర్పరచి ఉంది. దారంతా కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. ఓ మలుపు దగ్గర మాసిపోయిన బట్టలు ధరించి ఓ పరుపు మీద కూర్చున్న లీ బాస్ కనిపించాడు. చూడ్డానికి రాక్షసుడిలా ఆరడుగుల రెండంగుళాల ఎత్తు, లావుగా ఉన్న అతని బరువు కనీసం నూట అరవై కిలోలు ఉంటుంది. అతనివి బలమైన చేతులు.
‘ఏమిటి?’ అతను నా వంక తీక్షణంగా చూస్తూ ఫ్రెంచ్ భాషలో అడిగాడు.
‘నిన్న దొంగిలించిన నా పర్స్‌లోని వస్తువు కోసం వచ్చాను’ చెప్పాను.
‘తాళం చెవా? అదిప్పుడు నా ఆస్థి. దాన్ని నీకు తిరిగి ఇవ్వను’
‘తాళం చెవికి ఉన్న రూబీ కోసం నేను రాలేదు. దాన్ని తీసుకుని తాళం చెవి మాత్రం ఇవ్వు. నాకు అది విలువైంది’ అర్థించాను.
‘అది నకిలీ రూబీ. నీకా తాళం చెవి అవసరం ఏమిటి?’ అడిగాడు.
‘అది నా ఎస్టేట్ గేటుని తెరిచే తాళం చెవి’
‘అదెక్కడ ఉంది?’
‘బోర్గ్ లా రెయిన్లో.. నా ఎస్టేట్ చాలా చిన్నది. నీకు ఆసక్తికరమైన వస్తువులేం ఉండవు. అందులోని సామాను పాతది’
‘అంత చిన్న గదిలో ఉండటం దేనికి? ఏ హోటల్లోనో ఉండచ్చుగా?’
‘అది సెంటిమెంట్’
‘దానికి మారుతాళం చెవి చేయించుకోవచ్చుగా? ఇంత దూరం దాని కోసం ఎందుకు వచ్చావు? నువ్వు చెప్పినట్టు అది చిన్న గది తాళం చెవి కాదు. భారీ డబ్బున్న ఐరన్ సేఫ్ తాళం చెవి. లేదా ఖరీదైన ఆభరణాలు గల గదై ఉండచ్చు’
‘ఏదైనా కావచ్చు. నాకు ఇప్పుడు అది కావాలి’ కోరాను.
‘చావడానికి సిద్ధపడే వచ్చావా?’
నేను జేబులోంచి కత్తిని తీసి పట్టుకున్నాను. వెంటనే అతని చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది.
‘కదలక. కత్తి కింద పడేయ్’ హెచ్చరించాడు.
నేను పడేసిన కత్తి చప్పుడు చేయకుండా మురికి నీళ్లల్లో పడిపోయింది. లీ బాస్ చేతిలోని రివాల్వర్ పేలింది. నేను క్షణకాలం తూలినా అతని వైపు అడుగులు వేయసాగాను. అతని చేతిలోని రివాల్వర్ మూడుసార్లు పేలినా నాకేం కాలేదు.
‘నువ్వు... నువ్వు.. మనిషివి కాదు. లేదా...’
అతను భయంగా లేచి నిలబడ్డాడు. నేను అతని దగ్గరికి వెళ్లి అరుస్తున్న అతన్ని గట్టిగా పట్టుకుని కఠినంగా చెప్పాను.
‘తాళం చెవి’
అతని చేతులు కూర్చున్న పరుపుని తడిమి ఆ తాళం చెవిని అందుకున్నాయి.
‘ఇదిగో ననే్నం చేయకు’ అతని కళ్లల్లో, మొహంలో భయం స్పష్టంగా కనిపించింది. నా పట్టులోంచి తప్పించుకునే విఫల ప్రయత్నం చేస్తూంటే, నేను ముందుకి వంగి అతని మెడ మీద నా కోర పళ్లని ఉంచి తృప్తితీరా అతని రక్తాన్ని పీల్చుకున్నాను.
ఆ దృశ్యం చూసిన పిల్లలు భయంగా అరుస్తూ చెల్లాచెదురయ్యారు. లీ బాస్ నేల కూలుతూ చెప్పాడు.
‘నువ్వు మనిషివి కావు. వేంపైర్‌వి’
‘అవును. ఆ తాళం చెవి నా శవ పేటిక ఉన్న గదిది’ చెప్పాను.
*

(రాబర్ట్ బ్లాక్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి