S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎక్కడున్నాడు?

ప్రతీ దేశంలో తప్పిపోయిన వారి వివరాలని నమోదుచేసే ‘బ్యూరో ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్’ అనే శాఖ ఉంటుంది. అమెరికాలో ఎవరూ కనుక్కోలేని విధంగా ఓ వ్యక్తి కొంతకాలం క్రితం మాయం అయ్యాడు. అతని పేరు ఛార్ల్స్ ఎల్టన్.
1917లో ఓ బుధవారం ఉదయం ఎనిమిదిన్నరకి వాషింగ్టన్ డిసిలోని స్టేట్ సెక్రటరీ ఆల్వే ఆగస్టస్ ఇంటి ముందు ఓ కారు ఆగింది. డ్రైవర్ దిగి ఇంట్లోకి వెళ్లాడు. కొద్ది క్షణాల్లో ఛార్ల్స్ ఎల్టన్ ఆ కారు దగ్గరికి వెళ్లి ఓ స్క్రూ డ్రైవర్‌తో పెట్రోల్ టేంక్ స్క్రూని వదులు చేశాడు. వెంటనే అందులోని పెట్రోల్ అంతా నేల మీదకి కారిపోయింది.
లోపల నించి డ్రైవర్‌తో అగస్టస్ బయటకి వచ్చాడు.
‘మీ కార్లోని పెట్రోల్ అంతా కారిపోయాక ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది?’ ఆయన దగ్గరికి వచ్చిన ఎల్టన్ చెప్పాడు.
‘ఎవరు నువ్వు? ఏమిటి నువ్వనేది?’ ఆయన కోపంగా అడిగాడు.
‘మిస్టర్ సెక్రటరీ. మీకు చాలా ముఖ్యమైంది ఒకటి చూపించాలని వచ్చాను’
‘నేను తొందరలో ఉన్నాను. నా ఆఫీస్‌కి వచ్చి కలు’ అగస్టస్ కసిరాడు.
‘ఈ కారు కదిలే పరిస్థితిలో లేదు’ చేతిలోని స్క్రూ డ్రైవర్‌తో కిందకి కారిన పెట్రోల్‌ని చూపిస్తూ చెప్పాడు.
వెంటనే డ్రైవర్ వంగి కిందకి చూశాడు.
‘ఎవరో పెట్రోల్ కారేలా చేసారు.. ఇతనే’ ఎల్టన్ చేతిలోని స్క్రూ డ్రైవర్ని చూసి డ్రైవర్ చెప్పాడు.
‘నేను రావడానికి కారణం అదే. మిస్టర్ సెక్రటరీ దయచేసి నన్ను క్షమించండి. కాని నేను మీతో మాట్లాడడానికి మీ ఆఫీస్‌కి వరసగా నాలుగు రోజులు వచ్చినా మీరు నన్ను చూడలేదు’
‘కొద్దిగా పెట్రోల్ మిగిలుందేమో చూస్తాను’ చెప్పి డ్రైవర్ కారెక్కి స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ కాలేదు.
ఆయన జేబులోంచి చేతి గడియారం తీసి చూసి డ్రైవర్‌తో చెప్పాడు.
‘స్టేట్ డిపార్ట్‌మెంట్ మీటింగ్ ఎనిమిదింముప్పావుకి. లోపలకి వెళ్లి టేక్సీకి ఫోన్ చేసిరా’
‘పోలీసులకి కూడా ఫోన్ చేయనా?’ డ్రైవర్ అడిగాడు.
‘ఒద్దు’
‘మీ కారు స్టార్ట్ అయ్యే ఏర్పాటు చేస్తాను’ చెప్పి ఎల్టన్ లాన్ తడిపే నీటి గొట్టాన్ని అందుకుని పంపుని తిప్పి దాన్ని పెట్రోల్ టేంక్ వైపు తెచ్చాడు.
‘ఏం చేస్తున్నావు?’ అగస్టస్ అడిగాడు.
‘మీరు మీటింగ్‌కి వెళ్లే ఏర్పాటు’
అతను ఇందాకటి స్క్రూని బిగించి, పెట్రోల్ టేంక్ మూత తీసి అందులో నీళ్లు నింపబోతూంటే అగస్టస్ అరిచాడు.
‘ఆగు. నువ్వు కారుని పాడు చేస్తున్నావు. ఇది నీళ్లతో నడిచే కారనుకుంటున్నావా?’
నవ్వుతూ నీళ్లు నింపాక ఎల్టన్ జేబులోంచి పావు అంగుళం వ్యాసం ఉన్న ఓ తెల్లటి మాత్రని తీసి ఆయనకి చూపిస్తూ చెప్పాడు.
‘ఈ పని మీద మీ దగ్గరికి వచ్చింది’
నీళ్లు నిండిన పెట్రోల్ టేంక్‌లో ఆ మాత్రని వేసి మూతని బిగించి చెప్పాడు.
‘ఈ మాత్రలోని రసాయనిక పదార్థం నీళ్లల్లో కరగడానికి ఆట్టేసేపు పట్టదు. ఎక్కండి’
అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేయగానే అది స్టార్ట్ అయింది. అగస్టస్ నివ్వెరపోయాడు.
‘కూర్చోండి మిస్టర్ సెక్రటరీ. మూడు నిమిషాల్లో నేను మిమ్మల్ని స్టేట్ డిపార్ట్‌మెంట్ భవంతి ముందు దింపుతాను’
ఇంట్లోంచి బయటకి వచ్చిన డ్రైవర్ కారు స్టార్ట్ అవడం గమనించి అడిగాడు.
‘పెట్రోల్ ఎలా వచ్చింది సార్?’
‘నీళ్ల గొట్టంలోంచి’ చెప్పి ఆయన ఎల్టన్ పక్కన కూర్చున్నాడు.
కారు ముందుకి కదిలింది.
* * *
అగస్టస్ ప్రభుత్వ మిలటరీ రీసెర్చ్ లేబొరేటరీలోకి వచ్చి, అక్కడ ఉన్న ముగ్గుర్నీ విష్ చేసి తన వెంట వచ్చిన వ్యక్తిని పరిచయం చేశాడు.
‘జెంటిల్‌మెన్. ఇతను ఛార్ల్స్ ఎల్టన్’
ఎల్టన్‌కి కమాండర్ ఫిలిప్స్‌ని, కల్నల్ విల్సన్‌ని, ప్రొఫెసర్ గార్నర్ని పరిచయం చేశాడు.
‘వీరంతా వీరివీరి రంగాల్లో నిపుణులు... ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ని కనుక్కున్నాక మిస్టర్ ఎల్టన్ ఓ విశిష్టమైన దాన్ని కనుగొన్నాడు. అతను చెప్పేది నిజమైతే అది పెట్రోల్ ధరని చాలా తగ్గించేస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికన్నా ఇంకా వేగంగా పెరుగుతుంది’
‘ఆ అద్భుతం ఏమిటి సర్?’ కల్నల్ విల్సన్ అడిగాడు.
‘ఇది’ చెప్పి ఎల్టన్ తన కోటు జేబుని తట్టాడు.
‘ఇతను నన్ను మోసం చేసాడో లేక ఇది నిజమో పరీక్షించడానికి వెంట తీసుకువచ్చాను’
వాళ్లు సిద్ధం చేసిన బాడీ లేని మోటర్‌కార్ ఇంజన్‌ని చూసి సెక్రటరీ అడిగాడు.
‘దీని టేంక్ పూర్తిగా ఖాళీగా ఉందా? ఎన్నడూ ఇందులో ఎలాంటి ఇంధనాన్ని నింపలేదు కదా?’
వాళ్లు లేదని తలలూపాక సరుకుల దుకాణం నించి కొనుక్కొచ్చిన నీళ్ల సీసా మూతని తెరిచి అగస్టస్ అది నీళ్లే అని రూఢి చేసుకోడానికి ఓ గ్లాస్ నీళ్లు తాగాడు. తర్వాత ఆ సీసాలోని కొంత నీటిని కమాండర్‌కి ఇచ్చి అందులో ఏదైనా కలిసిందేమో పరీక్షించమని కోరాడు. ఆ తర్వాత ఎల్టన్‌కి సైగ చేస్తే అతను జేబులోంచి ఓ మాత్రని తీసి ఆ సీసాలో వేశాడు. అది బుడగలని విడుదల చేస్తూ అందులో తక్షణం కరిగిపోయింది. ఆ గదిలోని ముగ్గురూ వింతగా చూస్తూంటే ఎల్టన్ ఆ నీళ్లని ఓ ఔన్స్ గ్లాస్‌లోకి వంచి మిగిలింది సింక్‌లో పారపోసి చెప్పాడు.
‘ఇది నా రహస్యాన్ని కాపాడుకోడానికి. ఈ నీరు ఇంజన్‌ని కేవలం నిమిషం మాత్రమే పని చేయిస్తుంది. మీరు మాట ఇచ్చినట్లుగా ఈ మొత్తం పెట్రోల్ ఖర్చయ్యేదాకా ఇంజన్‌ని నడపాలి. ఎందుకంటే ఈ భూగోళంలో నా మాత్రలోని రసాయనిక పదార్థాలన్నీ లభిస్తాయి’
‘నీళ్ల వల్ల ఇంజన్ పాడవుతుంది’ గార్నర్ అభ్యంతరం చెప్పాడు.
అతను ఇంజన్ టేంక్‌లో ఆ నీళ్లని పోసి ఇంజన్‌ని ఆన్ చేశాడు. అది స్టార్ట్ అయి సరిగ్గా నిమిషం సేపు నడుస్తూనే ఉంది. తర్వాత ఎల్టన్ సీసాని, ఔన్స్ గ్లాస్‌ని శుభ్రంగా కడిగేశాడు. ఆ ముగ్గురి మొహాల్లో విభ్రాంతి. అగస్టస్ మొహంలో చిరునవ్వు.
‘నీ ఫార్ములాకి ఎంత అడుగుతావు?’ అగస్టస్ అడిగాడు.
‘కోటి డాలర్లు’ ఎల్టన్ చెప్పాడు.
‘కాని ఈ మాత్ర చేయడానికి ఎంత ఖర్చవుతుంది?’ గార్నర్ అడిగాడు.
‘పది గేలన్ల పెట్రోల్‌కి రెండు సెంట్ల కంటే తక్కువ’
‘ఇంత పెద్ద మొత్తాన్ని నేను బాధ్యత తీసుకుని కమిట్ అవలేను. మీరా గదిలో వేచి ఉంటే మేం చర్చించుకుని ఓ నిర్ణయం తీసుకుని మిమ్మల్ని పిలుస్తాం’ అగస్టస్ కోరాడు.
ఎల్టన్ పక్కనే ఉన్న చిన్న గదిలోకి వెళ్లి చెక్క బెంచీ మీద కూర్చోగానే తలుపు మూసి అగస్టస్ వారితో చర్చించాడు.
అతను చెప్పింది సరైందైతే అతను కోరింది చాలా తక్కువ అని వాళ్లు నిర్ణయించారు. అమెరికా అధ్యక్షుడి అనుమతి తీసుకుని ఆ ఫార్ములాని కొనాలని నిర్ణయించారు.
రెండు నిమిషాల తర్వాత అగస్టస్ వెళ్లి ఆ గది తలుపు తెరిచాడు. ఆశ్చర్యంగా ఆ గదిలోని బెంచ్ ఖాళీగా ఉంది. అక్కడ ఎల్టన్ లేడు. అదృశ్యం అయ్యాడు!! ఆ గదిలోంచి బయటకి ఆ తలుపు ఒక్కటే దారి. కిటికీలూ లేవు. అతను తలుపు తెరచుకుని వెళ్తుంటే బయట నిలబడ్డ ఆ నలుగురికీ కనపడేవాడు.
ఎఫ్.బి.ఐ. రంగంలోకి దిగి అతని కోసం చాలా నెలలు వెదికింది. వాషింగ్టన్ డిసిలోని ప్రతీ హోటల్ గది, అద్దె గది వెదికారు. ఛార్లెస్ ఎల్టన్ పేరు గల ప్రతీ వ్యక్తి ఫొటోని ఆ నలుగురికీ చూపించారు. వారిలో తాము చూసిన ఎల్టన్ లేడు. లేబ్‌లో దొరికిన అతని వేలిముద్రల వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. ఆ పేరుగల ఆ వ్యక్తి అమెరికాలో ఉన్నాడనే రుజువే వారికి దొరకలేదు. అతను నీళ్లని పెట్రోల్‌గా ఎలా మార్చాడో ఈ రోజుకీ ఎవరికీ తెలీదు.
నిజంగా అలాంటి ఫార్ములా ఉందా? లేదా ఎల్టన్ వారిని ఏదైనా మాయ చేసాడా? ఆ గదిలోంచి ఎలా మాయమయ్యాడు? ఎక్కడికి వెళ్లాడు? దేవుడికే తెలియాలి.
*