S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మాయ

మొదట్లో తన మీద నెల్డా ప్రాక్టికల్ జోక్ వేస్తోందని ఆమె భర్త హగ్ అనుకున్నాడు. అయితే ఆమె ఎన్నడూ తన మీద ఎలాంటి ప్రాక్టికల్ జోక్ వేయలేదని అతనికి తెలుసు. ఆమె ఆ తరహా మనిషి కాదు. అంతేకాక ఆమెలో సెన్సాఫ్ హ్యూమర్ ఎంత తక్కువ అంటే, హగ్ ఏదైనా జోక్ చెప్పాక దాన్ని వివరిస్తే కాని అర్థమై నవ్వేది కాదు. అది జోక్ కాదని హగ్‌కి అర్థమయ్యాక తన భార్యతో చెప్పాడు.
‘ఈ పిచ్చి మంచిది కాదు. మాను’
నలభై రెండేళ్ల హగ్ బెల్డన్ అండ్ నెయిల్స్ అనే ఆర్కిటెక్చరల్ కంపెనీలో డిజైనర్‌గా పని చేస్తున్నాడు. అతని జీతం అతని ఖర్చులకి నాలుగు రెట్లు వస్తుంది. అంత జీతం రావాలంటే ఇంట్లో కూడా ఆఫీస్ పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి అతను హోంవర్క్ చేసుకుంటూంటే కాలక్షేపానికి నెల్డా ఫేషన్ మేగజైన్స్, హాలీవుడ్ మేగజైన్స్‌ని చదువుతూండేది. నలభై ఏళ్ల నెల్డా చదివే పుస్తకాలు మారడం ఆరు వారాల క్రితం హగ్ గమనించాడు.
‘సైకిక్ ఎక్స్‌పీరియెనె్సస్ త్రూ ది ఏజెస్’ అనే టైటిల్ చదివి కొద్దిగా ఆశ్చర్యపోయాడు. తర్వాత ‘ఎర్లీ స్పిరిట్యువలిజం’. ఆ తర్వాత ‘టెలిపతి ఇన్ ఎవ్విరిడే లైఫ్’ అనే పుస్తకాలని చూసి నెల్డాని అడిగాడు.
‘ఏమిటి? కొత్తగా ఇలాంటి చెత్త పుస్తకాలు చదువుతున్నావు?’
‘ఇవన్నీ ఈ ఫీల్డ్‌లోని నిపుణులు రాసిన పుస్తకాలు. చెత్త కాదు’ ఆమె జవాబు చెప్పింది.
‘ఏదైనా కావచ్చు. కాని వీటిని ఎందుకు చదువుతున్నావు?’
‘నా స్నేహితురాళ్లు ఇద్దరు నాకు ఇ.ఎస్.పి. లేదా అలాంటిది ఏదో ఉందని అంటున్నారు. అదేమిటో తెలుసుకుందామని వీటిని లైబ్రరీ నించి తెచ్చి చదువుతున్నాను’
‘ఇక నువ్వు జ్యోతిష్యం చెప్పడం మొదలుపెడతావా?’ ఎగతాళిగా నవ్వాడు.
నెల్డా ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా మళ్లీ ఆ పుస్తకం చదవడంలో మునిగిపోయింది. ఆఫీస్ నించి అతను ఎప్పుడు ఇంటికి వచ్చినా నెల్డా ఫైర్ ప్లేస్ పక్కన అతి పురాతన కుర్చీలో కూర్చుని, అతీంద్రియ శక్తులకి చెందిన ఏదో ఒక పుస్తకాన్ని చదవడం హగ్ కొన్ని వారాలపాటు గమనించాడు. ఓ రోజు ఆమె చేతిలోని ‘హిప్నోసిస్ అండ్ డ్రీమ్ టెలిపతి’ అనే పుస్తకాన్ని చూసి అడిగాడు.
‘నీకు ఈ పిచ్చి ఎక్కువైనట్లుందిఆ? కాస్త తగ్గించరాదూ?’
ఆమె అతని వంక చూసి నర్మగర్భంగా నవ్వి చెప్పింది.
‘మీకు తెలీదు’
‘ఏమిటి నాకు తెలీదు?’ హగ్ ప్రశ్నించాడు.
‘ఇటీవల నేను బ్రిడ్జి ఆటని ఆడుతున్నప్పుడు ఇది మొదలైంది. మిగిలిన ముగ్గురు ఆడే ప్రతీ కార్డ్, వాళ్లు అది ఆడకుండానే నాకు తెలిసిపోసాగింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆలోచిస్తే, వాళ్ల చేతుల్లో ఏం పేకముక్కలు ఉన్నాయో కూడా నాకు తెలిసిపోయింది. దాంతో ఆ ఆటలో నేనే గెల్చాను’
‘అయితే మనం లాస్‌వేగాస్‌కో, రెనోకో వెళ్లి ధనవంతులం అవచ్చన్నమాట’ అతను పెద్దగా నవ్వి చెప్పాడు.
‘హగ్! ఇది జోక్ కాదు. నాకిది కొంత ఆందోళనని కూడా కలిగిస్తోంది. అది జరిగిన రెండు మూడు రోజుల తర్వాత నా స్నేహితురాళ్లు రూత్, బార్బ్, నేను ‘ది టీ కెటిల్’ రెస్ట్‌రెంట్‌లో కలవాలనుకున్నాం. రూత్, నేను వెళ్లాం. నాకా ఆలోచన ఎక్కడి నించి వచ్చిందో అర్థం కాలేదు కాని, ‘బార్బ్ రావడంలేదు. ఆమె రెస్ట్‌రెంట్ మేనేజర్‌కి ఫోన్ చేసి తనకి వొంట్లో బావుండక రాలేకపోతున్నానని మనకి చెప్పమని చెప్తుంది’ అన్నాను. రూత్ నేను చెప్పింది నమ్మలేదు. మేము కూర్చున్న రెండు నిమిషాలకి మేనేజర్ వచ్చి మాతో ‘మిసెస్ బార్బరా లాంగ్ ఇప్పుడే ఫోన్ చేసి తను రాలేనని, తన కోసం ఎదురుచూసే ఇద్దరి ఆడవాళ్లకి ఈ విషయం చెప్పమని చెప్పింది. వాళ్లు మీరే కదా?’ అని అడిగాడు. వెంటనే రూత్ నాకు అతీంద్రియ శక్తి ఉందని చెప్పింది.’
హగ్‌కి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమె వంక చూస్తూ సామాన్యమైన తన భార్యకి పిచ్చెక్కిందా అని అనుకున్నాడు.
ఆ రాత్రి హగ్ సోంజా దగ్గరకి వెళ్లాలని అనుకున్నాడు. గత మూడు రోజులుగా అతనామె దగ్గరకి పని వత్తిడి వల్ల వెళ్లలేదు. కాని నెల్డా చెప్పింది విన్నాక, ఆమె కంఠంలోని నిశ్చయాన్ని గమనించాక, అతను ఇంట్లోనే ఉండిపోదల్చుకున్నాడు. బయటకి వెళ్లాలనుకుంటే, హగ్‌కి అడ్డే లేదు.
‘గ్రాండీ బిల్డింగ్‌కి ఏదో సమస్య వచ్చింది. నేను ఆఫీస్‌కి వెళ్లాలి’ అని చెప్తే చాలు. నెల్డా అభ్యంతరం చెప్పదు. మే అవెన్యూలో ఆ బిల్డింగ్ కడుతున్నారని ఆమెకి తెలుసు. వెళ్లి కొద్ది గంటలు సోంజా దగ్గర ఆనందాన్ని అనుభవించి మళ్లీ వెనక్కి రావచ్చు. నెల్డాకి తన ప్రవర్తన మీద ఎలాంటి అనుమానం కలగదు అని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. ఎందుకనో అతనికి ఆ రాత్రి ఇంట్లోనే ఉండిపోవాలని అనిపించింది.
‘ఇంకేమైనా అతీంద్రియ అనుభవాలు చెప్తావా?’ అతను నవ్వుతూ అడిగాడు.
నెల్డాకి కోపం వచ్చింది.
‘మీరు నమ్మట్లేదు కదా? నన్ను ఆట పట్టిస్తున్నారు కదా?’ అడిగింది.
‘లేదు. నాకు ఆసక్తిగా ఉండి అడిగాను’
‘మీకు చెప్పినవి రెండూ పెద్దవి. ఇంకా కొన్ని చిన్న అనుభవాలు కూడా కలిగాయి. అవి జరగడం ఎక్కువవుతోంది. ప్రతీసారి నాలో అతీంద్రియ శక్తి బలపడుతోంది’ ఆమె ఇంకేదో చెప్పబోయి అకస్మాత్తుగా ఆగి కొంచెం దూరంలో బల్ల మీద ఉన్న టెలిఫోన్ వంక చూసి చెప్పింది.
‘ఇప్పుడు అలాంటి అనుభవమే కలిగింది. మన ఫోన్ మోగబోతోంది’
‘అయితే ఇది నీకు పరీక్ష. చూద్దాం ఎంతదాకా నిజమో?’ హగ్ చెప్పాడు.
ఇద్దరూ నిశ్శబ్దంగా ఫోన్ వైపు చూడసాగారు. ఒక నిమిషం. రెండు, మూడు నిమిషాలు గడిచినా ఫోన్ మోగలేదు. అంతలోనే ఫోన్ మోగింది.
‘దాన్ని ఆన్సర్ చేయద్దు. అది రాంగ్ నంబర్’ నెల్డా చెప్పింది.
ఆ రోజు ఆ ఫోన్ రిసీవర్ని ఆ కాల్ కోసం ఎత్తకూడదని ప్రభుత్వం చట్టం చేసినా అతను ఆ ఫోన్‌ని ఎత్తి ఉండేవాడు.
‘హలో’
‘జిమీ ఇంకా ఇంటికి రాలేదా?’ ఓ కంఠం వినిపించింది.
వెంటనే హగ్ అనాలోచితంగా బుసకొట్టే సర్పాన్ని దూరంగా ఉంచినట్లుగా చేతిని దూరంగా చాపాడు. తర్వాత గట్టిగా చెప్పాడు.
‘రాంగ్ నంబర్’
అతను తన భార్య వంక చూస్తే ‘నే చెప్పానా?’ అనే భావం వ్యక్తం చేయకుండా తను చదివే పుస్తకంలో నిమగ్నమై ఉండటం గమనించాడు.
నెల్డాకి ఏమైంది? ఆమెకి నిజంగా ఏదైనా కొత్త శక్తి వచ్చిందా?’ అత్యంత సాధారణమైన నెల్డాలో ఏమిటీ వింత మార్పు?
‘నీకు ఏదైనా అపూర్వమైంది జరిగిందా?’ అడిగాడు.
‘అంటే?’ పుస్తకం చదువుతూనే అడిగింది.
‘అంటే? ఎలక్ట్రిక్ షాక్ కొట్టడం కాని, తలనొప్పి రావడం కాని, లేదా తలకి దెబ్బ తగలడం కాని... ఇలాంటిది ఏదైనా జరిగిందా?’
‘లేదు. నేనెప్పట్లాగానే ఉన్నాను’
ఫోన్, రాంగ్ నంబర్‌లని బట్టి అతనికి తన భార్య చెప్పే దాని మీద కొంత నమ్మకం కలిగింది. నిజంగా ఆమెకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసే అతీంద్రియ శక్తి వచ్చి ఉంటే అది తన జీవితంలో గొప్ప భయంకర మార్పుని తేవచ్చు అని అనుకున్నాడు. అది అతనికి రుచించలేదు. ఇది తాత్కాలిక లక్షణమే అని, తన భార్యలోంచి అది త్వరలోనే మాయమై పోతుందని, లేదా ఇలాంటి పుస్తకాలు చదవడంతో విసిగిపోయి మళ్లీ మామూలై పోతుందని అతను ఆశించాడు. ఆ రాత్రి అతనికి ఓ పట్టాన నిద్ర పట్టలేదు. అనేక సంవత్సరాలుగా అదే మిత్రులతో బ్రిడ్జి ఆట ఆడుతూండటంతో వారు ఆ ఆటని ఆడే విధానం సబ్‌కాన్షస్‌గా తెలిసి వారు వేయబోయే కార్డులని ఊహించి ఉంటుంది. బార్బరా లాంగ్ రెస్ట్‌రెంట్‌కి రాకపోవడం కల్పన వల్ల చేసిన ఆలోచన. కాకతాళీయంగా అది నిజమై ఉంటుంది.
కాని తమకి రాత్రిళ్లు ఆ సమయంలో ఎన్నడూ ఫోన్ కాల్స్ రావు. వచ్చిందంటే అద రాంగ్ కాలే అవడంలో విశేషం లేదు. దాన్నీ మరో కాకతాళీయంగా కొట్టేసాక అతనికి నిద్ర పట్టింది. త్వరలోనే తన భార్య తిరిగి ఫేషన్, హాలీవుడ్ మేగజైన్స్‌కి మళ్లుతుందని అతను ఆశించాడు.
హగ్ మర్నాడు రాత్రి ఆఫీస్ నించి సరాసరి సోంజా హోటల్ అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నాడు. తనకన్నా పదిహేనేళ్లు చిన్నదైన ఆమె అతనికి పరిచయమైన ఆరు నెలల్లో ఆమె కోసం చాలా ఖర్చు చేశాడు. బంగారు నగలు, ఖరీదైన దుస్తులు, షాంపేన్, రూం సర్వీస్ డిన్నర్, పనె్నండో అంతస్థులోని హోటల్ సూట్‌కి అద్దెలకి వేల డాలర్లు ఖర్చు చేశాడు. తాను ఎప్పుడు వెళ్లినా ఆమె వొంటరిగా తన కోసం ఎదురుచూస్తున్నట్లుగా కనిపించేది.
సోంజాతో తన భార్యలోని మార్పు గురించి చెప్పాడు. ఆమె దాన్ని హగ్‌లా కొట్టిపారేయక నమ్మింది.
‘మన గురించి తెలిసి పోతుందేమో?’ భయంగా చెప్పింది.
వారం తర్వాత హగ్ గ్రాండీ బిల్డింగ్ ఎస్టిమేషన్ ఫైల్ ఇంట్లో మర్చిపోయి ఆఫీస్‌కి వెళ్లాడు. దాని అవసరం రావడంతో మధ్యాహ్నం మూడుకి ఇంటికి వెళ్లాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. టివి, రేడియో ఆన్‌లో లేవు. గోల్డెన్ ఓల్డీస్ సిడి కూడా ఆన్‌లో లేదు. నెల్డా ఇంట్లో లేదనుకున్నాడు. కాని ఆమె కారు ఇంటి ముందు చూశాడు కాబట్టి ఆమె ఏమైందా? అనుకున్నాడు. ఆమెని రెండుసార్లు పిల్చాడు. జవాబు లేదు. అనుమానం వచ్చి ఫైర్ ప్లేస్ పక్కన చూస్తే పురాతన కుర్చీలో కూర్చున్న నెల్డా కళ్లు మూసుకుని ఉంది. ఆమె చేతిలో ఓ తెల్లకాగితం పట్టుకుని ఉంది. ఆమెని భుజాలు పట్టుకుని కుదిపాడు. తక్షణం నెల్డా కెవ్వున కేకేసింది. కళ్లు తెరిచి అయోమయంగా చూసింది. తేరుకున్నాక భర్తతో చెప్పింది.
‘ట్రాన్స్‌లో ఉన్నప్పుడు నన్ను అలా బయటకి తీసుకువచ్చే ప్రయత్నం చేయకండి. ఈ టైంలో మీరు ఇంటికి ఎందుకు వచ్చారు?’
ఫైల్ గురించి చెప్పి అడిగాడు.
‘ట్రాన్స్ అంటే ఏంటి? కళ్లు మూసుకుని తెల్ల కాగితం చదవడమా?’
ఆమె సమాధానం చెప్పడానికి కొంత సందేహించి తర్వాత చెప్పింది.
‘నాలో అతీంద్రియ శక్తి ఇంకాస్త బాగా పని చేస్తోంది. నేను ఈ తెల్ల కాగితం చూడగానే దీని మీద కాన్సన్‌ట్రేట్ చేయాలనిపించింది. చేశాను. నేను చాలా కాలంగా చూడని ఓ మిత్రుడి నించి నాకో ఉత్తరం ఈ రోజు వస్తుందని ఆ ట్రాన్స్‌లో తెలిసింది.’
అతను నవ్వి చెప్పాడు.
‘దీని కోసం సమయం వృధా చేయడం దేనికి? ఉత్తరం వస్తే పోస్ట్‌మేన్ తెస్తాడుగా? నువ్వా పిచ్చి పుస్తకాలు చదవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి.’
అతను సమాధానం కోసం ఎదురుచూడకుండా లివింగ్ రూంలోని ఆ ఫైల్ తీసుకుని బయటకి వెళ్తూ చెప్పాడు.
‘ఈ రాత్రి నేను లేట్‌గా వస్తాను. బిజినెస్ డిన్నర్ మీటింగ్ ఉంది.’
అతను తన కారు ఎక్కి స్టార్ట్ చేస్తూండగా పోస్ట్‌మేన్ ఎరుపు తెలుపు నీలం రంగు జీప్ తమ సందులోకి తిరగడం కన్పించింది. అతను వచ్చేదాకా ఆగి ఉత్తరాలు తీసుకుని తన భార్యకి ఇచ్చి అతీంద్రియ శక్తి ఆమెలో లేదని రుజువు చేయదల్చుకున్నాడు. పోస్ట్‌మేన్ ఇచ్చిన చేతి నిండా పట్టిన ఉత్తరాలతో భార్య దగ్గరికి వెళ్లి వాటిని ఇచ్చి అడిగాడు.
‘నీ అతీంద్రియ శక్తి నిజమే అయితే ఏదీ నువ్వు చెప్పిన ఉత్తరం చూపించు’
బిల్స్, ప్రకటనలు, కూపన్లు వచ్చిన కవర్లని పక్కన పెట్టి నెల్డా, చేత్తో గుండ్రంగా తన అడ్రస్ రాసిన ఓ కవర్ని భర్తకి ఇచ్చి చెప్పింది.
‘చదువుతా చూడండి’
హగ్ కవర్ చింపి ఉత్తరం బయటకి తీశాక నెల్డా కళ్లు మూసుకుని చదివింది.
‘డియర్ నెల్డా,
ఏళ్లు గడిచాయి కాబట్టి నేను గుర్తుండకపోవచ్చు. నేను, నా భార్య కేన్సస్ సిటీ నించి మీ ఊరికి మారాం. మనం కలిసి కాలేజీ కబుర్లు చెప్పుకుందాం. నాతో పని చేసే జాక్ తప్ప నాకు ఇక్కడ ఎవరూ తెలీదు. నాకు నీ భర్తని కూడా చూడాలని ఉంది. నా భార్య నీతా నీ దగ్గరికి త్వరలో రావడానికి ప్లాన్ చేస్తోంది.
సిన్సియర్లీ,
కానే్వ డెలాహన్
పి.ఎస్.లో ఫోన్ నంబర్ ఇచ్చాడు.
* * *
హగ్ చెప్పింది వినగానే సోంజా మొహం పాలిపోయింది.
‘మీ ఆవిడకి కచ్చితంగా అతీంద్రియ శక్త అబ్బింది. ఆమెకి ఈ శక్తి వల్ల మన గురించి తెలిస్తే ఎలా? ఇంతకాలం ఇద్దరం కలిసి రెస్ట్‌రెంట్లకి కూడా బయటకి వెళ్లకుండా ఈ నాలుగు గోడల మధ్యే కలుస్తున్నాం.’
‘ఆ చెత్త పుస్తకాలు చదవడం వల్లే ఇదంతా. నీ కొత్త పెర్‌ఫ్యూంలో నువ్వు ఎలిజబెత్ టైలర్ వాసన వేస్తున్నావు’
‘దొంగా! ఎలిజబెత్ టైలర్ వాసన నీకెలా తెలుసు?’ అతని ముక్కుని పిండి అడిగింది.
ఇద్దరూ నవ్వుకున్నారు.
ఆ రాత్రి హగ్ ఇంటికి వెళ్లేసరికి నెల్డా మంచం మీద కూర్చుని కళ్లు మూసుకుని కుడిచేతి వేళ్లతో నుదుటిని
రాసుకుంటూ కనిపించింది.
‘ఏమైంది? తలనొప్పా?’ హగ్ అడిగాడు.
‘నేను ఎక్కడ ఉన్నాను?’ కళ్లు నెమ్మదిగా తెరిచి అయోమయంగా చుట్టూ చూస్తూ అడిగింది.
‘మనింట్లో. మన బెడ్‌రూంలో’
నెల్డా చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. హగ్ దుస్తులు మార్చుకుని పడుకున్నాడు. ఆమెని సైకియాట్రిస్ట్ దగ్గరకి తీసుకెళ్లాలన్న ఆలోచన అప్పుడు అతనికి కలిగింది.
‘పడుకో’ చెప్పాడు.
‘నాకు అత్యంత విచిత్రమైన దృశ్యం కనిపించింది. నా మనోఫలకం మీద కొన్ని ఫొటోల్లాంటివి కన్పించాయి. వద్దనుకున్నా అవి కనపడుతూనే ఉన్నాయి. నేను నా శరీరంలోంచి బయటకి వచ్చి ఆ గదిలో నిలబడి అక్కడ జరిగేది చూశాను. అది హోటల్ గదిలా కన్పించింది. బహుశా నెలసరి హోటల్ సూట్ అనుకుంటా. ఎర్రరంగు సోఫా, టేబుల్ మీద నీ ఫొటోగల ఫ్రేమ్. లవ్ సీట్లో నువ్వు కూర్చుని ఉన్నావు. నువ్వు ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా నీ పెదవులు కదిలాయి. కాని నాకు మాటలు వినపడలేదు. నువ్వు ఒంటరిగా లేవు. నల్లటి జుట్టు గల ఓ అందమైన యువతిని ఆ గదిలో చూశాను...’
హగ్ తక్షణం నిటారుగా లేచి కూర్చుని భయంగా అడిగాడు.
‘ఏమిటి నువ్వనేది?’
‘నాలో అతీంద్రియ శక్తి పని చేస్తోందా? లేక నాకు పిచ్చెక్కుతోందా? నేనేం చూస్తున్నానో నాకు అర్థం కాలేదు. ఈ రాత్రి నీ బిజినెస్ మీటింగ్ ఎక్కడ జరిగింది?’
‘బేక్‌స్టర్ హోటల్‌లో. న్యూయార్క్ నించి వచ్చిన ఓ ఆర్కిటెక్ట్ గదిలో’ కొంత దాకా హగ్ నిజం చెప్పదల్చుకున్నాడు.
‘ఐతే అర్థమైంది. నేను చూసింది ఆ మీటింగ్‌ని. కానీ నేను మీ ఇద్దరినే తప్ప మిగిలిన వాళ్లని ఎందుకు చూడలేక పోయాను?’
హగ్ ఆ ప్రశ్నకి సరైన జవాబు ఇవ్వలేకపోయాడు. హగ్‌కి ఆ రాత్రి సూర్యోదయ సమయంలో కాని నిద్ర పట్టలేదు.
ఆఫీస్‌కి వెళ్లగానే హగ్ ముందుగా సోంజాకి ఫోన్ చేసి, తన భార్య చెప్పిన విషయాలు చెప్పాడు.
‘అయితే మనం కొంతకాలం కలవొద్దు’ ఆమె భయంగా చెప్పింది.
‘కాని నిన్ను కనీసం మూడు రోజులకి ఒకసారైనా చూడకుండా ఉండలేను. మా ఆవిడకి ఈ పిచ్చి ఎప్పటికి తగ్గుతుందో నాకు తెలీదు. నా పరిస్థితి సంతల్లో జ్యోతిష్యం చెప్పే వ్యక్తితో జీవిస్తున్నట్లుగా ఉంది. హేతువాదంతో ఆలోచిస్తే మా ఆవిడకి జరిగేది ఏదీ నాకు అర్థం కావడంలేదు’
‘ఆమెకి అతీంద్రియ శక్తి కచ్చితంగా ఉంది హగ్. నాకు ఇలాంటి వాటిలో బాగా నమ్మకం. బ్రిడ్జి ఆట, ఫోన్, రాంగ్ నెంబర్, పోస్ట్‌మేన్ ఉత్తరం, ఇప్పుడు ఇది... ఇన్ని కాకతాళీయాలు ఎలా జరుగుతాయి? నువ్వే ఇలా ఆలోచించు. అదే హేతువాదం అవుతుంది...’
సోంజా భయపడి అపార్ట్‌మెంట్ మారింది.
వారం పాటు హగ్ సోంజా దగ్గరికి వెళ్లనే లేదు. ఆఫీసయ్యాక ఇంటికి వెళ్తున్నాడు. ఫైర్ ప్లేస్ పక్కన కుర్చీలో కూర్చుని అప్పుడప్పుడు వింతగా నవ్వుతూ, అసెంట్రిక్ విచ్‌క్రాఫ్ట్ లేదా క్లెయిర్ వాయిన్స్ ఫర్ డమీ లాంటి పుస్తకాలు చదివే తన భార్యని ఇంటికి తిరిగి వచ్చాక చూడసాగాడు.
ఓ రాత్రి ఫోన్ మోగితే నెల్డా హగ్‌తో చెప్పింది.
‘ఎత్తకు. అది నాకే. రేపటి బ్రిడ్జి ఆట వాయిదా పడిందని చెప్పడానికి షీలా ఫోన్ చేసింది. ఆమె కోడల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారు. ఈ రాత్రే ఆమెకి బిడ్డ పుడుతుంది’
హగ్ స్ప్రింగ్‌లా లేచి రిసీవర్ని అందుకుని అడిగాడు.
‘హలో షీలా?’
‘అవును. నెల్డాకి ఫోన్ ఇవ్వండి’
‘నిద్రపోతోంది. ఏమిటి విశేషం?’
‘రేపు బ్రిడ్జి రద్దైందని చెప్పండి. మా కోడల్ని హాస్పిటల్‌కి రేపు ఉదయం తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది’
‘అలాగే’ హగ్ నిస్సారంగా రిసీవర్ని పెట్టేశాడు.
‘ఇందాక పొరపాటు చెప్పాను. హాస్పిటల్‌కి తీసుకెళ్లేది రేపు ఉదయం. బిడ్డ పుట్టేది రేపు మధ్యాహ్నం’ నెల్డా చెప్పింది.
హగ్ టివి ఆన్ చేశాడు. కాని ఎక్కువసేపు చూడలేక పడుకున్నాడు.
* * *
నెల్డా భర్త మీదకి వంగి కదుపుతూ చెప్పింది.
‘హగ్ లే, హగ్ నిద్ర లే. ఉదయం తొమ్మిదైంది. నువ్వు ఆఫీస్‌కెళ్లే టైం దాటింది’
‘నన్ను లేపకు’ చెప్పి హగ్ అవతలకి తిరిగి పడుకున్నాడు.
‘ఆఫీస్‌కి వెళ్లాలిగా? లే’
‘ఆఫీస్‌కి వెళ్లనీ రోజు’
‘నీకు ఒంట్లో బావుళ్లేదా?’
జవాబు చెప్పకుండా దుప్పటిని తల మీద కప్పుకున్నాడు. గత రాత్రి నెల్డా చెప్పింది అతనికి పెద్ద దెబ్బ. సోంజా చెప్పినట్లు తన భార్యకి భవిష్యత్తు జరగబోయేవి తెలుసుకునే అవుటాఫ్ బాడీ విద్యలు నిజంగా పట్టుబడ్డాయి. సోంజాకి, తనకి మధ్యగల సంబంధం అత్యంత గోప్యంగా సాగుతోంది. అది ఆమె తెలుసుకుంటే? ఆ ఆలోచనకే అతనికి వణుకు పుట్టింది. ఆ మానసిక వత్తిడితో హగ్‌కి జ్వరం వచ్చింది. రెండు రోజులు మంచం మీంచి లేవలేదు.
మూడో రోజు అతను ఆఫీస్‌లో ఉండగా, ఆశ్చర్యంగా నెల్డా అతని గదిలోకి వచ్చింది. లంచ్ టైంలో సోంజా దగ్గరికి వెళ్లి తిరిగి వచ్చిన హగ్ తన భార్యని చూసి నివ్వెరపోయాడు. ఆమె మొహంలోని ఆందోళనని పసిగట్టి అడిగాడు.
‘ఏమిటి సంగతి? ఏం జరిగింది?’
‘ఏం జరిగింది కాదు. ఏం జరగబోతోంది అన్నది మీకు చెప్పడానికి వచ్చాను’ ఆదుర్దాగా చెప్పింది.
హగ్ ప్రశ్నార్థకంగా చూశాడు.
‘నిన్ను మరో హోటల్‌లో ఓ మీటింగ్‌లో ఓ రాత్రి చూశాను. ఆ మీటింగ్‌లో మళ్లీ నువ్వు, ఆ నల్లజుట్టు అమ్మాయి మాత్రమే నాకు కనపడ్డారు. అకస్మాత్తుగా గది తలుపు తెరుచుకుని ఒకరు మీ గదిలోకి వచ్చారు. అతని మొహాన ఓ ముసుగు ఉంది. అతని చేతిలో పిస్తోలు ఉంది. అతను నీ మీదకి దూకి ‘ఈ చోటు నీది కాదు. ఇది నా టెరిటోరి’ అని సరిగ్గా నీ గుండెల్లోకి గురి చూసి పిస్తోలుని పేల్చాడు. తర్వాత ఆమె దగ్గరికి వెళ్లి ‘ఇంకోసారి నిన్ను పరాయి పురుషుడితో ఇట్లా చూస్తే నిన్ను కాల్చేస్తాను’ అన్నాడు. ఆమె అతన్ని ముద్దు పెట్టుకుంది. ఇద్దరూ పడక మీదికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె వొంటి మీద నీలం చుక్కలతో హృదయాకారం డిజైన్ గల సిల్క్ గౌన్ ఉంది’
‘నెల్డా నీకేమైనా పిచ్చెక్కిందా? ఇది నేనింత దాకా విన్న అతి పిచ్చి విషయం’ చెప్పాడు.
‘కదా? ఇది మీతో చెప్పి ఇద్దరం సరదాగా నవ్వుకోవచ్చని వచ్చాను?’
నవ్వే బదులు హగ్ తన తలని చేత్తో పట్టుకున్నాడు. నెల్డా వెళ్లిపోయాక సోంజాకి ఫోన్ చేసి ముందు అనుకున్నట్లుగా ఆ రాత్రి తను రావడం లేదని చెప్పాడు. సోంజా భయపడుతుందని నెల్డా చెప్పిన కల గురించి చెప్పలేదు. మరో వారం రోజులు ఏదో వంక చెప్తూ హగ్ సోంజా దగ్గరకి వెళ్లలేదు.
ఓ రోజు అర్ధరాత్రి నెల్దా హగ్‌ని భుజాలు పట్టి కుదుపుతూ లేపింది. భయంతో నిలువెల్లా వణికిపోతోంది. చెమట పట్టింది.
‘ఏమిటి’ అయోమయంగా ప్రశ్నించాడు.
‘నాకు ఓ కల వచ్చింది. నిజానికి కల కాదు. అవుటాఫ్ బాడీ ఎక్స్‌పీరియెన్స్‌తో భవిష్యత్‌లోకి వెళ్లి జరిగేది చూశాను. అదే గది. అదే నల్లజుట్టు అమ్మాయి. అది బిజినెస్ మీటింగ్‌లా అన్పించలేదు. ఇదివరకటిలానే ముసుగు వ్యక్తి తలుపు తీసుకుని అకస్మాత్తుగా లోపలకి వచ్చాడు. అతను మిమ్మల్ని కాల్చేలోగా మీరు బాల్కనీలోంచి ‘ఇప్పుడేం జరగబోతోందో నాకు తెలుసు’ అంటూ కిందకి దూకారు. సరిగ్గా సమయానికి కింద కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్న వారి లారీ వచ్చి ఆగింది. దానిలోని పరుపుల మీద మీరు పడి రక్షింపబడ్డారు’
‘సర్లే. పడుకో’
నెల్డా ప్రశాంతంగా నిద్రపోయింది. కాని హగ్‌కి నిద్రపట్టలేదు.
మర్నాడు రాత్రి హగ్ సోంజా అపార్ట్‌మెంట్‌కి వెళ్లాడు. తను ఇంతకాలం ఎందుకు రాలేదో ఆమెకి వివరించబోయాడు. అకస్మాత్తుగా సోంజా అపార్ట్‌మెంట్ తలుపు తెరుచుకుంది. లోపలకి ముసుగు ధరించిన ఓ వ్యక్తి చేతిలో పిస్తోలుతో వచ్చాడు. సోంజా అతన్ని చూసి కెవ్వున అరిచింది.
‘వద్దు. నన్ను షూట్ చేయకు. దయచేసి నన్ను షూట్ చేయకు’ రెండు చేతులు ఎత్తి హగ్ చెప్పాడు.
‘ఇది నీ గది కాదు. ఇది నా టెరిటోరి’ ఆ ముసుగు వ్యక్తి చెప్పాడు.
తక్షణం హగ్‌కి తన భార్య రెండో కల నిజమవుతుందని అన్పించింది. బాల్కనీలోకి దూసుకుపోయి కిందకి దూకాడు. నేల మీద పడుతూ వచ్చే లారీ కోసం చూశాడు. లారీ కనపడలేదు. నెత్తురోడే అతని శవం బాల్కనీలోంచి భయంగా చూస్తున్న సోంజాకి కనపడింది.
* * *
తన భర్త అంత్యక్రియల తర్వాత నెల్డా ఆ ప్రత్యేక శక్తి ఎంత ప్రయత్నించినా మళ్లీ పని చేయలేదు. ముసుగు మనిషి బెదిరించి వెళ్తాడు అన్న విషయం దాచి, తన భర్తకి పరుపుల లారీ వస్తుందని అబద్ధం చెప్పి, అతను కిందకి దూకేలా చేయడంవల్ల ఆ శక్తి తనలోంచి తొలగించబడిందని ఆమె అనుకుంది.

(హెలెన్ టక్కర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి