S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరో లోకం

‘మిస్టర్ విల్సన్. ఆయన మిమ్మల్ని కొద్ది నిమిషాల్లో చూస్తారు’ నమ్మలేనంత అందంగా ఉన్న సెక్రటరీ ఇంటర్‌కం ఫోన్‌ని క్రేడిల్ మీద ఉంచి చెప్పింది.
ఆమె నవ్వు విల్సన్‌కి వెనె్నల వెలుగులా తోచింది.
‘్థంక్ యూ’ చెప్పాడు.
విల్సన్ దుస్తులు లేని ఆమె వంక గుడ్లప్పగించి చూస్తూండిపోయాడు. అక్కడ ఎవరూ దుస్తులు వేసుకోరు. కాని అంతా హాలీవుడ్ నటీమణుల్లా చక్కని ఒంపుసొంపులు గల దేహాలతో ఉన్నారు.
‘మీరు ఆయన కొమ్ములని పొగిడితే సంతోషిస్తారు’ సెక్రటరీ నవ్వుతూ చెప్పింది.
‘ఏమిటి?’ విల్సన్ ప్రశ్నించాడు.
‘ఆయన కొమ్ములని పొగడండి. అవంటే ఆయనకి గర్వం’
‘గుర్తుంచుకుంటాను. థాంక్స్ ఫర్ ది టిప్’ ఆమె వంక చూడకుండా ఉండటంలో విఫలమైన విల్సన్ చెప్పాడు.
సెక్రటరీ అతని వంక చూసి మరోసారి నవ్వి కంప్యూటర్ కీ బోర్డ్ మీద ఏదో టైప్ చేసుకోసాగింది.
‘మిస్’ విల్సన్ పిలిచాడు.
ఏమిటన్నట్లుగా చూసింది.
‘ఇక్కడికి వచ్చే అందర్నీ ఇంటర్వ్యూ చేస్తారా?’
‘అబ్బే. ఆయనకి అంత టైం ఉండదు. నిత్యం వేల మంది వస్తూంటారు. ఒకోసారి లక్షల మంది కూడా’
‘నా విషయంలో ఏదైనా సమస్య ఉండి ఉండచ్చా?’
‘్భయపడకండి. అంతా సవ్యంగా జరుగుతుంది’
‘నేను ఇక్కడికి వచ్చి నాలుగు గంటలే అయింది. ఈ నాలుగు గంటలూ నా జీవితంలోని అత్యంత ఆనందకరమైన గంటలు’
‘మీ జీవితంలో అనడం తప్పు. మీరు జీవించి లేరు. కొత్తగా వచ్చేవారి అనుభవం ఎప్పుడూ ఇదే’ సెక్రటరీ పకపకా నవ్వి చెప్పింది.
ఇంటర్‌కంలో మృదువుగా మోగింది. ఆమె రిసీవర్ని అందుకుని అవతల నించి చెప్పేది విని, విల్సన్ వంక చూసి తల ఊపి చెప్పింది.
‘మీరు లోపలకి వెళ్లచ్చు’
విల్సన్ లేచి ‘ఎన్’ అనే అక్షరం పెయింట్ చేసిన నల్లటి తలుపు వైపు నడిచాడు. అతని చెయ్యి పిడి మీద పడగానే సెక్రటరీ చెప్పింది.
‘ఆయన కొమ్ముల గురించి నేను చెప్పింది మర్చిపోకండి’
‘అలాగే’
విల్సన్ ఆ గదిలోకి అడుగు పెట్టాడు. విశాలమైన ఎగ్జిక్యూటివ్ టేబిల్ ముందు కూర్చున్న ఆయన నవ్వుతూ లేచి నిలబడి చేతిని చాపి చెప్పాడు.
‘నిన్ను కలవడం సంతోషంగా ఉంది’
ఆయన కంఠం శ్రావ్యంగా, అదే సమయంలో శక్తివంతంగా ఉంది.
‘్థంక్ యు సర్’ చెప్పి విల్సన్ ఆయనతో కరచాలనం చేసాడు.
‘నన్ను నిక్ అని పిలవచ్చు’
ఇద్దరూ కూర్చున్నాక నిక్ కుర్చీలో వెనక్కి వాలి, తల వెనక రెండు అర చేతులని ఉంచుకుని విల్సన్ వంక ఆప్యాయంగా చూసాడు. ఆ ఆప్యాయత నిజమైందని విల్సన్‌కి అనిపించింది. అదే సమయంలో ఆయన తనకి రుచించనిది ఏదో చెప్పబోతున్నాడని కూడా అనిపించింది.
‘విల్సన్. నువీ ప్రదేశం అంతా చూసావు. ఎలా ఉంది?’
‘చాలా బావుంది. నేను నమ్మలేనంత చాలా’
‘ఇదిలా ఉంటుందని నువ్వు ఊహించలేదు కదా?’
‘అవును సర్. నిజాయితీగా చెప్పాలంటే ఇది ఇలా ఉంటుందని నేను ఎన్నడూ ఊహించలేదు. అసలు ఇది ఉందనే నేను నమ్మలేదు’
నిక్ నవ్వాడు.
‘ఇంకో ప్రదేశం గురించిన మాటేమిటి? దాన్ని కూడా మీరు నమ్మలేరా?’
‘లేదనుకుంటాను.. నాకు తెలీదు. అసలీ రెంటి గురించీ ఆలోచించనే లేదు’
‘అది పై అంతస్థులో ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చి నాలుగు గంటలు దాటిందనుకుంటా?’
‘అవును. ఎలాంటి నాలుగు గంటలు? ఇంత ఆనందం నా ముప్పై ఏళ్ల జీవితంలో నేను ఎన్నడూ అనుభవించనంత’
‘ఇక్కడి ఆడవాళ్లు మీకు నచ్చారా?’
‘ఎవరికి నచ్చరు? మా లోకంలో దుస్తుల్లేని కొందరు ఆడవాళ్లని చూడలేం. ఇక్కడ అలా కాదు’
‘అవును. జూదగృహాలు?’
‘సినిమాల్లో కూడా ఇలాంటివి నేను చూడలేదు’
‘మొత్తానికి ఈ ప్రదేశం అంతా మీకు నచ్చిందన్న మాట’
‘చాలా. పూర్తిగా. అన్నట్లు నిక్. మీ కొమ్ముల జత ఎంతో అందంగా ఉంది’
‘్థంక్ యు విల్సన్. వాటికి పూసే ప్రత్యేక మైనం వల్ల ఆ అందం వచ్చింది. దాన్ని నేనే తయారు చేసుకున్నాను’
నిక్ సంతోషించినట్లుగా కనపడ్డాడు.
‘ఈ ప్రదేశాన్ని అందరికీ ఆనందం కలిగించేలా ఉంచాలని నేను ఎంత ప్రయత్నించినా కొన్ని దురదృష్టకరమైన నిబంధనలు ఉన్నాయి’ నిక్ చెప్పాడు.
‘కాని నాకు కనపడ్డ వారంతా ఆనందంగానే కనిపించారు’
‘పొగ? అది కళ్లని ఇబ్బంది పెట్టడం లేదా?’
‘మొదట్లో. కాని ఇప్పుడు అలవాటై పోయింది’
‘మంచిది. నీకో చెడ్డ వార్త’
‘ఏమిటది సర్.. నిక్?’ విల్సన్ ఓ గుటక వేసి అడిగాడు.
‘చాలా చెడ్డ వార్త. ఓ పొరపాటు జరిగింది. ఎక్కడ జరిగిందో తెలీదు కాని జరిగింది. ఇటీవలే మేము కొత్త కంప్యూటర్లని ఇన్‌స్టాల్ చేసాం. ఓ కంప్యూటర్ చేసిన తప్పై ఉండచ్చు. లేదా స్క్రీనింగ్ సెక్షన్‌లోని వాళ్లో, సెలక్షన్ కమిటీలోని వాళ్లో పొరపాటు చేసి ఉండచ్చు. ఇంతదాకా ఎన్నడూ ఇలాంటి పొరపాటు మా దగ్గర జరగలేదు’ నిక్ ఇబ్బందిగా చూస్తూ చెప్పాడు.
‘ఏం పొరపాటు?’
‘నీకు ఇక్కడ ఉండటానికి అనుమతి లేదు’
‘ఏమిటి? నాకు అనుమతి లేదా?’ విల్సన్ కుర్చీలోంచి సగం లేచి అడిగాడు.
‘ఐయాం సారీ విల్సన్. నీ రికార్డుల ప్రకారం నువ్వు పై అంతస్థుకి వెళ్లి ఉండాల్సింది’
‘కాని నేను ఇప్పటికే ఇక్కడ ఉన్నాను. నాకు ఇది నచ్చింది. నన్ను ఉండనివ్వచ్చుగా?’ విల్సన్ ప్రశ్నించాడు.
‘నీకు అంత రికార్డ్ లేదు. ఇది నీ ఫైల్. నువ్వు చిన్నప్పుడు అల్లరి పిల్లవాడివి కావు. కొన్ని గంటల క్రితం మరణించేదాకా నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదు. ఒక్క పొరపాటు కూడా చేయలేదు. కనీసం ఒక్క చెడ్డ ఆలోచన కూడ చేయలేదు. వందేళ్లల్లో ఒక్కసారి కూడా ఇలాంటి మచ్చలేని రికార్డుని నేను చూడలేదు. ఈ విషయంలో నేనేం చేయలేను. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి’ నిక్ అభ్యర్థనగా చెప్పాడు.
‘అంటే మీరు నన్ను పై అంతస్థుకి పంపిస్తున్నారా?’
‘అవును. నీకు ఇక్కడ ఉండేందుకు అర్హత లేదు. నిన్ను పై అంతస్థుకి బదిలీ చేయక తప్పదు’
‘పైన ఎలా ఉంటుంది?’ విల్సన్ నిస్పృహగా అడిగాడు.
‘నీకు నచ్చుతుంది. ఎంతో విశ్రాంతిగా ఉంటుంది. నీకు సంగీతం ఇష్టమేనా? హార్స్ అనే వాద్య సంగీతం సదా వినిపిస్తూంటుంది’
‘ఇంకా?’ విల్సన్ బలహీనంగా అడిగాడు.
‘పెద్దగా ఏమీ ఉండదు. నీకు రెక్కలు ఉంటాయి కాబట్టి అటూ ఇటూ ఎగరచ్చు. ఐతే ఇక్కడిలాగా ఆనందాలు, వినోదాలు ఉండవు. అంతా పవిత్ర వాతావరణం అనుకో’
‘ఓసారి నా మిత్రులతో నేను పేకాట ఆడినప్పుడు ఇరవై డాలర్లు గెలుచుకున్నాను. దాన్ని ఇన్‌కంటేక్స్ రిటర్న్‌లో చూపించలేదు’ విల్సన్ చెప్పాడు.
‘అది పెద్ద తప్పు కాదు’
‘చిత్రం. నా భార్య ఎడ్నా కోరిక పై అంతస్థుకి వెళ్లాలని. నేను పైకెళ్లగలిగీ కిందే ఉండాలని అనుకుంటున్నాను’
‘ఇది వ్యక్తిగతం కాదు కాని ఆమె రికార్డ్‌ని బట్టి ఆమె నిన్ను చాలా కష్టపెట్టింది అనుకుంటాను’
‘ఆమె పరమ గయ్యాళి భార్య’
‘నిన్ను ఇంట్లో పైప్‌ని తాగనివ్వదు కదా?’
‘అవును’
‘డ్రింక్? నీ పుట్టిన రోజున కనీసం బీర్ కూడా తాగనివ్వదు కదా?’
‘అవును. తన తండ్రి తాగి మరణించాడని ఆమెకి డ్రింక్ అంటే కోపం’
‘నీ జీతం ఆవిడ చేతుల్లోనే పోయాలి. బస్ టిక్కెట్లకి, లంచ్‌కి వారానికి నీకు ఆవిడ పనె్నండున్నర డాలర్లు పాకెట్ మనీగా ఇస్తుంది అని రికార్డులో ఉంది’
‘అవును’
‘నీ మిగిలిన జీతం ఏవౌతుంది?’
‘ఆమెకి ఖరీదైన అభిరుచులు ఉన్నాయి’
నిక్ చేతి వేళ్లతో టేబుల్ మీద కొడుతూ కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు.
‘మీ దేశంలో ఇప్పుడు తెల్లవారుజామున మూడుం ముప్పావు. నువ్వు నాలుగున్నర గంటల క్రితం నిద్రలో మరణించావు. అది ఇంకా ఎవరికీ తెలీదు. మీ ఆవిడ ఇంకా నిద్రపోతూనే ఉంది’
‘ఐతే?’
‘విల్సన్. నువ్వు జీవితంలో ఎన్నడూ ఒక్క చెడ్డ పని కూడా చేయలేదు. నిన్ను మళ్లీ వెనక్కి పంపిస్తే వెంటనే ఏదైనా చెడ్డ పని చేసి వెనక్కి రాగలవా?’
‘ప్రయత్నిస్తాను’
‘ప్రయత్నించడం కాదు. చేస్తావా? లేదా? ఓ చెడ్డ పని చేయగలవా? లేదా?’
‘చేస్తాను’ స్థిరంగా చెప్పాడు.
‘మంచిది. నువ్వో చెడ్డ పని చేస్తే తిరిగి వచ్చాక ఇక్కడ ఉండేందుకు నీకు అర్హత లభిస్తుంది.’
‘నిజంగా?’
‘అవును’
‘నాకీ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’
‘కాని నీకు కనీసం బూతులు మాట్లాడటం కూడా రాదు. బహుశ నీకు ఏం చెడ్డ పని చేయాలో కూడా తెలీకపోవచ్చు. అవునా? నీకు మెలకువ రాగానే నేను చెప్పేది వెంటనే చేస్తే, తక్షణం వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ శాశ్వతంగా ఉండచ్చు’
‘అప్పుడు నాకు నిజంగా అర్హత వస్తుందా?’
‘పూర్తిగా’
‘నేనేం చేయాలి?’ విల్సన్ ఆత్రంగా అడిగాడు.
‘నీకు నీ మంచం మీద కొద్దిసేపట్లో మెలకువ వస్తుంది. నీ వంట గదిలో అనేక కత్తులు ఉన్నాయి. ఒకటి తీసుకుని...’
‘బాబోయ్!’
‘మీ ఆవిడకి పైకి వెళ్లాలనే కోరిక ఉందని ఇందాకే చెప్పావు’
‘అవును. కాని...’
‘నువ్వు ఆమె కోరికని తీర్చడమే కాక నీ కోరికని కూడా తీర్చుకుంటావు. ఇది ఇద్దరికీ మంచిదైన తేలిక మార్గం’
‘సరే. కాని...’
‘కాని ప్రసక్తి లేదు. నువ్వు చేసి తీరాలి. అతి చెడ్డ పనైన హత్య చేయగానే ఇక్కడ ఉండటానికి నీకు అనుమతి లభిస్తుంది.’
‘అప్పుడు ఎడ్నా కోరిక, నా కోరిక తీరతాయి. మరణానంతరమైనా మేమిద్దరం దూరదూరంగా ఉంటాం’ విల్సన్ ఆనందంగా చెప్పాడు.
‘ఎందుకనో నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడింది. అందుకే దీన్ని సూచించాను’ నిక్ చెప్పాడు.
‘మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలీడం లేదు’
‘మరో ముఖ్య విషయం. నీకు మెళకువ వచ్చిన ఐదు నిమిషాలకల్లా మళ్లీ మరణిస్తావు. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఎక్కువ జీవించవని గుర్తుంచుకో’
‘అది నేను చెయ్యాల్సిన పనికి రెట్టింపు కాలం’
‘అవును. కాని నీకు తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉందిగా’
నిక్ ఇంటర్‌కం బటన్ నొక్కి చెప్పాడు.
‘దయచేసి విల్సన్ తిరిగి తన దేహంలోకి ప్రవేశించే ఏర్పాటు చెయ్యి. ఐదు నిమిషాల తర్వాత అతను తిరిగి వస్తాడని, స్వాగతం చెప్పమని రిసీవింగ్ సెక్షన్‌కి తెలియజేయి’
‘ఎస్ సర్’ సెక్రటరీ తియ్యటి కంఠం వినిపించింది.
నిక్ లేచి నిలబడి విల్సన్‌తో కరచాలనం చేసి తలుపు దాకా సాగనంపి, భుజం మీద తట్టి చెప్పాడు.
‘వెళ్తున్నానని బాధపడకు. ఐదు నిమిషాల్లో మళ్లీ కలుద్దాం’
* * *
విల్సన్‌కి మెలకువ వచ్చేసరికి గడియారం ముల్లు ఐదు నిమిషాలు తక్కువ నాలుగు చూపిస్తున్నాయి. కిటికి అంచు మీద కురిసిన మంచు కనిపించింది. అతను తక్షణం మంచం దిగి వంట గదిలోకి వెళ్లి, సింక్ పక్కన కేబినెట్లోని మాంసం కోసే కత్తిని అందుకుని మళ్లీ పడక గదిలోకి వచ్చాడు. తన భార్య పక్కన నిలబడి ఓ నిమిషం సేపు ఆమె మొహం వంక చూస్తూండిపోయాడు.

ఆ పని తన వల్ల కాదని అనుకున్నాడు. చూస్తూ చూస్తూ ఓ మనిషిని, ముఖ్యంగా తన భార్యని చంపలేక పోయాడు. కాని అతని కళ్ల ముందు అందమైన నగ్న స్ర్తిల దేహాలు, జూద గృహాలు, బార్లు కనిపించాయి. ‘చంపు. సందేహించకు’ ఓ కంఠం లోపల నించి వినిపించింది.
సన్నగా గురక పెట్టే ఎడ్నా నించి ఓ అడుగు వెనక్కి వేసి, రెండు చేతులతో కత్తిని పైకెత్తి బలంగా దింపాడు. ఆమె మెడ మొండెం నించి విడిపోయింది.
* * *
‘ఆ పని చేసాను’ విల్సన్ గంభీరంగా చెప్పాడు.
‘కంగ్రాట్యులేషన్స్’ సెక్రటరీ నవ్వుతూ చెప్పింది.
‘అది నా వల్ల అవుతుందని ఆఖరి క్షణం దాకా అనుకోలేదు’
‘నిక్ ఆఖరి క్షణంలో నీలో ప్రవేశించాడు విల్సన్. నిజానికి ఆయన చాలామందిలోకి ప్రవేశిస్తూంటాడు’
‘నిజంగా?’
‘అవును. ఆయన నీ కోసం వేచి ఉన్నారు. లోపలకి వెళ్లు’
‘్థంక్ యు’ చెప్పి విల్సన్ తలుపు తెరచుకుని నిక్ ఆఫీస్ గదిలోకి వెళ్లాడు.
నిక్ లేచి నిలబడి నవ్వుతూ చేతులు చాపి చెప్పాడు.
‘నేను చెప్పిన పనిని సజావుగా చేసావు. పునఃస్వాగతం’
‘ఇప్పుడు నేను జూద గృహాల్లోకి, బార్లలోకి వెళ్లచ్చా?’ విల్సన్ ఆనందంగా అడిగాడు.
‘లేదు. అవన్నీ పాపుల రికార్డులని పరిశీలించేదాకా తాత్కాలికంగా ఉండటానికి ఏర్పాటు చేసినవి. త్వరలోనే నువ్వు కింది అంతస్థులోని సరైన ప్రదేశానికి వెళ్తావు’
‘సరైన ప్రదేశమా? అంటే?’
‘వెళ్లాక తెలుస్తుంది’
‘నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం మీరు ఇందాక చెప్పలేదు’ విల్సన్ చెప్పాడు.
నిక్ బల్ల మీది ఓ బటన్ని నొక్కి చెప్పాడు.
‘ఓసారి వెనక్కి తిరిగి చూడు’
విల్సన్ తల తిప్పే లోపలే అతను నిలబడ్డ నేల కింద పెద్ద గోతిలోకి దిగింది. ఎదురుగా కనపడ్డ దృశ్యాన్ని చూసిన అతని కాళ్లు వణికాయి.
వేలకొద్దీ మనుషులు నగ్నంగా సంకెళ్లతో బంధింపబడి, మంటల్లో కరిగే రాళ్ల మధ్య కాలుతూ ఒళ్లు జలదరించేలా బాధగా అరుస్తున్నారు. ఆ గాల్లోని వేడి, ఆవిరి, గంధకం, మాంసం కాలే వాసనలు విల్సన్ చర్మాన్ని కాల్చసాగాయి.
నిక్ నవ్వు విని తల పైకెత్తి చూశాడు. రెండు కొమ్ములు గల అతను పగలబడి నవ్వుతూంటే కళ్లల్లోంచి నీళ్లు కూడా కారాయి.
‘మీరు నన్ను మోసం చేసారు’ విల్సన్ భయంగా గొంతు చించుకుని అరిచాడు.
‘మొదటి నించి నేను నీతో ఆడిన ఆటని గ్రహించలేదు. ఎందుకంటే నువ్వు ఆనందాన్ని, వినోదాన్ని కోరుకున్నావు. వాటిని కోరుకునే వాళ్లు ఎన్నడూ దుఃఖాన్ని తిట్టకూడదు’
‘ఎంత క్రూరుడివి!’ విల్సన్ ఏడుస్తూ చెప్పాడు.
‘నికొలస్ క్రూరమైన వాడని జీవించి ఉండగా నువ్వు వినలేదా?’ చెప్పి నిక్ పెద్దగా నవ్వుతూ ఆ గోతి మీది మూతని మూసేసాడు.
(బైబిల్ ప్రకారం నికొలస్ అనే డెవిల్‌కి కొమ్ములు ఉంటాయి. అతనే చెడుకి మనుషుల్ని ప్రేరేపిస్తాడు - రచయిత)
*
(జోనాథన్ క్రైగ్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి