S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అలలపై తేలే పాఠశాల (లోకం పోకడ)

ఇంఫాల్‌కి 50 కిలోమీటర్ల దూరంలో గల చంపూ ఖాంగ్‌పాక్ గ్రామంలో ఒక చిత్రమైన పాఠశాల ఉంది. ఇది ప్రపంచంలోని ఇతర పాఠశాలల కన్నా ఎంతో భిన్నమైనది. ఎలాగంటే... ఈ పాఠశాల ఇక్కడుండే లోక్‌తక్ సరస్సుపై తేలియాడుతూ చిన్నారులకు విద్యనందిస్తోంది. ఈ పాఠశాలలో ఎక్కువగా మత్స్యకారుల పిల్లలే చదువుకుంటున్నారు. నిజానికి వారి కోసమే ప్రభుత్వం ఈ పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇంఫాల్‌లోని లోక్‌తక్ సరస్సు ఆ ప్రాంత వాసులకు మంచినీటిని అందించే స్వచ్ఛమైన సరస్సుగా గణతికెక్కింది. హైడ్రోపవర్ జనరేటర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగునీటి వంటి అనేక సౌలభ్యాలను సమకూరుస్తున్న లోక్‌తక్ సరస్సు చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో మత్స్యకారులు నివసిస్తూ లోక్‌తక్ సరస్సు ద్వారా లభించే మత్స్య సంపద మీదే జీవనం సాగిస్తున్నారు. ఈ కారణంగా వారు దూరాభారాలు వెళ్లలేరు. అలాగే తమ పిల్లలని కూడా ఎక్కడి పాఠశాలలకో పంపించలేరు. ఈ కారణంగానే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడి మత్స్యకారుల పిల్లలు విద్యాబుద్ధులు నేర్వలేకపోతున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం పీపుల్ రీసోర్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (పిఆర్‌డిఎ) అనే ఎన్‌జీవో సంస్థతో కలసి లోక్‌తక్ సరస్సుపై తేలియాడే ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలో పిల్లలతో పాటు అక్షర జ్ఞానం లేని పెద్ద వారికి కూడా చదువు చెబుతారు. ఈ పాఠశాలను ఏర్పాటు చేసినప్పుడు ఇరవై అయిదు మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. తర్వాత తర్వాత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తొలుత ఎలిమెంటరీ స్థాయి విద్యనందిస్తూ వచ్చిన ఈ పాఠశాల రానున్న రోజుల్లో ఎనిమిదవ తరగతి వరకు విస్తరించేందుకు యోచన చేస్తోంది. ఈ పాఠశాల ఏర్పాటు కావడం చూసిన తర్వాత లోక్‌తక్ సరస్సుకు చుట్టుపక్కల ఉండే స్కూల్ డ్రాపౌట్స్ ఒకరొకరుగా వచ్చి ఈ పాఠశాలలో చేరడం మొదలుపెట్టారు. అదే విధంగా వయోజనులు కూడా ఉదయం పూట పనిపాటలు ముగించుకుని సాయంత్రం వేళల్లో ఈ పాఠశాలలో చేరి అక్షర జ్ఞానం పొందుతున్నారు. ఇటువంటి స్పందన చూసిన ప్రభుత్వం, పిఆర్‌డిఎ పాఠశాల నిర్వహణకు సంబంధించి మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక్కడ పని చేసే ఉపాధ్యాయులకు యాక్షన్ ఎయిడ్ ఇండియా (ఎఎఐ) నెలవారీ జీతాలు చెల్లిస్తోంది. ఇక్కడి ప్రభుత్వం లోక్‌తక్ సరస్సుపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల గతంలో కంటే ఈ సరస్సు ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా తయారయింది. ఇంతకు ముందు లోక్‌తక్ సరస్సుపై ఏడు వందల వరకు చిన్నాపెద్దా తేలే గుడిసెలు ఉండేవి. లోక్‌తక్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎల్‌డిఎ) వీటినన్నింటినీ తొలగించేసింది. దీంతో లోక్‌తక్ సరస్సు స్వచ్ఛత మరింత పెరిగింది. లోక్‌తక్ సరస్సు, దీని అందాలు, ఇక్కడి నీటిపై తేలే ఎలిమెంటరీ పాఠశాల తదితర అంశాలను స్పృశిస్తూ పబన్‌కుమార్ అనే సృజనకారుడు తీసిన డాక్యుమెంటరీకి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రోత్సాహక అవార్డు దక్కింది. నీలంగా, స్వచ్ఛంగా మెరిసిపోయే లోక్‌తక్ సరస్సు, దానిపై తేలియాడే పాఠశాలను వీక్షించడం చక్కటి అనుభూతి అని సందర్శకులు అంటూ ఉంటారు. ఈ పరిసరాలు జీవవైవిధ్యానికి పెట్టని కోటలు. ఇక్కడ ఎన్నో రకాల జంతువులు, ప్రజలు సహజీవనం సాగిస్తూ సంతోషంగా బతుకుతున్నారు. అటువంటి చోట అలలపై తేలియాడుతూ పాఠాలు చదివే పిల్లలు అదృష్టవంతులని చెప్పక తప్పదు.

- దుర్గాప్రసాద్ సర్కార్