S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అపర కర్ణుడు

ఇది స్వార్ధపూరిత ప్రపంచం. అంతా నాకే కావాలి... అంతా నేనే దోచుకోవాలి అనుకునే సమాజంలో బతుకుతున్నాం మనం. పక్కవాడి గురించి కలలో కూడా ఆలోచించని పైశాచిక మానవులు మన చుట్టూ ఉన్నారు. ఆస్తులు, ఐశ్వర్యాల కోసం రక్తసంబంధీకులను కూడా కడతేరుస్తున్నారు. అటువంటిది తనకేమీ కాని వారి కోసం తన యావదాస్తిని తృణప్రాయంగా త్యజించిన ఒక మానవతా మూర్తి గురించి వింటే ఆశ్చర్యపోక తప్పదు. అతనే డెబ్బై నాలుగేళ్ల పాలం కళ్యాణ సుందరం. చెన్నైకి చెందిన కళ్యాణ సుందరానికి చిన్నతనం నుండి కష్టాలంటే ఏమిటో తెలుసు. ఎందుకంటే అతనికి ఏడాది వయసప్పడు అతని తండ్రి మరణించాడు. తల్లే అతన్ని అష్టకష్టాలు పడి పెంచి పోషించింది. అనుక్షణం అతని బాగోగుల గురించే ఆలోచించేది ఆమె. ఆమె ఎన్ని కష్టాలు పడుతున్నా మనకు తోచిన సాయం ఎదుటి వారికి చేయాలని అతనికి చెబుతుండేది. తల్లి చేసిన ఆ బోధలే పెద్దయ్యాక అతన్ని దానకర్ణుడిగా మార్చేసాయి.
కష్టాలతో సావాసం చేస్తూనే అతను తన విద్యాభ్యాసం కొనసాగించాడు.
అతను విద్యార్థి దశలో ఉండగా ఇండో-చైనా యుద్ధం వచ్చింది. ఆ సమయంలో అతను ఒకసారి అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగం వినడం తటస్థించింది. అప్పుడు నెహ్రూ తన ప్రసంగం చివరిలో రక్షణ దళాలకు విరాళాలు ఇవ్వాలని కోరారు. అలా ఆయన కోరిన వెంటనే కళ్యాణ సుందరం తన మెడలో ఉన్న బంగారు చెయిన్‌ని అప్పటి ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్‌కు అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
కళ్యాణ సుందరం లైబ్రరీ సైన్స్‌లో గోల్డ్‌మెడల్ అందుకున్నారు. అలాగే లిటరేచర్ అండ్ హిస్టరీలో మాస్టర్స్ చేశారు. అనంతరం ఆయన లైబ్రేరియన్‌గా ఉద్యోగం సంపాదించారు. అలా కష్టపడి మంచి స్థాయికి చేరినా ఆయన ఏనాడూ విలాసవంతంగా జీవించలేదు. అతి సాధారణంగా బతుకుతూ పేదవాళ్ల జీవితం ఎలాంటిదో తెలుసుకోవడానికి అనేక సార్లు రైల్వేస్టేషన్లలో గడిపి, అక్కడే రాత్రి నిద్రపోయేవారు. తనకి వచ్చే జీతంలో కేవలం తాను బతకడానికి కొంత ఉంచుకుని మిగతాది అంతా పేదలకు, పేదలను అక్కున చేర్చుకుని సాకే స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేసేవారు. ఆ దాతృత్వం చివరికి ఎక్కడికి వెళ్లిందంటే ఆయన ఉద్యోగ జీవితమంతా చేసిన దాని కంటే ఎక్కువగా రిటైర్ కాగానే తనకి వచ్చిన బెనిఫిట్ పది లక్షలు ఇలా రాగానే అలా తీసుకెళ్లి దానమిచ్చేశారు.
నిరంతరం పేదల కోసం తపించిపోయే కళ్యాణ సుందరం తాను పయనించే దారిలో ఆటంకం ఎదురు కాకూడదని చివరికి పెళ్లి కూడా చేసుకోలేదు. దాతృత్వం, పేదల సేవకి అంకితమైన కళ్యాణ సుందరం గొప్పదనాన్ని గుర్తించిన ప్రభుత్వం, అనేక సంస్థలు ఆయనకి ఎన్నో సత్కారాలు అందజేశాయి. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ అవార్డు, యునైటెడ్ నేషన్స్ నుండి మోస్ట్ ఔట్‌స్టాండింగ్ పీపుల్ ఆఫ్ ది ట్వంటీయత్ సెంచరీ అవార్డు రోటరీ క్లబ్ నుండి మేన్ ఆఫ్ ది మిలీనియం అవార్డు వంటివెన్నో అందుకున్నారు. అలా అవార్డులతో పాటు ఆయన రివార్డులు కూడా అందుకుని వాటిని కూడా పేదల సంక్షేమం కోసమే ఖర్చు చేసేశారు. అలా ఆయన ఇప్పటి వరకు దానం చేసిన మొత్తం దాదాపు 30 కోట్ల వరకు ఉంటుంది.
ఆయన పాలం పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పేదలకు సాయం చేస్తున్నారు. అలాగే ఆ సంస్థ ద్వారా దాతల నుండి విరాళాలు సేకరించి పేదలకు అందేలా కృషి చేస్తున్నారు.

దుర్గాప్రసాద్ సర్కార్