S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఖాళీ సీసాలు

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
అమెరికా నుంచి వచ్చి వారం రోజులవుతోంది.
తమ్మడి ఇంట్లోనే ఉన్నాను. పాత పొన్నూరులో వాడు ఉండేది. ఉదయం పూట చుట్టుపక్కల గ్రామాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లి పలకరించి రావడం, మధ్యాహ్నం దావులూరి వారి దొడ్లో ఉన్న పూరిపాకలో కూర్చుని మిత్రులతో కబుర్లు చెప్పడం, సాయంత్రంపూట పొలాల్లో తిరగడం. వారం రోజులు ఏడు నిమిషాల్లా గడిచిపోయాయి.

పొన్నూరులోనే పుట్టి పెరగడంతో ఊళ్లో దాదాపుగా అందరూ తెలుసు. ఏ రోడ్డులో ఎవరి ఇల్లు ఉందో తెలుసు. అక్కడక్కడ పాత పెంకుటిళ్లు స్థానంలో రెండు మూడు అంతస్తుల భవనాలు వెలిశాయి. ప్రతి ఇంటి ముందు పశువుల పాకలు ఉండేవి. అవి ఇప్పుడు లేవు. ఊరి పొలిమేరల్లోకి, పొలాల్లోనే పశువుల పాకలు ఉన్నాయి. అందరి ఇళ్లల్లో పాడి ఉండేది. మురుగు కాలువలు కన్పిస్తున్నాయి ఇప్పుడు జనాభా పెరిగిపోవడంతో.
పూరిపా కలో చేరి చిన్ననాటి మిత్రులు పేకాట ఆడుతుండే వాళ్ల దగ్గర చేరాను. వాళ్లు కుర్చీ తెచ్చి వేశారు గాని, కుర్చీలో కూర్చోకుండా ఈత ఆకుల చాపమీదే వాళ్ల పక్కన కూర్చున్నాను.
‘న్యూజెర్సీలో పెద్ద సైంటిస్టువి. నువ్వు కింద కూర్చోవడం ఏమిటి? ఖాళీగా కూర్చోకపోతే నాలుగు ఆటలు ఆడరాదూ! నీ డాలర్లు ఏమీ పోవులే. రోజంతా మాతోపాటు కూర్చుని ఆడినా ఒక్క డాలరు... అంటే అరవై రూపాయల చిల్లర పోగొట్టుకుంటావ్.. అదీ అన్ని ఆటలూ ఓడిపోతే!’ అన్నాడు కోటేశ్వరరావు.
‘ఒరేయ్! మన పేకాట రుచి మరిగితే మళ్లీ అమెరికా వెళ్లడు’ అన్నాడు మరో మిత్రుడు నవ్వుతూ.
‘మనోడు బాగా సంపాదించాడు. వాడు తలుచుకుంటే మన ఊళ్లో సగం ఆస్తులు నిమిషాల్లో కొనేస్తాడు. వాళ్ల నాన్న బతికి ఉంటే ఇరవై ఎకరాల మాగాణి కొని ఇచ్చేసేవాడు. వీడి వైభోగం చూసే అదృష్టం మన కృష్ణగాడి తల్లిదండ్రులకు లేదు’
... వాళ్లు అనుకునేది నిజమే! తనను చదివించడానికి నాన్న ఉన్న ఐదు ఎకరాల పొలం అమ్మేశాడు. అమెరికాలో తను నిలదొక్కుకునేసరికి తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. దానితో ఊళ్లో పొలాలు, స్థలాలు కొనే ఆసక్తి పోయింది. తమ్ముడు చంద్రం మున్సిపల్ కౌన్సిలర్. వ్యవసాయం మీద అనురక్తి తక్కువ. పొలమంతా కౌలుకు ఇచ్చేశాడు.
‘ఆర్చీ ఇల్లు అమ్మకానికి పెట్టారు కృష్ణా! కొనుక్కుంటావా? చిన్నప్పుడు ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడివి కదా!’ అన్నాడు శివుడు.
ఆర్చీ ఇల్లు పేరు వినబడగానే ఒళ్లు గగుర్పాటుకు గురైంది. ఆ గగుర్పాటు భయంతో వచ్చింది కాదు. గత వైభవానికి స్మృతి చిహ్నంగా నిలిచి ఉన్న పాత భవనం అది.
ఎతె్తైన పాటి మట్టి దిబ్బ మీద ఎప్పుడో రెండొందల సంవత్సరాల కిందట కట్టారు ఆ భవంతిని. రాజప్రాసాదంలా ఉంటుంది. పాడుబడిపోయేక ఎవరూ ఆ భవంతిలో ఉండకపోవడంతో ఊళ్లో అందరూ ఎలా ఉంటుందో చూడటానికి లోపల కాలు పెడుతూండేవాళ్లు. కుటుంబీకులు తప్పితే లోపలికి వెళ్లాలంటేనే భయపడేవాళ్లు. భవనం చుట్టూ పది అడుగుల ఎత్తులో ప్రహరీగోడ, తూర్పు వైపున లోపలికి ప్రవేశించడానికి పెద్ద ఆర్చీ, ఆ ఆర్చీ పైభాగంలో కృష్ణుడి బొమ్మ కాళిందిని గొడుగుగా అమర్చుకుని చిద్విలాసంగా మురళి వాయిస్తూ, ఆ కృష్ణుడి బొమ్మకు అటూ ఇటూ మోర ఎత్తి నిలబడ్డ ఆవులు రెండు, వాటి పొదుగు దగ్గర నిలబడి పాలు తాగడం మర్చిపోయి వేణుగానం వింటున్నట్లు నిలబడ్డ చిన్న లేగదూడలు - అటువైపు ఎవరు వెళ్లినా చెప్పులు విడిచేసి నిలబడి ఉండిపోయేవాళ్లు ఆర్చీకేసి చూస్తూ.
షావుకారు గోవిందయ్యది ఆ ఆర్చీ ఇల్లు. చలమయ్య కొడుకు శివాజీ నా క్లాస్‌మేట్ అవ్వడంతో ఆ ఇంట్లోకి నా ప్రవేశం నిరాటంకంగా సాగిపోతూ ఉండేది. ఇంటి ఆవరణలో శివాజీతో ఆడుకుంటూ ఉండేవాడిని. గోవిందయ్య పెంచుతున్న రెండు ఆల్సేషియన్ కుక్కలు తోక ఊపుతూ నా చుట్టూ తిరిగేవి. ననే్నమీ చేసేవి కావు.
ఆ రోజుల్లో పిల్లలకు నెహ్రూ, గాంధీ, స్టాలిన్, లెనిన్, సుభాష్ చంద్రబోస్ అని పేర్లు పెట్టుకునే వాళ్లు. కానీ ఆ నాయకుల లక్షణాలు ఒక్కరికి రాలేదు. ఊళ్లో సగం మంది తల్లిదండ్రుల ఆస్తులు కరిగిస్తూ కాలక్షేపం చేస్తున్న వాళ్లే గాని పనిపాటల్లో, వ్యవసాయంలో ఎవరికీ శ్రద్ధ లేదు. పేకాట ఆడటమో సాయంత్రం అయ్యేసరికి క్వార్టర్ బాటిల్ కోసం ఆరాటపడేవాళ్లే ఎక్కువమంది ఉన్నారు.
గోవిందయ్య కొడుక్కి శివాజీ అని పేరు పెట్టుకున్నాడు గాని ధైర్యసాహసాలు శివాజీలో మచ్చుకైనా లేవు. తండ్రి చాటుబిడ్డగానే రోజులు గడిచాయి. చదువు పెద్దగా అబ్బలేదు. నిడుబ్రోలు పిబిన్ కాలేజీలో డిగ్రీలో చేరాడు. ఆ డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయాడు.
‘అదృష్టం అంటే వాడిదే!’ అనుకునేవాడిని చిన్నప్పుడు.. పెద్ద భవనంలో ఉంటున్నాడు. పది మంది పనివాళ్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏది కావాలన్నా నిమిషాల్లో తెచ్చి వాడి ముందు ఉంచుతారు. ఊళ్లో అందరికంటే ధనవంతుడు వాళ్ల నాన్న... ఆ ఆర్చీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వైభవంగా జరుపుతారు. గోవిందయ్య ఇంట్లో జరిగే పెళ్లికి పిలిచాడంటే ఊళ్లో వాళ్లకి అది గొప్ప గౌరవం. ఆర్చీ ఇంటి ఆవరణలో వేసిన పెళ్లి పందిరిలో భోజనం చెయ్యడమే జీవితంలో మర్చిపోలేని అనుభూతి!
‘అదృష్ట జాతకుడివిరా!’ అని అంటే శివాజీ ఒప్పుకునేవాడు కాదు.
‘ఏం అదృష్టం? మీలా పొలాల్లో తిరుగుతూ కందికాయలు, పెసర కాయలు కోసుకుని తినలేను. రాజమ్మ దిబ్బ మీద చింతచెట్టు దగ్గర మీ అందరిలా కోతికొమ్మచ్చి ఆట ఆడలేను.. చెరువులో ఈత కొట్టలేను. చెడుగుడు ఆడలేను. వానలో తడుస్తూ ఆడుకోలేను. లేగదూడతో పోటీగా పరుగెత్తడం కుదరదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి! బయట తిరిగితే పరువు పోతుందని అంటారు ఇంట్లో వాళ్లు. బయట పిల్లలంతా అలగా వాళ్లు నాన్న దృష్టిలో! తాటిముంజలు తినాలనిపిస్తే నిమిషాల్లో తెచ్చి ఇస్తారు ఇంట్లో పనివాళ్లు. పండిన ఈతకాయలు, జామకాయలు ఏది కావాలన్నా అడగాల్సిందే! ఇంట్లో కూర్చుని తింటే సంతోషం ఏముంటుంది? మీతో పాటు చెట్లు ఎక్కి మామిడికాయలు, జామకాయలు, నేరేడు కాయలు కోసుకుతింటే మజాగా ఉంటుంది. మా ఇంటి ఆవరణలో ఆడుకుందామన్నా పిల్లలెవరినీ రానివ్వడు నాన్న.’
‘నన్ను రానిస్తున్నాడు గదా!’ అనేవాడిని.
‘నువ్వు బాగా చదువుతావని, అన్ని తరగతుల్లో ఫస్ట్ వస్తున్నావని నువ్వంటే మా నాన్నకు, అమ్మకు అభిమానం. అందుకే ఇంట్లోకి రానిస్తున్నారు’ సమాధానం ఇచ్చాడు.
ఆర్చీ ఇంట్లో తిరగడం అద్భుతమైన అనుభవం. విశాలమైన హాలు. పది గదులు ఉన్నాయి. గదులన్నీ తిరిగేక ఏ గది ఏ పనికి ఉపయోగించేవాళ్లో, ఏది పడక గదో, ఏది దేవుడి గదో గుర్తుపట్టలేక పోయేవాడిని. వాడు చదువుకునే గదిలోకి వెళ్లడానికే నాలుగైదుసార్లు పొరపాటు పడ్డాను. తలుపులకి చెక్కిన నగిషీలు, ఇంటి నిండా అందమైన వస్తువులు, ఫర్నిచర్‌తో నిండి ఉండేది. గోడలు తెల్లగా మెరిసిపోతూ ఉండేవి. ఎక్కడా మరక కన్పించేది కాదు.
ఆ ఇంట్లో ఆడవాళ్లు ముట్టుకుంటే మాసిపోయేటట్లు మెరిసిపోతూ కన్పించే వాళ్లు. బయట ఎక్కడా కన్పించేవాళ్లు కాదు. మెరిసిపోయే బట్టలు ఆభరణాలు ధరించే వాళ్లు. వాళ్లని చూడటానికి రెండు కళ్లు చాలవనిపించేది ఆ రోజుల్లో.
చుట్టుపక్కల గ్రామాల్లోని సంపదంతా ఆర్చీ ఇంట్లో చేరిందాననిపించేది. ‘లక్ష్మీదేవిక్కూడా ఆర్చీ ఇల్లు అంటే మక్కువ’ అనుకునేవాడిని.
డిగ్రీ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డాడు శివాజీ. చందోలు నుంచి రోజూ బస్సులో కాలేజీకి వచ్చే అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. చందోలు నుంచి వచ్చే బస్సు నిడుబ్రోలు దగ్గర ఆగేది. కాలేజీ ఉన్నది రెండు మైళ్ల దూరంలో. కాలేజీకి వెళ్లాలంటే అక్కడ నుంచి సిటీ బస్సులోనో, రిక్షాలోనో వెళ్లాలి. రోడ్డు దగ్గర కాపుకాసేవాడు ఆ అమ్మాయి కోసం. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాలేజీకి చేరుకునేవాళ్లు.
శివాజీ ప్రేమ వ్యవహారం గోవిందయ్యకు తెలిసింది. చందోలు వెళ్లి ఆ అమ్మాయి తండ్రిని బెదిరించాడు. రోడ్డుపక్కన సైకిల్ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న ఆ అమ్మాయి తండ్రి, గోవిందయ్యకు భయపడి కూతురికి వెంటనే మరో కుర్రాడితో పెళ్లిచేసి తెనాలి పంపించేశాడు. శివాజీకి చదువు మీదే కాదు జీవితం మీదే విరక్తి ఏర్పడింది. ఐదు సంవత్సరాలు గడిచినా డిగ్రీ పూర్తి కాకపోవడంతో కలప అడితిని, సినిమా హాలు మేనేజ్‌మెంట్ కొడుక్కి అప్పగించాడు తండ్రి.
అమెరికా వెళ్లిపోవడంతో శివాజీ సంగతులు తెలియలేదు.
పాత స్మృతుల్లోంచి బయటపడ్డాను.
‘పాత ఆర్చీ ఇల్లు చూడాలని ఉందిరా!’ అన్నాను మిత్రులతో.
‘ఇంకెక్కడి ఆర్చీ ఇల్లు. కూలగొట్టడం కూడా మొదలుపెట్టారు’ అన్నాడు శివుడు.
‘కూలగొట్టడం ఏమిటి? ఎంత అద్భుతమైన కట్టడం అది. హెరిటేజ్ హవుస్.. ఆ ఇంట్లో ప్రతి వస్తువూ కళాత్మకంగా ఉంటుంది. ఆ ఇల్లు పడగొట్టడానికి శివాజీకి మనస్సు ఎలా వచ్చింది? ఆర్చీ ఇల్లు స్థానంలో మోడరన్ హవుస్ కట్టుకున్నా, షాపింగ్ కాంప్లెక్స్ కట్టినా గతకాలంనాటి వైనవం రాదు కదా?! పడగొట్టకుండా శివాజీ ముందే నాకు కబురు చేసినా ఆ ఇంటిని కొనుక్కునేవాడిని’ అన్నాను ఆవేశంగా.
ఆర్చీ ఇల్లు పడగొడుతున్నారన్న మాట వినేసరికే మనస్సు వికలమై పోయింది. శివాజీ మీద కోపం వచ్చింది.
‘ఇంకెక్కడి శివాజీ? నీకు చాలా సంగతులు తెలిసినట్లు లేవు’ అన్నాడు శివుడు పేకముక్కల వైపు నుండి దృష్టి మరల్చకుండానే.
‘శివాజీకి ఏమయ్యిందిరా?’
‘ఆనందంగా పేకాట ఆడుకునేవాళ్లని ప్రశ్నలు వేస్తే ఎలా? గెలిచే ఆట చంకనాకి కౌంట్ పడుతుంది. నువ్వు అక్కడికి వెళ్లు. చలపతి అన్ని వివరాలు చెబుతాడు’ అన్నాడు శివుడు విసుగ్గా.
చలపతి పేరు వినగానే వాడిని గూర్చి తెలుసుకోవాలనిపించింది. చిన్నప్పుడు వాడూ నా ప్రాణ స్నేహితుడే.
ఇప్పుడేం చేస్తున్నాడో?
‘చలపతిని కలవడానికి చింతలపూడి రోడ్డులోని గుడిసెల వైపు వెళ్లేవ్.. వాడు అక్కడ దొరకడు. సెంటర్‌లో హైస్కూల్‌కి దగ్గర్లో పెద్ద బిల్డింగ్ ఉంది వాడికి. ఊళ్లో సంపన్నుల్లో వాడొకడు.. పారిశుద్ధ్య కార్మికుడి కొడుకు చలపతి కాదు. వాడు కాబోయే ఎంఎల్‌ఏ. అంత పలుకుబడి, ఆస్తి సంపాదించాడు. వెనుకటి రోజుల్లో ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొనే వాళ్లని, సాంఘిక సేవా తత్పరుల్ని యంఎల్‌ఏలుగా ఎన్నుకునేవాళ్లు, ఇప్పుడు ప్రజలు కూడా సంపన్నులనే ఇష్టపడుతున్నారు..’ శివుడు ఏదో చెప్పుకు పోతున్నాడు.
అక్కడ నుంచి కదిలి ఎండలోనే ముందుకు నడిచాను.

శివాలయం రోడ్డులో ఉన్న ఆర్చీ ఇంటి దగ్గరకు చేరుకున్నాను.
అక్కడి దృశ్యం గుండెను మెలివేసేటట్లు ఉంది.
..ఎంతో అపురూపంగా భావించిన ఆర్చీ ఇల్లు కూలగొడుతున్నారు. ఏ కట్టడమైనా అది ఉన్నన్నాళ్లే ఆ వైభవం.
అద్దాల గది ఉన్న మేడ మీది గది కూలిపోయింది. రాజమందిరాన్ని తలపించే భవనం రాళ్ల కుప్పలా కన్పించింది.
కూలీల పని చేసుకుపోతున్నారు తలెత్తకుండా. పడగొట్టమంటే పడగొడతారు. భవనం కట్టమంటే కడతారు. పాపం వాళ్ల తప్పేముంది?
ఐ యామ్ లెఫ్ట్ విత్ నథింగ్ బట్ మెమెరీస్...
ఆర్చీ ఇల్లు దాదాపుగా కూలిపోయింది. మొండి గోడలే పాత రాజసం, దర్పం ఉట్టి పడిన భవనానికి గుర్తుగా మిగిలాయి. మరి కొన్ని నిమిషాలు గడిస్తే ఆ గోడలు కూడా కన్పించవు.
కూలీలు మాట్లాడుకునే మాటలు విన్పించేయి. ఆర్చీ ఇల్లు గోడల్లో వజ్ర వైఢూర్యాలు దాచి ఉంచారని, హాల్లో భూగర్భంలో పసిడి ప్రతిమలు దొరుకుతాయనే కట్టుకథలు ప్రచారంలో ఉన్నాయి. తవ్వుకుంటే రాళ్లు, మట్టి గడ్డలు తప్పితే వాళ్లకు ఏమీ కన్పించలేదు.
చలపతి వచ్చాడు అక్కడికి కారులో.
వెంటనే గుర్తు పట్టాడు. ‘ఒరేయ్.. ఎప్పుడు వచ్చావురా అమెరికా నించి?’ భుజం మీద చేతులు వేసి ఊపేశాడు సంతోషంతో.
‘ఆర్చీ ఇల్లు కొన్నావట గదా?’ అడిగాను చలపతిని.
‘అవున్రా. మొన్నీ మధ్య శివాజీ చనిపోయాడు. ఆర్చీ ఇల్లు వాడు ఉన్నప్పుడే అమ్మకానికి వచ్చింది. ఎక్కువ ధర ఇచ్చి కొనేశాను.. గోవిందయ్య ఎప్పుడో చనిపోయాడు. దుర్మార్గుడు.. దుష్టుడు.. వడ్డీ వ్యాపారం చేసి అడ్డంగా సంపాదించాడు. కనికరం లేకుండా బీదాబిక్కీని పీడించాడు. వాడు సంపాదించినదంతా శివాజీ హారతి కర్పూరంలా కరిగించేశాడు.
చలపతి మాటలకు అడ్డుపడుతూ ‘శివాజీ ఎలా చనిపోయాడు?’ అడిగాను.
‘లివర్ పూర్తిగా పాడైపోయింది.. ఇరవై నాలుగ్గంటలూ తాగుతుంటే లివర్ పాడై పోకుండా ఎలా ఉంటుంది? చివరి రోజుల్లో వాడిని చూస్తూంటే జాలి వేసింది. ఆస్తులన్నీ అమ్ముకున్నాడు అప్పటికే. చివరికి ఆర్చీ ఇల్లు మిగిలింది.. వాడు బతికి ఉండగానే నాకు అమ్మేశాడు.. చిన్ననాటి స్నేహితుడు కదా! ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మని అనలేక పోయాను. పలకరించే నాథుడు లేడు. నేనే ఆస్పత్రిలో చేర్పించి బతకడని తెలిసినా అంతిమ క్షణాల వరకు డబ్బు ఖర్చు పెట్టాను. బంధువులు ఎవరూ దగ్గరకు రాలేదు’
‘్భర్యా పిల్లలు లేరా?’ అడిగాను ఎటో చూస్తూ.
‘్భర్య చదువుకున్న అమ్మాయి. విలాసాలకు డబ్బు ఖర్చు పెట్టేది. భార్యని అదుపులో పెట్టుకోలేక పోయాడు. చెన్నై వెళ్లి రెండు మూడు సినిమాలు తీసింది.. రెండు మూడు రోజులు కూడా ఆడలేదు ఆ సినిమాలు. పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి, మనవాడి ఆస్తి అప్పుల కింద అమ్మేసింది. ఆర్చీ ఇల్లు కూడా ఆమె ఉండగానే అమ్మడానికి బేరం పెట్టింది. మనవాడు ఒప్పుకోలేదు. విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగలేదు. మూడు ముళ్లు వేసిన అమ్మాయి కూడా మనవాడిని శత్రువుగా చూసింది. నేను ఎప్పుడన్నా వాడి పక్కన నిలబడితే చీదరించుకునేది. నన్నో మనిషిగా పరిగణించేది కాదు.. ఆమెది పెద్దకులం మాది తక్కువ కులమని గోవిందయ్య ఆమెకు నూరిపోశాడు. నీకు తెలుసు కదా చిన్నప్పుడు నీతోపాటు శివాజీని చూడటానికి ఆర్చీ ఇంట్లో అడుగుపెట్టబోతే బండబూతులు తిట్టి నన్ను బయటకు గెంటేశాడు. అప్పటి నుంచి ఆర్చీ ఇంటి మనుషులంటే కోపం. గంజాయి మొక్కల మధ్య తులసి మొక్కలా శివాజీ తల్లి ఒక్కత్తే కనిపించేది. ఆ మహాతల్లిని అవమానించాడు. ఎవరితోనో కులుకుతుందని నోరుజారాడు.. ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది’ చెప్పుకుపోతూనే ఉన్నాడు.
‘అవన్నీ సరే, ఆర్చీ ఇల్లు కూలగొట్టావెందుకు? చుట్టుపక్కల ఊళ్లలో ఇంత అద్భుతమైన కట్టడం లేదని అందరూ అనుకుంటూ ఉంటారు. కొన్ని మరమ్మతులు చేసి నువ్వే ఉంచేసుకోవాల్సింది’ అన్నాను గొంతు సవరించుకుంటూ.
కూలిపోయిన ఆర్చీ ఇల్లును చూస్తూంటే గొంతు పూడుకుపోయింది.
‘నీకు తెలుసో తెలియదో మా నాన్న మున్సిపాలిటీలో పని చేసేవాడు. మురుగు కాలువలు, పాయిఖానాలు శుభ్రం చెయ్యడం ఆయన పని. ఆయన చుట్టూ ఎప్పుడూ మురుగు వాసనలు తారట్లాడుతుండేవి. అలసిపోయి మందు కొట్టేసి పాటలు పాడుకుంటూ ఏ అర్ధరాత్రో పడుకునేవాడు...
...ఓ రోజు ఆర్చీ ఇంటి దగ్గర పని చేస్తున్నాడు. పొరపాటున ఇంటికి వెనుక వైపు ఉన్న ద్వారం గుండా వెళ్లకుండా ఆర్చీ దాటుకుని ప్రధాన ద్వారం ముందు నుంచి వెళ్లాడని చెర్నాకోలాతో బాదేశాడు గోవిందయ్య... శివాజీ తాతగారు కూడా పేదలను ఏడిపించేవాడని మా తాత చెబుతూ ఉండేవాడు.. అందుకే ఆర్చీ ఇల్లు అన్నా, ఆ మనుషులన్నా నాకు చీదర.... కసి... వాళ్ల మీద కోపం.. ఆర్చీ ఇల్లు కొని, నేలమట్టం చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కంటూ ఉండేవాడిని. ఆ కల ఇప్పుడు సాకారం అయ్యింది’ అన్నాడు కళ్లలో నుంచి జారుతున్న ఆనందబాష్పాలు తుడుచుకుంటూ.
‘నాకు కబురు చేస్తే ఆర్చీ ఇల్లు నేను కొనేసేవాడిని’ అన్నాను తెప్పరిల్లి.
‘నాకు తెలుసు. ఆర్చీ ఇల్లు అమ్మకానికి వచ్చిందని తెలిస్తే నువ్వు కొనేసి ఆర్చీ ఇంటిని యధాస్థితిగా ఉంచుతావని.. అందుకే తొందరపడి కూలగొట్టించాను’ అన్నాడు చలపతి.
ఓ మూల ఖాళీ సీసాలు గుట్టగా కన్పించేయి.
‘అవేమిటి?’
‘మన శివాజీ ఖాళీ చేసిన విదేశీ మద్యం సీసాలు’
కొంచెం ముందుకు నడుస్తుంటే కాలికి ఇనుప వస్తువు లాంటిదేదో గట్టిగా తగిలింది. కిందకు వంగి మట్టిని తొలగించి ఆ వస్తువును చేతిలోకి తీసుకున్నాను.
..‘కార్క్ ఓపెనర్’ అది. సీసా మూతలు తీసే కార్క్ ఓపెనర్.
గుండెల్లో బాధను తొలగించుకోవడానికి శివాజీ కార్క్ ఓపెనర్ ఉపయోగించుకునేవాడన్న మాట!
చివరకు ఏమీ మిగుల్చుకోకుండా ఖాళీ సీసాగా మిగిలిపోయాడు మా మిత్రుడు.
చాలాసేపు ఆ శిథిలాల దగ్గరే నిలబడిపోయాను.

అలపర్తి రామకృష్ణ.. 9908587876