S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శాంతము లేక సౌఖ్యము లేదు

ఓపల్లెటూళ్లో అన్నదమ్ములు వాటాల కోసం కుస్తీలు పడుతున్నారు. భార్యలకు స్థిమితం లేదు. విషయం తేలదు. ఎవరూ తగ్గటం లేదు. ఈ విషయం క్రమంగా ఆ ఊళ్లో గ్రామ పెద్ద చెవిన పడింది. తనంతట తాను ఆ అన్నదమ్ములిద్దర్నీ కలిశాడు.
‘ఒరేయ్! రక్తం పంచుకుని పుట్టిన పిల్లలురా మీరు. ఓ అమ్మ కన్నబిడ్డలురా! రాళ్లూ రప్పలకున్న ఆయుర్దాయం మనకుందా? కూడా ఆస్తులు పట్టుకుపోతామా? ఆడుకోవటం దగ్గర నుంచి మీరు నాకు తెలుసు. కలిసే తిరిగారు. కలిసే చదువుకున్నారు. ఇద్దరూ ప్రాజ్ఞులైయ్యారు. ఒకర్ని చూడకపోతే మరొకరుండే వారు కాదు. మీలో ఒకడు అన్నం తినకపోతే మరొకడు పస్తుండేవాడు. మీ అమ్మ చెప్తూండేది. అలాటిది, యింత వయసొచ్చిన తర్వాత యిప్పుడిలా వీధిన పడతారా? నలుగురికీ తెలిస్తే మీరు పలుచనై పోరూ? మీ మాటకు ఎవరైనా విలువనిస్తారా? ఆలోచించండి. కాస్త ప్రశాంతంగా కూర్చుని యిద్దరూ మాట్లాడుకుంటే సరిపోదా? దానికి యింత రాద్ధాంతమా? చెప్పండి.’
ఆ మాటలకు యిద్దరన్నదమ్ములూ కరిగిపోయారు. తగ్గిపోయారు.
‘సరే బాబాయ్! నువ్వందరికీ కావలసిన వాడవు. నువ్వెలా చెబితే అలాగే నడుచుకుంటాం. సరేనా?’ అన్నారు.
పెద్దాయన మాటలు వాళ్ల బుర్రలకెక్కాయి. తిరగబడలేదు. తెలుసుకున్నారు.
చీకట్లో చిందులేసే వాళ్లకు దారిలో పెట్టేది ఒక్క మంచి మాట. వాక్కుకు అంత శక్తి ఉంది. పాటకూ ఉంది. మంచి పాట కూడా ఆలోచింపజేస్తుంది. గమ్యం చూపుతుంది.
మహాత్మాగాంధి మాటలన్నీ రామబాణాల్లాంటివే. మొత్తం జాతినే దారిని పెట్టలా? అవతలవాడు, ఎదురుతిరిగి మాట్లాడకుండా సలహా చెప్పగల కిటుకు అందరికీ తెలియదు. ఆ పెద్ద మనిషి సత్యాన్ని మృదువుగా చెప్పాడు. నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అన్నదమ్ముల్ని శాంతపరిచాడు. కొంతమంది అవతలి వారి మెప్పు కోసం ఉన్నవీ లేనివీ కలిపేసి చెప్పేస్తూంటారు. ఆ కాసేపూ, ప్రియంగా మాట్లాడటం మనిషి బ్రతకటానికి పనికిరావచ్చునేమో?! కానీ ఆ ‘వాక్కు’ ఉద్ధరించడానికీ పనికి రావాలి.
కొందరుంటారు. మేం చెబుతున్నది సత్యం సుమా! సత్యం ఎప్పుడూ కటువుగానే ఉంటుంది’ అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూంటారు. వాళ్లవల్ల లోకానికి ఎటువంటి ఉపకారమూ లేకపోగా హాని కూడా.
చెప్పబడే మాట పది మందికీ మేలు కలిగించేలా వుండాలి. నోరుందని ప్రతి దానికీ మీద పడి కరిచేవారికి శాంతి ఉండదు. పక్కవాళ్లను శాంతంగా వుండనివ్వరు. అటువంటి వారెప్పుడూ ఏకాకులై పోతారు.
అందర్నీ కలిపేది ఒక్క ప్రేమ మాత్రమే. అపారమైన ప్రేమ భావంతో మాట్లాడే మాటలకు ఎంతటి వారైనా యిట్టే వశమై పోతారు. కరిగిపోతారు.
పవిత్ర గ్రంథాల్లో కనిపించేవన్నీ ఋషుల వాక్కులే. అయస్కాంతం లాంటి ఆ మాటలతో మనుషులు ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్న సందర్భాలనేకం.
వౌనం మానసికమైనదే గానీ, కంఠ గతం కాదు. మాట్లాడకుండా వుండటం వౌనమా? కాదు.
మానసికంగా తమవి కాని విషయాల పట్ల మాట్లాడకుండా శాంతంగా వుండటమే వౌనం. వౌనం ఎప్పుడూ బలమే. మాటే బలహీనత.
ఏ వ్యక్తికైనా సహజమైన స్వభావమంటూ ఉంటుంది. త్యాగరాజు యిందుకు మినహాయింపు కాకపోయినా అటువంటి వారు వాక్కును తపస్సుగా భావిస్తారు. సందర్భాన్ని బట్టి స్థితప్రజ్ఞులై క్షణాల్లో వాళ్లను వాళ్లు సరిదిద్దుకుంటారు.
ఆ రోజుల్లో నూనె గానుగలుండేవి. ఎడ్లు ఆ గానుగలో తిరుగుతూండగా నువ్వులు ఆడించి నూనె తీసేవారు.
కడిగిన నువ్వుల్ని ఆరుబయట ఎండబెట్టేవారు.
త్యాగయ్య ఇంటి ముందు కడిగి ఆరబెట్టిన నువ్వుల్ని ఆడుకుంటున్న పిల్లలు తొక్కేస్తూండేవారు.
అది గమనించిన త్యాగయ్య ఓసారి ఆ పిల్లల్ని దండించబోయి, కోపంతో ఊగిపోవటం చూసిన భార్య శాంత,
‘ఏమండీ! అభం శుభం ఎరగని పిల్లల మీదనా మీ కోపం? ఆ మాత్రం కోపాన్ని నిగ్రహించుకోలేరా?’ అంది.
ఆ క్షణంలోనే త్యాగయ్యకు తప్పు తెలిసింది. తొందరపడ్డాననుకుని ‘ఇంత తెలిసి యుండి ఈ గుణమేల’ ననుకున్నాడు. స్థిమితం లేదు. తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది. ‘సామ’ రాగంలో అప్పుడు స్వామి ఎదురుగా పాడుకున్న కీర్తనే ‘శాంతము లేక సౌఖ్యము లేదు’
తీర్థయాత్రలు పూరె్తై యింటికి తిరిగొచ్చిన త్యాగయ్యలో వచ్చిన మార్పు ఆయన కీర్తనలలో ప్రస్ఫుటంగా కనిపించేదని ఆయన శిష్యులనేవారు. ‘తిత్తిలో సుఖమునకై తిరిగెనీ ప్రాణి’ అంటాడు అన్నమయ్య.
మనిషి సాధారణంగా సుఖానే్న ఆశిస్తాడు. ‘బాధలు కొన్ని తనే సృష్టించుకుంటాడు. అందుకే ప్రశాంత జీవనానికి ప్రాణాయామం పుట్టింది. మనకు తెలియకుండా, ఊపిరి తీసుకుంటూ మళ్లీ వదిలినంత కాలమూ బాగానే ఉంది. ఏ మాత్రం, కాస్త హెచ్చుతగ్గులున్నా కనిపించినా ఇంతే సంగతులు.
అందుకే శ్వాస మీద ధ్యాస - చాలామందికిది దుర్లభం. కొందరికే సులభం.
* * *
కర్ణాటక సంగీతంలో కొన్ని రాగాలు చాలా ప్రసన్నంగా ఉంటాయి.
కొన్ని ఉద్వేగాన్ని కలిగిస్తాయి.
మరి కొన్ని కరుణరస ప్రధానంగా లాలిస్తూ సేద తీరుస్తాయి. అటువంటి రాగాల్లో ఈ ‘సామ’ రాగం వొకటి.
సదాశివ బ్రహ్మేంద్రుల రచన.. ‘మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే’ ప్రసిద్ధమైంది.
‘ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే’
‘మరవకవే ఓ మనసా!’ మొదలైన త్యాగరాజ కీర్తనలతోబాటు యితర వాగ్గేయకారులెందరో ఈ సామ రాగంలో ఎన్నో కీర్తనలందించారు. వెనుకటి రోజుల్లో రికార్డుల్లో వినబడే త్యాగయ్యగారి, ఈ కీర్తన ఎంతో ప్రసిద్ధమైంది.
‘శాంతము లేక సౌఖ్యము లేదు
దాంతునికైన, వేదాంతునకైనా’

దార సుతులు ధన ధాన్యములుండిన
సారెకు జప తప సంపదలుండిన ॥

ఆగమ శాస్తమ్రులన్నియు చదివిన
బాగుగ సకల హృద్భావము తెలిసిన ॥

యాగాది కర్మలన్నియు చేసిన
భాగవతులనుచు బాగుగ పేరైన ॥

రాజాధిరాజ శ్రీరాఘవ! త్యాగరాజ వినుత
సాధు రక్షక! తన కుప ॥

ధన కనక వస్తు వాహనాలెన్ని యున్నా, నియమ నిష్టలతో జపతపాలెన్ని చేసినా, మనిషి ప్రశాంతచిత్తుడు కాకపోతే ‘ప్రయోజనం సున్నా’. స్వప్రయోజనాల కోసమో, పదవుల కోసమో, నక్క ఆశలతో నలిగిపోయే వాళ్లకు ‘శాంతి’ అందని ద్రాక్ష. వాళ్లు స్థిమితంగా ఉండరు. మరొకరిని ఉండనివ్వరు.
ఒక్క సుషుప్తిలోనే మనకు శాంతి. ఎందుకంటే సుషుప్తిలో ఆదమరచి నిద్రబోయినప్పుడు వేహ భవాం వుండదుగా. ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి.
దాంతులు చెప్పినా వేదాంతులు చెప్పినా సత్యం ఇదే. త్యాగరాజు మాటలు అటు జిజ్ఞాసులకు, ఇటు విద్వాంసులకూ మార్గం చూపేవే.
అసలు వాడికి నిద్రతో పనిలేదు. ‘కొసరువాడు’ నిద్ర లేకపోతే ఉండలేడు.
అందుకే ఈ రాత్రీ పగలూను. మనం నిద్రిస్తున్నా, మనక్కావలసినవి కనిపెడ్తూంటాడే! ‘ఆ’ ఒక్కణ్ణీ నమ్ముకుంటే చాలు. శాంతిగా బ్రతకవచ్చునన్న త్యాగరాజు మాటే పాటైంది.
సన్నివేశాలు ఆ పాటలోని చరణాలయ్యాయి.
‘మీ ఇద్దరి వల్లా పెరిగిన సంసార వృక్షపు నీడలో హాయిగా వున్నారా?’ అని ఏ దంపతులనైనా అడిగి చూడండి. సరైన సమాధానం వస్తుందా? దీన్ని పట్టుకున్నాడు త్యాగయ్య. శాంతి మార్గాన్ని ఆయన వెతుక్కుని మనకు దారి చూపించాడు.
దేహానికి చేసి పెట్టే కర్మలుంటాయి. కుటుంబానికి చేసేవుంటాయి. సమాజ శ్రేయస్సుకూ చేసేవుంటాయి. అన్నింటికీ ధర్మాచరణే మూలం.
ధర్మాన్ని పట్టుకున్న వాడికి ‘శాంతి’ లేకపోవడం వుండదు.
ఇప్పుడు సమాజంలో కనిపించేది పాపాచరణ, అధర్మాచరణ. ఇంకెక్కడి శాంతం? బాహ్యంగా కనిపించే శత్రువులను నిర్జించగలం. మరి అంతఃశ్శత్రువుల సంగతి? అవి కనిపించవే?
కడుపున పుట్టిన పిల్లలు, రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు, కట్టుకున్న భార్య, అందరూ మన కళ్ల ముందే తిరుగుతూంటారు. కాని శాంతి ఉండదు. ఎక్కడుంది లోపం. ఏమిటీ మాయ?
మంచి చెడులు రెండూ పక్కపక్కనే వుంటాయి. వివేకముంటేగాని తేడా తెలియదు.
శాంతంగా బ్రతకాలనుకుంటే బాటసారిలా, వచ్చిన పని చూసుకుని వెళ్లడమే. సంసారంలో వున్నా సంసారం మాత్రం మనలో లేనంత కాలమూ ఏ బాధ లేదు. పడవ నీటిలోనే తిరగాలి. కానీ నీరు పడవలోకి రాకూడదుగా?
యింద్రియాల బలహీనత వల్లా, పెరిగే కోరికల వల్ల భోగభాగ్యాల వల్లా, ప్రశాంతంగా వుండటం కల్ల’ అంటారు త్యాగయ్య.
మితమైన ఆహార విహారాలతో మనసుకు కాసె్తైనా, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో చేస్తే ఆలోచనలు ఎప్పుడూ సత్ఫలితానే్న యిస్తాయి. నిశ్శబ్దం, వౌనం అనగానే, మన మనసులో మెదిలే భగవాన్ రమణమహర్షి. పుట్టుకతో తమిళుడు. దక్షిణాది భాషలెన్నో వచ్చు. సంస్కృతం సరేసరి.
తమిళంలో ‘వెణ్బా’ అనే ఛందస్సుంది. ఆ ఛందస్సును తెలుగులోకి తెచ్చి మూడు పద్యాలు రాశారు. మళ్లీ వాటిని తమిళంలోకి మార్చి ‘శంకరాభరణం’ రాగంలో స్వర సహిత గణాలతో, పక్కనే వున్న వారికి పాడి వినిపించారు. ఆయనకు సంగీతాభిరుచి ఉందని తెలిసిపోయింది.
భగవాన్ పాడటంతో శిష్యులంతా ఆనందంగా విన్నారు. ఆ రోజుల్లో ఆశ్రమంలో ప్రత్యేక సందర్భాల్లో సంగీత కచేరీలు జరుగుతూండేవి. సాధకులు, సంగీత రసికులూ తెలుసుకోదగిన అంశం ఒకటి ఉంది.
సంగీత కచ్చేరీలలో భగవాన్ మనలా తల ఊపడం, తారస్థాయిలో సంచారాలు చేసినప్పుడూ, ఎంతో ఆర్భాటంతో ముక్తాయి స్వరం పాడినప్పుడు, చప్పట్లు కొట్టేయడం లాంటివేమీ చేయకుండా, కూర్చుని వింటున్న భగవాన్‌ని చూసి ‘అంత నిశ్చలంగా స్పందన లేకుండా కూర్చుంటారేమి?’ అనడిగారు, శిష్యులు.
‘మీరంతా ప్రకృతి స్వరానికి (అంటే శృతికి) వికృతులైన సప్తస్వరాల సంగీతం వింటారు. నేనేమో ఆధార శృతిలో లీనమై ఆత్మలో వుండిపోతున్నాను.’ అని సమాధానం చెప్పారు. ఆధార శృతి అంటే షడ్జం. సంగీతం పాడేవారు, వినేవారూ గమనించవలసిన అంశమిది. మనకు ఆనందాన్నిచ్చే ముఖ్య స్వరం ఆధార షడ్జమే.
సంగీతమైనా, ఏ కళైనా కానీ, దానికదే అత్యున్నత దశ కాదు. అవి ఒక దశ వరకే.
త్యాగరాజాది మహానుభావులంతా పాడి పొందలేదు. పొందిన దానినే పాడారు.
అందుకే ఆ సంగీతం జీవంతో ఉంది.
96 కోట్ల రామనామ జపం చేసినవాడు త్యాగబ్రహ్మ. దీక్షితులు, శ్యామశాస్ర్తీ కూడా ఉపాసకులే. సంగీతంతో ముగ్గురూ తరించారు. ఈ విద్య లభించిన ఇతరుల దృష్టి మరోలా ఉంటుంది. వారు ఆధ్యాత్మిక సిద్ధి కోసం పాటుపడరు. వాళ్ల మనస్సు కీర్తి ప్రతిష్టల కోసమే వెంపర్లాడుతుంది -అనేవారు భగవాన్.

చిత్రాలు..భగవాన్ రమణ మహర్షి
*ముత్తుస్వామి దీక్షితార్
*త్యాగయ్య
*శ్యామశాస్ర్తీ

- మల్లాది సూరిబాబు 9052765490