S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోపాన్ని జయించి దేవుడైన శ్రీకృష్ణుడు

జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని సాధించుకొన గలిగే వరకు ఎన్ని అవరోధాలనైనా, కష్టాలనైనా, అవమానాలనైనా సహించగలిగేవారు మిగతా అందరికన్నా మహా శక్తివంతులై దైవత్వాన్ని సాధించుకుంటారు.
తన లక్ష్య సాధనకు ఏ వ్యక్తి అయినా సాధించుకున్న ఏకాగ్రతకే ‘తపస్సు’ అని పేరు. అట్టి తపస్సు వల్ల ఘన, ద్రవ పదార్థాల రూపంలో ఉన్న ఏ వస్తువునైనా వాయువు రూపంగా, జ్యోతిస్సుగా మార్చివేయగల్గడం సాధ్యమవుతుంది. దానినే ‘దైవత్వం’ అంటారు.
‘జ్యోతిస్సు’గా మారిపోగల్గడమే ‘దైవత్వం’ అని అర్థం చేసుకొనగల్గితేనే ఈ అనంత సృష్టిలోని అద్భుత రహస్యం అర్థమవుతుంది. మహా మేధావిత్వం లభిస్తుంది.
‘దేవతలు’ అందరూ జ్యోతిస్వరూపాలే. ఆకాశంలో కానవచ్చే నక్షత్రాలు అన్నీ దేవతలే. భూమధ్య రేఖా ప్రాంతంపైగా ఉండే ఆకాశ మధ్యరేఖా ప్రాంతంలో భూమిని చుట్టి ఉండే ‘నక్షత్ర చక్రం’లో ఉండే 27 నక్షత్రాలలోని ‘శ్రవ’ నక్షత్రం ‘అభిజిత్’ నక్షత్రాలే బ్రహ్మ.. విష్ణువులు - ‘ఆర్ర్దా’ నక్షత్రమే మహేశ్వరుడు. ఇవి చాలా మంది పండితులకు సైతం తెలియని రహస్యాలు.
ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురించిన కథలు వెంటనే అర్థంకావు. నమ్మదగినవిగా కనిపించకపోవచ్చు. కాని లోతుగా పరిశీలిస్తే ఆధునిక శాస్ర్తియ సత్యాలు అన్నీ ఆ కథల నుండి బయటపడతాయి.
వాటిని అలా ఉంచి పురాణ కథల్ని చూద్దాం.
పరమేశ్వరుడు ‘త్రిపురాసుర సంహారం’ చేసినప్పుడు అతడు వదిలిన ఒక బాణం మూడు పురాలనూ దహించి వచ్చిన తర్వాత దానిని ఆయన తన తొడ మీద పెట్టుకున్నాడు. అది వెంటనే ఒక ‘బాలుడు’గా మారింది.
ఆ బాలుడు అనంతమైన ఉగ్రత్వం - అమితమైన శాంతం, సహనం కలిగిన అనూహ్య, అద్భుత వ్యక్తి కాబట్టి అతడికి ‘ద్వౌర్వాసుడు’ అనగా ‘రెండు అద్భుత లక్షణాలు కలవాడు’ అని దేవతలు అతడికి పేరు పెట్టారు. ‘ద్వౌ’ అంటే ‘రెండు’ అని అర్థం కాబట్టి.
ఆ ‘ద్వౌర్వాసుడు’ అనే పదం క్రమంగా ‘దూర్వాసుడు’గా లోకంలో స్థిరపడిపోయింది.
ఒకసారి దూర్వాస మహాముని ఇప్పటికి ఐదువేల పైబడిన ఏళ్ల క్రిందటి వారైన (క్రీ.పూ.3138లో భారత యుద్ధానికి కారకులైన) పాండవుల మందిరానికి వచ్చాడు. వారిని చూచి మందహాసం చేశాడు. అంతలోనే ఉన్నట్టుండి కోపగించుకున్నాడు. కళ్లెర్రజేశాడు. వెంటనే తనకు కడుపు నిండేటంత అన్నం కావాలన్నాడు. మళ్లీ ఎందుకనో వద్దన్నాడు. తర్వాత మళ్లీ కోపంతో చెలరేగి తనకు వెంటనే అన్నం పెట్టాలన్నాడు. అనేక మందికి సరిపడిన అన్నం తినేశాడు. కాస్సేపు నేల మీదా, కాసేపు పట్టుపరుపుల మీద పడుకొని దొర్లాడు. పగలూ, రాత్రి అనే తేడా లేకుండా తరచుగా ఆకస్మికంగా లేచి ఎక్కడికో వెళ్లిపోయేవాడు. తిరిగి వచ్చి అందరి మీదా కోపగించుకొని ధుమధుమలాడేవాడు. దూర్వాసుని ఈ ప్రవర్తన ఎవ్వరూ సహించగలిగేదిగా లేదు. కాని అతడిని ఎదుర్కొనే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఎదురుతిరిగితే మహా తపస్వి కాబట్టి ఏమని శపిస్తాడని అందరికీ భయం. ఏదో కాస్సేపు అతడి ఆగ్రహాన్ని రెచ్చగొట్టకుండా సహనంతో గడిపేస్తే, అతడే వెళ్లిపోతాడులే అని అతడి నిష్క్రమణానికై ప్రతిక్షణం ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి దూర్వాస మహ శ్రీకృష్ణుని భవనానికి అందరూ చూస్తూండగానే ఆకాశమార్గాన ప్రయాణం చేస్తూ వెళ్లి - కృష్ణుని నుండి భయభక్తులతో అందించిన ఆతిథ్యం పొంది - శ్రీకృష్ణా! నాకు ఈ రోజున మధురమైన పాయసం తినాలని ఉంది. ఒక గుండిగ నిండా వండించి ఇక్కడ పెట్టించు’ అన్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే ఆ ఏర్పాటు చేశాడు. గుండిగ నిండా పాయసం దూర్వాస మహర్షి ఎదుట సిద్ధంగా ఉంది.
మహర్షి దానిని చూసి తన కమండలాన్ని ఆ పాయసపు గుండిగలో ముంచి పాయసాన్ని పలుమార్లు తీసుకొని కడుపు నిండేట్లుగా తాగాడు.
అంతవరకూ ఎవ్వరికీ ఏమీ కొత్తగా అనిపించలేదు. ఏమీ బాధ అనిపించలేదు. కాని ఆ తర్వాత జరిగింది అనూహ్యమైన సంఘటన. అందరినీ ఎంతగానో కలవరపెట్టిన సంఘం.
ఎందుకని అందరూ అయోమయ స్థితిలో పడిపోవల్సి వచ్చిందో తెలిసిందా? అది ఎవ్వరి ఊహకూ అందనిది. అదేమిటంటే-
దూర్వాస మహర్షి ‘శ్రీకృష్ణా ఇలా రా!’ అన్నాడు. శ్రీకృష్ణుడు అన్నీ తెలిసిన వాడైనా ఏమీ తెలియనట్లు అమాయకత్వాన్ని నటిస్తూ ఆయన వద్దకు వెళ్లాడు.
శ్రీకృష్ణా ‘ఈ పాయసాన్ని ఎక్కడా వదలకుండా శరీరం అంతటా నిండుగా పూసెయ్యి’ అన్నాడు. శ్రీకృష్ణుడు అమాయకుడిలాగా పాయసాన్ని దూర్వాసుడి శరీరమంతటా పూశాడు.
దానితో దూర్వాస మహర్షి దయ్యం పట్టిన వాడిలా వికృతంగా నవ్వుతూ, ఎగురుతూ తన కమండలంతో ఆ పాయసాన్ని శ్రీకృష్ణుడి శరీరంపైనా, రుక్మిణీ దేవి శరీరంపైన పోసి వారు పాయసంలో పూర్తిగా తడిసిపోయేట్లు చేశాడు.
అంతవరకూ కూడా శ్రీకృష్ణుడూ రుక్మిణీ దేవి గాని ఇతరులుగాని సహించి వౌనంగా ఉండిపోయారు. దానితో దూర్వాస మహర్షి రెచ్చిపోయి శ్రీకృష్ణుణ్నీ, రుక్మిణీదేవిని రెచ్చగొట్టాడానికై వెంటనే ఒక రథాన్ని తెప్పించి, శ్రీకృష్ణుడు చూస్తూండగానే రుక్మిణీ దేవిని రథం మీదికి తోసివేసి, ఆమెను రథానికి కట్టివేసి తను రథం ఎక్కి గుర్రాలను తోలే ములుకోలుతో గుర్రాలతోపాటుగా రుక్మిణీదేవిని కూడా కొట్టసాగాడు.
ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలందరూ కుతకుత ఉడికిపోతున్నారు. ఈ అనూహ్య సంఘటనలో తాను ఏం చేయాలో తెలియక రుక్మిణీ దేవి శ్రీకృష్ణుని వంక చూసింది. ప్రజలు కూడా అతని వంక చూశారు. శ్రీకృష్ణుడు అందరినీ ‘శాంతంగా ఉండమ’ని కళ్లతోనే సంజ్ఞ చేశాడు. దూర్వాన మహాముని పట్ల వినమ్రుడై ఉన్నట్లు నటిస్తూ రథం వెంట తానూ ఎంతో దూరం నడిచాడు.
ఇది ఎవరు చూసినా భరించరాని దృశ్యం. కాని శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి కూడా ఏమీ కోపం తెచ్చుకోకుండా వినమ్రంగా ఉండిపోయారు.
ఇలా కొంతసేపు జరిగిన తర్వాత దూర్వాస మహర్షి శ్రీకృష్ణుడూ రుక్మిణీదేవిని చూసి వారి పట్ల ప్రసన్నత వెల్లడిస్తూ-
‘ఓ నా బిడ్డలారా! మీ ఇద్దరూ నా పరీక్షలో నెగ్గారు. ఈ పరీక్షలో విజయమే మీలోని దైవత్వానికి నిదర్శన’మని అన్నాడు. మీరే ప్రజలందరికీ ఆదర్శం కాగల్గుతారు అని చెప్పి మహర్షి అంతర్థానమయ్యాడు.
భీష్ముడు తన ఇష్టప్రకారం బాణాల అంపశయ్యపై పరుండి ఉత్తరాయణం రాగానే జీవితాన్ని చాలించడానికై ఎదురుచూస్తూన్న సమయంలో ధర్మరాజు ఆయనను కలిసినపుడు అతడికి ఈ విషయం చెబుతూ - సహనశక్తియే దైవత్వమనీ, అందరూ సాధించుకొనవలసింది అదేననీ, దానివల్లనే అనంతమైన ఆనందం లభిస్తుందనీ చెప్పాడు. ఇది విశిష్టమైన జీవిత రహస్యం కదా?!

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి