S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విరుగుడు మంత్రం

అనీల్‌ని ఇంట్లో వాళ్లంతా ‘సిసింద్రీ’ అనే పిలుస్తారు. ‘ఒరేయ్! నీ పేరేంట్రా అంటే, పొరపాటున సిసింద్రీ అని చెప్పేసి - వాడికి వాడే బుర్ర మీద ఒక్కటిచ్చుకోవడం కూడా కద్దు.
అనీల్ అల్లరి పట్టడం కష్టమై పోయింది వాడి అమ్మానాన్నలకి. ‘నాన్నా! చిన్నప్పుడు నువ్వు అల్లరి చేసేవాడివి కాదా?’ అని ఎదురుప్రశ్న వేసేవాడు కూడా.
‘నీ అంత కాదులేరా.. అయినా మా అమ్మ మీ అమ్మలా ముద్దు చేసేది కదా. బెత్తంతో రెండు తగిలించేది...’ అని చెప్పాడు వాళ్ల నాన్న. ‘ఓహో మీ అమ్మ టీచర్ కదా! పాపం.. అంచేత బెత్తం దెబ్బలు తగిలేవేమో కదా..’ అంటూ జాలిగా మొహం పెట్టాడు అనీల్.
‘ఇదిగో.. ఈ సంక్రాంతి సెలవులకి వచ్చేటపుడు మీ నాన్నమ్మని బెత్తం తెమ్మంటాను.. నిన్ను దార్లో పెట్టడానికి..’ నాన్న అనీల్ని బెదిరించాడు. సంక్రాంతి రానే వచ్చింది. నాన్నమ్మ వచ్చేసింది. అనీల్ నాన్నమ్మతో బాగా ఆడాడు. ఎన్నో కథలు చెప్పించుకున్నాడు. కనుమ పండుగ రోజున అనీల్ వాళ్లమ్మ ఉదయానే్న నిద్ర లేపింది. ‘సెలవులు అయిపోతున్నాయి. రెడీ అయి హోంవర్క్ పూర్తి చేయాలి’ అంది అమ్మ.
మారాం చేయసాగాడు అనీల్. రెడీ కమ్మంటే.. స్నానం చేయనన్నాడు. పళ్లు తోముకోవడానికీ పేచీ పెట్టాడు. అమ్మ తలకి నూనె పూస్తానంటే ‘వద్దంటే వద్దు’ అని అరుపులూ, పరుగులూ ఇల్లంతా.
‘అనీల్! ఏంటి నీ గొడవ...’ విసుక్కున్నాడు నాన్న. వాడికి ఇప్పుడు నాన్నమ్మ దొరికింది ఆసరాగా.
‘నాన్నమ్మా చూడు.. నేను హోంవర్క్ చేసి - టిఫిన్ తిని - స్నానానికి వెళ్తానంటే అమ్మ మొదట స్నానం అంటోంది..’ నాన్నమ్మకి పితూరీ చెప్పాడు అనీల్. పైగా - నేను బుద్ధిమంతుడిలా ముందు హోంవర్క్ చేస్తానంటే కాదంటున్నారు అంటూ గోల చేయసాగాడు.
నాన్నమ్మ వాడిని దగ్గరకు తీసి తల నిమిరింది. ‘అనీల్! హోంవర్క్ చేయడం మంచిదే. కానీ - ఉదయానే్న లేచి చేయవలసిన కాలకృత్యాలు త్వరగా ముగించి పనిలో పడాలి. అదీ పద్ధతి’
‘అనీల్! నువ్వెందుకు మొదట హోంవర్క్ చేస్తానంటున్నావో నాకు తెలుసురా!’ అంటూ తొడపాశం పెట్టింది.
‘అవును నాన్నమ్మా! నాకు బద్ధకం...!’ నిజం నాన్నమ్మ దగ్గర ఒప్పేసుకున్నాడు అనీల్ నవ్వుతూ.
నాన్నమ్మ అనీల్‌ని హత్తుకొంటూ.. వాడి నుదుటి మీద ముద్దెట్టుకొని చెప్పసాగింది.
‘నీకో మంచి సూత్రం చెబుతాన్రా.. ‘్ఫస్ట్ థింగ్స్ ఫస్ట్’ అంటే.. మొదట చేయాల్సిన పనులు త్వరగా చేసేయడం. ఈ మంత్రం నీ బద్దకానికి విరుగుడుగా పని చేస్తుంది...
రాత్రిళ్లు త్వరగా పడుకొని ఉదయానే్న నిద్రలేచి చకచకా కాలకృత్యాలు తీర్చుకొని పనిలో పడ్డావనుకో! రెండు లాభాలు! ఒకటి - అది నీలో హుషారు తెస్తుంది. రెండు - బోలెడంత టైం మిగిలి ఇంకా ఎక్కువ శ్రమించేందుకు సహాయపడుతుంది. పెద్ద క్లాసులకు వస్తున్నావు.. మంచి అలవాట్లు నేర్చుకో’ అంటూ ముక్తాయించింది.
‘అవునే్ల నాన్నమ్మా! మా టీచర్ కూడా చెప్పారు. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్.. మేక్స్ ఏ మాన్ - హెల్తీ, హెల్తీ అండ్ వైజ్..’
‘ఊ! సరే.. ఇంకెందుకు ఆలస్యం!!’ అని ఓ పోజ్ కొట్టి నవ్వుతూ, టూత్‌బ్రష్ చేతిలోకి తీసుకున్నాడు అనీల్.

-బీవీఎస్ ప్రసాద్