S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భయంకర సహచరి (నమ్మండి.. ఇదినిజం)

పాము అంటే ఎవరికైనా భయమే. ముఖ్యంగా బాగా లావుగా ఉండే కొండచిలువని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ చైనాలోని డోంగ్‌యాన్ అనే గ్రామానికి చెందిన ఓ కుటుంబం గురించి 2013లో ప్రపంచ పత్రికలన్నీ రాశాయి. కారణం, ఆ కుటుంబానికి చెందిన అజాహీ ల్యూ అనే పదమూడేళ్ల కుర్రాడి సహచరి సాక్షాత్తు కొండచిలువ. బర్మాకి చెందిన ఈ కొండచిలువ పొడవు 15 అడుగులు! పాకే ఈ జీవి అజాహీకి బెస్ట్ ఫ్రెండ్! దాన్ని చూస్తే ఎవరికైనా గుండె అదురుతుంది. కానీ అజాహీ మాత్రం దాంతో నిర్భయంగా రాత్రిళ్లు దాని పక్కనే పడుకుంటాడు.
అజాహీ ఏడాది నిండకుండానే కొండచిలువ పక్కనే పడుకోవడం ఆరంభించాడు. వీడు పుట్టడానికి ఆరు సంవత్సరాల ముందు అజాహీ తండ్రి ఛెన్‌ల్యూకి ఓ కొండ చిలువ గుడ్డు కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకువచ్చి పొదిగాడు. అందులోంచి కొండచిలువ బయటికి వచ్చింది. అజాహీ పుట్టేనాటికే దాని బరువు ఇరవై కిలోలు. ఆ కొండ చిలువ వారింట్లోనే పుట్టి అక్కడే పెరగడంతో ఎన్నడూ బయటికిపోలేదు. ఇంట్లోని కుటుంబ సభ్యులని కూడా బాధించలేదు. చిన్నప్పటి నించే దాన్ని చూస్తూండటంతో పెరిగి, భయంకరంగా మారినా, ఆ కుటుంబ సభ్యులు దాన్ని చూసి ఎన్నడూ భయపడలేదు.
అజాహీకి తొమ్మిది నెలల వయసులో మొదటిసారిగా తల్లిదండ్రులు ఇల్లు తాళం పెట్టి పనికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి వాడు దాంతో నిర్భయంగా ఆడుకుంటూ కనిపించాడు. అంతకు మునుపే వాడికి అది మాలిమి అయిందని వాళ్లకి నిర్ధారణ అయింది కాబట్టి జంకు గొంకు లేకుండా వదిలిపెట్టి వెళ్లారు. వయసు పెరిగేకొద్దీ అజాహీకి దాని మీద ప్రేమ పెరగసాగింది. ఇద్దరూ కలిసి ఆడుకోసాగారు. వాడు దాని వీపు మీద కూర్చుంటే అది ముందుకి పాకుతుంది. వేసవిలో ఎండ మండుతున్నప్పుడు, ఆ కొండ చిలువ చల్లటి శరీరం అజాహీ గదిలో ఎయిర్‌కండిషనర్ యంత్రంగా పని చేస్తుంది.
అజాహీ ఇంకే ఆట వస్తువులతో ఆడలేదు. తన తీరిక సమయాన్ని ఆ కొండచిలువతోనే గడిపేవాడు. ఒక్కసారి కూడా అది వాడిని బాధించలేదు. 2012లో అజాహీ మొదటిసారి స్కూల్‌కి వెళ్లినప్పుడు దానికి దూరం అవడంవల్ల దిగులు పడ్డాడు.
‘అది నన్ను ఎన్నడూ గట్టిగా చుట్టుకోలేదు. నా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. జంతువులని అర్థం చేసుకుంటే అవి మనుషుల విషయంలో ఎంతో దయగా ఉంటాయి’ అజాహీ చెప్తాడు.
చుట్టుపక్కల గ్రామాల నించేకాక, విదేశాల నించి కూడా అనేక మంది, అజాహీని, ఆ బర్మీస్ కొండచిలువని చూడ్డానికి వస్తారు. ఈ నలుపు తెలుపు కొండచిలువ బరువు 100 కిలోలు. వాళ్లిద్దరూ పడుకునే పరుపు ఇద్దరికీ సరిపోయేంత పెద్దది.
ఇదేకాక వాళ్ల ఇంట్లో ఇంకో తెల్ల కొండచిలువ కూడా ఉంది. దాని వయసు పదేళ్లు.
‘ఈ కొండచిలువల్ని మేము మనుషుల్లా చూస్తాము. తరచూ వాటితో మాట్లాడతాము. బయటికి తీసుకెళ్తూంటాము. వాటితో ప్రయాణాలు కూడా చేస్తుంటాం’ అజాహీ తండ్రి ఛెన్ ఓ జర్నలిస్ట్‌తో చెప్పాడు.
ఒక అజాహీనే కాక ఇప్పటిదాకా ఆ కొండ చిలువలు ఏ మనిషికీ హాని చేయలేదు. ఇరుగు పొరుగు కూడా దానికి మేత వేస్తుంటారు. తన దగ్గరికి వచ్చి భయంగా చూసే సందర్శకుల చేతులని పట్టుకుని అజాహీ ఆ కొండచిలువని తాకించి ధైర్యాన్ని కలిగిస్తాడు.
మొదట్లో ఇరుగు పొరుగు, ఇళ్లకి వచ్చే బంధువులు ఈ కొండచిలువల్ని చూసి భయపడి అవి ఊళ్లో ఉండకూడదని ప్రభుత్వాధికారులకి ఫిర్యాదు చేశారు. కానీ గ్రామస్థులే ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకోమని అభ్యర్థించటంతో ప్రభుత్వాధికారులు వెనక్కి తగ్గారు.
తర్వాత వచ్చిన తెల్ల కొండచిలువని చూసిన వాళ్లు గతంలోలా ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేయలేదు. ఈ కొండచిలువలకి పేర్లు పెట్టకపోవడం విశేషం.
2013 చైనీస్ జోడియాక్ ప్రకారం సర్ప సంవత్సరం. ఆ సందర్భంగా చైనాలోని కొన్ని టీవీ షోలలో అజాహీ, కొండచిలువలు పాల్గొన్నారు. డిస్కవరీ, నేషనల్ జియోగ్రాఫిక్ లాంటి ఛానెల్స్‌లో కూడా అజాహీ ఇంటర్వ్యూలు, అతని మీద షోస్ ప్రదర్శించారు.
‘పాములని తినకండి. వాటి మీద దయ చూపించండి’ అని అజాహీ ఆ షో చివర్లో ప్రపంచ పౌరులకి విజ్ఞప్తి చేశాడు. పెద్దయ్యాక అజాహీ జువాలజిస్ట్ అవాలని ఆశిస్తున్నాడు. అందువల్ల మరికొన్ని జంతువులతో స్నేహం చేయచ్చని ఆశ పడుతున్నాడు.

పద్మజ