S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవుడిచ్చిన వరం

సేతుపతి తన చేతిలో వున్న డబ్బు వంక చిరునవ్వుతో చూశాడు. పదిహేను రోజుల శ్రమకి తనకి ఉస్మాన్ భాయ్ ఇచ్చిన పారితోషికం ఏడువేల ఐదొందలు. ఇదే చేతులతో రోజుకి పదివేలు పారితోషికం అదే ఉస్మాన్‌భాయ్ చేతుల మీదుగా అందుకున్నాడు ఒకపుడు. నాలుగేళ్ల క్రితం ఇరవై నాలుగు అడుగుల ఎత్తు నుంచి తన ప్రియమైన మంకీజంప్ ఫీట్ చేస్తుండగా, టెంట్ చివర కట్టిన తాడు తెగిపోయి, జారి, క్రింద పడటంతో, చావుతప్పి, కుడికాలు విరిగిపోయి, అవిటివాడై పోయాడు సేతుపతి. సర్కస్‌లో తన ఫీట్స్ హైలైట్.
భారతదేశం నలుమూలలా గోల్డెన్ ఇండియా సర్కస్ పేరుతో ఉస్మాన్ నిర్వహించిన ఎన్నో షోలలో తన మంకీ జంపింగ్, స్టిక్ వాకింగ్, ఫైర్ డాన్సింగ్ కార్యక్రమాలు డబ్బుల వర్షం కురిపించాయి. నానక్‌రాం జోకర్ షోకి, తన ఫీట్స్‌కి సర్కస్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. నానక్‌రాం చచ్చిపోయాడు గుండెపోటుతో. తను కాలు విరిగి, ఎటువంటి ఫీట్స్ చేయలేని స్థితిలో చిక్కుకుపోయాడు. ఉస్మాన్ భాయ్ ఇంతకాలం సంపాదించిన డబ్బుతో ‘మదర్ ఇంపీరియల్ రిసార్ట్స్’ దగ్గరలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లో పది పదిహేనేళ్ల పిల్లలతో చిన్నచిన్న సర్కస్ ఫీట్స్ చెయ్యిస్తూ, బాగానే సెటిల్ అయ్యాడు. ఆ పిల్లలకి కొత్తకొత్త మెళకువలు నేర్పించి, రకరకాల వెరైటీ షోలకి తయారుచెయ్యించటం సేతుపతి పని. నెలకి పదిహేను రోజులే ఉద్యోగం. ఇది కాకుండా ఇంట్లోనే చిన్నపిల్లల కోసం, రంగుకళ్లద్దాలు, ఫ్లూట్స్, బెలూన్ బొమ్మలు, ఏక్‌తారలు తయారుచేసి, మార్కెట్లో బబ్లుసేఠ్‌కి సప్లై చేస్తూ, మరో నాలుగైదు వేలు సంపాదించుకుంటున్నాడు.

సేతుపతికి ఎవ్వరూ లేరు. ఏకో నారాయణ. చిన్నప్పుడు ఏడో తరగతి వరకు తనతో కలిసి చదువుకుని, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ అయిపోయి, ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేక, కేవలం చిత్రకళ మీద బోలెడంత పిచ్చితో, దారిద్య్రాన్ని కూడా ఒక వరంగా భావిస్తూ బ్రతికేస్తున్న గణపతి గాడిని, తనతోపాటు, తన ఇంట్లోనే ఉంచుకుని పోషిస్తున్నాడు. గణపతి చాలా మంచి చిత్రకారుడు. కానీ కళారంగానికే ఒక శాపం వుందనిపిస్తుంది గణపతిని చూస్తే. విద్యని, కళని నమ్ముకున్న వాళ్ల కంటే వాటిని తెలివిగా అమ్ముకోవడం తెలిసిన వాళ్లు కోట్లకు పడగెత్తుతారు. గణపతి ఆ కోవకి చెందడు. కళని మరో స్థాయికి తీసుకెళ్లాలని పరితపించే మనిషి. కానీ తపన ఒక్కటే సరిపోదు. కళా హృదయాన్ని అర్థం చేసుకునేవాడు, వాడి గోడుని అర్థం చేసుకుని స్పందించే జోడు, భుజం తట్టి ప్రోత్సహించే మంచి మనసు కావాలి.
గణపతి కోరుకున్న అమ్మాయి మరొకరిని కోరుకుని పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్లిపోయింది. సేతుపతి గణపతికి తోడు, నీడ, జోడు, పోషించి ప్రోత్సహించేవాడు అయ్యాడు.
ఉస్మాన్ భాయ్ నుంచి జీతం అందుకోగానే, దాదూస్ స్వీట్స్‌లో ఢోక్లా, గులాబ్‌జామ్, బావర్చిలో చికెన్ బిరియానీ, గణపతికి ఇష్టం అని కొని, ఇంటికి తీసుకొచ్చాడు.
తన చంకల క్రింద వుండే కర్రలు టకటకలాడిన చప్పుడు విని తలుపు తెరిచాడు గణపతి. బిరియానీ వాసన గుప్పున కొట్టింది.
‘బిరియానీ?’ అన్నాడు ఆనందంగా.
‘ఒరిజినల్ బావర్చి బిరియానీ. సంధ్య టాకీస్, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ నుంచి...’ లోపలికి వస్తూ అన్నాడు.
‘ఆహా.. పిచ్చ ఆకలిగా ఉంది. నేనాగలేను సేతు...’
‘ఆగాకు. దాదూస్ స్పెషల్ ఢోక్లా, గులాబ్ జామ్ కూడా!’
‘వావ్!’ ఆనందంగా కౌగిలించుకున్నాడు గణపతి.
క్షణాల్లో ప్లేట్లు తీసుకొచ్చి, అన్నీ ఓపెన్ చేసి, కూర్చున్నారు.
‘హైదరాబాద్ అంటే బిరియానీ. బిరియానీ అంటే బావర్చి...’ తన్మయత్వంతో అన్నాడు గణపతి ఒక్క ముద్ద తినగానే.
‘మరో గుడ్ న్యూస్ చెప్పనా?’
‘చెప్పు సేతు?’
‘దసరా నవరాత్రుల కోసం రకరకాల అమ్మవార్ల పెయింటింగ్స్ వేసి ఇస్తే, దామోదర్‌గారు ఐదు వేల చొప్పున పది బొమ్మలైనా, యింకా ఎక్కువైనా కొనుక్కుంటానన్నారు...’ అన్నాడు సేతు.
‘ఇంపాసిబుల్. బంబుల్‌బీ ఇంటర్నేషనల్ ఆర్ట్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్‌కి లాస్ట్‌డేట్ సెప్టెంబర్... నేను తప్పకుండా ఆ పోటీలో ఫస్ట్ ప్రయిజ్ కొట్టాలి! లక్ష రూపాయలు ఫస్ట్ ప్రయిజ్. డబ్బులు పక్కన పెట్టు. మాథ్యూస్ సియానా, అభిషేక్ గులాటీ, చందన్‌రాజ్, నిజాముద్దీన్, నటరాజన్ పిళ్లై లాంటి గొప్పగొప్ప చిత్రకారులు న్యాయనిర్ణేతలు. క్రియేటివిటీకీ, కానె్సప్ట్‌కి, వర్కింగ్ స్టయిల్‌కీ ప్రాముఖ్యత ఇస్తారు. పాలిటిక్స్ వుండవు. జడ్జ్‌మెంట్‌లో క్లారిటీ ఉంటుంది...’
గణపతి మాటలు సగానికి సగం అర్థం కాకపోయినా, అతని తపనకీ, ఉత్సాహానికీ తన వంతు సహకారం అందిస్తున్నాననే ఆత్మతృప్తి తొణికిసలాడుతోంది సేతుపతి మొహంలో.
‘ఓకేరా. నీ ఇష్టం. నీ తపస్సుకి భంగం కలిగించను. వచ్చిన ఆఫర్ చెప్పాను...’
‘అది ఆఫర్ కాదు సేతు. నీకు తెలీదు. పెయింటింగ్, ఎగ్జిబిషన్, ప్రమోషన్ అనే సామ్రాజ్యంలో చాలా పెద్ద మాఫియాయే ఉంది. నిజమైన కళాకారుడికి వాళ్లిచ్చేది పీనట్స్!! అసలు పెయింటింగ్ కంటే సిగ్నేచర్ వాల్యూకే వ్యాపారం ఎక్కువ. మధుకొల్హాపురీ అనే పేరుతో లక్షలకి అమ్ముడుపోయే పెయింటింగ్, అన్నీ చిల్లర డబ్బులకి, రోజు కూలీకి పనిచేసే ఆర్టిస్టులని వాడుకుని, ఆ పేరుతో అమ్ముకుంటారు. మధుకొల్హాపురీ అనే పేరుతో అసలు ఆర్టిస్టు ఉన్నాడో లేడో కూడా తెలీదు. నన్ను కదిలించకు. గంటల తరబడి, రోజుల తరబడి నేను ఈ క్రియేటివ్ బ్రెయిన్ డ్రెయిన్ మాఫియా గురించి మాట్లాడగలను’
‘ఒద్దులే. ఇప్పుడు నీ మైండ్ పాడుచేసుకోకు... నీకేం కావాలో చెప్పు. ఏర్పాటు చేస్తాను...’
‘్థంక్యూ రా. కానీ నా మీద నాకే కోపం వస్తోంది’
‘ఎందుకు? వంద ఐడియాలు. బ్రష్ పట్టుకోగానే ఆ ఐడియా ఔట్‌డేటెడ్ అనిపిస్తుంది. నాచురల్ పోర్ట్‌రెయిట్ వెయ్యాలా, ఆబ్‌స్ట్రాక్ట్ సర్రియలిస్టిక్ పెయింటింగా, విజువల్ మ్యూజింగ్స్ బావుంటాయా, ట్రెడిషనల్ కానె్సప్ట్ ట్రై చేద్దామా డిసైడ్ చెయ్యలేక పోతున్నాను...’
‘మనసుకి నచ్చింది వెయ్యి గణపతీ. అది ఏ కోవకు చెందుతుందో న్యాయనిర్ణేతలు చూసుకుంటారు. ముందు నీ కంటికి నచ్చాలి. నీ మనసుకి తృప్తి కలగాలి. కళాకారుడిలాగే రసజ్ఞులు కూడా దేనికో స్పందిస్తారు. ఎక్కడో ట్రిగర్ అవుతుంది. నువ్వు గ్యారెంటీగా విజయం సాధిస్తావ్. ఆల్ ది బెస్ట్’ సేతుపతి మాటలు గణపతికి ఇన్‌స్పిరేషన్ అయ్యాయి.
‘్ఫడ్ అదిరింది. పది నిమిషాలు రెస్ట్ తీసుకుని, లేచి ఫ్రెషప్ అయ్యి, అప్పుడు స్టార్ట్ చేస్తాను’ అన్నాడు ఉత్సాహంగా.
తన గదిలోకి వెళ్లాడు. చుట్టూ ఎన్నో పెయింటింగ్స్ పేర్చబడి ఉన్నాయి. గొప్పగొప్ప నిర్మాణాలు, ప్రకృతి, ప్రముఖ వ్యక్తులు, రంగుల మయం ఆ గది. ఒక పక్కగా నేల మీద పరుపు. నడుము వాల్చాడు. చిన్న కునుకు పట్టింది. మూడు వైపులా కిటికీలు. పరదాలు గాలికి ఎగురుతున్నాయి. గణపతికి నిద్రలో కూడా ఏవో ఇమేజెస్ కదులుతున్నాయి. రెపరెపలాడుతున్న అందాల రాశి కళ్లు. తేనెలూరుతున్న లిప్‌స్టిక్ పెదవులు, నున్నటి భుజాలు, సుడులు తిరిగినట్లున్న నాభి, గులాబీ రంగు మేనిఛాయ, మృదువైన చేతివేళ్లు. వాటి చివర లేత నీలిరంగు నెయిల్ పాలిష్ గోళ్లు. వజ్రాల్లాంటి ఆమె పళ్లు మెరుస్తుంటే, తన మీదకి చిరునవ్వుల జల్లులు కురిపిస్తున్నట్లు అనిపించడంతో, ఠక్కున లేచి కూర్చున్నాడు. కాన్వాస్ వైపు కదిలాడు.
పెన్సిల్ అందుకున్నాడు.
ఒక రకమైన తపోద్వేగంతో స్కెచ్ వెయ్యడం ప్రారంభించాడు గణపతి. కొన్ని రఫ్‌లైన్స్‌లో ఒక అప్సరసా శిరోమణి రూపుదిద్దుకుంటున్నట్లు అనిపించింది. పెన్సిల్ పక్కన పెట్టి, గదిలోంచి బైటికొచ్చాడు.
‘వేడివేడి టీ రెడీ బాస్...’ అన్నాడు సేతుపతి. చెక్కతో చిన్నచిన్న వీణలు తయారుచేస్తున్న పనిలో బిజీగా ఉంటూనే.
‘ఓహ్. థాంక్స్‌రా. బావర్చి బిరియానీ పని చేస్తోంది. గొప్ప ఐడియా వచ్చింది. వారం, పది రోజుల్లో అయిపోతుంది...’ అంటూ లోపలకెళ్లి, మొహం కడుక్కుని, ఫ్లాస్క్‌లోని టీ కప్పులో పోసుకుని, ఒక సిగరెట్ వెలిగించుకుని, కుర్చీలో కూర్చున్నాడు. సేతుపతి మాట్లాడించలేదు. గణపతి అసలు ఈ లోకంలోనే ఉన్నట్లు లేడు. టీ తాగేసి, సిగరెట్ బట్‌ని యాష్‌ట్రేలో పడేసి, తన గదిలోకి వెళ్లిపోయాడు.
కుడివైపున ఉన్న సరోజినీ దేవి నాయుడు పెయింటింగ్‌లోని కళ్లు నవ్వుతూ పలకరించాయి. రబీంద్రనాథ్ ఠాగూర్ తెల్లని గడ్డం గాలికి కదులుతున్నట్లు అనిపించింది. ఆ వెనకగా వున్న మంచు పర్వతాల పెయింటింగ్‌లో మంచు కరుగుతున్న భావన కలిగింది. అమలాపురం చిత్రకళ పోటీలో ఫస్ట్ ప్రయిజ్ వచ్చిన కనకదుర్గ సింహం జూలు దులిపినట్లు గోచరించింది. కలర్స్ మిక్స్ చేసుకున్నాడు. బ్రష్ అందుకున్నాడు. ప్రిన్స్‌టన్ ఫ్లాట్ బ్రష్.
గణపతి చేతి వేళ్లు లయబద్ధంగా కదులుతున్నాయి. చిన్ననాటి నుంచి రంగులతో అనుబంధం. బొమ్మలతో బాంధవ్యం. బ్రష్షులతో ఆత్మీయత.
‘చదువు మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి వుంటే గొప్ప డాక్టరో, ఇంజనీరో అయ్యుండేవాడు. కానీ వాడికి ఇదే పిచ్చి... ఎవరు చెప్పినా వినడు...’ అమ్మ ఆందోళన. కానీ గణపతి ఇంటర్ పూర్తి చేసి, బి.కాంలో జాయిన్ అయిన కొన్ని రోజులకే సెరబ్రల్ హెమ్మరేజ్‌తో కన్ను మూసింది. యిక చెప్పేవాళ్లు ఎవరూ లేరు. గణపతి తండ్రి ఒకరోజు రేఖ అనే స్ర్తిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఒంటరితనం భరించడం తన వల్ల కాదని, తనలాగే బ్యాంక్‌లో మరో బ్రాంచ్‌లో ఉద్యోగం చేస్తున్న రేఖకి భర్త లేడని, ఆమెను చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పినప్పుడు, తనకి చెప్పి చేసుకోవాలని అనుకుంటున్న అతని సంస్కారం గణపతిని నిరుత్తరుడిని చేసింది. అమ్మ స్థానంలో రేఖని తను అంగీకరించలేక తటస్థంగా ఉండిపోయాడు. రేఖ కూతురు తనని అన్నగా అంగీకరించలేక పోయింది.
ఒక పథకం ప్రకారంగా వాళ్లకి అడ్డు తొలగిపోయి బైటికొచ్చినప్పుడు, ఎలాగైనా బ్రతికేయొచ్చుననే తన నమ్మకం వమ్ము కావటంతో, అయోమయావస్థలో చిక్కుకున్న గణపతి రకరకాల పెయింటింగ్ వర్క్స్ చేసి చేసి విసిగి
వేసారిపోయాడు. సేతుపతి అతన్ని అర్థం చేసుకుని, తనతోపాటు వుండమని చెప్పాడు. దేవుడిచ్చిన వరం సేతుపతి. తనని, తనలోని కళాకారుడిని అతనెంతగానో గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు.
రోజులు గడుస్తున్నాయి.
గణపతి ఊహా ప్రపంచంలోంచి ఒక అపురూప సౌందర్యరాశి కాన్వాసు మీద ఊపిరి పోసుకుంటోంది. ఏవో స్నాక్స్ అందించడానికి గదిలోకొచ్చిన సేతుపతి, ఆనందాతిశయంతో అరిచినంత పని చేశాడు.
‘అరే బాప్‌రే! కళ్ల ముందు ఒక దేవత ప్రత్యక్షమైనట్లుంది గణపతీ!’ అన్నాడు.
‘ఇంకా ఎక్కడ? పది శాతం కూడా పూర్తి కాలేదు. యింకా చాలా డిటెయిల్స్ వర్క్ ఔట్ చెయ్యాలి...’ అన్నాడు గణపతి.
అనుకున్న దానికంటే ఎక్కువ టైం తీసుకుంటోంది. యింకా పది రోజులు కూడా లేవు.
మెడ నుంచి కింద వరకు వచ్చాడు. వక్షోజాల స్వరూపానికి నగిషీలు చెక్కుతుంటే, బ్రష్ కాస్త వణికినట్లు అనిపించింది. పని ఆపి, పచార్లు చేశాడు. బైటికెళ్లి గాలి పీల్చుకుని వచ్చాడు. సేతుపతి బిజీగా వున్నాడు. ఉదయం వెళ్లి రాత్రి ఇంటికొస్తున్నాడు. అమృత మెస్‌లో నెలకి సరిపడా మీల్స్ టోకెన్స్ కొని యింట్లో పెట్టడంతో, సమయానికి వెళ్లి భోజనం చేస్తున్నాడు. వీధి చివర ఇరానీ రెస్ట్‌రెంట్‌లో సమోసా, టీ ఎప్పుడంటే అప్పుడు. ఫ్లాస్క్‌లో మూడు నాలుగు కప్పుల టీ పోయించుకుని వస్తే రోజంతా గడిచిపోతుంది. హల్దీరాం భుజియా, చేగోడీలు, దాల్‌మోట్ ప్యాకెట్స్ ఉండనే వున్నాయి. మధ్యమధ్యలో సిగరెట్ మంచి కంపెనీ ఇస్తుంది.
అహోరాత్రులూ శ్రమించి, యింకా మూడు రోజులు మాత్రమే గడువు వుందనగా, తను వేస్తున్న వర్ణచిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. కానీ గణపతికి ఇంకా సంతృప్తి కలగటం లేదు. కలర్ కాంబినేషన్ బావుంది. ఆ అందాల రాశి స్కిన్ టింట్ అద్భుతంగా వచ్చింది. చేతి వేళ్లు, కాలి గోళ్లు, ఒంపులు, సొంపులు, నడుము దగ్గర ముచ్చటైన మలుపు, అన్నీ నగిషీలు చెక్కాడు. లైఫ్‌సైజ్ పెయింటింగ్ కావడంతో, సజీవంగా కనిపిస్తోంది.
అర్ధరాత్రి ఇంటికొచ్చిన సేతుపతి ఆ చిత్రాన్ని చూసి ఆనంద పారవశ్యంతో ఊగిపోయాడు.
‘నువ్వు బ్రహ్మవిరా గణపతి. బ్రహ్మ కూడా యింత అందమైన అమ్మాయిని సృష్టించలేదనిపిస్తోంది. ఆ మొహం చూస్తుంటే, ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. ఆ పెదవుల మెరుపులు చూస్తుంటే - హఠాత్తుగా నిన్ను ప్రియా అని పిలుస్తుందేమో అనిపిస్తోంది. అణువణువునా ఆడతనం ఎంత అపురూపంగా కనిపిస్తోందో!’ అన్నాడు సేతుపతి.
గబగబా అతన్ని గదిలోంచి బైటికి లాక్కొచ్చాడు గణపతి.
‘ఊహుఁ.. ఇంకా పూర్తి కాలేదు. యింకా ఏదో కావాలి...’
‘ఇంకేం కావాలి? ఆభరణాలు లేవు, మెరుపులు చెక్కడానికి. ఒంటి మీద నూలుపోగు లేదు. రంగులు అద్దడానికి. అద్భుతమైన అందాల రాశి అలాగే పెయింటింగ్‌లోంచి బైటికి వచ్చిందనుకో, నగరంలో కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది...’ నవ్వుతూ అన్నాడు సేతుపతి.
తలుపులు తెరిచే ఉన్నాయి.
‘ఆహా.. మట్టి వాసన.. ఈ రోజు పెద్ద వర్షం పడటం ఖాయం..’
‘ఐతే పద. భూపతి వేడివేడి మిర్చీ బజ్జీలు వేస్తూ ఉంటాడు. నాలుగు లాగించి వస్తే నీ బ్రష్‌కి మంచి ఊపొస్తుంది!’ అన్నాడు సేతుపతి.
ఇంటికి తాళం వేసి, ఇద్దరూ నడుచుకుంటూ, సెంటర్‌లోని భూపతి బండి దగ్గరికి కదిలారు. ఒక్కసారిగా పెద్ద గాలి. ఎవరినో భయపెట్టడానికన్నట్లు హోరుగా, జోరుగా. వర్షం మొదలుకాలేదు గానీ, మెల్లిగా మేఘాలు క్రమ్ముకుంటున్నాయి.
భూపతి బండి మీద మిర్చీ బజ్జీలు మహత్తరంగా ఉంటాయి.
‘ప్రతీదీ ఆర్టేరా! వాడి చేతులు చూడు. ఎంత లాఘవంగా కదులుతున్నాయో. పిండి కలపడం లోనే వాడి ప్రతిభ తెలుస్తుంది. అదిగో ఆ బజ్జీల్లోంచి తొంగి చూస్తున్న మసాలాలోనే వాడి ప్రావీణ్యత దాగి ఉంది...’
చెరో నాలుగు బజ్జీలు తిని, టీ తాగి, ఇంటికి చేరుకున్నారు.
తలుపులు తెరవగానే గణపతి గుండె గుభిల్లుమంది. గాలి ఇంట్లోకి కట్టలు తెంచుకుని వచ్చింది. తన గదిలోకి పరుగుతీశాడు.
‘సేతూ!’ అని గట్టిగా అరిచాడు. అనుకున్నంతా అయ్యింది. గదంతా చెల్లాచెదురయ్యింది. పెయింటింగ్స్ అన్నీ జారి కింద పడిపోయాయి. ఇద్దరూ కలిసి, వాటిని జాగ్రత్తగా ఒక్కొక్కటీ తీశారు. తను వేసిన పెయింటింగ్‌ని నిలబెట్టాడు గణపతి. రంగు సీసాలన్నీ పగిలిపోయి, రంగులన్నీ పెయింటింగ్ మీద వొలికిపోవటంతో, నగ్నంగా వున్న ఆ అందాల రాశికి ప్రకృతి రంగురంగుల వస్త్రం తొడిగినట్లు అనిపించింది సేతుపతికి.
కానీ, గుండె పగిలినట్లు ఏడుస్తూ కుప్పకూలిపోయాడు గణపతి.
‘అయిపోయిందిరా. అంతా నాశనం అయిపోయింది. నలభై రోజుల నా శ్రమంతా వృధా అయిపోయింది!’ అని చిన్నపిల్లవాడిలా రోదిస్తున్నాడు.
సేతుపతి అతన్ని కదిలించలేదు. ఆ పెయింటింగ్ వంకే తదేకంగా చూస్తున్నాడు.
* * *
నవంబర్ ఐదో తారీఖు.
తలుపు చప్పుడయ్యింది.
రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. సంతకం పెట్టి తీసుకున్నాడు గణపతి.
బంబుల్‌బీ ఇంటర్నేషనల్ నించి వచ్చిన ఉత్తరం.
‘గాడ్స్ గిఫ్ట్’ అనే పెయింటింగ్‌కి ఫస్ట్ ప్రయిజ్ వచ్చినట్లు శుభ వర్తమానం.
షాక్ అయ్యాడు గణపతి. ఆ పేరుతో తను ఏ పెయింటింగూ పంపలేదే! అసలు తను పెయింటింగ్ పంపించనే లేదే!
తలతిప్పి చూశాడు. సేతుపతి అలసిపోయి నిద్రపోతున్నాడు.
‘సేతూ! సేతూ!’ అరిచాడు ఆవేశంగా. ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు సేతుపతి.
‘ఏంటిరా ఇది! నేనేమిటి? గాడ్స్ గిఫ్ట్ అనే పెయింటింగ్ వెయ్యడం ఏంటి? నాకు ఫస్ట్ ప్రయిజ్ రావడం ఏంటి?’
సేతుపతి చిరునవ్వు నవ్వాడు, ఒక యోగిలా.
‘నువ్వు వేసిన పెయింటింగేరా! అంత అందమైన అమ్మాయికి ఒంటి మీద నూలు పోగులేకుండా చేసినందుకు, నువ్వు వేసిన మిగతా పెయింటింగ్స్‌లోని మహానుభావులు, ప్రకృతిని ఆవాహన చేశారు. వాయుదేవుడు నీ రంగులందుకుని, నీ కళాఖండానికి కొసమెరుపు దిద్దాడని నాకు అనిపించింది. నీకు చెప్తే ఒప్పుకోవని, దామోదర్‌గారిని కలిసి, ఎంట్రీ ఫీజు కట్టి, బంబుల్‌బీ ఇంటర్నేషనల్ పోటీకి పంపించేసాం...’
గణపతి కళ్లల్లోంచి ఆనందభాష్పాలు.
‘ఇంతకీ దానికి పేరు పెట్టిందెవరో తెలుసా? నేనే! కొసమెరుపు దిద్దింది దేవుడే కదా. అందుకే దేవుడిచ్చిన వరం అని చెప్పాను. దామోదర్‌గారు అద్భుతం అన్నారు. అంతే!’
గట్టిగా సేతుపతిని కౌగిలించుకున్నాడు గణపతి.
‘నువ్వు! నువ్వురా నాకు దేవుడిచ్చిన వరం!’ ఆనంద పారవశ్యంతో అన్నాడు.

వి.యస్.పి.తెనే్నటి 9959091236