S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేరే దారి లేదు ( విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

‘నువ్వు లాకర్‌ని తెరవగలవా ఎడ్డీ?’ వారెన్ ప్రశ్నించాడు.
వారెన్ అండ్ కోల్స్ ఫార్మాస్యుటికల్స్ కంపెనీకి వారెన్ ప్రెసిడెంట్. బూడిద రంగు సూట్‌లోని వారెన్, ఆఫీస్‌లోని తన ప్రైవేట్ రూమ్‌లో ఖరీదైన బల్ల వెనుక కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా కూర్చుని ఉన్న ఎడ్డీ గోధుమ రంగు చవక సూట్‌ని ధరించాడు.
వారెన్ వెనక ఉన్న గోడలోని పెద్ద సేఫ్‌ని చూసి ఎడ్డీ చెప్పాడు.
‘అది మంచి లాకర్. ఐతే నేను తెరవలేని లాకర్ కానీ, సేఫ్ కానీ, వాల్ట్ కానీ లేదు. కానీ నేను వీటిని తెరవడం మానేశాను మిస్టర్ వారెన్. గత రెండేళ్లుగా నేను దొంగతనాలు మానేసాను’
‘ఈ రోజు నించి వారం తర్వాత రెండు లక్షల ఏభై వేల డాలర్ల నగదు ఈ సేఫ్‌లో ఉంటుంది. దాన్ని నేను దొంగిలించదల్చుకున్నాను. లాకర్‌ని తెరవడానికి నీ సహాయం అవసరం’
‘ఇది చెడ్డ జోక్!’ ఎడ్డీ ఆశ్చర్యంగా చెప్పాడు.
‘జోక్ కాదు. నీ గురించి వాకబు చేయడానికి నాకు కొంత సమయం పట్టింది’ వారెన్ చెప్పాడు.
‘మీ శ్రమ వృధా అని తెలుసుకోండి’ ఎడ్డీ లేచి నిలబడి చెప్పాడు.
ఎడ్డీ తలుపు దాకా వెళ్లి దాన్ని తెరిచే ప్రయత్నం చేశాడు. కానీ తెరుచుకోలేదు.
‘అది ఎలక్ట్రిక్ రిలీజ్ పద్ధతిలో తెరుచుకుంటుంది’
‘దయచేసి తలుపు తెరవండి..’ ఎడ్డీ కోరాడు.
‘కూర్చో ఎడ్డీ. ఈ దొంగతనానికి నేను జాగ్రత్తగా పథకం వేశాను. రెండురోజుల క్రితం రెస్టారెంట్‌లోని ఓ వ్యక్తికి తీసుకెళ్లి ఇవ్వమని నీకో పేకెట్ ఇచ్చాను. గుర్తుందా?’
‘గుర్తుంది’
‘అందులో డ్రగ్స్ ఉన్నాయి. నువ్వు ఆ పేకెట్‌ని ఇచ్చిన వ్యక్తి రోడ్డు మీద డ్రగ్స్ అమ్మే వ్యక్తి. నీ మీటింగ్‌ని ఫొటోలు తీశాను. వాటిని పోలీసులకి పంపితే నీ పెరోల్ రద్దవుతుంది. మళ్లీ జైలుకి వెళ్తావు. అలాంటి వారిని కలవడం పెరోల్ నిబంధనలని అతిక్రమించడమే. నేను చెప్పిన దానికి నువ్వు నిరాకరించే అవకాశం ఉందని ఆ జాగ్రత్త తీసుకున్నాను’
ఎడ్డీ తలుపు దగ్గరే కదలకుండా నించున్నాడు. ఏమీ మాట్లాడలేదు.
‘పెరోల్ నిబంధనని అతిక్రమించకూడదనేగా నువ్వు నేను చెప్పింది నిరాకరించింది? అంతకు ముందే నిన్ను ఆ కారణంగా జైలుకి పంపగలను. నేను చెప్పింది చెయ్యి. లేదా జైలుకి వెళ్లు’
ఎడ్డీ వచ్చి నిస్పృహగా అతని ఎదురుగా కూర్చున్నాడు.
‘నీకు నేను చెప్పింది చేయడం తప్ప వేరే దారి లేదు’
‘పట్టుబడితే ఈసారి నేను జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది’
‘లేదా ఇంకొంతకాలం’ వారెన్ అంగీకారంగా చెప్పాడు.
‘నాకు వేరే దారి లేదన్నమాట?’ ఎడ్డీ ప్రశ్నించాడు.
‘నాకు తెలిసి లేదు’ వారెన్ మొహంలోని నవ్వు మరింత పెరిగింది.
‘మిస్టర్ వారెన్! నా జీవితంలోని సగం రోజులు జైల్లోనే గడిపాను. ఆరు అరెస్టులు, మూడుసార్లు జైలు. జైలు జీవితం గురించి మీకు అవగాహన లేదు. పట్టుబడితే...’ ఎడ్డీ ఆపేశాడు.
‘నీ తెలివిని నా తెలివితో పోలుస్తున్నావా ఎడ్డీ? నేను చక్కటి పథకాన్ని వేసానని చెప్పాగా? మనిద్దరిలో ఎవరూ పట్టుబడరు. ఇది భద్రంతో కూడిన దొంగతనం’
‘పూర్తి వివరాలు చెప్పండి’
‘నేను అనుమానితుడ్ని కాకపోవడానికి గల కారణాలు, దొంగతనానికి నాకు కారణం లేదు. ధనవంతుడ్ని. ఎలాంటి అప్పులు కానీ, ఆర్థిక నష్టాలు గానీ లేవు. జూదం ఆడను. బ్రహ్మచారిని. ఆడవాళ్లతో ఎలాంటి సమస్య లేదు. అందువల్ల నాకు నగదు అవసరం ఎంత మాత్రం లేదు’
‘అలాంటప్పుడు ఎందుకు?’
‘ఓ కారణం ఉంది కానీ అది ఎవరికీ తెలీదు. తెలిసేసరికి రుజువు ఉండదు. ప్రస్తుతం ననె్నవరూ అనుమానించరు’
‘నా సంగతి ఏమిటి? పోలీసుల రికార్డుల్లో సేఫ్‌లు పగులగొట్టే దొంగని. నా మోడస్ ఆపరెండీని బట్టి అది నా పనని వాళ్లు గ్రహిస్తారు’ ఎడ్డీ చెప్పాడు.
‘నీకో ఎలిబీ ఉంటుంది. మోడస్ ఆపరెండీని కొద్దిగా మారిస్తే చాలు. నేను నీకో సహాయం కూడా చేయగలను’
‘ఏమిటది?’
‘నేను ఆఫీస్‌కి వచ్చినప్పుడు దొంగతనం పూర్తయి, దొంగ పారిపోవడం చూస్తాను. పోలీసులకి దొంగని వర్ణిస్తాను. అది నీది కాదు. పోలీసులు ఇన్సూరెన్స్ కంపెనీ నీ ఎలిబీని పరిశీలించాక నా వర్ణన మీద అనుమానపడరు. ఈ లోకంలో లేని దొంగ కోసం వాళ్లు వెదుకుతూంటారు. ఆ డబ్బుని ఎప్పటికీ కనుక్కోలేరు’
‘ఐతే నన్ను పోలీసులు అనుమానించరు అంటారా?’ ఎడ్డీ అడిగాడు.
‘అవును’
‘మీకు నా అవసరం ఏమిటి? మీరే దొంగతనం చేయచ్చుగా?’
‘పోలీసులకి నిజమైన దొంగతనం ఏదో తెలుస్తుంది. ఆ లాకర్ కాంబినేషన్ నాకు, నా భాగస్వామికి మాత్రమే తెలుసు. ప్రొఫెషనల్ దొంగ అది చేశాడని అంతా అనుకోవాలి’
‘మీరు నాకెంత ఇస్తున్నారు?’
‘నువ్వు మళ్లీ జైలుకి వెళ్లకపోవడమే నీ లాభం’
ఎడ్డీ మొహంలో స్వల్పంగా కోపం కనిపించింది. లేచి నిలబడి చెప్పాడు.
‘సరే. నాకో రోజు ఇవ్వండి. నా భార్యకి చెప్పి పథక రచనని చేయాలి’
‘సరే. ఒక్కరోజే’ వారెన్ అంగీకరించాడు.
* * *
ఓ చవక అద్దె అపార్ట్‌మెంట్‌లోని లివింగ్ రూంలో ఎడ్డీ తన భార్యకి వారెన్ చెప్పింది వివరించాడు. గత రెండేళ్లుగా నిజాయితీగా సంపాదిస్తూండడంతో వాళ్ల జీవితం బొటాబొటీగా సాగుతోంది.
‘మనకి వేరే దారి లేదు గ్రేస్’ ఎడ్డీ చెప్పాడు.
‘ఇది చేయకుండా తప్పించుకోలేవా?’ గ్రేస్ ప్రశ్నించింది.
‘నేను దొంగతనం చేసి జైలుకి వెళ్లకపోవచ్చు. కానీ చేయకపోతే మాత్రం తప్పనిసరిగా వెళ్తాను’
‘పట్టుబడకుండా ఆ పని చేయగలవా?’
‘చేయగలను’ ఎడ్డీ తల ఊపి చెప్పాడు.
‘తర్వాత వారెన్ నిన్ను ఇబ్బంది పెడితే?’ గ్రేస్ భయంగా అడిగింది.
‘అతను లోభి మాత్రమే. నన్ను ఇబ్బంది పెడితే, అతను కోల్పోయేది చాలా ఉంది’
‘నీ పాత జీవితమే బావుండేది. కావలసినంత డబ్బుతో హాయిగా జీవించేవాళ్లం. నువ్వు జైల్లో లేనప్పుడు’
‘ఈసారి జైలుకి వెళ్లను’
‘వారెన్ నీకు వేరే దారి లేకుండా చేశాడు’
‘అవును. మనిద్దరికీ టిక్కెట్లు కొంటున్నాను. అందుకు సరిపడే డబ్బు మాత్రమే వారెన్ మనకి ఇచ్చాడు’ ఎడ్డీ చెప్పాడు.
* * *
వారెన్, ఎడ్డీ ఓ హోటల్ గదిలో కలుసుకున్నారు. ఇద్దరూ రావడం ఎవరూ చూడలేదు.
‘సోమవారం రాత్రికల్లా ఆ డబ్బు లాకర్‌లో ఉంటుంది. శనివారం రాత్రి నువ్వు నీ భార్యతో కలిసి నేను చెప్పిన రిసార్ట్‌కి వెళ్తావు. హోటల్లో గది తీసుకుని సెలవులు గడపడానికి వచ్చేవారు ప్రవర్తించినట్లు ప్రవర్తించండి. సోమవారం రాత్రి నువ్వు కారులో బయలుదేరు. నువ్వు ఇంకా రిసార్ట్‌లోనే ఉన్నట్లుగా నీ భార్య ప్రవర్తిస్తుంది. నువ్వు అక్కడి నించి వెళ్లడం, తిరిగి రావడం ఎవరూ చూడకపోతే పోలీసులు నిన్ను అనుమానించరు. వాళ్ల దృష్టికి నువ్వు వచ్చినా ఎలిబీ వల్ల, నేను చెప్పే దొంగ వర్ణనవల్లా నిన్ను ప్రశ్నించి వదిలేస్తారు’
‘నేను ఎవరూ చూడకుండానే వచ్చి వెళ్తాను. గ్రేస్‌కి ఏం చేయాలో తెలుసు’ ఎడ్డీ చెప్పాడు.
‘మంచిది. నువ్వు మా ఆఫీస్‌కి వచ్చాక ఎంత సేపట్లో పని పూర్తి చేస్తావు?’
‘సుమారు గంటన్నర. సాధారణంగా నేను నైట్రో పేలుడు పదార్థాన్ని ఉపయోగిస్తాను. ఈసారి మాత్రం డ్రిల్ చేసి మోడస్ ఆపరెండీని మారుస్తాను’
‘ఆఫీసులో పని ఉందని, సోమవారం రాత్రి వెళ్తానని నా భాగస్వామికి ముందే చెప్తాను. ఆఫీస్‌కి వచ్చాక లాకర్ పగలగొట్టబడిందని, దొంగ పారిపోవడం చూశానని తప్పు వర్ణన ఇస్తాను’
‘వాచ్‌మేన్ గురించి ఏమిటి?’
‘లాబీలో ఓ వాచ్‌మేన్. ఆఫీస్ చుట్టూ తిరిగే ఇంకో వాచ్‌మేన్. వారి టైమ్ షెడ్యూల్‌ని నీకు ఇస్తాను. వాళ్ల సంగతి నువ్వే చూసుకోవాలి’
‘అది నా పని. వాళ్లతో నాకు ఇబ్బంది ఉండదు’
‘లాకర్‌కి అలారం ఉంది. అది సెక్యూరిటీ కంపెనీ ఆఫీస్‌లో మోగుతుంది’
‘అలారం మోగకుండా చూసుకునే బాధ్యత కూడా నాదే. ఆ డబ్బు దొంగిలించాక నేను ఏం చేయాలి?’ ఎడ్డీ అడిగాడు.
‘బస్టాండ్‌కి వెళ్లి ఓ పబ్లిక్ లాకర్‌లో ఉంచి తాళం వేయి. తర్వాత ఆ తాళం చెవిని అక్కడ పార్క్ చేసి ఉన్న కారులో ఉంచు. దాని నెంబర్ నీకు ఇస్తాను. ఆ కారుకి, నాకు ఎలాంటి సంబంధం లేదు’
‘సరే. నేను డబ్బుతో వెళ్లిపోయిన అరగంటదాకా మీరు పోలీసులకి ఫోన్ చేయకూడదు. నాకు డబ్బు దాచి, తిరిగి రిసార్ట్‌కి బయలుదేరడానికి అంత సమయం కావాలి’ ఎడ్డీ కోరాడు.
‘అలాగే. అంతకు మించి ఎక్కువ టైం ఇవ్వను. ఎందుకంటే ఓ వాచ్‌మేన్ ప్రతీ రెండు గంటలకి నేను అక్కడ ఉన్నానా లేదా అని చెక్ చేస్తూంటాడు’
‘సరే. ఆ తర్వాత మనం మళ్లీ కలవం కదా?’ ఎడ్డీ అడిగాడు.
‘ఆ అవసరం లేదు. కాబట్టి కలవం. పథకం ప్రకారమే అంతా సాగుతుంది ఎడ్డీ. అధైర్యపడకు’ వారెన్ ధైర్యం చెప్పాడు.
* * *
సోమవారం సాయంత్రం ఐదు తర్వాత వారెన్ తన వ్యాపార భాగస్వామి జార్జ్‌తో ఆఫీస్‌లో ఆ రాత్రి లేట్‌గా పని చేస్తానని చెప్పాడు.
‘నేను నాటకానికి టిక్కెట్లు కొన్నాను. కాబట్టి రాలేను’ జార్జ్ నవ్వుతూ చెప్పాడు.
వెనక్కి తిరిగిన వారెన్ నవ్వుని జార్జ్ గమనించలేదు.
ఆ సాయంత్రం ఆరున్నరకి వాచ్‌మేన్ వారెన్ గది దగ్గరికి వచ్చాడు. పని చేసుకుంటున్న వారెన్‌ని చూసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎనిమిదిన్నరకి, పదిన్నరకి మళ్లీ వస్తాడు. ఎడ్డీ ఎనిమిదిన్నరకి దొంగతనానికి వస్తాడు.
వారెన్ ఆ రాత్రి ఏడు గంటలకి సేఫ్‌ని తెరిచి అందులోని రెండున్నర లక్షల డాలర్లని ఓ సూట్‌కేస్‌లో పెట్టి దానికి తిరిగి తాళం వేసి అలారాన్ని సెట్ చేశాడు. ఆ సూట్‌కేస్‌ని వెనక మెట్ల మీంచి, వెనక ఉన్న స్టోర్ రూంలోకి తీసుకెళ్లాడు. అందులోంచి బయటికి వచ్చి, వెనక సందులోని తన కారు డిక్కీలో దాన్ని ఉంచి, మళ్లీ అదే దారిలో ఆఫీస్‌కి వచ్చాడు. అతన్ని ఎవరూ చూడలేదు.
ఆఫీస్‌లో ఎనిమిది దాకా వేచి ఉండి, టోపీ పెట్టుకుని కింద లాబీలోకి వెళ్ళాడు.
‘మళ్లీ పదిన్నరకి వస్తాను’ తలుపు దగ్గర వాచ్‌మేన్‌కి చెప్పాడు.
వారెన్ నెమ్మదిగా కారుని మైలు దూరంలోని ఓ కొలను దగ్గరికి పోనించాడు. అంతకు మునుపే, అతను తవ్విన గోతిలో ఆ సూట్‌కేస్‌ని పాతిపెట్టాడు. తిరిగి కార్లో ఆఫీస్‌కి చేరుకుని ఓ చోట దాక్కున్నాడు.
ఎనిమిదిన్నరకి ముందు ఓ చిన్న కారు ఆఫీస్ వెనక సందులో ఆగింది. అందులోంచి ఎడ్డీ దిగడాన్ని వారెన్ దూరం నించి చూశాడు. అతని చేతిలో పెద్ద నల్ల సంచీ ఉంది.
వారెన్ ఎనిమిదిన్నరకి కెమిస్ట్రీ సొసైటీ మీటింగ్‌కి హాజరై పది ఇరవై దాకా అక్కడే ఉండి, ఆఫీస్‌కి బయలుదేరాడు. వాచ్‌మేన్‌ని గ్రీట్ చేసి తన ఆఫీస్ గదిలోకి వెళ్లాడు. అతని ప్రైవేట్ గదిలోని లాకర్ తలుపు తెరిచి ఉంది. దానికి చేసిన రంధ్రాలు కనిపించాయి. వెనక కిటికీ లోంచి కిందకి వేలాడే తాడు కూడా కనిపించింది. వెంటనే వారెన్ అరిచాడు.
‘పట్టుకోండి! దొంగ’
ఇద్దరు వాచ్‌మేన్‌లు ఆ అరుపులకి ఆ గదిలోకి పరిగెత్తుకు వచ్చారు. వారెన్ కిటికీ వంక చూపిస్తూ చెప్పాడు.
‘ఆ తాడు పట్టుకుని వెళ్లాడు. పొడుగ్గా, లావుగా, నల్లగా ఉన్నాడు. పోలీసులకి ఫోన్ చేయండి’
ఓ వాచ్‌మేన్ ఫోన్ దగ్గరికి, మరొకడు లాకర్ దగ్గరికి వెళ్ళారు.
‘అందులో విలువైనవి ఏమైనా ఉన్నాయా సార్?’ అతను అడిగాడు.
‘ఉన్నాయి. రెండున్నర లక్షల డాలర్లు’
తన మొహంలోని చిరునవ్వు కనపడకుండా లాకర్ వైపు తల వంచాడు. పది నిమిషాల్లో వచ్చిన పోలీసులు వారెన్ చెప్పింది విన్నారు. క్లూటీమ్ ఆ గదిలో ఆధారాల కోసం వెదికారు.
‘ఓ మీటింగ్ నించి ఇక్కడికి వచ్చి చూస్తే, లాకర్ తలుపు తెరిచి కనిపించింది. కిటికీలోంచి తాడు కనిపించడంతో అక్కడికి వెళ్తే, తాడుని వదిలి నేల మీదికి దూకిన ఆ దొంగ కనిపించాడు. పొడుగ్గా, లావుగా, నల్లగా ఉన్నాడు. ఆకుపచ్చ ఆర్మీ యూనిఫాం లాంటిది ధరించాడు. భుజాన సంచీలో బహుశా డబ్బు ఉండి ఉండాలి’
గంట తర్వాత పోలీసుల అనుమతితో వారెన్ ఆఫీస్ నించి సరాసరి ఇంటికి వెళ్లి స్కాచ్ సోడా కలుపుకుని, కుర్చీలో కూర్చుని దాన్ని తాగసాగాడు.
అతను అది తాగడం పూర్తి చేసేసరికి గదిలోని ఫోన్ మోగింది. ఎడ్డీ నించి.
‘నిజమే. నిన్ను నమ్మలేక డబ్బుని ముందే తీసేసుకున్నాను. గుడ్‌బై ఎడ్డీ. మన ఒప్పందం ముగిసింది. మళ్లీ ఈ నంబర్‌కి ఫోన్ చేయక. నీకు వ్యతిరేక సాక్ష్యం నా దగ్గర ఉందని మాత్రం మర్చిపోకు’ చెప్పి రిసీవర్ పెట్టేశాడు.
పోలీసులు కొద్ది వారాలు పరిశోధిస్తారు. తన ఆర్థిక వ్యవహారాలు గురించి కూడా పరిశోధిస్తారు. వాళ్లకి అనుమానించాల్సింది ఏదీ దొరకదు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు కూడా తనని అనుమానిస్తారు. కానీ, తనని దొంగగా భావించడానికి వాళ్లకి సరైన కారణం దొరకదు.
అతను ఆలోచనల్లో ఉండగా డోర్ బెల్ మోగింది. తలుపు తెరిస్తే ఎదురుగా యూనిఫాంలోని పోలీసులు.
‘మీ ఇల్లు రొటీన్‌గా వెదకాలి’ కోరారు.
‘తప్పకుండా. నాకు దాచడానికి ఏమీ లేదు కాబట్టి సెర్చ్ వారెంట్ ఉందా అని కూడా అడగను’ చెప్పి వారెన్ పక్కకి తప్పుకున్నాడు.
వారు ఇంటిని క్షుణ్ణంగా వెదుకుతూంటే, ఆ డబ్బు కానీ, దొంగ కానీ ఎప్పటికీ వాళ్లకి దొరకవని భావించాడు. కొన్ని నెలల తర్వాత ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆ కేసుని పక్కన పెడతారు. దొంగ పేరుతో నెమ్మదిగా, జాగ్రత్తగా ఆ డబ్బుని షేర్లలో పెట్టుబడి పెట్టి, కొనే్నళ్ల తర్వాత తన పార్ట్‌నర్ భాగాన్నికూడా కొనేసి, మొత్తం వ్యాపారాన్ని తన పరం చేసుకుంటాడు. పేపర్ మీద తనకి వచ్చిన అనేక లాభాల్ని ఎవరూ ప్రశ్నించలేరు. తన వర్ణనకి సరిపడే లాకర్ల దొంగ ఒకవేళ పోలీసులకి చిక్కినా అతనికి ఎలిబీ లేని పక్షంలో అరెస్ట్ అయి శిక్ష కూడా పడచ్చు.
‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ’ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
‘ఆ డబ్బు మా ఇంట్లో దొరకనందుకు నేను కూడా సారీ!’ వారెన్ నవ్వుతూ చెప్పాడు.
* * *
మూడు నెలల తర్వాత పోలీసులు వారెన్ గురించి అతనికి తెలిసిన వాళ్లని ప్రశ్నించడం ఆపేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇనె్వస్ట్‌గేటర్ వారెన్ అండ్ కోల్స్ కంపెనీకి రావడం కూడా ఆపేశాడు. ఈ మూడు నెలలు వారెన్ ఎప్పటిలానే రొటీన్ జీవితాన్ని మచ్చలేని విధంగా గడపసాగాడు.
వారెన్ ఇచ్చిన వర్ణనకి తగిన ఏ దొంగనీ పోలీసులు అరెస్టు చేయలేక పోయారు. పోలీసులు తమకి తెలిసిన లాకర్ దొంగలందర్నీ పిలిపించి ప్రశ్నించారు - ఎడ్డీతోసహా. ఎడ్డీ ఎలిబీని పరిశీలించాక అతని పేరుని అనుమానితుల జాబితాలోంచి కొట్టేశారు. తమ ఇన్ఫార్మర్స్ ఎవరికీ ఆ దొంగ గురించి తెలియకపోవడం పోలీసులని విస్మయపరచింది. మరో ప్రదేశం నించి తమ ఏరియాకి ఆ దొంగ వచ్చి ఉంటాడని వారు భావించారు.
దొంగతనం జరిగిన మూడున్నర నెలల తర్వాత వారెన్ కారుని కొద్ది దూరంలో ఆపి, చూసేసిన సినిమాకి వెళ్లాడు. అతను మధ్యలో చీకట్లో బయటికి వచ్చేసరికి పెట్టుడు గడ్డం ఉంది. చొక్కా కూడా మారింది. ఆ మారు వేషంలో కారు దగ్గరికి వెళ్లి, తన ఆఫీస్‌కి మైలు దూరంలో ఉన్న పొలానికి చేరుకున్నాడు. డబ్బుని పాతినప్పుడు ఆపిన చోటే కారుని ఆపి ఆ గోతి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ తను డబ్బు పాతక మునుపు ఉన్న లాంటి గొయ్యి వెక్కిరిస్తూ కనిపించింది. ఖాళీగా ఉన్న గోతిని, పక్కనే ఉన్న మట్టిని కొన్ని క్షణాలు నిర్ఘాంతపోతూ చూస్తూండిపోయాడు. లోపలి మట్టి పొడిగా, గట్టిగా ఉంది. డబ్బు సంచీ ఉంచిన చోట ఎండుటాకులు, ఇతర చెత్త చేరాయి. ఆ డబ్బుని కొన్ని నెలల క్రితమే తీసుకున్నారని గ్రహించాడు. బహుశా తను పాతిన రాత్రే.
ఆ డబ్బుని ఎవరు దొంగిలించారో వారెన్‌కి అర్థమైంది.
ఎడ్డీ!
తనని అనుమానించి, వెంబడించి ఉంటాడు. రెండున్నర లక్షల డాలర్లని కోల్పోయిన వారెన్‌కి తిరిగి దాన్ని రాబట్టే దారే లేదని అనిపించింది.
* * *
ఓ ద్వీపంలో ఎడ్డీ, అతని భార్య గ్రేస్ సముద్రపు ఒడ్డున పడుకుని ఉన్నారు. ఆ తీరం అక్కడి ఫైవ్‌స్టార్ హోటల్ ఆస్థే. యూనిఫాంలోని వెయిటర్స్ కోరిన వారికి కోరినవి హడావిడిగా తెస్తున్నారు.
‘ఇవాళ్టికి నాలుగు నెలలు’ గ్రేస్ నవ్వుతూ చెప్పింది.
‘నువ్వు అనవసరంగా భయపడ్డావు. పోలీసులు నాతో మాట్లాడి పంపించాక ఇక మనల్ని వాళ్లు పట్టించుకోరని నాకు తెలుసు. వారెన్ దొంగ గురించి తప్పుడు వర్ణన ఇచ్చాక, ఇంక జరిగింది పోలీసులకి చెప్పినా నమ్మరు. కాబట్టి మనకి ఇంక ఎలాంటి భయం లేదు. అతను నాకు ఒకటే అవకాశం ఇచ్చాడు. ‘జైలుకి వెళ్లు లేదా దొంగతనం చెయ్’. నేనూ అతనికి ఒకటే అవకాశం ఇచ్చాను. ‘నా గురించి చెప్పి జైలుకి వెళ్లు. లేదా మిన్నకుండు’ నన్ము నమ్మి అతను రెండున్నర లక్షల డాలర్లని లాకర్‌లో ఉంచడన్న నా ఊహ నిజమైంది. అతనికి, అతని భాగస్వామికి మాత్రమే కాంబినేషన్ నంబర్లు తెలుసు. కాబట్టి ముందే డబ్బు దొంగిలిస్తాడని నాకు తెలుసు. బయటికి వెళ్లే దారి లేని విధంగా ఎవర్నీ ఉంచకూడదు. ఓ దారి వదలాలి’ ఎడ్డీ చెప్పాడు.
ఇద్దరూ చేతులు పట్టుకుని వేడిగా ఉన్న నీలంరంగు సముద్రపు నీళ్ల వైపు పరిగెత్తారు.

(మార్క్ శాడ్లర్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి