S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విడదీయరాని బంధం

తపాలా వ్యవస్థ భారతీయ సమాజంలో విడదీయలేని బంధాన్ని... పెనవేసుకుంది.... ఒకప్పుడు ఆ ఒక్క కాగితం ముక్క మనసులోని మాటను మోసుకొచ్చేది.. రాయబారాలు నడిపేది.. శ్రీవారికి ప్రేమలేఖ అదేమరి. మంచి వార్తలను, బాధ కలిగించే పరిమాణాలకు ప్రమాణపత్రంలా ఉండేది. ఊసులు, ఉబుసుపోని కబుర్లు, ప్రేమపాఠాలు, ప్రేమరాగాలు, సందేశాలు ఒకటేమిటి.. కవితలు.. కాలక్షేపానికి రాసే ఉపన్యాసాలు అంతేనా.. తెలుగు సాహిత్యంలో ఉన్నన్ని ప్రయోగాలు ఈ ఉత్తరాలలో దొర్లేవి. చక్కటి వ్యాసాన్ని అందజేసినందుకు కృతజ్ఞతలు.
-పి.సుధాకర్ (విజయవాడ)
సెంటిమెంట్
విప్లవ వాదులు సహా మనుషులందరికీ ఏవో సెంటిమెంట్స్ ఉంటాయి. అవి లేని మనుషులుండరు. సెంటిమెంట్స్‌ని గౌరవించాలని చెప్పిన ‘ఓ చిన్న మాట’ భేషుగ్గా ఉంది. ‘అవీ - ఇవీ’లో సైనిక విన్యాసాల ఫొటోలు ఆహా అనిపించాయి. జర్మనీలో కప్ప నోటిని పోలిన ముఖంగల పక్షి ఆకట్టుకుంది. పుష్యమీ సాగర్ గారి ‘మత్తు కోరల్లో పసి బాల్యం’ కవిత మాకెంతో నచ్చింది. ముఖ్యంగా ‘అభివృద్ధి అరచేతిలోకొచ్చాక మానసిక అంగవైకల్యం అడుగడుగునా విస్తరిస్తుంది’ అన్న భావన ఎంతో నిజం. శాంతము లేక సౌఖ్యము లేదు అంటూ అమృతవర్షిణిలో వివరించిన విషయాలు బాగున్నాయి.
-సదాప్రసాద్ (గొడారిగుంట)
సైన్స్
మనం చేసే పనులు, చూసే వస్తువుల వెనుక ఎంత సైన్స్ ఉందో గోపాలంగారు బాగా చెప్పారు. నిజమే. తెలిస్తే ఎంత బావుంటుంది! అమెరికాలోని ఆలిస్ అతి ఆగ్రహంతో గాని తీవ్ర మనోవ్యధతో గాని ఏ వస్తువునైనా చూస్తే అది తగలబడిపోవడం ఆశ్చర్యమే. ఆమెలో దయ్యం ఉందని సవతి తల్లికి అనుమానం. ఆమె అమాయకురాలని హిప్నటిస్ట్ నమ్మకం. తగలబడడానికి కారణం ఎవరికీ తెలియదు. అయితే ఆలిస్‌కి పెళ్లయి బిడ్డలతో ప్రశాంతంగా ఉండడంతో ఆమె అగ్నిసృష్టి సామర్థ్యం మాయమవడం మరీ వింత. ఆలిస్ ఒక్కతే కాదు. ఆమె లాగే వస్తువుల్ని తగలబడేటట్లు చేసేవాళ్లు ఇంకా ఉన్నారంటే మరింత వింత!
-బి.సొనాలి (సూర్యారావుపేట)
శాంతం - వౌనం
శాంతమే నిజమైన సౌఖ్యాన్ని కలుగజేస్తుందని జీవనం ద్వారా తెలుసుకుని, దీని మీద కీర్తనను రాసి ప్రాణం పోసి కీర్తినార్జించిన త్యాగరాజు మనలను ధన్యులను చేశాడు. నాదత్రయమైన ముత్తుస్వామి దీక్షితార్, త్యాగయ్య, శ్యామశాస్ర్తీలను బ్రహ్మ సృష్టించక పోయినట్లయితే సామవేద సారం తదుపరి తరాల వారి సరసన చేరేది కాదు. నిరంతర, చిరంతర ప్రాతఃస్మరణీయులు ఈ త్రిమూర్తులు. వౌనమంటే ఏమీ మాట్లాడకుండా ఉండటం కాదు - కాని తెలియని విషయాల మీద తెలుసున్నట్లు మాట్లాడకుండా ఉండటమే వౌనం అన్నదో చక్కని మాట. మల్లాది వారి అమృతవర్షిణిలో ప్రతీ అక్షరం అమృత బిందువే.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
కల
పెళ్లి కాని ఎమిలీకి కల వచ్చింది. ఆ కలలో తీవ్రంగా గాయపడ్డ ఒక మిలిటరీ ఆఫీసర్‌ని స్ట్రెచర్ మీద చూసింది. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్తుంటే ఎమిలీ నా భార్య అని చెప్తాడు. ఎమిలీ! ఐ లవ్ యూ అని కూడా చెప్తాడు. ఈ కల వచ్చిన కొంత కాలానికి ఆ మిలిటరీ ఆఫీసర్‌లాగ కనిపించే హేరీ ఆమెను కలిసి ప్రేమించి పెళ్లి చేసుకొని మిలటరీలో చేరుతాడు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక తీవ్రంగా గాయపడ్డ హేరీని ఎమిలీ ఇంటికి తీసుకొస్తారు. స్ట్రెచర్ మీద అతనిని చూస్తుంది ఎమిలీ. అచ్చంగా కలలో కనిపించినట్టే! భవిష్యత్తులో జరగబోయేది ఆమె కలలో ఎలా చూసిందన్నది నిజంగా నమ్మలేని నిజమే! విచిత్రాలు జరుగుతాయి.
-శాండో ప్రచండ్ (శ్రీనగర్)
భక్తి మాధుర్యం
త్యాగరాజు, పోతన లాంటి కవి రాజులు రాజభోగాలను అనుభవించకపోయినా, తమ కీర్తనలు, కవితల రూపంలో ఆ భగవంతుడినే భోగింపజేసిన ఈ భూలోక దైవ స్వరూపులు. ఈ భూమి రుణం తీర్చుకున్న భాగ్యవంతులు. వీరు భౌతికంగా మన మధ్య లేకపోయినా, మనం పాడుకునే కీర్తనలలో, పద్యాలలో వారు నిత్యం జీవిస్తూనే ఉన్నారు. పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండని కృతజ్ఞతలు కురిపించిన పోతనామాత్యుడు, ఆ రాముడినే నమ్ముకుని తిని తినక అహర్నిశలు ఆయన స్మరణలోనే తరించిన గాయత్రోపాసకుడు మన వాగ్గేయకారుడు త్యాగయ్య. వీరిద్దరూ రామభక్తులవడం విశేషం. రీతిగౌళ రాగానికి ఎంత విశిష్టత గలదో విశదంగా వివరించిన మల్లాది వారి అమృతవర్షిణి అమృతానే్న కురిపించగా, ఈ రాగంలో తనకెవరు సాటి రారనే విధంగా సినిమా పాటలకు శాస్ర్తియ సంగీత గౌరవాన్ని కల్పించి - ఆత్రేయ రాయగా - రాగాన్ని పెండ్యాల కూర్చగా వేంకటేశ్వర మహాత్మ్యం చిత్రంలో శేషసైలా వాస శ్రీ వేంకటేశా అన్న పాటను అమృతమయం చేసిన ఘంటసాల, ఎప్పటికీ అమరుడే. బ్రహ్మ సృష్టిలో ఈ గాయకుని జన్మ ఓ ప్రత్యేకం. పునర్ సృష్టి ఆ బ్రహ్మకే అసంభవం.
-ఎన్.ఆర్. (సికిందరాబాద్)
పయనం
జీవితంలో ప్రతి విషయం చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఎన్నో అడుగులేస్తే ఒక సుదీర్ఘ పయనం. ఎన్నో చర్యలు తీసుకుంటే ఒక విజయం దక్కుతుంది. అందుకని ఒక చిన్న అడుగుతో మన ప్రయత్నాలు ప్రారంభించాలన్న సండే గీత ఎంతో ఉపయుక్తంగా ఉంది. థాయ్‌లాండ్‌లో ప్రతి సెప్టెంబర్ మాసంలో వరుస స్తంభాలకు పంజరాలు అమర్చి 1400 రకాల పక్షుల్ని ప్రదర్శించడం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
-కె.సాహిత్యదీప్తి (రమణయ్యపేట)