S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దిగంబర దేవత

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
**
అదొక ఎయిర్ కండిషన్ సెమినార్ హాల్. దాదాపు వెయ్యి మంది వరకూ కూర్చునేంత విశాలంగా ఉంది. వేదిక మీద ‘జాతీయ స్థాయిలో ఫేషన్ డిజైనింగ్ పోటీలు’ అనే ఫ్లేక్సీ వేలాడుతోంది.
ప్రేక్షకుల్లో కూర్చున్న మీనాక్షి మనసులో ఉత్కంఠ. వేదిక మీద పోటీ కోసం ఆఖరి విడతగా ఎంపికయిన మూడు రకాల దుస్తులు.
కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పొడుగు చేతులున్న బ్లాక్‌టాప్, లిపి ప్రింట్‌తో ధోతీ - ఆ తర్వాత సాసర్, స్పూన్ ఫ్లోరల్ ప్రింట్లు ఉన్న మార్మేయిడ్ స్లైట్ గౌన్. ఆఖరున తను తయారుచేసిన డిజైనర్ చీర నలుపు లేత ఆకుపచ్చ రంగుల కలయికతో ఫ్లోరల్ ప్రింట్ చేసిన చీర - వంద మంది పోటీదార్లు పాల్గొంటే దాంట్లోంచి ముగ్గురిని ఎన్నిక చేశారు. వాటిల్లోంచి ఒక డిజైన్ బహుమతి కోసం ఎంపిక చేస్తారు. ప్రత్యేక న్యాయ నిర్ణేతలు రాబోతున్నారు. ‘అదృష్టం ఎవరిని వరిస్తుందో’ అనుకుంది.
‘తనది రెండు నెలల కష్టం, అందుకు ప్రతిఫలం, మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.
ఇంకో పావుగంటలో ఫైనల్ విజేత ఎంపిక, మీనాక్షి గుండె కొట్టుకుంటోంది కంగారుగా, ఆందోళనగా, తన డిజైనుకు బహుమతి వస్తుందా, రాదా అని - వేదిక మీదకు సూటేసుకున్న ఒక యువకుడు ఎక్కాడు. ఫ్యాషన్ డిజైనింగ్ మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్. ఆయన ఏం చెపుతున్నాడో మనసుకు ఎక్కడం లేదు. ఏవో ఆలోచనలు. తనను ఇంట్లో అంతా ఏ ఇంజనీరింగో, డాక్టరు కోర్సో చేయకుండా ఎందుకీ ఫ్యాషన్ డిజైనింగ్ అనేశారు. అయినా తనకు అదే ఇష్టం. ఇంటర్ తర్వాత మూడేళ్ల డిగ్రీ కోర్సు. ఆ తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్. దాంట్లో తాను చేస్తున్న ప్రాజెక్టులో ఇదో డిజైన్ - తను గెలవాలి. అంతా పెదవి విరిచిన తన కోర్సు, తనను గెలిపించాలి- అందుకే ఆమెలో ఆ కంగారు, భయం.
కళ్లు మూసుకుంది. రాత్రంతా ట్రైన్ ప్రయాణం. కళ్లు తెరవాలనిపించడం లేదు. మైకం కమ్మినట్టు నిద్ర ముంచుకు వచ్చేస్తోంది.
* * *
‘మీనాక్షి... మీనాక్షి’ ఎవరో పిలుస్తున్నారు. గబుక్కున కళ్లు తెరిచింది. తను ఎక్కడుంది?! చుట్టూ జనాలు.. ఎవరో తనని తట్టి లేపుతున్నారు. తనను పిలిచేది వేదిక మీద ఉన్నవాళ్లు.
‘్ఫ్యషన్ డిజైనింగ్ పోటీలో ప్రథమ బహుమతి కైవసం చేసుకున్న కుమారి మీనాక్షిగారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం’
ఇది కలా? నిజమా? అలా అనుకుంటూనే వేదిక మీదకు పరిగెత్తింది. మెడలో దండ వేశారు. చేతికి బొకే అందించారు. బహుమతిగా ఫ్యాషన్ డిజైనింగ్‌కు సంబంధించిన పుస్తకాలు, ధృవీకరణ పత్రం, ఒక ముచ్చటయిన సంచిలో వేసి ఇచ్చారు.
అవన్నీ తీసుకుని స్టేజి దిగుతుంటే అంతా చప్పట్లు. ‘సంప్రదాయమైన చీరకట్టును పోటీలో నిలిపి ప్రైజు కొట్టారు - ఆ ఆవరణలో ఎవరో అభినందించారు. టైమ్ చూసుకుంది. మూడు దాటింది. ‘గబగబా రైల్వేస్టేషన్‌కు చేరుకుంటే ఏదయినా ట్రైన్ దొరుకుతుంది. ఇక ఆలస్యం చెయ్యకూడదు’ అలా అనుకుంటూ ఆ సెమినార్ హాల్ దాటి బయటకొచ్చింది. ఒక నిమిషం నిరీక్షణ. తర్వాత ఒక ఆటో దొరికింది.
‘రైల్వేస్టేషన్‌కు వెళ్లాలి. వైజాగ్ వెళ్లే ట్రైన్ పట్టుకోవాలి. కాస్త తొందరగా పోనీయ్’ అంది ఆ ఆటోవాలాతో.
‘మీకు తెలీదా. రైళ్లన్నీ లేటు. తుని దగ్గర ఏదో గూడ్సు బండి ట్రాక్ తప్పింది. దాన్ని సరిచేసే సరికి ఐదారు గంటలు పడుతుందట. మీరిపుడు వెళ్లినా ఏ ట్రైనూ దొరకదు’ అన్నాడు.
‘మంచివాడిలా ఉన్నాడు.. మరయితే తను ఐదారు గంటలు ఎలా గడపాలి? ఉదయం సరాసరి తను ట్రైన్ దిగి పోటీలు జరిగే ఈ ప్రాంతానికి వచ్చేసింది. ఏ లాడ్జిలోనూ దిగలేదు. దిగుదామంటే భయం.. ఒంటరిగా రావడంతో ఆ సాహసం చెయ్యలేక పోయింది. ఇపుడేం చెయ్యాలి?!’ - నిమిషం సేపు ఆలోచన ఆమెకు ఒక పరిష్కారం చూపింది. వెంటనే ఆటో అతనితో అంది.
‘బాబూ ఈ ఊళ్లో చూడతగ్గ ప్రదేశాలేమిటి?’
‘ఇక్కడకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా దిగంబర దేవత ఆలయం’ అన్నాడు.
‘దిగంబర దేవత ఆలయమా?’ ఆమె ఆశ్చర్యంగా అడిగింది. ఎప్పుడూ ఆ పేరు వినకపోవడంతో.
‘అమ్మవారి గుడి. గ్రామ దేవత. చాలా మహిమలున్నాయంటారు. ఆడవారు ఎక్కువగా వెళతారు. పైగా ఈ రోజు అమ్మవారి పండుగ. చాలా బావుంటుంది. అరగంటలో వెళ్లొచ్చు’ అన్నాడు.
‘సరే పోనీయ్’ అంది ఇక ఆలోచించకుండానే ఆటో ఎక్కి-
ఆటో వేగంగా ముందుకు కదిలింది. మీనాక్షి మనసులో ఆనంద పరవశం. తనకు బహుమతి తెచ్చి పెట్టిన చీరను ఒక్కసారి తడిమి చూసుకుంది. గుండెలకు హత్తుకుంది. ఆ చీర మీద ఇద్దరు మనసు పడ్డారు. ఒకరు తన ఫ్యాషన్ డిజైనింగ్ ప్రొఫెసర్ సుమలత, ఇంకొకరు నాన్న పని చేస్తున్న కంపెనీ మేనేజర్‌గారి సతీమణి. నాన్న రెండు నెలల నించీ ఆయన బాస్‌గారికి తెగ చెప్పేసారుట. ‘మా అమ్మాయి బ్రహ్మాండమైన చీర డిజైన్ చేస్తోంది’ అని. వెంటనే ‘ఆ చీర మా ఆవిడకే’ అనేసారట. ఇపుడు తన ముందున్న సమస్య - చీర తన ప్రొఫెసర్‌కు ఇవ్వాలా, నాన్నగారి బాస్‌గారి భార్యగారికి ఇవ్వాలా?’ -శ్రీశ్రీగారి సంధ్యా సమస్యలు కవిత గుర్తొచ్చి నవ్వుకుంది. సర్లే, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం అనుకుంటూ ఆటోలోంచి బయట పరిసరాలు గమనిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా బాగా పెరిగిన సరుగుడు చెట్లు, మధ్యమధ్యలో పంటచేలు. అరగంట ప్రయాణం తర్వాత, తారు రోడ్డు నుంచి ఆటో ఒక మట్టి రోడ్డు వైపుగా మలుపు తిరిగింది. మరో పది నిమిషాల్లో ‘దిగంబర దేవత ఆలయం’ అనే బోర్డు దగ్గర ఆటో ఆగింది.
ఆ ఆవరణ అంతా సందడిగా ఉంది. బాజాభజంత్రీలు, బాణాసంచా, పగటి వేషగాళ్ల విన్యాసాలు. వీటితో అంతా కోలాహలంగా ఉంది. అక్కడ ఎక్కువమంది ఆడవాళ్లే కనిపించారు మీనాక్షికి. మెల్లగా నడుచుకుంటూ గుడి ముఖద్వారం దగ్గరకు చేరుకుంది మీనాక్షి.
ఆ గుడి ముంగిట్లో శుభ్రంగా కడిగిన నాపరాయి నేల మీద ముగ్గు వేశారు. ఆ ముగ్గు మధ్యలో తళతళ మెరుస్తున్న రాగి దీపపు స్తంభం- దాన్ని వత్తులతో వెలిగించారు. గుడి పక్కన ధ్వజస్తంభం సమీపంలో బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు ఒక ముసలాయన. ఆయనకి ఎంత వయసు ఉంటుందో తెలీడంలేదు. ముఖం నిర్మలంగా ఉంది. కళ్లు వెలుగుతున్నట్లుగా ఉన్నాయి. పొడుగ్గా గీత గీసినట్లుగా నుదుట కుంకుమబొట్టు, వీపు మీద వరకూ పాయలు పాయలుగా వేలాడుతున్న జుట్టు, గెడ్డం, మీసాలు పూర్తిగా తెల్లబడినాయి. తెల్లటి పంచె, ఏ ఆచ్ఛాదనా లేని శరీరం మీద కాషాయరంగు శాలువా.
ఆ కొండల మధ్య అర ఎకరం స్థలంలో కట్టిన ఆ గుడి దక్షిణం వైపున రావిచెట్టు, ఈశాన్యంగా నుయ్యి ఉన్నాయి. పూజారి ముందుగా ముతె్తైదువలు బిందెలతో తెచ్చిన నీళ్లతో అమ్మవారిని అభిషేకం చేశాడు. ఏడాదికి ఒక్కసారే అమ్మవారి పండుగ రోజునే ఆమెను అలంకరించి చీర కడతారు. నవరాత్రులయిన తర్వాత ఆమెకు కట్టిన చీరను వేలం వేసి దానితో పేదసాదలకు అన్నదానం. ఇంకా వస్తద్రానం వంటివి చేస్తారు.
మీనాక్షి అమ్మవారి విగ్రహాన్ని తదేక దీక్షతో చూసింది. ఆ కళ్లలో ఆమెకు ప్రేమ, కరుణ కనిపించింది.
పూజారి, అమ్మవారికి చీర కట్టి అలంకరించడం కోసం గుడి తలుపులు మూసారు. దానికి ‘గంటకు పైగా సమయం పడుతుంది. ఈలోగా గుడి చుట్టూ చూసి రండి’ అన్నాడు.
ఇంతలో పూజారిని ఎవరో అడిగారు. ‘అసలు ఈ దిగంబర దేవత ఎలా వెలిసింది?’ అని. అందుకు సమాధానంగా గుడి ముందు కూర్చున్న ఆ ముసలాయన వైపు చెయ్యి చూపించాడు.
ఆ గుడిని దర్శించడానికి వచ్చిన యాత్రీకులంతా ఆ ముసలాయన చుట్టూ చేరారు. మీనాక్షి ఆసక్తిగా ఆయన వైపు దృష్టి సారించింది.
ఆయన క్షణంసేపు కళ్లు మూసుకున్నాడు. ఏదో ధ్యానంలోకి వెళ్లిపోయినట్లుగా అలా వౌనంగా ఉండిపోయాడు. అందరికీ అమ్మవారి గురించి తెలుసుకుందామనే ఆసక్తి కలగడానికి కారణం - ఆలయంలోని అమ్మవారి నగ్న ప్రతిమ.
ఆ పెద్దాయన ఎపుడు కళ్లు తెరుస్తాడా అని అలా చూస్తూ ఉండిపోయారు. రెండు నిమిషాలకు కళ్లు విప్పి తన చుట్టూ కూర్చున్న ఆ యాత్రీకుల వైపు పరిశీలనగా చూసి-
‘అరవయ్యేళ్ల క్రితం జరిగిన సంగతి! మహలక్ష్మమ్మ కథ తెలిస్తే ఈ దిగంబర దేవత ఎలా వెలిసిందో తెలుస్తుంది’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.
* * *
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరమే మహలక్ష్మమ్మకు, సుబ్బయ్యతో పెళ్లి జరిగి కాపురానికి వచ్చింది. ఆమె కాపురానికి వచ్చేప్పటికి వొంటి నిండా బంగారమే - చెవులకు దుద్దులు, ముక్కుపుడక, మెడకు కంటె, నడుముకు వడ్డాణం, కాళ్లకు వెండి పట్టాలు - వీటితో మహలక్ష్మమ్మ సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మిలా ఆ ఇంట్లో అడుగుపెట్టింది.
మహలక్ష్మమ్మ భర్త సుబ్బయ్యది పెద్ద కుటుంబం. అతడికి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. ఇంటికి పెద్దవాడు కావడంతో కుటుంబ భారం అతడిదే! కుటుంబ పెద్దగా తోబుట్టువుల పెళ్లి భారం మీద వేసుకోవడంతో సుబ్బయ్య అప్పుల పాలయ్యాడు. మహలక్ష్మమ్మ ఒంటి మీద నగలన్నీ వడ్డీ వ్యాపారి దుకాణంలో చేరాయి. వంశానుగతంగా వారి వృత్తి నేతచీరల తయారీ - సుబ్బయ్య అప్పుల భారం తమ మీద పడుతుందని, అతని తమ్ముళ్లు, చెల్లెళ్లు అన్న కుటుంబాన్ని వదిలిపెట్టి కలకత్తా మిల్లులో పనికి కుదిరారు. సుబ్బయ్య తల్లీ తండ్రి వారిని వదిలేసి కలకత్తా వెళ్లిపోయారు. సుబ్బయ్య అతడి భార్య ఒంటరి వాళ్లయ్యారు. ఊరి మీద మమకారంతో కడదాకా పుట్టిన ఆ ఊళ్లోనే తమ బతుకుల్ని ముగించాలనుకున్నారు. సమిష్ఠిగా తమ వృత్తి సాగించే రోజుల్లో చాలా చీరలు తయారుచేసేవారు. అందరూ వెళ్లిపోవడంతో తాము తయారుచేసే చీరల సంఖ్య తగ్గిపోయింది. పైగా చీరల తయారీకి కావలసిన ముడి సరుకు కోసం సుబ్బయ్య ఉన్న అప్పులు చాలక కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. అలా బంగార్రాజు అనే వడ్డీ వ్యాపారి వలలో చిక్కుకుపోయాడు. భవిష్యత్తు అంధకారంగా అనిపించింది. ఈ స్థితిలో నుంచి పలాయనం చిత్తగించడానికి తాగుడికి బానిసయ్యాడు. ఆ అలవాటుతో అప్పులు మరింత పెరిగాయి.
దేవీ నవరాత్రుల సంబరాలు మొదలయ్యాయి. నెల రోజులుగా మహలక్ష్మమ్మ చీరను తనే స్వయంగా నెయ్యడం మొదలుపెట్టింది. దాన్ని పండుగకు కట్టుకుని దుర్గమ్మ తల్లికి మొక్కుకుందామని ఆమె ఆశ. పెళ్లయి ఐదేళ్లయినా తన కడుపు పండలేదు. పిల్లలు పుడితే సుబ్బయ్య తాగుడు మానేసి సంసారం సజావుగా సాగిస్తాడని ఆమె అనుకుంది. ఆ రోజు తలారా స్నానం చేసి తను నేసిన కొత్తచీర కట్టుకుని భర్తతో గుడికి వెళదామని ఆరుబయట తాటాకు పాకలో స్నానం కోసం వెళ్లింది.
సుబ్బయ్య ఊరంతా అప్పు కోసం తిరుగుతున్నాడు. తాగుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు. అప్పటికే ఇంట్లోని విలువ చేసే సామానులు, భార్యకున్న ఒకటో, రెండో పట్టుచీరలు మద్యం దుకాణంలోకి తరలిపోయాయి. వారం క్రితం తాగిన మైకంలో మహలక్ష్మమ్మ మెడలోని పుస్తెల తాడు తీసుకెళ్లిపోయాడు. ఇపుడిక అమ్మడానికి అతడికి ఏమీ మిగల్లేదు. సారా కొట్టు నర్సయ్యని బతిమాలాడు. ‘ఇప్పటికే సారా కొట్లో అప్పు అలానే ఉంది. మీ ఇంట్లో ఏది దొరికితే అది పట్టుకురా. కనీసం ఒక కొత్త చీరయినా’ అనేసాడు నర్సయ్య.
సుబ్బయ్య గబగబా ఇంటికి పరిగెత్తాడు. స్నానాలగదిలో స్నానం పూర్తి చేసిన మహలక్ష్మమ్మ తను స్వయంగా నేసిన కొత్తచీర కట్టుకునేందుకు సిద్ధమవుతోంది. భర్త వచ్చిన అలికిడి విని ‘తొందరగా స్నానం చేసిరా.
గుడికి వెళదాం’ అంది అమాయకంగా.
సుబ్బయ్య భార్య మాటలు ఏమీ వినపడలేదు. నాలిక పిడక కట్టుకుపోతోంది. నరాలు తెగిపోతున్నాయి. స్నానాల గది తలుపుతోసాడు. భార్య కట్టుకోడానికి ఒంటి మీద వేసుకున్న కొత్త చీర కనిపించింది. ఆ చీరను కుదువపెడితే సారా కొట్టువాడు ఇచ్చే సారా గ్లాసు కళ్ల ముందు నాట్యం చేసింది. కొన్ని రోజుల క్రితం భార్య మెడలో పుస్తెల తాడు లాగేసినట్టు కట్టుకోబోతున్న ఆ కొత్త చీరను ఒంటి మీద నుంచి లాగేసాడు. ఆమెకు ఆ క్షణంలో భర్త చేస్తున్నదేమిటో అర్థం కాలేదు. చీర లాక్కున్న సుబ్బయ్య ఒక్క క్షణం అక్కడ ఉండకుండా వేగంగా సారా కొట్టుకు పరిగెత్తాడు. మహలక్ష్మమ్మకు ఒంటి మీద చీర లేదు. ఒంట్లో స్పృహ లేదు. ఒక్కసారిగా ఆమెకు కళ్లు బైర్లు కమ్మినట్టయింది.
‘అయ్యో.. నా కొత్త చీర. దాన్ని కష్టపడి నేసాను. ఆ చీర కట్టుకుని అమ్మవారికి మొక్కుకోవాలి. నా కడుపులో ఒక నలుసుని పడెయ్యమని ఆ తల్లి కాళ్ల మీద పడతాను’ అలా అరుస్తూ పిచ్చిదానిలా నగ్నంగా భర్త వెనకే పరిగెత్తింది.
సాయంత్రం వీడిపోయింది. పల్చటి చీకటి ఛాయలు, నక్షత్రాలు మిణుకు మిణుకు మంటున్నాయి. ఆ చీకటి రాత్రిలో, ఆ అభాగ్యురాలికి మతి చలించింది. తానున్న స్థితి ఏమిటో మరిచిపోయి పరిగెత్తింది. వీధిలో జనం ఆమె వెంట పడ్డారు. ‘పిచ్చిది, బట్టల్లేకుండా పరిగెడుతోంది..’ పిల్లలు కేకలేస్తూ ఆమె మీద రాళ్లు విసిరారు. అప్పటికి ఆమెకు అర్థమయింది తనెంత అవివేకంగా ప్రవర్తించింది. ఆమె పరిగెడుతున్న దారిలో అమ్మవారి గుడి కనిపించింది. గుడిపక్క నుంచి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న గోదావరి, గుడిలోని దుర్గమ్మ వైపు క్షణం చూసి నమస్కరించింది. వేగంగా గోదాట్లోకి నడిచింది.
‘మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచి ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి అని పెళ్లిలో బాసలు చేసిన భర్తే తనకు పరాభవం చేశాడు. నలుగురిలో తన నగ్నరూపం బహిర్గతం కావడానికి కారణమయ్యాడు. తను ఆ క్షణంలో సిగ్గుతో చచ్చిపోయింది. ఇక తను చచ్చిపోవడానికి మిగులుంది’-
అలా అనుకుందేమో ఆ పిచ్చితల్లి నదిలో మునుగుతూ - రెప్పపాటు కాలంలో అందరూ చూస్తూండగానే ఆమె నదీ గర్భంలోకి వెళ్లిపోయింది.
తాగిన మత్తులో ఉన్న సుబ్బయ్యకు ఉదయం వరకూ తెలీదు, తన భార్య గోదాట్లోకి దూకి ప్రాణాలు తీసుకున్న విషయం. ‘తన తాగుడే భార్య పరువు, ప్రాణం తీసింది’ అనుకుంటూ సుబ్బయ్య మహలక్ష్మమ్మ చూపిన తోవలోనే వెళ్లిపోయాడు.
ఇద్దరి శవాల కోసం ఊరంతా జాలరులతో కలిసి గాలించినా ప్రయోజనం లేకపోయింది. మూడు రోజుల తర్వాత సుబ్బయ్య శవం కొట్టుకొచ్చింది. మహలక్ష్మమ్మ జాడ దొరకలేదు. ‘పుణ్యాత్మురాలు, బొందితో కైలాసం వెళ్లిందేమో, లేకపోతే శవం కనిపించాలి కదా!’ అనుకున్నారు ఆ ఊరి అమాయక ప్రజలు. అలా మహలక్ష్మమ్మ ఆ ఊరి ఇలవేలుపు అయ్యింది. దిగంబరంగా అమ్మవారికి మొక్కుకుంది. అలాగే గోదాట్లోకి దూకి ప్రాణత్యాగం చేసుకుంది. అలా ఆమె దిగంబర దేవతగా ఆ ఊళ్లో వెలిసింది. కొత్త చీర కట్టుకుని అమ్మవారికి మొక్కుకుందామనే కోరిక తీరకుండానే అశువులు బాసింది. ఆమె గుర్తుగా దేవీ నవరాత్రుల తొలిరోజు, నేత చీరల్ని దిగంబర దేవతకు మొక్కుగా చెల్లించి వాటిని ఏ పేద స్ర్తికో దానంగా ఇచ్చే ఆచారం మొదలయింది. అరవయ్యేళ్లుగా ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది.
* * *
ఆ ముసలాయన దిగంబర దేవతగా వెలిసిన మహలక్ష్మమ్మ కథ చెప్పడంతో అది విన్న అందరి కళ్లు తడి అయ్యాయి. చలించిపోయారు. మీనాక్షి మనసులోనూ ఏదో తెలీని బాధ.
ఇంతలో అమ్మవారుగా వెలసిన దిగంబర దేవత అలంకరణ పూర్తయ్యింది. పూజారి గంట మోగించాడు. గుడి తలుపులు తెరిచాడు.
మహలక్ష్మమ్మ అమ్మవారిపుడు నిండుగా ఉన్నారు. తలలో పువ్వులు, కనకాంబరం రంగు పట్టుచీర, తీర్చిదిద్దిన కాటుక, మెడలో కంటె, చేతికి గాజులు, ముక్కుపుడక, అమ్మవారి ప్రతిమలోని కళ్లు వారికి తేజోవంతంగా కనిపించాయి. అమ్మవారిని దర్శించడానికి వచ్చిన ఆడవాళ్లంతా తాము తెచ్చిన చీరలను అమ్మవారి విగ్రహం ముందు ఉంచి తీసుకుని వెళ్లిపోతున్నారు. మీనాక్షి తనకు బహుమతి తెచ్చి పెట్టిన చీరను అమ్మవారి కాళ్ల దగ్గర వుంచి, తిరిగి దానిని తన సంచిలో పెట్టుకుంది. వెంటనే టైము చూసుకుంది. ‘లైను క్లియర్ అయి ఉంటుంది’ అనుకుంటూ ఆ ఆవరణ దాటి గబగబా బయటకు వచ్చింది. ‘ఆటో’ అంటూ పిలిచింది. ‘రైల్వేస్టేషన్‌కు అర్జంటుగా వెళ్లాలి’ అంది.
అరగంటలో స్టేషన్‌కు వచ్చింది. ‘వైజాగ్ వెళ్లే సూపర్ ఫాస్ట్ లింక్ ఎక్స్‌ప్రెస్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్ మీదకు వచ్చి యున్నది’
‘హమ్మయ్య సమయానికి చేరుకున్నాను’ అనుకుంటూ కోచ్ నెంబర్ అడిగింది కనిపించిన టిక్కెట్ కలెక్టర్‌ను. రిజర్వేషన్ కోసం. ఆయన చెప్పగానే ఆ కోచ్‌లోకి నడిచింది. పది నిమిషాల్లో ట్రైన్ కదిలింది. పావుగంట తర్వాత టీసీ బెర్త్ ఎలాట్ చేశాడు. పనె్నండు గంటల ప్రయాణం. తరువాతి రోజు ఉదయం ఆరు గంటలకు వైజాగ్ చేరుకుంది మీనాక్షి.
బయటకొచ్చి ఆటో ఎక్కింది. పావుగంట తర్వాత ఇల్లు చేరుకుంది. ఆటో దిగి ఇంటి వైపు అడుగులు వేస్తుంటే- ‘అమ్మా పువ్వులు’ అనే పిలుపు. వెనక్కి తిరిగింది. రోజూ తనకు పువ్వులమ్మే గౌరి. మల్లెపువ్వులు, కనకాంబరాలు, సన్నజాజులు పొట్లంగా కట్టి ఇచ్చింది. ఒక్కసారి గౌరి వంక చూసింది. వెలిసిపోయిన పాత చీర. గౌరిని రెండేళ్లుగా చూస్తోంది. ఎప్పుడూ ఆ పాత చీరలే. పండగలప్పుడూ - తను చాలా చక్కగా ఉంటుంది. గుండ్రటి ముఖం, చారడేసి కళ్లు, పెద్ద జడ, మనిషి వయసు ముప్పైలోపే.
‘ఏంటి గౌరీ. ఎప్పుడూ పాత చీరలేనా, ఒక కొత్త చీర కొనుక్కోరాదూ..’ అంటే, ‘ఏం చీరలమ్మా. ఇద్దరు పిల్లలు, ముసలి అత్తమామలు. వారిని పోషించడానికే నా పువ్వులమ్మిన డబ్బులు సరిపోతాయి. ఇక చీరలు కొనుక్కోవడమా! నా మొగుడు తాగుడికి వాడి సంపాదనంతా సరిపోతుంది’ అంటుంది.
మీనాక్షి ఒక్కసారి ఆలోచనలో పడింది. దిగంబర దేవత గుర్తుకొచ్చింది. ఆమె తాగుబోతు మొగుడితోనే తన జీవితం పతనమయిపోయింది. ఈ పువ్వులమ్మి గౌరి బతుకు ఇంతేనా?! ఇలాంటి వారు ఎందరో?! వెళ్లిపోతున్న గౌరి వెనక్కి తిరిగి ‘అమ్మా ఒక పాతచీర ఉంటే ఇవ్వండి, వచ్చేవారమే కదా అమ్మవారి పండగ మా ఊళ్లో. అది కట్టుకు వెళతా. మీ పాత చీరలయినా మాకు కొత్తచీరలే అమ్మా’ అంది.
మీనాక్షి ఒక్క క్షణం ఆలోచించి, గబగబా తన సంచిలో తను డిజైన్ చేసిన చీరనూ, తనకు బహుమతి తెచ్చిపెట్టిన చీరను తీసింది. ఒక్కసారి దీక్షగా చూసింది. వెంటనే గౌరికి ఆ చీర ఇచ్చేసింది.
‘ఇదిగో కొత్త చీర. అమ్మవారి పండుగకు కట్టుకో’ అంది.
గౌరి కళ్లల్లో వెలుగు. ఇంకా ముఖంలో ఆశ్చర్యం. ‘నాకేనా అమ్మా’ అంటూ ఆ చీరను తడిమి చూసుకుంది.
ఆమె కళ్లల్లో ఆ దేవాలయంలోని దిగంబర దేవత కళ్లల్లోని వెలుగు కనిపించింది మీనాక్షికి.

-డా.ఎం.సుగుణరావు.. 9393129945