S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చేసేద్దాం.. సేంద్రియ సేద్యం

సిక్కిం... ఓ చిన్నరాష్ట్రం..
కానీ ఈ మధ్య ఓ ఘనతను సాధించింది...
మన దేశంలో మొత్తం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం అదొక్కటే... గొప్పకాదూ...
అరుణాచల్ ప్రదేశ్... ఈశాన్యభారతంలోని ఓ చిన్నిరాష్ట్రం..
న్యూజిలాండ్‌లో మాత్రమే సాగయ్యే కివీ పళ్ల సాగులో
అద్భుతాలు సృష్టిస్తోంది...
అక్కడికన్నా రుచికరమైన పళ్లను ఉత్పత్తి చేసేస్తోంది.. గొప్పకాదూ...

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యం... అద్భుతమైన కాఫీ, యాపిల్ పళ్ల సాగుకు వేదికవుతోంది... గొప్పకాదూ...

బెంగళూరులో పనిచేసే ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఉద్యోగం చేస్తూ వారాంతంలో సొంత ఊరు బీదర్ వచ్చి పొలం పనుల్లో దీక్షగా దిగిపోవడం... విజయనగరం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు పైరినాయుడు బడి వదిలాక తోటపల్లి పొలాల్లో మొక్కల ఏలుబడికి వెళ్లడం... పూనాకు చెందిన సుజాత నఫాడే దంపతులు సేంద్రియ సేద్యంపై మక్కువ పెంచుకోవడం... గొప్పకాదూ... ఇవన్నీ సరే... ఓ వైద్యుడు.. ఓ చార్టెడ్ అకౌంటెంట్, ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఓ బ్యాంకు ఉద్యోగి... రైతుగా ఎందుకు మారిపోతున్నాడు... అదీ సేంద్రియ సేద్యానికి ఎందుకు మోజుపడుతున్నాడు అంటే.. అదే మాయ. సేంద్రియ ఇంద్రజాలం..
ఎరువుల జోలికి వెళ్లడం లేదు.. పురుగు మందుల అక్కరే లేదంటున్నారు...
పేడ పిసికి...గోమూత్రం పట్టి.. వానపాములు, వేపాకులతో ఎరువు తయారు చేసి పొలాల్లో కదం తొక్కుతున్నారు... యంత్రాల జోలికి వెళ్లకుండా పాడిపశువుల సాయంతో హైలెస్సా అంటున్నారు.. లాభం పెద్దగా లేకపోయినా.. రాకపోయినా సేంద్రియ ప్రయోగాలకు సై అంటున్నారు.. గొప్పేగా మరి...
తిండి కలిగితే కండ కలదోయ్ అంటారు...
సరే ఇప్పుడు తినే తిండి వల్ల కండల మాటేమో గానీ దానితోపాటు దండిగా మందులు తినాల్సి వస్తోంది. రసాయనాలు, పురుగుమందులతో ఏపుగా పెరిగిన పంటలు చూడ్డానికి కళకళలాడుతూనే ఉంటాయి. నకనకలాడే మనం వాటిని తింటే ఆనక మనకు మంట పుట్టిస్తున్నాయి. రోగాలపాలు చేస్తున్నాయి. అందుకే బాగా బతకాలన్న ఆశ పెరిగిన జనం ఇప్పుడు ఏది పడితే అది ఆబగా తినేయకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన పంటలను వాడి తయారు చేసే అహారాన్ని ఇష్టపడుతున్నారు. ఇన్నాళ్లూ పాశ్చాత్య ఒరవడిలో పడిపోయిన మనవాళ్లు ఒకప్పటి బలవర్ధక ఆహారాలైన అంబలి, రాగిసంకటి, రాగి ఇప్పుడు అడిగి మరీ తింటున్నారు. ఇన్నాళ్లు పేరెత్తితే చిన్నబోతామని చెప్పుకునే కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగుల రాసులపై మమకారం చూపుతున్నారు. ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ ఇది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల జోలికి వెళ్లకుండా సంప్రదాయ శైలిలో పెంచిన పంటలు, ఆహారానికి ఇప్పుడు మంచిరోజులు వస్తున్నాయి.
***
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో అక్కడక్కడ పళ్ల బండ్లపైన, దుకాణాల్లోను చూసే ఉంటారు... ‘ఆర్గానిక్’ బోర్డులు.. పండ్లను మాగపెట్టడం దగ్గరనుంచి సాగు, అమ్మకాల వరకు ‘సేంద్రియం’ అన్న మాట మంత్రంలా పనిచేస్తోంది. రాగి పిండితో చేసే లడ్డూల్లో ఉండే మజాను చాలామంది రుచి చూస్తున్నారు. జొన్నపిండితో చేసే రొట్టెలకు మహా గిరాకీ ఉంది. హైదరాబాద్ వీధుల్లో కుర్రకారు.. పెద్దవారు.. అంటే సంపన్నులు కూడా అక్కడికక్కడ వేడివేడిగా చేసి అందించే బళ్లపై జొన్నరొట్టెలను తినడం చూస్తూనే ఉంటాం. ఒక రూపాయి ఎక్కువైనా ఫర్వాలేదు సేంద్రియ వస్తువుల, పదార్థాలను తినేందుకు ఇష్టపడుతున్నారు. పేదలు ఎలాగూ వాటిపైనే ఆధారపడుతున్నారు. ఎటొచ్చీ సంపన్నుల వైఖరిలో పెద్దమార్పులే వచ్చాయి. డబ్బు పోయినా ఫర్వాలేదు... పాతతరం గింజధాన్యాలు, తృణధాన్యాలు, ఆకు కూరలు అవసరం అంటున్నారు. పొట్టు తొలగించని బియ్యం.. మరీ ఎర్రబియ్యం
ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు. అదీ సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తి చేసేవే కావాలంటున్నారు. మినప ఇడ్లీలో కేరట్ కలుపుతున్నారు. రాగి నూక తోడైతే ఆరోగ్యం అదుర్స్ అంటూ లొట్టలు వేస్తున్నారు. అందుకే చాలామంది రైతులు ఇప్పుడు సేంద్రియ విధానాల్లో సాగుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో కూడా మంచి మార్పు కనిపిస్తోంది. మనదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ మార్పు కనిపిస్తోంది. గడచిన మూడేళ్లలో సేంద్రియ సాగు 20 శాతం మేరకు పెరిగిపోయింది. మన దేశంలో సిక్కిం తరహాలో ప్రపంచంలో డెన్మార్క్ పూర్తి సేంద్రియ సాగు చేస్తున్న దేశంగా తయారవుతోంది. ఇప్పటికే అక్కడ 98 శాతం వ్యవసాయం ‘ఆర్గానిక్’ విధానంలోనే జరుగుతోంది. అంతెందుకు భారత్‌లో సేంద్రియ వ్యవసాయం గడచిన మూడేళ్లలో ప్రపంచంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందుతోంది. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో సేంద్రియ వ్యవసాయానికే పెద్దపీట. సేంద్రియ వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, ఎక్కువగా అమలు చేస్తున్న మొదటి పది దేశాల్లో భారత్, ఇథియోపియా, మెక్సికో, ఉగాండా, ఫిలిప్పీన్స్, టాంజానియా, టర్కీ, పరాగ్వే, ఇటలీ ఉన్నాయంటే నమ్మాలి. ఆస్ట్రేలియా, చైనా కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. సేంద్రియ పంటలను సాగు చేస్తు అత్యధిక దిగుబడులు సాధిస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో 585200 హెక్టార్లలో సేంద్రియ సేద్యం సాగవుతోంది. ఇథియోపియాలో 203302 హెక్టార్లు, మెక్సికోలో 200030 హెక్టార్లలో సేంద్రియ పంటలు పండిస్తున్నారు. ప్రపంచంలో సేంద్రియ విధానంలో పంటలు పండించే దేశాలు 174 ఉన్నాయి. ఆయా దేశాల్లో 5.9 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిలో ఈ పంటలు పండిస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో ప్రస్తుతం 1.1 శాతం మాత్రమే సేంద్రియ సాగుకు వినియోగిస్తున్నప్పటికీ గడచిన మూడేళ్లలో ఇది విపరీతంగా పెరిగింది. 11 దేశాల్లో విస్తృతంగా సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. వాటిల్లో భారత్ ఒకటి. ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించడం రైతులకు ఉత్సాహాన్నిచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
సేంద్రియ సాగుకు ముందు సేంద్రియ పద్ధతుల్లో తయారైన విత్తనాలు అవసరం. ఇప్పుడిప్పుడే ఆ దిశగా రైతుల్లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో తృణధాన్యాలు, గింజ ధాన్యాలను సేంద్రియ పద్ధతుల్లో సిద్ధం చేయడం ఓ ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో మహిళ రైతుల పాత్ర ఎక్కువగా ఉంది. అటు ఏపిలో కర్నూలు ప్రాంతంలో ఈ ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తోంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశాలలో సేంద్రియ వ్యవసాయానికి ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద రైతులు కూడా ఇటు దృష్టి సారించారు. సేంద్రియ ఉత్పత్తులకు మంచి ధర పలుకుతుండటంతో వారు ఆసక్తి చూపిస్తున్నారు. సేంద్రియ పంటలను గుర్తించి సర్టిఫై చేసే విధానాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉండటమే సమస్య. సేంద్రియ పంటలకు గుర్తింపు ఉంటేనే వాటిని నమ్మాల్సి ఉంటుంది. బహుళ జాతీయ సంస్థల ప్రభావం నుండి బయటపడని కొన్ని ప్రభుత్వాలు, అధికారుల తీరు సేంద్రియ విధానానికి పెద్ద అడ్డంకి. నిజానికి పురుగు మందులు, కీటక నాశక మందులు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. చాలామంది రైతుల ఆత్మహత్యలకు ఇవి సాధనాలవుతున్నాయి. ఇక సైడ్ ఎఫెక్ట్‌వల్ల రైతులు రోగాలబారిన పడుతున్నారు. మహారాష్టల్రో ఇటీవల జరిగిన సంఘటనల్లో ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. మందులు జల్లుతూ వారు అనారోగ్యానికి గురై మరణించారు. సేంద్రియ వ్యవసాయంలో ఇలాంటి సమస్య ఉండదు. పైగా ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. రసాయనిక ఎరువువల వల్ల భూసారం తగ్గి చవిడి భూములుగా మారిపోతాయి. ఆ ప్రమాదం సేంద్రియ విధానం వల్ల తగ్గుతుంది. పాడి పశువుల అవసరం పెరిగి ఆ రంగం వృద్ధి చెందుతుంది. కాకపోతే మొదట్లో సేంద్రియ వ్యవసాయం వల్ల దిగుబడి తగ్గవచ్చు. అయితే శాస్తవ్రేత్తల అంచనా మరోలా ఉంది. మొదటి ఐదేళ్లలో సేంద్రియ సాగువల్ల దిగుబడి తగ్గినా ఆ తరువాత పెరుగుతుందని, భూసారం పెరగడం, కాలుష్యం తగ్గడం అందుకు కారణమవుతాయని వారు అంటున్నారు. సేంద్రియ వ్యవసాయం జరిగే భూముల్లో నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుందని అందువల్ల మేలు జరుగుతుందని వారి అంచనా. 2022 నాటికి రైతుకు ఇప్పుడు వస్తున్న ఆదాయం రెట్టింపు అవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా విధానాలు రూపొందిస్తున్నారు. రైతులను సేంద్రియ వ్యవసాయంవైపు మొగ్గు చూపేలా చైతన్యం తీసుకువచ్చేందుకు చాలా స్వచ్చంద సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ఎటొచ్చీ మార్కెటింగ్ సౌకర్యం పెరగాల్సి ఉంటుంది. పూర్తిగా సేంద్రియ ఉత్పత్తులను అమ్మే సంస్థలు, ఆహార పదార్థాలకు గుర్తింపు తప్పనిసరి. అందుకు తగ్గ విధానాల్లో స్పష్టత అవసరం. ఇప్పటివరకు అయితే అన్ని దేశాల్లోని సేంద్రియ వ్యవసాయదారులు, వ్యాపారుల మధ్య అనుసంధాన వ్యవస్థ ఉంది. అది మరింత విస్తృతం అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో సేంద్రియ ఉత్పత్తులపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా అవసరం.
ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ -2017
ప్రపంచంలో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో మూడేళ్లకు ఒకసారి జరిగే ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు ఈఏడాది మనదేశంలో నిర్వహిస్తున్నారు. నవంబర్ 9వ తేదీ నుంచి 15వ తేదీవరకు జరిగే ఈ సదస్సుకు దాదాపు 54 దేశాల నుంచి మూడువేల మంది ప్రతినిధులు హాజరవుతారు. సేంద్రియ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలు, సాధించిన అద్భుత ఫలితాలపై విస్తృత, శాస్ర్తియ చర్చలు సాగుతాయి. వందలమంది శాస్తవ్రేత్తలు హాజరవుతారు. గత సదస్సు టర్కీలోని ఇస్తాంబుల్ జరిగింది. ఇప్పుడు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సేంద్రియ విత్తనాలు, పంటల ప్రదర్శన ఉంటుంది. ఈ సదస్సు జరిగినన్నిరోజులూ సేంద్రియ ఉత్పత్తులతోనే ఆహార పదార్థాలను వండి పెడతారు.
మన కివీ పళ్లు మహా రుచి!
విశాఖ మన్యంలోని లంబసింగి ప్రాంతంలో యాపిల్ పళ్ల సాగుకు అవకాశం ఉందన్నది అంచనా. పరిశోధనలు జరిగాయి. పంటల సాగు ప్రాథమిక దశలో ఉంది. భవిష్యత్‌లో అక్కడ యాపిల్ సాగుకు అవకాశాలున్నాయి. అలాగే కివి పళ్ల సాగుకు అరుణాచల్ ప్రదేశ్ అనుకూలంగా ఉంది. అక్కడ పేరున్న సేంద్రియ రైతు బొడుంబ 20 ఎకరాల్లో కివీ పళ్ల సాగును మొదలుపెట్టాడు. వెస్ట్ కమెంగో జిల్లాలో అతడు చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల ఆ పళ్లకు మంచి రుచి వచ్చింది. నిజానికి న్యూజిలాండ్‌లో సాగయ్యే ఆ పళ్లకన్నా అరుణాచల్ కివీ పళ్లు మంచి రుచితో ఉన్నాయని ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ సంస్థ ప్రకటించింది. ‘బొడుంబ’ కు ఈ మధ్యే అరుణాచల్ ప్రభుత్వం ఉత్తమ రైతు పురస్కారంతో సన్మానించింది.
సిక్కిం మార్క్ వ్యవసాయం

పూర్తిగా సేంద్రియ సేద్యం చేస్తున్న ఏకైక రాష్ట్రం సిక్కిం. ఇటీవల ఆ గుర్తింపును సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఘనమైన సంప్రదాయాలు, సంస్కృతికి నిలయమైన సిక్కింలో రైతులకు మొదటి నుంచి సంప్రదాయ సేద్యంపై అవగాహన ఉంది. పట్టూ ఉంది. అది వారికి కలిసి వచ్చింది. ప్రపంచంలో ఎక్కువ మోతాదులో పురుగుమందులు వాడే దేశం భారత్. అయితే సిక్కిం వాటికి చాలాదూరంగా ఉంది. ఎరువులు, పురుగు మందుల తోడు లేకుండా అధిక దిగుబడులు సాధించడం ఎలాగో అక్కడి రైతులు నేర్చుకున్నారు. చక్కటి నీటిపారుదల, సంప్రదాయ ఎరువుల వాడకం ద్వారా భూసారం పెంచి దిగుబడులు సాధించడంలో వారు నైపుణ్యం సాధించారు. వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. కొన్ని సందర్భాలలో సేంద్రియ బాట పట్టని రైతులపట్ల కఠినంగాను వ్యవహరించింది. సిక్కిం రాష్ట్రానికి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన పవన్ చామ్లింగ్ అక్కడి వ్యవసాయ విధానంపై చెరగని ముద్ర వేశారు. పనె్నండేళ్ల క్రితం ఆయన సేంద్రియ వ్యవసాయ ప్రణాళికను ప్రకటించి అమలు చేశారు. 2016 నాటికి అది నిజం చేశారు. రైతులు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయదారులను చామ్లింగ్ చైతన్యవంతం చేశారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించారు. నిబంధనలు అతిక్రమించినవారిపట్ల చాలా కఠినంగా వ్యవహరించారు. జరిమానాలు, శిక్షలు విధించి అమలు చేశారు. సిక్కిం ఆర్గానిక్ మిషన్ పేరిట కార్యక్రమాలు అమలు చేశారు. రైతులను ఇతర ప్రాంతాలకు పంపి సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇప్పించారు. లక్షలమంది ఇతర ప్రాంత రైతులను ఇక్కడికి తీసుకువచ్చి సేంద్రియ వ్యవసాయం ఎలా సాగుతున్నదీ చూపించారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది తప్పనిసరి సబ్జెక్టుగా విద్యావిధానాన్ని మార్చారు. పేడ, కంపోస్టు, గోమూత్రం, వేపాకులు, చెత్త వంటివి వాడి ఎరువులను, ప్రాకృతిక క్రిమిసంహారకాలను రైతులు తయారు చేసుకుని వాడటం మొదలుపెట్టారు. నిజానికి 2003కు ముందు అక్కడ కూడా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలను వాడేవారు. అవి రైతులు, పంటలపై దుష్ప్రభావం చూపడంతో ప్రభుత్వం కళ్లు తెరచింది. అయితే రైతుల ఆర్థిక స్థితులు, దిగుబడుల్లో అద్భుతాలు జరిగిపోయాయని చెప్పలేం. బాలారిష్టాలు తప్పడం లేదు. అయితే ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. దిగుబడులు మునుముందు పెరుగుతాయన్నది అంచనా. ఏటా జనవరిలో సేంద్రియ ఉత్సవం పేరిట చేపట్టే కార్యక్రమాలు రైతులకు స్ఫూర్తినిస్తున్నాయి. కేరళ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ కూడా సిక్కిం బాటలో పయనిస్తున్నాయి.

-ఎస్.కె.కృష్ణ రవళి