S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇహ పర సాధనల సంపుటి

‘భగవద్గీతను యోగ శాస్త్రంగానే పరిగణించాలంటారా?’
నా వ్యాఖ్యానాలతో ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా చైతన్య ప్రశ్న.
‘అవును చైతన్యా! బహుళ ప్రచారంలో ఉన్న అష్టాంగ యోగమే యోగం అని కాదు.. పతంజలి యోగ శాస్త్రం ఒక్కటే ప్రామాణికం అని కాదు. అష్టాంగ యోగానికి, పతంజలి యోగ సూత్రాలకు చేరవలసిన మరెన్నో యోగ సూత్రాలు భగవద్గీతలో ఉన్నాయి. ప్రపంచానికి తెలిసిన హఠయోగానికి కలవవలసిన భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం గీతలో కూలంకషంగా కనిపిస్తాయి. ఆత్మల సంయోగాన్ని గురించి, ఆత్మల పర ప్రజ్ఞను గురించి గీత విశదీకరించినట్లుగా మరే ఆధ్యాత్మిక గ్రంథమూ వివరించలేదు.’
‘అన్నట్టు గురువుగారూ! మీ అనుభవసారంలో యోగం అంటే...’ చైతన్య.
‘సంయోగించటమే యోగం. ఇక్కడ సంయోగం అంటే ఒక ఆత్మ మరొక ఆత్మతో సంయోగించటం.. ఇంకా చెప్పుకోవాలంటే ఇహ ఆత్మ పర ఆత్మతో, జీవ ఆత్మ పరమ ఆత్మతో సంయోగించటానికి ఉపకరించే సాధనా మార్గమే యోగం. ఈ యోగ సాధనకు వలసిన ఇహ పర సాధనాలను గుదిగుచ్చటమే కృష్ణగీత చేసిన పని.’
‘మీ దృష్టిలో గీతలో యోగ ప్రస్థానం ఎలా సాగిందంటారు’
‘పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతలో మొదటి, పదిహేనవ, పదిహేడవ అధ్యాయాలలో తప్ప తక్కిన పదిహేను అధ్యాయాలలో ‘యోగం’ అనే పదం 78 మార్లు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ‘యోగి’ అనే పదాన్ని సైతం గీతాచార్యుడు 28 మార్లు ప్రయోగించాడు. పైగా గీత ప్రకారం నిత్య చైతన్య ఆవిష్కరణతో, నిరంతర యోగ సాధనలో ఉన్నవాడే యోగి అని అర్తం. పైగా యోగి వ్యక్తిమత్వాన్ని కృష్ణగీత చాల చక్కగా విశే్లషించింది. మనకు తెలిసిన అష్టాంగ యోగాన్ని ఆరవ అధ్యాయానికి పరిమితం చేసి తక్కిన పదిహేడు అధ్యాయాలలోను కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను అర్థవంతంగా వివరించింది.’
‘ఇంతకీ గురువుగారూ, గీతాచార్యుడు విషాదంతో ఎందుకు గీతను ప్రారంభించినట్లు...?’
‘ప్రథమాధ్యాయమైన అర్జున విషాద యోగం కృష్ణార్జునులది ఒకే మాట ఒకే బాట అన్న చందాన ప్రారంభమైనప్పటికీ, కురుక్షేత్ర ప్రవేశంతో ఇద్దరి తత్వాలు వేరువేరుగా ప్రకటితమయ్యాయి. కృష్ణుడిది పరమాత్మ తత్వమైతే అర్జునుడిది జీవాత్మ తత్వం. సంయోగ ప్రస్థానంలో వియోగం చోటు చేసుకుంటే ఎలా? పర్యవసానం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానమే భగవద్గీత. వియోగం నుండి స్వాంతన పొంది సంయోగించటం ఎలానో ప్రతీ అధ్యాయంలోను కృష్ణగీత చూపిస్తూ పోయింది. ఇలా ప్రతీ అధ్యాయమూ యోగ ప్రస్థానానికి కావలసిన సాధనా సంపత్తిని అందించింది, చివరికి అర్జునుడి చేత ‘నీ మాటే నా చేత’ అనిపించేలా గీతోపదేశం సాగింది.’
‘మరో మాట గురూజీ! ప్రథమాధ్యాయమే అర్జున విషాదం కదా! అంటే, మృత్యువును గురించిన భయ విహ్వలత అనేగా! ఎందుకు ప్రతి మనిషికీ చావు అంటే ఇంత భయం? పుట్టటం ఎంత సహజమో చావటమూ అంతే సహజం కదా! జనన మరణాలు సృష్టి క్రతువులే! ప్రకృతిలో రూపంగా కనిపించిన ప్రతీదీ ఏదో ఒకనాడు అరూపం అవుతూనే ఉంది. మనం కూడా ప్రకృతిలో ఒక భాగమైనపుడు మనమూ అరూపం కావలసిందేగా! ఇలా అరూపం కావటమే మృత్యువు.
అటువంటిది ఈ మృత్యువును జయించాలన్న పోనీ అధిగమించాలన్న కోరిక ఏమిటో! మృత్యు రాహిత్య స్థితి కోసం తపన ఎందుకో? మన యోగం, ధ్యానం, తపస్సు ఈ మృత్యు రాహిత్యం కోసమేనా? ఈ దేహం అనే కాదు, ఏ రూపమూ శాశ్వతం కాదు, కాబట్టి మనం కోరుకోవలసిన శాశ్వతత్వం ఈ రూపానికి కాదు... అంటే ఈ భౌతిక దేహానికి కాదు. కాబట్టి ఈ దేహాన్ని చేరిన ఆత్మ శాశ్వతత్వం కోసమే మన యోగ సాధన అని నాకు అనిపిస్తుంటుంది. అవునంటారా? కాదంటారా?’ చైతన్య మరో మారు తన మనసులోని మాటను నాముందుంచాడు.
‘చైతన్యా! చాల మంచి అంశానే్న ప్రస్తావించావు.. అవును, రూపం అరూపం కావలసిందే! శబ్దం నిశ్శబ్దం కావలసిందే! బీయింగ్ నథింగ్ కావలసిందే! నువ్వనుకుంటున్నట్టు మనం భయపడుతున్నది మృత్యువును గురించి కాదు.. ప్రేమిస్తున్న ఈ దేహాన్ని గురించి, ఈ దేహ సంపదను గురించి. నేడు అందంగా కనిపిస్తున్న భోగలాలసకు ఆలవాలమైన దేహం రేపు లేకుండా పోతుందేమో అన్నదే అసలు భయం. కనిపించే వారు లేకపోతే ఎలా?
ఆ వియోగానికి మరో రూపమే మృత్యువు.. సరాగానికి వికృతి వియోగం. రెండంచుల జీవితం నడుమ ప్రయాణం సాగిస్తున్నపుడు కనిపించిన మొదటి అంచు అంటే దాని వచ్చిన మొదలు అందంగానే కనిపిస్తుంటుంది. కనిపించని మరో అంచు ఎలా ఉంటుందో అన్న బెంగ భయంగా పరిగణమిస్తుంది. ఇప్పటి కంఫర్ట్‌తో కంపేర్ చేసుకుని ఆ కనిపించని రెండవ అంచు అసలు లేకుండాపోతే ఎంతో హాయి అనిపిస్తుంటుంది. ఆ ప్రయత్నంలో నానా అవస్థలు పడుతూ భయాన్ని ప్రోగు చేసుకుంటుంటాం. అలా ప్రోగు చేసుకునేదంతా రోగమే. కాబట్టి రోగం మరణానికి తొలి ఆహారం. తొలుదొల్తగా ఈ రోగం పుట్టుకొచ్చేది మనసు నుండే.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946