S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కష్టాల మూట (కథాసాగరం)

ఒక వ్యక్తి బతకడానికి ఎన్నో కష్టాలు పడేవాడు. కుటుంబంలో ఎన్నో సమస్యలుండేవి. మనుషుల్తో ఎన్నో బాధలు పడేవాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాడు. ప్రపంచంలో బాధలన్నీ తనకే వున్నాయని భావించేవాడు. అందరూ ఆనందంగా ఉన్నట్లు, తనొక్కడే లెక్కలేనన్ని కష్టాలు పడుతున్నట్లు అనుకునేవాడు.
తను ఏదో శాపవశాన ఈ భూమిలో పుట్టినట్లు దేవుడు తన మీద కష్టాల వర్షం కురిపిస్తున్నట్లు భావించేవాడు.
ఒకరోజు ఈ విషయం దేవుడితో మొరపెట్టాలనుకున్నాడు. పిల్లలు దేనికో డబ్బు కావాలని అడిగారు. భార్య తన వాళ్లని మర్యాదగా చూడడం లేదని నిలదీసింది. తన మెత్తదనాన్ని ప్రతి ఒక్కడూ ఉపయోగించుకుంటూ మోసం చేస్తున్నారని దిగులు పడిపోయాడు.
ఒకరోజు రాత్రి ఎంతసేపటికీ అతనికి నిద్ర రాలేదు. ఇంటి వరండాలోకి వచ్చి ఆకాశంకేసి చూసి, ‘దేవా! ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? నేను ఎవరికీ ఎట్లాంటి అపకారం చెయ్యలేదు. అయినా యిన్ని కష్టాలు పడుతున్నాను. నేను నిన్ను ఒకటే కోరిక కోరుతున్నాను. డబ్బు, అధికారం, పేరు ప్రతిష్టలు ఏవీ అడగడం లేదు. ప్రపంచంలో నన్ను మించిన బాధలు ఎవరికీ లేవు. నా కష్టాలు ఎవరయినా తీసుకుని వాళ్ల కష్టాలు నాకు ఇవ్వమని చెప్పు. అంతకు మించి నిన్ను ఏమీ అడగను’ అన్నాడు.
ఆకాశం నక్షత్రాలతో నిశ్శబ్దంగా చూసింది. అతను వెళ్లి పడుకున్నాడు. తెల్లవారుజామున అతనికి ఒక కల వచ్చింది. దేవుడు ఆ వూళ్లో వాళ్ల కష్టాలన్నీ మూటగట్టి వూరవతలికి తీసుకురమ్మన్నాడు. అందరూ తమ కష్టాల్ని మూటగట్టి తీసుకొచ్చారు. అన్ని మూటలు ఒక దగ్గర పెట్టారు. కష్టాలు లేని వాళ్లు ఎవరూ లేరు. అన్ని మూటలు బరువుగా, భారంగా, భారీగా ఉన్నాయి. మూటలన్నీ ఒక దగ్గర పెట్టారు.
దేవుడు ‘ఇప్పుడు మీ ఇష్టం. మీ మూట కాకుండా మీ ఇష్టమయిన ఇంకొక మూట తీసుకోండి. మీకు ఆ స్వాతంత్య్రమిచ్చాను’ అన్నాడు. యితని వైపు తిరిగి ‘నీకు కావల్సిన మూట నువ్వు అందుకో. నీ ఇష్టం’ అన్నాడు.
ఇతను అన్ని మూటల్ని చూశాడు. తన మూటను చూశాడు. అన్నీ ఒకేలాగా ఉన్నాయి. మొదట వేరే మూటను అందుకోబోయి ఆగాడు. ‘ఆ మూటలో ఏ బాధలున్నాయో? ఎన్ని బాధలున్నాయో ఎవడికి తెలుసు. తీసుకుంటే గానీ అవి ఏవో తెలిసే వీలు లేదు. తన బాధల్లాంటివి కాకపోయినా అవీ కష్టాలే! కానీ తనవి తనకు అలవాటయిన కష్టాలు. ఇప్పుడు ఆ మూటను తీసుకుంటే కొత్త కష్టాలకు దారి తీసినట్లవుతుందేమో!’ అనుకుని తన మూట తల మీద పెట్టుకుని ఇంటికి పరుగుతీశాడు.
అంతలో అతనికి మెలకువ వచ్చింది.

- సౌభాగ్య, 9848157909