S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెద్దనోట్ల రద్దు నవ శకమేనా

సరిగ్గా ఏడాది క్రితం...
పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన క్షణాన...
దేశ ప్రజలు తెల్లబోయారు.. నల్లకుబేరులు గంగవెర్రులెత్తారు... ఆ ప్రభావం నుండి తేరుకోవడానికి నెలలే పట్టింది. జనం, అధికారులు, ప్రభుత్వం ఓపికగా ఓ సంస్కరణకు సాయం పట్టారు... అయితే ఆశించిన లక్ష్యం నెరవేరిందా? ఆ నిర్ణయం నవ శకానికి నాందిగా మారిందా? నాశనానికి దారి తీసిందా? విఫల ప్రయోగంగా మిగిలిందా అన్నది ఇప్పుడు అందరి ప్రశ్న.
ఏడాది క్రితం పెద్ద నోట్ల రద్దు భారతీయులందరినీ అసహనానికి గురిచేసింది. 500 రూపాయిలు, వెయ్యి రూపాయిల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రకటించగానే ఆర్థిక వ్యవస్థ పెద్ద కుదుపునకు గురైంది. బ్యాంకుల చుట్టూ, ఎటిఎంలు చుట్టూ పెద్ద పెద్ద క్యూలలో రోజుల తరబడి నిలబడిన జనం నానా అవస్థలు పడిన ఘట్టాలు చాలామంది మరచిపోయినట్లు అనుకుంటున్నా ఇంకా స్మృతిపథం నుంచి చెరగిపోలేదనే చెప్పాలి.
ప్రజలందరినీ ఏడాది జాగృతం చేసిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని పూర్తికావచ్చింది. నల్లధనం, అవినీతిపరుల ఆటకట్టించడానికి మోదీ ప్రభుత్వం సాహసంతో ఈ నిర్ణయం తీసుకుందన్న నమ్మకంతో కష్టనష్టాలను చిర్రుబుర్రులాడుతూనే సామాన్యులు సహించారు. అయితే ఏడాది తరువాత ఇది విఫల ప్రయోగమన్న విమర్శలు పెరిగాయి. నిజంగా ఈ నిర్ణయం ఫలితం ఏమిటన్నది సామాన్యుడి ప్రశ్న. రాజకీయ నేతలు, ఆర్థిక నిపుణుల్లో ఒకవర్గం ఇది విఫలప్రయోగం అంటుంటే భవిష్యత్‌లో ఇది ఫలితాలను ఇస్తుందని మరోవర్గం గట్టిగా చెబుతోంది.
లాభమా? నష్టమా??
పెద్ద నోట్లు రద్దు జరిగి నవంబర్ 8 నాటికి ఏడాది కావస్తోంది. ఈ ఘటనను రాజకీయ పార్టీలు భాష్యం చెబుతూ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు, ఆర్ధిక నిపుణులు, న్యాయనిపుణులు, అధికారవర్గం భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. భారత్ ఏ దిశగా పయనిస్తోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల లాభం జరిగిందా? నష్టం వాటిల్లిందా? అసలేం జరిగింది ఏడాది కాలంలో భారత్ ఆర్ధిక వ్యవస్థ స్థితిగతులు ఏమిటి అనే చర్చ మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి మాటల్లో చెప్పాలంటే పెద్ద నోట్ల రద్దుతో దేశానికి మూడు ప్రధానమైన లాభాలు సమకూరాయి. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. పన్ను రాబడి పెరిగింది. పెద్ద నోట్ల చెలామణి నియంత్రించగలిగారు. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ లావాదేవీలకు మారారు. కొత్త సాంకేతికత వస్తున్న కొద్దీ భారతీయుల్లో డిజిటల్ లావాదేవీలపై ప్రోత్సాహం తో పాటు ఉత్సాహం కూడా పెరుగుతుంది. మరోపక్క ఉగ్రవాదులు, తీవ్రవాదుల వద్ద బంకర్లలో దాచిపెట్టిన వేల కోట్ల రూపాయిలు చెల్లకుండా చేయగలిగారు. అవినీతిని నిరోధించగలిగారు, దొంగనోట్ల మాఫియాను నిలువరించి, నల్లధనాన్ని దెబ్బతీయగలిగారు. బ్యాంకుల్లో దాయకుండా నగదు రూపంలో వేల కోట్ల రూపాయిలను దాచుకున్న వారంతా తమ నోట్లను బయటకు తీయాల్సి వచ్చింది.
అకస్మాత్తుగా ఈ ప్రకటన చేయాల్సి రావడం వెనుక ఉన్న గోప్యతకు కారణాలను కూడా ఇటీవల అరుణ్ జైట్లి చెప్పారు. నోట్ల రద్దును ముందే ప్రకటించి ఉంటే ధనవంతులు అంతా ఆ డబ్బును వేరే రూపంలోకి మళ్లించుకునే అవకాశం ఉందని, అలా వారు ముందస్తు జాగ్రత్త పడకుండా ఉండేందుకే అకస్మాత్తుగా ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. సామాన్యుడి నుండి అసమాన్యుడి వరకూ, పేదవాడి నుండి ఐశ్వర్యవంతుడి వరకూ, సాధారణ నిరుద్యోగి మొదలు అపార వ్యాపార సామ్రాజ్య అధిపతుల వరకూ నోట్ల రద్దు ప్రభావితం చేసింది.
వాదన.. నిరసన
అయితే నోట్ల రద్దు మిగిల్చిన కష్టాలను మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకు నవంబర్ 8న విపక్షాలు బ్లాక్ డే నిర్వహించాలని నిర్ణయించాయి. వ్యాపారాలు మందగించాయని, జీడీపీ తగ్గిందని నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైన తీరును ప్రతిబింబిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిందనేది విపక్షాల వాదన. ప్రభుత్వ నిర్ణయంతో అనేక మంది క్యూలలో నిలవలేక, ఆర్థిక ఒత్తిళ్లకు గురై మరణించారని ఇలాంటి ఘటన ప్రపంచ చరిత్రలో ఇదొక్కటే అనేది విపక్షాల విమర్శ. విపక్షాల వాదనను తిప్పికొడుతూ యాంటి బ్లాక్ డే నిర్వహించాలని బిజెపి యోచిస్తోంది.
నోట్ల రద్దు ఎందుకు?
ఇంత వరకూ లీగల్ టెండర్‌గా వాడుతున్న కరెన్సీని వెనక్కు రప్పించి, దాని స్థాయిని మార్చడమే నోట్ల రద్దు అంటారు. ఇలా లీగల్ టెండర్‌ను నోట్ల రద్దుకానీ, తిరిగి తీసుకోవడం కానీ , తీసివేయడం కానీ చేసిన తర్వాత ఆ నోట్లు చెల్లుబాటు కావు. ఆ కరెన్సీ నోట్లను మళ్లీ వాడటానికి వీలు లేదు. నల్లధన లావాదేవీలను, సమాంతర ఆర్ధిక వ్యవస్థను ఆపడానికి, చట్టబద్ధమైన ఆర్థిక లావాదేవీలను మాత్రమే ప్రోత్సహించడానికి ప్రభుత్వం
ఈ నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8న భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాత 500 నోట్లు, 1000 నోట్లు చెల్లకుండా పోయాయి. పాత నోట్లకు బదిలీకి 2016 డిసెంబర్ 30 వరకూ గడువు ఇచ్చారు. తర్వాత 500, 2వేల రూపాయిల నోట్లను ఆర్‌బిఐ విడుదల చేసింది. స్వాతంత్య్రానంతరం నోట్ల రద్దు జరగడం ఇది రెండోసారి. స్వాతంత్య్రానికి పూర్వం కూడా 1946లో నోట్ల రద్దు జరిగింది. 1978లో మొరార్జీ దేశాయి ప్రభుత్వంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇచ్చిన నివేదిక ప్రకారం 500 నోటు, 1000 నోటు, 10వేల నోటును రద్దు చేశారు. అప్పటికి ఆ నోట్లు చాలా తక్కువ కనుక 15 శాతం వరకూ మాత్రమే ప్రభావితం చేశాయి. పెద్ద నోట్ల లావాదేవీల్లో అవకతవకలను నిరోధించడానికి చేసిన పెద్ద నోట్ల రద్దు చట్టం -1978 వల్ల ఎలాంటి లాభం లేకుండా పోయింది. 2015-16 ఆర్ధిక సర్వే ప్రకారం 27 శాతం గ్రామాలు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. దానిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని జన్‌ధన్ బ్యాంకు ఖాతాలను ప్రోత్సహించారు.
పటిష్ట ఆర్థిక వ్యవస్థ
విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన తెలివితేటలు మనిషిని పంచభూతాలపై విజయాన్ని సమకూరుస్తున్నా డబ్బుంటే చాలు మనిషి చేయలేని పనిలేదనే వాదన ఇంకా నెగ్గుకొస్తోంది. ప్రపంచంలోనే జ్ఞాన సంపత్తిలో అగ్రగణ్యంగా ఉన్న ప్రాచీన భారతదేశం తర్వాత తన రూపురేఖలను కోల్పోయినా ఇపుడిపుడు సాంకేతిక సమాచార విప్లవం పుణ్యమా అని మళ్లీ తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతోంది. అంతరిక్ష రంగంలో భారత్‌కు నేడు తిరుగే లేదు. అలాగే రానున్న రెండు మూడు దశకాల పాటు భారత్ యువతరం ఆవిష్కరణలకు కొదువే లేదు. అదే మార్గంలో భారత ఆర్థిక వ్యవస్థ సైతం తన సత్తాను చాటుతోంది. సరళీకృత ఆర్థిక విధానాల సమయంలో కావచ్చు, అగ్రదేశాలు సైతం ఆర్థిక సంక్షోభాలతో అట్టుడికిన సమయంలో భారత్ మాత్రం ఎంతో సంయమనంతో ముందడుగు వేసింది. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సమయంలో తన పునాదులను మరింత పటిష్టపరుచుకున్న భారత్ సంప్రదాయ ఆర్థిక వ్యవస్థను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. ఒక్కో అడుగు ముందుకు వేసుకువెళ్తున్న భారత్ తాజాగా మరో మారు ఆర్థిక సంస్కరణల సాహసం చేసింది. దీంతో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలులోకి వచ్చాయి.
భవిష్యత్‌లో భారత్ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థగా రూపాంతరం చెందే అవకాశం లేకపోలేదని అనేక సర్వే సంస్థలు చెబుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను సైతం వెనక్కు నెట్టి భారత్ ముందుంజ వేయడం ఖాయమని అంటున్నాయి. 2050 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని వాటర్ హౌస్ కూపర్స్ అనే సంస్థ అధ్యయన నివేదికలో పేర్కొంది. ప్రపంచ జిడిపిలో 85 శాతంతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న 32 దేశాల దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధి అంచనాలపై అధ్యయనం చేసిన తర్వాత ఈ నివేదికను బయటపెట్టారు. లాంగ్‌వ్యూ పేరుతో తయారుచేసిన ఈ నివేదికలో భారత్ రెండోస్థానానికి చేరుకోనుంది. ఒక నిర్దిష్టకాలంలో అనేక దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి, కొనుగోలు శక్తి, ఆర్థిక ఉత్పాదకత, ప్రజల జీవన ప్రమాణాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక పరిణామం 2050 నాటికి రెట్టింపు కంటే అధికమవుతుంది. దీని ప్రభావం సమాచార సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత ఉత్పత్తులపై అధికంగా ఉంటుందని నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 2050 నాటికి ఏడు దేశాల్లో ఆరు దేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తులుగా ఎదుగుతాయి. అందులో చైనా అగ్రస్థానానికి చేరుకుంటుందని, భారత్ రెండో అగ్రస్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రస్తుతం అగ్రస్థానంలో ఉండగా 2050 నాటికి మూడో స్థానానికి పరిమితం కానుంది. ఇండోనేషియా నాలుగో స్థానంలోనూ, యుకె పదో స్థానంలోనూ ఉంటాయని, ఫ్రాన్స్ తొలి పది దేశాల జాబితాలో నుండి గల్లంతు కానున్నదని అంచనా. ఇటలీ తొలి 20 దేశాల జాబితాలోనూ చోటు దక్కించుకునే స్థితి లేదు. మెక్సికో, టర్కీ, వియాత్నం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇటలీని దాటుకుని పైకి ఎగబాకనున్నాయి. రాబోయే కాలం వ్యాపారానికి స్వర్ణయుగం , స్థానిక అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చుకోనున్నాయి.
మారుతున్న స్వరూపం
ద్రవ్యానికి ఉన్న చరిత్ర చాలా గొప్పది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మార్పిడికి మధ్య సాధారణంగా అంగీకరించేదే ద్రవ్యం. సాధారణంగా నాణేలు, నోట్లుగా తయారుచేయబడిన వాటిని ఇందుకు వినియోగిస్తుంటారు. ప్రతి దేశం తమ భౌతిక అంశాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ ధనాన్ని సరఫరా చేస్తుంది. మార్పిడి యొక్క మాధ్యమం ద్రవ్యం. ఒకపుడు నాణాలకే పరిమితమైన ద్రవ్యం నేడు నోట్ల రూపంలో, ఇతర ఎలక్ట్రానిక్ రూపాల్లో కూడా లభ్యమవుతోంది. ప్రస్తుతం దేశంలో 5,10,20,50,100,500, 2000 రూపాయిల నోట్లు జారీ అవుతున్నాయి. వీటిని రిజర్వుబ్యాంకు జారీ చేస్తోంది. గతంలో ఉన్న ఒక రూపాయి, రెండు రూపాయిలను నాణాలుగా మార్చేశారు. దాంతో కొత్త నోట్లు అందుబాటులో లేవు. సంజ్ఞల వారీ నోట్ల పరిమాణం ఎంత అవసరమో ఆ మేరకు రిజర్వు బ్యాంకు అంచనాలు వేస్తుంది. వాటికి అనుగుణంగా భారత ప్రభుత్వం ద్వారా వివిధ ముద్రణాలయాలకు ఇండెంట్లు సమకూరుస్తుంది. ఈ ముద్రణాలయాలు వాటిని ముద్రించి అధీకృత బ్యాంకులకు పంపిస్తుంది. నోట్లు, రూపాయి నాణాల పంపిణీ వసతి కోసం రిజర్వు బ్యాంకు ఎంపిక చేసిన బ్యాంకు శాఖలను అధీకృతం చేసింది. ఇవి నిల్వ గోదాములుగా ఉంటాయి. వీటినే కరెన్సీ చెస్ట్‌లు అంటారు. పరిస్థితులు అవసరాలకు అనుగుణంగా వీటిలో భద్రతా ఫీచర్లను బాగా పెంచడం అయింది.
వాస్తవానికి ప్రాచీన భారతంలో ఆరోశతాబ్దంలోనే ద్రవ్యానికి సంబంధించిన ఆధారాలున్నాయి. క్రమపద్ధతిలో తొలిసారి ద్రవ్యాన్ని వినియోగించింది మాత్రం 1486-1545 ప్రాంతంలో షేర్ షా సూరి. చాణుక్యుడు రాసిన అర్థశాస్త్రం అందరికీ తెలిసింది. రంగు, రూపు పరంగా అనేక మార్పులను దేశంలో కరెన్సీ నోట్లు చూశాయి. కరెన్సీ నోట్ల గురించి చెప్పాలంటే వాటికి 150
ఏళ్ల చరిత్ర ఉంది.
18వ శతాబ్దం వరకూ దేశంలో బంగారు, వెండి నాణేలు చెలామణిలో ఉండేవి. తొలి ప్రపంచ యుద్ధ కాలంలో వెండి కొరత ఏర్పడటంతో కాగితం నోట్లు తయారీ ప్రారంభించారు. యురోపియన్ వ్యాపార సంస్థల పట్టు ఎపుడైతే దేశంలో పెరిగి , డబ్బు అవసరం ఎక్కువ ఏర్పడటంతో కాగితం నోట్లను ముద్రించాల్సి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటి పేపర్ నోట్లను అప్పటి కొల్‌కటాలోని బ్యాంకు ఆఫ్ హిందుస్థాన్ ముద్రించింది. దానిపై కేవలం అక్షరాలు మాత్రమే ఉండేవి. బ్రిటిష్ కంపెనీల పట్టు పెరిగిన తర్వాత బెంగాల్, ముంబై, చెన్నైలలో ప్రెసిడెన్సీ బ్యాంకులు వెలిశాయి. అందులో మొదటిది బ్యాంకు ఆఫ్ బెంగాల్, వీటి రాక వల్ల కాగితపు నోట్ల పాపులారిటీ మరింత పెరిగింది.
స్వతంత్య్ర భారతంలో తొలి నోటు 1949లో విడుదలైంది. రూపాయి నోటుపై సారనాథ్‌లోని అశోకస్థూపం ముద్ర వేశారు. 1950 ఆగస్టు 15న అణా విడుదల చేశారు. 1960లో వివిధ రంగుల్లో నోట్ల ముద్రణ మొదలైంది. 1944లోనే సెక్యూరిటీ థ్రెడ్, ఆర్బీఐ వాటర్ మార్కుతో కూడిన నోట్లను ముద్రించారు. 2005లో మహాత్మాగాంధీ సిరీస్‌లో నోట్లను ముద్రించారు.
1968 తర్వాత నయాపైసా కాస్తా పైసాగా మారింది. కాంస్యం, నికెల్ , రాగి, అల్యూమినియం ఇలా వెండి నుండి ఇతర మూలకాలను వినియోగించడం పెరిగింది. 1968లో 1,2,3 పైసలు తొలగించారు. 1988లో 10,25,50 పైసలు అమలులోకి వచ్చాయి. 1992లో రూపాయి నాణం వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో కుదుపువచ్చిన ప్రతిసారీ నాణాల విలువను, నోట్ల విలువనూ ప్రభుత్వం మారుస్తూ వచ్చింది.
ఎక్కడికీ ప్రస్థానం?
నోట్ల రద్దు కారణంగా భారత్ వృద్ధి రేటు మందగించడం ఖాయమని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సైతం ప్రపంచ బ్యాంకు అభిప్రాయాలనే అచ్చుగుద్దినట్టు వెల్లడించింది. ముందుగా అంచనా వేసిన 7.6 శాతానికి ఏ మాత్రం పొంతన లేకుండా గత ఏడాది ఆర్థిక వృద్ధి రేటును 6.6 శాతంగా పేర్కొంది. కళ్లు తెరుచుకుని తెప్పరిల్లే లోపే ప్రపంచ ఆర్థిక ఫోరం సైతం మరింత నిరాశాజనక ఫలితాలను బయటపెట్టింది. పురోగతి సూచికలో ఏకంగా పాకిస్తాన్, చైనాల కంటే వెనుకబడినట్టు పేర్కొంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 79 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ర్యాంకు 60కు పడిపోయినట్టు వెల్లడించింది. చైనాకు 15వ ర్యాంకు దక్కింది. పాకిస్తాన్ 52వ స్థానంలో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన సంఘటిత పురోగతి, అభివృద్ధి నివేదిక 2017లో ఈ విషయాలను తెలిపింది. ప్రపంచ బ్యాంకు ముందే చెప్పినట్టు నోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వృద్ధి 6.6 శాతానికి పడిపోవడంతో 6.7 శాతంతో కొనసాగుతున్న చైనా భారత్‌ను దాటి పైకి ఎగబాకింది. అభివృద్ధి సూచిలో 79 దేశాలు ఉంటే భారత్ 60వ స్థానానికి పరిమితం కావడం ఎవరికీ మింగుడుపడటం లేదు. చైనా 15వ స్థానం సాధించడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించకపోయినా తరచూ ఆర్థిక విఫల దేశంగా భావించే పాకిస్తాన్ ఏకంగా 52వ స్థానంలో కూర్చోవడం విస్మయానికే గురిచేస్తోంది. చైనా, పాక్‌లే కాదు, అభివృద్ధి సూచితో పోలిస్తే బంగ్లాదేశ్ 36వ ర్యాంకులో నిలబడి భారత్ కంటే ముందున్నాననిపించుకోవడం మరో విడ్డూరం. అయితే 2018 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుందని వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అంచనా వేసి కొత్త ఆశలు రెకేత్తించింది. అంతేకాదు, 28 మంది రిజర్వ్‌బ్యాంకు ఫోర్‌కాస్టర్స్ సర్వే ప్రకారం జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి), రియల్ జివిఎ (అదనంగా చేసిన స్థూల విలువ) 7.4 శాతం, 7.2 శాతంగా పెరుగుతాయని ఆ తదుపరి సంవత్సరం మరో 40 బేసిక్ పాయింట్లు, 50 బేసిక్ పాయింట్లు చొప్పున పెరిగి స్థిరీకరణ చెందుతుందని అంచనా వేశాయి. ఆర్‌బిఐ 2007 సంవత్సరం నుండి ఈ సర్వే ఆప్ ఫ్రొఫెషనల్ ఫోర్‌కాస్టర్స్‌ను నిర్వహిస్తోంది. 2018-19 నాటికి భారత్ ఆర్ధిక వృద్ధి క్రమంగా స్థిరీకరించుకుంటుందని తేలింది. 2018 నాటికి భారత్ వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటుందని అవుట్‌లుక్ అంచనా వేయడం కూడా ఊపిరిపీల్చుకోదగిన ఆశాజనక అంశమే. దేశ ఆర్థిక వ్యవస్థలో వేళ్లూనుకున్న అనేక లోపాలను సరిచేసేందుకు తీసుకున్న సాహసోపేత నిర్ణయం నోట్ల రద్దు, ఏడాదిలో ఎన్నో ఆర్థిక పాఠాలను నేర్పింది. ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా పెట్టుకోవడం ఎపుడూ ఆచరణీయమే కానీ ఆ మొత్తాన్ని ఏ రూపంలో దాచాలా? ఆ మొత్తాన్ని నగదు రూపంలో పెట్టుకోవడం ఏ విధంగా మంచిది కాదని నోట్ల రద్దు మరోసారి గుర్తుచేసింది. పరిస్థితులు గాడిలో పడి భారత ఆర్థిక విధానమే సరైనదని ప్రపంచానికి చాటిచెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్న మాట సంతోషించదగిందే.
ప్రయోజనం శూన్యం?
నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైపోయిందనేది విపక్షాల వాదన. నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా తొందరపాటు చర్య అని విపక్ష నేత గులాంనబీ అజాద్ అంటున్నారు. ప్రజలకు కడగండ్లు మిగిల్చిన రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా నవంబర్ 8న దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నాయి. తృణమూల్, జెడియు, ఎస్‌పి, బిఎస్‌పి, డిఎంకె, వామపక్షాలు, జెడియు చీలిక వర్గం కూడా ఈ నిర్ణయానికి బాసటగా నిలిచాయి. విపక్షాలు వాదించినట్టు సమాంతర ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు గణనీయమైన ప్రభావం చూపింది. పెద్ద నోట్ల రద్దుతో భారీ స్థాయి లావాదేవీలు తగ్గి, చట్టేతర హవాలా లావాదేవీలు కూడా కొంత మేరకు జరిగాయి. మనీ సప్లయి తగ్గింది. కొత్త నోట్లు అధికమొత్తంలో విడుదల కావడానికి చాలా కాలం పట్టింది. నేడు అది నియంత్రణలోకి వచ్చినా, ఈతిబాధలు తీరలేదు. వినియోగదారుల వస్తువులపైనా, రియల్ ఎస్టేట్, గోల్డ్, విలాస వస్తువులు, ఆటోమొబైల్ మొదలైన రంగాల్లో డిమాండ్ తగ్గింది, వ్యాపారం మందగించింది. వినియోగ వస్తువుల డిమాండ్ తగ్గి తయారీరంగం వృద్ధిపడిపోయింది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై వస్తువుల గిరాకీ తగ్గి కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది. నోట్ల రద్దుతో నల్లధనాన్ని నిర్మూలించామని ప్రభుత్వం చెబుతున్న వాదన సరికాదని విపక్షాలు చెబుతున్నాయి. నోట్ల రద్దు కంటే ఇతర వ్యవస్థాగతమైన మార్పులతోనే నల్లధనాన్ని అరికట్టగలమనేది వారి వాదన. పాత నోట్ల స్థానే కొత్త నోట్ల జారీతో నల్లధనాన్ని చట్టబద్ధం చేసే ప్రక్రియలో మరింత అవినీతి జరిగిందనేది ఇటీవలి కొన్ని అనుభవాలతో రుజవైంది.
ఇదీ లెక్క!
ఆర్‌బిఐ నివేదిక ప్రకారం దేశంలో 87 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నాయి. ఎటిఎంలు, బ్యాంకింగ్ సదుపాయాలు, స్వైపింగ్ మిషన్లు అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండటం వల్ల ఆర్థిక నిరక్షరాస్యత పన్ను చెల్లింపుల నుండి తప్పించుకోవాలనే ఉద్దేశ్యం, నల్లధనం లావాదేవీలు ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల 87 శాతం పైగా లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ 2016 నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 400 కోట్ల నకిలీ కరెన్సీ ఉంది, లోక్‌సభ వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం ఆర్‌బిఐ 26 లక్షల నకిలీ నోట్లను సీజ్ చేసింది. వాటి విలువ దాదాపు 167 కోట్లు. రద్దయిన పాత 500 నోట్లు విలువ 15.44 లక్షల కోట్లు. ఇందులో కనీసం మూడు నుండి నాలుగు లక్షల కోట్లు నల్లధనం ఉంటుందని అంచనా. నోట్ల రద్దు ప్రకటించినపుడు బ్యాంకులకు రాని మూడో వంతు మొత్తం ప్రభుత్వానికి మిగిలినట్టే భావించారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం విన్నవించిన నివేదికలో కూడా ఈ విషయాన్ని చెప్పింది. అయితే ఆ తర్వాత ఆ లెక్కలన్నీ ఘోరంగా తప్పాయి. ప్రభుత్వానికి మిగిలింది 16వేల కోట్లే. అయినా మరో రకంగా చూస్తే పన్ను చెల్లింపుదారుల సంఖ్య 40 శాతం అదనంగా పెరిగింది.
ఇలా కాదు!
ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రాజన్ ప్రకారం ఎపుడు నగదు రద్దు చేసినా, ఏదో రకంగా నకిలీ నోట్లను సృష్టించడం సులువే, ఒక వేళ నల్లధనాన్ని కరెన్సీ రూపంలో కాకుండా ఇతర రూపాలైన స్థిరాస్తి, బంగారం లేదా ఇతర రూపాల్లో దాచుకుంటే మరింత కష్టంగా మారుతుంది. కనుక నోట్ల రద్దు కాకుండా ఇతర వ్యవస్థాగత మార్పులతో మేలైన గవర్నెన్స్ పద్ధతుల్లో నల్లధనాన్ని నిర్మూలించాలి.
డిజిటల్ లావాదేవీల జోరు
ఆర్ధిక సర్వే ప్రకారం పూర్తిస్థాయి బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే భారీ మొత్తంలో వౌలిక సదుపాయాలు కల్పించాలి. అప్పటి పరిస్థితుల్లో పెద్ద నోట్లను బదిలీ చేయాలంటే 12వేల కోట్లు కావాలి, పెద్ద నోట్లను మార్చాలంటే 2300 కోట్ల నోట్లను రిజర్వు బ్యాంకు మార్చాల్సి ఉంది. కొత్తగా ప్రవేశపెట్టిన 2వేల నోటును చిల్లరగా మార్చాలంటే కష్టంతో కూడుకున్న పని, దినసరి లావాదేవీలన్నీ 500 కంటే తక్కువ మొత్తంలోనే జరుగుతాయి. భారీ స్థాయిలో నమోదయ్యే డిజిటల్ లావాదేవీలను నియంత్రించడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి హాకర్ల బారిన పడకుండా చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది.

-బి.వి.ప్రసాద్