S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంతోషం (సండేగీత)

చాలా రోజుల క్రితం ఓ మిత్రుడు ‘సంతోషం’ గురించి ఓ చిన్న కథ చెప్పాడు.
పెరిగి పెద్దైన తరువాత ఓ టీచర్ ‘మీరు ఏం కావాలని అనుకుంటున్నార’న్న విషయం మీద పిల్లలకి ఉపన్యాసం ఇచ్చాడు. ఆ తరువాత ఆ పిల్లలకి ఓ చిన్న అభ్యాసం ఇచ్చాడు. అది, నేను... కాదల్చుకున్నాను. దీన్ని కొంతమంది డాక్టర్ కావాలని, మరి కొంతమంది సైంటిస్టు కావాలని, ముఖ్యమంత్రి కావాలని, కలెక్టర్ కావాలని రకరకాలుగా రాశారు. ఒకే ఒక విద్యార్థి మాత్రం నేను సంతోషంగా ఉండదల్చుకున్నాను అని రాశాడు. అది చూసి ఆ టీచర్‌కి కోపం వచ్చింది. నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆ విద్యార్థితో కోపంగా అన్నాడు.
నేను రాసింది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని ఆ పిల్లవాడు జవాబు చెప్పాడు. ఆ టీచర్‌కి జ్ఞానోదయం అయ్యింది. ఇది నేను చాలా రోజుల క్రితం విన్న కథ.
మనం డాక్టరైనా, కలెక్టరైనా, న్యాయమూర్తి అయినా సంతోషంగా ఉండాలి. ఇతరులను సంతోషపెట్టాలి. మనం సంతోషంగా లేకపోతే ఇతరులని సంతోషపెట్టలేం. సంతోషం అనేది ఎక్కడుంది? ఎక్కడ దాని కోసం వెతకాలి? ఈ పరుగులో చాలామంది ఉన్నారు.
సంతోషం అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో విలువైనవి ఎన్నో ఉన్నాయి. అందులో సంతోషం ఒక్కటి. విలువైనవి అన్నీ మనకు ఉచితంగానే లభిస్తాయి. వాటికి ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. కానీ మనం సంతోషంగా ఉండటాని కోసం ఎక్కువ కష్టపడుతూ ఉంటాం.
మనం బతకడానికి గాలి కావాలి. అది అత్యంత విలువైనది. దాన్ని మనం కొనుక్కోవల్సిన పరిస్థితి రాలేదు. అది మనకు ఉచితంగానే లభిస్తుంది. దాన్ని ఎవరూ బంధించలేరు.
నీళ్లు లేకుండా మనం బతకలేం. నీళ్లు మనకు ఉచితంగానే లభిస్తున్నాయి. ఈ మధ్యనే కొంటున్నాం కానీ నిజానికి నీరు ఉచితంగానే లభిస్తుంది. నీటిని ఎవరూ బంధించరు. నిలువ చేస్తారు. చెరువు చేస్తున్న పని అదే.
వెలుతురు లేకుండా బతకడం దుర్లభం. సూర్యుడు మనకు వెలుతురుని ఉచితంగానే ఇస్తున్నాడు. దాన్ని మనం కొనుక్కోవడం లేదు.
అత్యంత విలువైనవన్ని మనకు ఉచితంగానే లభిస్తున్నాయి. సంతోషం విలువైనదని మనం భావిస్తే అది కూడా మనకు ఉచితంగానే లభిస్తుంది. కానీ మనం దాని కోసం ఎక్కడికో పరుగులు తీస్తున్నాం.
మనం సంతోషంగా ఉండటానికి అవసరమైనవి ఆ భగవంతుడు లేదా సృష్టి ఉచితంగా మనకు ఇచ్చింది. వాటిని గుర్తించకుండా మనం ఏదో వెతుకుతున్నట్టు పరిగెడుతున్నాం. పరిగెట్టడం ఆపేసి, సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. సంతోషం ఎక్కడో లేదు. మన మనసులోనే ఉంది. దాన్ని గుర్తిద్దాం.