S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాత్రిపూట మేలుకునే వారి మేలు కోసం... ( మీకు మీరే డాక్టర్)

ఫ్రశ్న: నేను సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాను. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారి 6 గంటల వరకూ డ్యూటీలో ఉంటాను. నా ఆరోగ్యం బాగా చెడుతోంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలియజేయండి.
జ: పత్రికా రంగంలో పనిచేసే వారికీ, కర్మాగారాలలో పనిచేసే వారికీ రాత్రి డ్యూటీలు ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్‌వేర్ రంగం వారు కూడా రాత్రి డ్యూటీలు చేయాల్సి వస్తుంది. పోలీసు వారికయితే నిలువుకాళ్ల జీతం, అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా పని వేళలుంటాయి. చాలా ఉద్యోగాలలో పగలు తగినంత విశ్రాంతి తీసుకొనే అవకాశం ఉండదు కూడ. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశం.
సహజంగా మనిషి రాత్రి పడుకొని పగలు పని చేయటానికి అలవాటు పడిన జీవి. రాత్రిపూట మేల్కొని పగలు నిద్రపోవటం ప్రకృతి విరుద్ధం. పగలు పడుకోకుండా రాత్రిపూట పెందరాళే పడుకొని తెల్లవారుజామునే లేచి పనులు ప్రారంభించుకోవటం శాస్త్ర సమ్మతం. ఆరోగ్యదాయకం కూడా! కానీ, పొట్టకూటి కోసం రాత్రి డ్యూటీలు తప్పనిసరి అయినప్పుడు, ఈ జాగ్రత్తలు అవసరం అవుతాయి.
రాత్రి జాగరణలు శరీరాన్ని శుష్కింపజేసి, వాత దోషం పెరిగేలా చేస్తాయి. అందుకని వాత సంబంధమైన వ్యాధులు, ముఖ్యంగా కీళ్ల వాతం, నడుం నొప్పి, మెడ నొప్పి, మోకాళ్లనొప్పులు, షుగరు వ్యాధి, బీపీ, రకరకాల ఎలర్జీ వ్యాధులు పిలవకుండా పలుకుతుంటాయి.
ముఖ్యంగా యువతీ యువకులు తమ శరీరంలో నిర్మాణ ప్రక్రియలు ఇంకా జరుగుతూనే ఉన్న దశలో ఈ విధంగా శుష్కింపజేసే ఉద్యోగాలు చేయటం వలన ఇరవైలలో అరవైలు చూసే ప్రమాదం ఉంది. అందుకే, ఈ జాగ్రత్తలు.
కెనడా దేశంలో మూడో వంతు ప్రజలు రాత్రి షిఫ్టులలో పని చేస్తుంటారని ఒక అధ్యయనం చెప్తోంది. సాంకేతిక పరమైన అభివృద్ధి దృష్ట్యా మన దేశంలోనూ ఇంచుమించుగా అదే పరిస్థితి నడుస్తోంది. అందుకు తగ్గట్టుగా మనం మన దినచర్యలను కొద్దిగా మార్పు చేసుకుంటే త్వరగా అలసిపోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం.
రాత్రి జాగరణం వలన కడుపులో ఎసిడిటీ త్వరగా పెరుగుతుంది. జీర్ణశక్తి మందగిస్తుంది. అజీర్తి సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. పేగుపూత లాంటి వ్యాధుల పాలిట పడే అవకాశం ఉంది.
తేలికగా అరిగే ఆహార పదార్థాలను కడుపు నిండా తినాలి. పులుసు కూరలు, వేపుడు కూరలకన్నా పరిమితంగా అల్లం వెల్లుల్లి మసాలాలు వేసిన ఇగురు కూరలు మేలు చేస్తాయి.
ఊరగాయలకన్నా రోటి పచ్చళ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. మజ్జిగ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.
పాలకన్నా పెరుగు, పెరుగుకన్నా మజ్జిగ శ్రేష్టం. నిద్ర మేల్కోవటం వలన శరీరంలో ఎక్కువగా వేడి పెరుగుతుంది. అందుకని తరచూ బార్లీ, సగ్గుబియ్యం జావ లాంటివి తీసుకుంటూ ఉండాలి.
బూడిద గుమ్మడి కాయతో సొరకాయ లాగానే అన్ని రకాల వంటకాలూ చేసుకోవచ్చు. ఇది చలవ నివ్వటమే కాదు, శరీరానికి పుష్టి నిస్తుంది. ఆరోగ్యం చెడకుండా కాపాడుతుంది.
షుగరు లేని వారు నైట్‌డ్యూటీ సమయంలో తీపి పదార్థాలు తింటూ ఉంటే కోల్పోయిన శక్తి తిరిగి పొందుతూ ఉంటారు. అలసటకు లోను కాకుండా ఉంటారు.
రాత్రి 10 గంటలకు పడుకునే సాధారణ సమయం అనుకుంటే, అప్పటి నుంచీ ఎన్ని గంటలు మెలకువగా ఉన్నారో అందులో సగం సమయాన్నీ ఉదయానే్న పడుకుంటే నిద్ర నష్టం తూకానికి సరిపోతుందని ఆచార్య సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో సూచించాడు. ఉదాహరణకు తెల్లవారుజామున 4 గంటలకు డ్యూటీ నుండి ఇంటికి వచ్చి పడుకొన్నారనుకోండి.. 6 గంటలసేపు మీరు జాగరణ చేసినట్టు లెక్క. అలాంటప్పుడు ఏకధాటిగా పగలు 6 గంటలసేపు సుదీర్ఘంగా పడుకోవటం మంచి అలవాటు కాదు. మధ్యాహ్నం అన్నం తిన్న తరువాత పడుకొని ఆ ఆరుగంటల నిద్రా లోపాన్ని పూడ్చుకోవాలనుకోవటం కూడా మంచిది కాదు. ఇందుకు సుశ్రుతుడు 2,500 ఏళ్ల క్రితం చెప్పిన ఉత్తమ మార్గమే శరణ్యం. ఆయన సూచించిన ఉపాయం ఇదీ...
అర్ధరాత్రి దాటాక ఎప్పుడు ఇంటికి వచ్చినా, ఉదయం 6 గంటలకే యధాప్రకారం లేచి కాలకృత్యాలు తీర్చుకొని రాత్రి మెలకువగా ఉన్న సమయంలో సగం కాలం అంటే సుమారు పొద్దున్న 9 లేదా 10 గంటల వరకూ పడుకుంటే గత రాత్రి నిద్రా లోపం సరిపోతుందన్నమాట. అలా పడుకొని నిద్ర లేచిన తరువాతే బ్రేక్‌ఫాస్ట్ చేయండి. టిఫిన్లు గట్రా చేసి అప్పుడు పడుకుంటే నిద్ర హాంగోవర్ ఎక్కువగా ఉంటుంది. అలసట కొనసాగుతుంది.
అన్నం తిన్న తరువాత పగలు గానీ, రాత్రి గానీ వెంటనే నిద్రపోవటం ఎన్నడూ చేయకండి. అందువలన స్థూలకాయం పెరుగుతుంది. పగలు కాసేపు పడుకుని నిద్రపోయి లేచాక అప్పుడు ఆహారం తీసుకోవటం ఆరోగ్యకరమైన అలవాటు. అన్నం తిన్న తరువాత పొరపాటున కూడా పడుకోవద్దు. ఈ జాగ్రత్త తీసుకుంటే మీకు అలసట రాదు.
రాత్రి డ్యూటీలో ఉన్నప్పుడు రాత్రి భోజనాన్ని సాధ్యమైనంత పెందరాళే తీసుకోండి. సాయంత్రం 7 గంటలకే అన్నం తినేస్తే మంచిది. ప్రమాదకరమైన మిషన్ల దగ్గర పనిచేసేవారు, డ్రైవర్లు ఆలస్యంగా భోజనం చేసినందువలన మత్తు వచ్చే ప్రమాదం ఉంది.
అన్ని రకాల పళ్లు, జీడిపప్పు, బాదంపప్పు లాంటి పోషక పదార్థాలు రాత్రి డ్యూటీ సమయంలో తీసుకుంటే అలసట రాదు. డ్యూటీ సమయంలో కాఫీ, టీలకన్నా పులవకుండా ఉన్న మజ్జిగని ఒక ఫ్లాస్కులో తెచ్చుకుని ఆరగా ఆరగా తాగటం మంచిది. రాత్రిపూట ఎక్కువగా మేల్కొనే వారికి ధూమపానం, మద్యపానం రెండూ అపకారమే చేస్తాయి. మజ్జిగ లేదా చల్ల మేలు చేస్తుంది.
రాత్రి జాగరణాల వలన స్ర్తి పురుషుల్లో లైంగిక ఆసక్తి చచ్చిపోతుంది. సెక్సు పరమైన అసమర్థతలు ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటాయి. ఇలా అవటానికి జాగరణం వలన శరీరంలో వేడి పెరగటమే కారణం. చలవ చేసే కూరగాయలు, ఆకుకూరల్ని ఇప్పుడు తింటున్న ఎక్కువ మోతాదులో తింటే ఫలితం కనిపిస్తుంది. రాత్రి జాగరణ వలన మలబద్దత కూడా కలుగుతుంది. కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
నిద్ర మేల్కొన్న సమయంలో ద్రవ పదార్థాలు, ఫ్రూట్ జ్యూస్‌లూ, మజ్జిగ, బార్లీ జావ, సగ్గుబియ్యం జావ, ఇలాంటివి తాగుతూ ఉంటే నిద్రా లోపం వలన ఎసిడిటీ లాంటి బాధలు కలగకుండా ఉంటాయి.
ఆఫీసుల్లో నైట్ డ్యూటీలు చేసే వారికి ఎండ పెద్దగా తగలకపోవచ్చు. రాత్రిపూట డ్యూటీ, పగటిపూట నిద్ర కారణంగా సూర్యరశ్మికి దూరం అవుతారు. అందువలన ఎముకలు మెత్తబడిపోవటం, కీళ్ల నొప్పులు కలుగుతాయి. ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో లే ఎండలో ఓ అరగంటసేపు కూర్చోవటం వలన డి విటమిన్ తగినంత తయారై, కాల్షియం వొంటబట్టేలా చేస్తుంది.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com